Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 6


    ఈ విషయాన్నే ఆలోచిస్తూ వుండే రఘు ఒక ఉదయం సుధ వంటరిగా తులసమ్మ కి ముగ్గు పెడుతూ వుండడం చూసి, 'సుధా' అన్నాడు దగ్గర కెళ్ళి ఉలిక్కిపడి తలెత్తిన సుధ మళ్ళీ తలోంచేసుకుంది.'
    'నాతొ మాట్లాడ్డం మానేశావెం సుధా.'
    మాట్లాళ్ళేదు.
    'నామీద కోపమా?'
    లేదన్నట్టుగా తలూపింది సుధ.
    'మరి, ఎవరన్నా వద్దన్నారా.'
    ఔనన్నట్టు తలాడించింది.
    'ఎవరా అన్నది.'
    'అమ్మ'
    'ఎవంది.'
    'ఇటు మీదట 'నువ్వు మునపటంత చనువుగా బావెంట తిరక్కూడదు అంది' రఘు వద్ద మాట దాచడమన్నది తనకేదో మహాపరాధం లా అనిపించిన సుధ ఉన్న దున్నట్లతనితో చెప్పేసింది.
    'వద్దు సుధా నువ్వు వాళ్ళ మాటలినోద్దు. అందుకూ వాళ్ళేమన్నా అన్నారంటే బావ చెప్పాడని స్పష్టంగా చెప్పేయి, ఏం?' అన్నాడు వాళ్లు సుధానిలా శాసించిన భావం లోని అర్ధాన్ని గ్రహించిన రఘు.
    'అలాగే బావా?' అంది అమాయకంగా అతని వేపు చూస్తూ సుధ. కట్టిపడేసిన లేడిపిల్ల ని వదిలేస్తే, ఎంత హాయిగా గెంతుతుందో ఆ భావాన్ని సుధ చూపుల్లో తెల్సుకున్న రఘు నవ్వుకుంటూ అక్కన్నుండి వెళ్ళిపోయాడు.
    మునపటంత చిలిపితనం చూపక పోయినా క్రమేణా మళ్ళీ, మామూలుగా అందరితోటీ చనువుగానే తిరుగుతుంది సుధ.

                            *    *    *    *
    'మిమ్మల్ని అడగాలను కుంటూ అప్పటి కప్పుడలాగే మర్చి పోతున్నా నోదినా. మీ మేనమావయ్య గారు కాకినాడ లోనే వుంటున్నారా  ఇప్పుడూ' అంది ఒకరోజు భోజనాలప్పుడు జానకి. 'ఆ గాంధీ నగర్ లో , పెద్ద బంగళా కొనుక్కున్నారుగా.'
    'అయన ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గనక మన  సుధకేదన్నా దాని స్థితికి అనుకూలవైన సమ్మంధం చెప్తారేమో నని. అసలాయన కిందులో అనుభవం ఎక్కువ.'
    'ఔననుకో. అయినా--' అంటూ ఇంకా ఏదో చెప్పబోయి, మళ్లీ ఎందుకో ఆగిపోయారావిడ. 'మన రఘు వుండగా, మరొక చోట ఎందుకూ' అనబోయి రఘు విషయం లో అనేందుకు నాకేం అధికారం వుందీ .' అనుకుని మళ్ళీ ఆగిపోయినట్టుంది ఆవిడ ముఖ భావం.
    'అయినా దానికిప్పుడెం తొందరనీ.'
    'ఇప్పుడు మొదలు పెడితే ఇప్పుడే అయి పోయేటంత సుళువు కాదుకదోదినా ! ఆడపిల్లల పెళ్లి విషయమంటేనూ, అందులోకి మన సుధ సంగతి ఇక చెప్పాలా' చిన్న బుచ్చుకుంటూ అంది జానకి.
    'అవుననుకో, అయినా ఇందులో ఎమనెందుకూ , ఎలా చెప్పేందుకూ కూడా పాలుపోవడం లేదు నాకు. నా మట్టుకు నాకు రఘు ఎంతో సుధ అంతే. ఇద్దరి  క్షేమమూ 'నాక్కావాల్సిందే , మరి ఆ రాజరాజేశ్వరి కృప ఎలాగుందో గానీ' అన్నారు పైకి చూసి కళ్ళతోనే నమస్కరిస్తూ.
    'మీ అంతః కరణ ఎటువంటిదో నే నెరుగుదునోదినా . అయినా నాకంత ఆశ లెస్సుమండి.'
    'ఏమో దైవ సంఘనంటూ వుందంటే -- '
    'అబ్బే అతని చదువూ, అతని చక్కదనం అన్నింటి కన్నా, ముఖ్యంగా ఏంతో ఉన్నతమైన అతని భావాలూ, అతన్ని ఉట్టినే అనుకునేందుకన్నా అర్హతుండోద్దూ మాకూ. అందుకే మీకూ వో సలహా ఇవ్వాలను కుంతున్నానేను.'
    అదేవిటన్నట్టుగా చూశారావిడ భోజనం ముగించేసి సావకాశంగా చేరబడి కూర్చుంటూ.
    'సుదంటే మీ కమితాభిమానం అన్నది నాకు తెలుసు. అయినా, ఆ అభిమానాల్ని చూపుకోవాలంటే దానికోసరం మరో ఇంత ఖర్చు కావలిస్తే చెయ్యండి. అంతే తప్ప దాన్ని చేసుకోవలసిందిగా రఘుని మాత్రం శాసించకండి. ఇదే నా ప్రార్ధన ' అంది. ఇది అతి ముఖ్యంగా తీసుకోవాలి సుమా అన్న భావాన్ని స్పష్టంగా వ్యక్త పరుస్తూ జానకి.
    'నువ్విలా ఎందుకంటూన్నావో నా కర్ధం కావడం లేదు' అన్నారు పొడిగా ఆవిడ.
    'ఎందుకనడం ఏవిటోదినా . మీరు గనక మీ కోరిక అతన్తో చెప్పారంటే , మీ మాట కాదనకుండా తప్పకుండా అతడు సుధని చేసుకుంటాడు. అందుకు ఫలితంగా ఆరు పువ్వులూ, పది కాయల్తో ఎంతో ఉన్నతంగా నడవల్సున్న అతని భవిష్యత్తు, నిరుత్సాహంతో చప్పబడి పోతుంది. ఈ లోపం అన్నది అతనోక్కడ్నీ మాత్రమే కాదు మనందర్నీ బాధించేటటువంటి విషయమే.' అందుకని చెప్తున్నా.
    'నువ్వన్నది నిజమే ననుకో. అయితే ఒకవేళ వాడంతట వాడే సుధని చేసుకుంటా నన్నాడంటేనో?'
    'సుధ మీద
అతని కున్న అభిమానం , అంతకన్నా ఎక్కువైన జాలీ, కారణాలుగా ఒకవేళ అతనలా అన్నా, మునుముందు అందువల్ల కల్గబోయే కష్ట నష్టాలూ, అంతకన్నా ముఖ్యమైన మనస్చాంచల్యం మొదలైన ఇబ్బందు లన్నింటినీ విపులంగా విప్పి చెప్పండి. అప్పటికి అతను చేసుకునే తీరుతానని గనక అన్నాడంటే అది సుధ యొక్క మహా భాగ్యమనుకుని ఆ ప్రయత్నా ల్చేద్దాం ' అంది జానకి.
    'ఆ. ఏవిటో నీ పిచ్చిగానీ ఏదో దైవం పెట్టిన ఆ ఒక్క లోపం తప్పితే --'
    'హు. అది చాల్దా వదినా, ఇద్దరి జీవితాల్నీ అంధకారం చేసేటందుకూ! సమస్త సరదాలూ అనుభవించాల్సున్న వో నవ యువకుడికి 'నీ భారీ కుంటిది' అని అందరూ అన్నప్పుడల్లా మనసు పడే క్షోభ కన్నా, మరో శిక్షెం కావాలని! అందుకే సుధ క్షేమాన్నుద్దేశించి , అతని భవిష్యత్తు పాడు చెయ్యడం నాకెంత మాత్రం ఇష్టం లేదు.'
    'నువ్వన్నదంతా నిజమే ననుకో. అయినా నే చెప్పేదీ శ్రద్దగా విను. ఈ విషయంలో వాడు గనుక నన్ను సలహా అడిగాడంటే . వో తల్లి తన బిడ్డ శ్రేయస్సు కోసరం ఎంతవరకూ చెప్పొచ్చు నో, అంత వరకే నే చెప్పదల్చాను. అప్పుడు వాడు చేసుకుంటా నన్నాడంటే ఇక నే నడ్డు చెప్పను. నువ్వూ అభ్యంతర పెట్తోద్దు. తెలిసిందా!' అన్నారు లేచి చేయి కడుక్కువొస్తూ.
    'నాన్న ఫోన్ చేశారమ్మా . ఎవరో కె. విశ్వనాధ దత్తుగారుట. కుటుంబంతో సహా ఎల్లుండి వస్తున్నారుట. మీతో చెప్పమన్నారు.' అన్నాడు అప్పుడే మధ్యాహ్న భోజనం కోసరం ఇంటి కొచ్చిన రఘు, కాళ్ళూ చేతులూ కడుక్కు వొచ్చి భోజనం బల్ల ముందు కూర్చుంటూ.
    'విశ్వనాధ దత్తు గారా? అంటే ఎవరూ' తనలో తనే అనుకున్నారు తాంబూలం వేసుకుంటూ ఉయ్యాల బల్ల మీద కూర్చునున్న పార్వతమ్మ గారు.
    'అంటే కే.వి. దత్తు అంటారే? ఆయనా!'
    'ఔనేమో, నీకు తెలుసునా?'
    'మరి ఆ పేరుతొ బర్మా లో ఒకాయనుండేవారు. వాళ్ళ పెద్ద కూతురు శశి కళ నా క్లాస్ మేట్ కూడా' అంది జానకి.
    'ఆ అవును రఘూ అ మధ్య వాళ్ళింట్లో ఎవరికో మెడికల్ కాలేజీ లో సీటు కావాలంటూ సిఫార్సు కోసరం నాన్నకి రాశారు కూడా! అన్నారు గుర్తు తెచ్చుకుంటూ పార్వతమ్మ గారు.
    'అన్నట్లు వాళ్ళూ బర్మా నించి వచ్చేసిన వాళ్ళే గావల్ను కదూ,' అన్నారు జానకీ నుద్దేశించి మళ్లీ    'ఆ వాళ్ళంతా సొమ్ము నష్టమూ, ప్రాణ నష్టమూ కలక్కుండా చక్కగా ముందు జాగ్రత్త  పడ్డవాళ్ళు. అయినా విదేశం వెళ్లి జీవితమంతా చాలావరకూ అక్కడే గడిపి , కావలసినంత ఆస్తి పాస్తుల్ని సమకూర్చుకున్నా , ప్రాణభయ సమయం అనేసరికి స్వదేశం వచ్చి చేరి పోవాలన్న ఒకే తాపత్రయం ఎందుక్కల్గుతుందో , అందరికీ కూడా' అంది ఆలోచిస్తూ జానకి.
    'పిచ్చిదానా . అదే మరి జన్మభూమి కున్న గొప్పదనం. భయపడ్డ పసిబిడ్డ తల్లి వళ్ళో చేరి స్థిమితపడడం! ఆపదలో వున్న ప్రజలు జన్మభూమి చేరి ధైర్య పడడం! ఇవన్నీ జన్మతా వచ్చ్జే అనుబంధాలు అంతే.'
    'నిజం వదినా . అందుకే గావాల్ను మా స్నేహితులొకరు స్వదేశం వచ్చేస్తూ! అక్కడ భయాలు తగ్గేవరకూ వారితో రమ్మని ఒక బర్మా కుటుంబాన్ని పిలుస్తే ' చస్తే మా దేశం లోనే చస్తాం గాని మేం రాము పోమ్మన్నారట నిర్భయంగా 'అంది కుతూహాలంతో జానకి.
    'అబ్బా అప్పుడే రెండవుతుందే  అని వాచీ చూసుకుంటూ భోజనం నుంచి లేచిన రఘు ' అన్నట్టు మీరింత పొద్దుపోయి భోజనం చేశారేం ఇవాళ.' అన్నాడు సుధ ఇచ్చిన లవంగం నోట్లో వేసుకుంటూ.
    'లేదురా , వాళ్ళ భోజనాలవగానే మేము కూర్చున్నాం' అన్నాడు అమాయకంగా పార్వతమ్మ గారు.
    'వో అయితే పదింటికి కూర్చుని ఒంటి గంటకు లేచారన్న మాట అదీ నేను రాబట్టి! భేష్' అన్నాడు నవ్వుతూ రఘు. వాళ్ళ సంభాషణ దేన్నీ గురించి జరుగుటుందోనని ఊహించుకుంటూ.
    'వో చెంపని విమానాలు హోరెత్తిస్తుంటే , మరో చెంప బాంబులు డమాల్ డమాల్ మంటుంటే , మా గమ్మత్తుగా వుంటుంది కదత్తయ్యా' అన్నాడు. అప్పటి దాకా పక్కనున్న గదిలో చదువుకుంటున్న వేణు. అక్కడికొచ్చి తనూ తల్లి పక్కన కూర్చుంటూ?
    'వో అలాంటప్పుడు డక్కడ నిజంగా వుండుంటే అప్పుడు తెలిసోచ్చేది అయ్యగారికి మజా' అంది, రఘు స్కూటర్ గేటు దాటేదాకా వుండి 'టాటా' చెప్పెసోచ్చిన సుధ మేనత్త కిటు వేపున తనూ కూర్చుంటూ.
    'నిజంగా అప్పుడు మీరంతా ఎలా కాలక్షేపం చేశేవారత్తయ్యా?....' అన్నాడు  ఉత్సాహంగా వేణు.
    'ఎలాగేవిటి, అలాగే .... అంది గోడకి చేరబడి నిల్చున్న జానకి.
    'భయంగా వుండేది కాదూ.'
    'మొదట్లో హడలి చచ్చేవాళ్ళం. తరవాత కాస్త పరిపాటిగా ఊరుక్కునేవాళ్ళం. ఆ తరవాత వో రకంగా బడి తెరిపోయి వీలు చిక్కేసరికి , కూలిన మేడల్ని, పోయిన జనాన్ని చూడ్డానికే బయల్దేరే వాళ్ళం ఏకంగా. ఆ తరవాత ఏవంటే యముని దాడి ఎంతెంత అపాయమైన పన్లు జరిపించిందో అవన్నీ, కాలక్షేపపు కధలుగా చెప్పుకుంటుండే వాళ్ళం కూడా.
    'అమ్మయ్యో , మీమట్టుకు మీకు....' ఏ నిమిషం ఏమై పోతామా అన్న భయం వుండేది కాదూ?'
    'చెప్పాగా , 'నిండా మునిగిన వాళ్ళకి చలేవి' టన్నట్టు  మొండి కెత్తి పోయామని.'
    'అయినా వీలున్నంతవరకూ, బతికేందుకే జగ్రత్తన్నా పడదామనన్నా ఉండదూ' ఆశ్చర్యంగా అడిగారు పార్వతమ్మగారు.
    'ఎందుకుండదూ . అందుకేగా ఇంటి చుట్టూ ఇసక బస్తాల్ని పేర్చుకొనడం అయినా. ఒక్కొక్కసారి . ఆ ఉన్న ఏ కాస్త సందు నుంచో బాంబు తునకలు లోపలికి దూరి కొన్ని ప్రాణాల్ని తీసి ' విధి విలాసం నుండి తప్పించుకోవడం మీ తరం కాదు సుమండీ.' అన్న సత్యాల్ని రుజువు చేస్తుండేవి. అక్కడికీ ఇళ్ళల్లో కూడా 'ట్రెంచీ' చేసుంచుకుని జాగ్రత్త పడుతూనే వుండేవాళ్ళం.
    'ఏవిటీ, ఇటువంటి ఇళ్ళల్లోనే?' ఆశ్చర్యపోతూ అడిగారు పార్వతమ్మ గారు.
    'మరీ? అపాయ సైరనోచ్చిందంటే,' మళ్లీ గంటలో? పూటలో? రోజులో! విడుదలఅవడానికి. అందుకని, చేతులో వున్నా కాస్తా, కూస్తా తిను బండారాల్నీ ఆ పల్లాల్లోనెగా సిద్దంగా పెట్టుంచు కోవడం?'
    'మరి సామాన్లెవన్నా కావలసోస్తే?'
    'హు, ఆ అలవాటే మర్చిపోయాం . ఉప్పు భాగ్యానికి శేరు 10 రూ. అమ్మిన రోజులు కూడా ఉన్నాయంటే , ఇక అమ్మే దేవరు కోనేదేవరు. వున్న వాటితో ఎదోస్తే అది చేసి, తలో ఇంత కడుపులో పదేసుకోవడం! కాస్త తెరిపనుకున్నప్పుడు లేచి తిరుగుతుండడం అపాయమప్పుడు ఆ గోతుల్లో అలా పడుండడం అంతే.'
    'అయ్యా బాబో , నేనైతే చచ్చూర్కునే వాణ్ణి.' అన్నాడు వళ్ళు జలదరించు కుంటూ వేణు.
    'ఒకసారి వో తమాషా జరిగింది. వరసగా కొన్ని రోజుల పాటు విమానదాడి జరుగుతూనే వుందేమో, ప్రాణాలు విసుగెత్తి, విరపాయమన్న కూత వినిపించడం తోనే, ఏవయితే అదయిందనుకుని నలుగురం కలిసి బయటికి పోయాం, కూలి శిదిలాలై పోయున్న భవంతుల్ని గుర్తు పట్టేందుకు ప్రయత్నిస్తూ అలా ముందుకు వెళ్ళి' పోయినట్టున్నాం.' ఇంతలో అపాయ శంఖం మొరపెట్ట నారంభించింది. భయంతో దిక్కూ, దిశా తోచలేదు. ఇల్లు చేరుకుందుకిక ఎలాగూ వ్యవధి లేదు గనక, పక్కనే వున్న కర్ర పెండలం తోట లో దూరి పడుక్కు నుండి పోయాం అందరమూను.
    ఒక అర్ధగంట అయ్యేసరికీ విమానం మోతా. బాంబుల మోతా రెండింటి తో చెవులు చిల్లులు పడ నారంభించాయి. దైవాన్ని ప్రార్ధించు కుంటూ కాలం గడుపు తున్నాం. పద్దు క్రమేణా అణిగింది. నిరపాయపు కూత కోసరం నిరీక్షిస్తున్నాం ఇంతలో నా పక్కని చెరచెర మంటూ ఏదో చప్పుడయింది . పరీక్షగా చూద్దును . పది జానలకు పైగా వుంటుందేమో వో పాము కనిపించింది.
    'అమ్మో' కెవ్వుమన్నాడు వేణు.
    'హి? ఎప్పుడో పామొస్తే, ఇప్పుడొచ్చి నట్టుగా అరుస్తున్నాడే బావ' కిలకిలా నవ్వింది సుధ.
    'రాక్షసీ, నీకెంత భయం లేదే?' నవ్వాడు వేణు కూడా.
    'అబ్బ ఉండరా!' అని వేణుని గద్దించి 'అప్పుడేవయింది ?' అంటూ జానకిని హెచ్చరించారు పార్వతమ్మ గారు. అందులో ఆవిడ క్కూడా అంత కుతూహలం కల్గినట్టుంది మరి.
    'అక్కడుంటే ఎవౌతామో? లేస్తే ఏమౌతామో? అని ఒకటే భయం నాకు. ఇంతలో అపాయం తొలగి ఇళ్ళకి చేరుకున్నాం.
    'ఇక అమ్మా వాళ్ళంతా ఆవేళ నన్నెంత కోప్పడ్డారో అలా వెళ్లినందుకు. ఏవైనా నాకు ఆయుర్దాయం గట్టి లెండి.' అంది నిర్లిప్తంగా నవ్వుతూ జానకి.
    వేణూ, పార్వతమ్మగారూ , ఆ కధని ఆశ్చర్యంగా మళ్ళీ మళ్లీ నెమరుకి తెచ్చుకుంటుంటే 'ఆ భయంకర వాతావరణానికెగా మా తండ్రి ఆహుతై పోయారూ. అంతంత పదల్నుంచి గదా అమ్మ తనని అతి కష్టంమీద కాపాడు కొచ్చిందీ!' అనుకుని ఆ ఊహలోకంలో లీనమైపోయింది సుధ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS