Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 5


    నాకు స్పృహ వచ్చేసరికి చాలాసేపయి నట్టుంది. పాప యెప్పుడు పుట్టింది , ఈ అవిటితనం ఎలా వచ్చింది అన్న వివరాల్ని అక్కడున్న వో నర్స్ ని అడిగాను.
    ఎప్పటికప్పుడు బాంబుల ప్రమాదం జరుగుతూ గుడారాలన్నీ శిధిలమై పోతున్నందున ఏ కేసు ని గురించిన వివరాలు అచూకీగా కూడా దొరకడం లేదనీ, వీలున్నంత వరకూ అపాయం లో లేవలేని స్థితిలో వున్నవార్ని వీలుని బట్టి ఏదో ఒక విధంగా కాపాడుకుంటూ వస్తున్నామని చెప్పి అందువల్ల దాదాపు అప్పటికి నాలుగైదు స్థలాలకు మార్చబడ్డ కారణంగా పాపని గురించిన వివరాలేవీ వారికి సరిగ్గా తెలియకపోయినా పాపని పరీక్షించి నిర్ణయించిన లెక్క ప్రకారం పాపకి ఆరో మాసం జరుగుతున్నట్టు తెలుస్తుందని, చెప్పింది. నాకు మరికొంచెం శక్తి కోలుకునే వరకు అక్కడే వుంచుకుని ఆ తరవాత మనదేశానికి వస్తూన్న వో జట్టుతో నన్ను చేర్పించారు.
    అప్పట్నుంచీ మళ్ళీ యధాప్రకారం దొరికిందాన్ని తినడం, అపాయమనగానే ఎక్కడో తల దాచుకోవడం ఇలా నడుస్తూ రోగాల్తోటీ, ఆకలి దప్పుల్తోటి కుస్తీ పడుతూ రెండు నెలలకేలాగో , కలకత్తా చేరుకున్నాం అదివరకే ఒకటి రెండుసార్లు సుదకి సుస్తీ చేసింది. ఒకసారి చాలా ప్రమాదించింది కూడా. నిజం చెప్తున్నా వొదినా , అప్పుడు గనక -- అదేవన్నా గనక అయ్యుంటే , ఆ వెంటనే ఏ రాతికో తల గోట్టుకుని నేనూ పోవాలనే నిశ్చయించు కున్నాను.'
    'అబ్బ నిండు ప్రాణాన్నేప్పుడూ అలా అనుకొకూడదమ్మా'-'
    'నేనిన్నియాతన్లూ సహించింది అయన ఎంతో ఆనందంతో ఎదురు చూసిన ఆ పాపని ఎలాగన్నా కాపాడి ప్రజల్లో దాన్ని పడేసి కొంతవరకు అయన ఆత్మ కన్నా శాంతి చేకూర్చాలన్న ఏకైక లక్ష్యం తో మాత్రమే వదినా. అటువంటిది అ పాప లేనప్పుడు నాకీ ప్రపంచం తో ఇంకేం పని? అంతేకాదు నాకు ఒకట్రెండు సార్లు విష జ్వరాలోచ్చినప్పుడూ నా తరవాత  ఇంకా బాధలు పడిపోవాల్సిన కన్నా, నాతొ పాటే దాన్నీ తీసుకు పోతేనే మేలనుకుని, ఏ అగాధం లోనన్నా దూకాలను కుని ఒకట్రెండు సార్లు ప్రయత్నించా కూడా.
    'ఇంకా నయం'
    'అయితే ఆ పాపకి గొప్ప భవిష్యత్తుంది సుమా' అన్నట్టుగా అలాంటి ప్రయత్నం చేసినప్పుడల్లా, ఏదో ఒక విఘాతం ఏర్పడ్డమే! సరి ఇంక మనమిటు వంటి ప్రయాత్నాల్ని చెయ్యనే కూడదనుకుని అప్పట్నుంచి ఇక అటువంటి ప్రయత్నాలు విరమించు కున్నాను.'    
    'మరి అప్పుడనగా కలకత్తా చేరిందాన్నివి--'
    'తీరా  అక్కడికి చేరాక చాలా సుస్తీ చేసి దాదాపు నెల్లాళ్ళ పాటు హాస్పిటల్ ల్లోనే వుండి పోవాల్సోచ్చింది. అవి గడ్డు రోజులవడం మూలాన్న ఇంకా పూర్తిగా కోలుకోక ముందే నన్ను డిశ్చార్జ్ చేసేశారు. ఇక అప్పుడు నా పరిస్థితి ఆలోచించండి వదినా! ఎటూ కాని ఆ పరిస్థితి కన్నా, ఆ అడవుల్లో, కొండల్లోనూ పడీ చెడీ --ఆ నడిచి రావడమే నాకెంతో బాగున్నట్టని పించిందనుకోండి. పోనీ శుభ్రమైన రెండు గుడ్డలు కొనుక్కు కట్టుకుందామా అంటే అందువల్ల దీని దగ్గరేదో వున్నట్టుందనుకుని ఎవరేం చేస్తారో నన్న భయం. పోనీ ఊరుకుందామంటే , ఈ బికారి రూపంతో ఏ మొహం పెట్టుకుని మిమ్మల్ని వెతుక్కోవడం , ఇలా నానా బాధపడి చివరికి వో మారువాడీ కొట్టులో ప్రాణపదంగా దాచుకోచ్చిన ఉంగరాన్ని అమ్మి ప్రయాణ ఖర్చులు పెట్టుకున్నాను. కాకినాడ కి వెళ్లే సరికి మీరు కోరంగి లో లేరని తెలిసింది. మీ మావయ్య గారూ వాళ్ళూ కూడా యుద్ద భయానికి స్వగ్రామం వెళ్లి పోయినట్టు విని, ఎవరో వో ముసలాయన మీరు ఈ వూర్లో వున్నట్టు చెపితే, అక్కడ్నించీ ఇక్కడి కొచ్చాను.'
    'నువ్వెంతో తెలివైన దానివీ, వోర్పున్న దానివీ గనక, ఇన్ని కష్టాలు సహించి ఎలాగో వచ్చి చేరగల్గావు. ఇదే నాబోటి అయితేనా భయంతో ఎప్పుడో పోయిండే దాన్ని.' అన్నారు ఆవలించి లేస్తూ ఆవిడ.
    'ఇదుగో ఈ నలుసు నీ, ఇన్ని కష్టాల మధ్య అతి జాగ్రత్త గా తీసుకొచ్చిన ఈ వస్తువుల్నీ ఎలాగన్నా మీ కప్పగించేయ్యాలన్న పట్టుదల వల్లే ఇన్ని చెర గండాలూ దాటుకుని ఎలాగో వచ్చి చేరిపోయాను. దానితో పాటు దానికి చెందాల్సిన ఈ వస్తువుల్ని మీరే జాగ్రత్త పెట్టండి.' అంటూ బీరువా మీద పెట్టుంచిన తన బట్టల సంచీ తీసి దానిడుగున పాత బట్టల్లో చుట్ట బెట్టబడున్న వస్తువుల మూటని విప్పి ఆవిడ ముందు పెట్టింది జానకి. విలువైన వజ్రపు నగలు దీపాల్లా ప్రకాశిస్తున్నాయి అ చింపి గుడ్డల మధ్య .
    'ఇదుగో ఇలా విను జానకీ. మా ఇద్దరి కంఠలలోనూ ప్రాణం వున్నంత వరకూ నీకూ నీ పిల్లకీ ఏవిధమైన లోపాన్ని రానివ్వం. అయితే ఎందున్నా మేమిద్దరం నీకన్నా పెద్దవాళ్ళ మే కదా తల్లీ. అందువల్ల నీ పిల్లని నీ ఆస్తిని చూసుకుంటూ, ఇది నీ పుట్టిల్లె అనుకుని నువ్వూ మాతో పాటు ఇక్కడే వుండు. కష్టమో, సుఖమో ఒకరికొకరు ఆసరాగా కాలక్షేపం చేసుకుందాం. తెలిసిందా.' అన్నారు ప్రేమతో జానకి తల నిమురుతూ. ఆనందంతో వంగి ఆవిడ పాదాలకి నమాస్కరించి జానకి. ఆరోజు మొదలుకున్నీ వారిద్దరూ ఏ అరమారాభ్యం తరాలు లేకుండా తల్లీ, పిల్లల్లాగే మసలు కుంటున్నారు.
    అదీ గాకుండా అంతవరకూ అన్ని విధాలా దురదృష్టవంతురాలు గా భావించబడ్డ సుధ శర్మ గారి కుటుంబం లో కొచ్చాక వారి పాలిటి అదృష్ట దేవత గానే వెలుగొందిందని చెప్పాలి. ఎందుకంటె శర్మగారు పనిచేస్తున్న కంపెనీ అమ్మకంలో కోస్తుందన్న సంగతి వారిలో వారు మాట్లాడుకుంటూండడం విన్న జానకి, చిన్నప్పట్నుంచీ వ్యాపార విషయాల్లో బాగా అనుభవం కలదవడం వల్ల అందుకో మంచి ఆలోచన చెప్పింది.... మొదట్లో శర్మ గారందుకు వప్పుకోక పోయినా అందులోని లాభ సదుపాయాల్ని జానకి విడమరిచి బోధించడంతో, సంతోషంగా సమ్మతించారు.
    కంపెనీ అభివృద్ధి కొచ్చేటంతవరకూ , ఒక బాలికల హైస్కూల్లో ఉపాధ్యాయుని గా పనిచేసి క్రమేణా కంపెనీ బాగా అభివృద్ధి లో కొచ్చి కొన్ని శాఖల్ను కూడా నిర్మించుకున్న కారణాన్నా పార్వతమ్మ గారూ పెద్దవారై గృహనిర్వాహణ చెయ్యలేక పోతున్న కారణాన్నా తను ఉద్యోగం నుండి విరమించుకుంది జానకి.
    ఆడపిల్లలు లేని కారణం వల్లనో, మరెందు వల్లనో గాని, సుదంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ, అమిత ప్రేమ. అయినా అందరి కన్నా ఎక్కువ అభిమానం రఘుకి. తనవరకూ తనని ఎవ్వరేమన్నా , సర్దుకు పోయే రఘు, సుధని ఎవరన్నా ఏవన్నా అంటే మాత్రం ఎంతమాత్రము వూరుకోడు. అతని ఈ అమితాభిమానానికి అందరూ ఆశ్చర్య పోతుండె వారు.
    చిన్నప్పట్నుంచీ శర్మ గారి వద్దే పెరుగుతున్న అయన అన్న కొడుకు వేణు కాలక్షేపం కోసరం తరచూ సుధని ఏవన్నా అని రఘుని రెచ్చ కొడుతుండేవాడు. ఇంత చిన్నతనం లో సుధ అవిటితనాన్ని, కప్పి పుచ్చేందుకు, సుధని నడిపించేందుకూ, అతను పడ్డ యాతన్లిన్నీ , అన్నీ కావు. ఒకసారి వారి ఇంటి వద్ద వున్న విఘ్నేశ్వరుడి గుడికి పిల్లలందరూ ప్రదక్షిణం చేస్తుండగా, ఊనుకోలుతో మెల్లగా నడుస్తున్న సుధని , 'అబ్బ దారి కడ్డు లేవే కుంటీ .' అని కసిరాడు వేణు. బిక్క మొహంతో వచ్చి రఘు దగ్గర ఫిర్యాదు చేసింది సుధ. ఇక అది విన్న రఘు కోపం చూడాలి. ఒక్క పరుగున వెళ్లి వేణుని నాలుగు వాయించి , 'ఇక మీదట ఈ మాట దాన్నెవరూ అన్నారో?' అంటూ అక్కడున్న పిల్లలందర్నీ వరసగా హెచ్చరించి మరీ ఇంటికొచ్చాడు. ఇటువంటి సంఘటనలు ఇంకా ఎన్నెన్నో.
    'భోజనానికి లేస్తారా వదినా?' అన్న జానకి పిలుపుతో పాత సంఘటనల నుండి మళ్ళీ యధాస్థితి కి వచ్చారు పార్వతమ్మ గారు.
    సుధ వయసుతో పాటు జానకి బెంగా పెరుగుతూనే వుంది. సుధ పెళ్లిని గురించి. పై శృంగారానికి ప్రాముఖ్యమిచ్చే ఈ రోజుల్లో హృదయ సౌరభాన్ని చూసి ఈ సుధ నెవరు చేసుకుంటారు! సొమ్ము కాసించి ఎవరన్నా చేసుకున్నా, సరిగ్గా చూసుకుంటారన్న నమ్మకం ఏం వుంది?
    అసలే ఆడపిల్లకి సమ్మంధం వెతకడమన్నది మహా కష్టం. అందుకు తోడు, ఇటువంటి అవిటి పిల్లకు వెతకడం అంటే మాటలా?
    ఇంతకీ ఫలితం ఎలా వున్నా ప్రయత్నం మాత్రం తప్పదు కదా, అనుకుని ఈ విషయాన్ని గురించి పార్వతమ్మ గారితో ప్రస్తావించాలని ఎన్నిమర్లో ప్రయత్నించి మళ్ళీ ధైర్యం చెయ్యలేక పోతుంది జానకి.
    చదువు రెండో సంవత్సరం పూర్తయింది రఘు కి. యుద్ధం ముగిసిపోయినా స్థితికి రానందున మేనత్త గారూరైన వో గ్రామానికి వెళ్లి కొన్నాళ్ళు ఉండి వచ్చాడు రఘు. తిరిగి వచ్చినప్పట్నుంచీ సుధలోని మార్పుని గుర్తించేడు రఘు. 'బావా! బావా!' అని పిల్చుకుంటూ చనువుగా తన వెంట తిరుగుతుండే సుధ ఇప్పుడు తనని చూసి ఎడవేడంగా వెళ్ళిపోతుంది. చిలిపితనం కారుతుండే సుధ చేతలూ మాటలూ ఎటు మాయమై పోయాయో . ఎక్కన్నుంచోచ్చిందో ప్రవర్తన లో వో పెద్దరికం, మొఖం లో వో గంబీరతా వచ్చాయి. ఉన్నచోటు తెలియకుండా లోపలి గదుల్లో ఎక్కడో వుంటుందిప్పుడు సుధ. రఘు పల్కరించినా , అడిగినదానికి సమాధానాన్ని మించి మాట్లాడ్డం లేదు.
    రఘుకీ పద్దతేవీ నచ్చలేదు. పైగా సుధ ఇక మీద తనకి లాగే దూరమై పోతుందే మోనన్న భయం కూడా పట్టుకుంది రఘుకి.
    'ఈ సుధా దేవి గారేవిటమ్మా నెల్లాళ్ళ లో ఇంత పెద్దావిళ్ళా మారిపోయారు.' అన్నాడు ఇక వుండ పట్టక ఒకరోజు తన తల్లితో.
    'అదా, మరి పెద్దదయిందనడం లో అర్ధమే అదీ.' అన్నారు ఆర్ద్రంగా ముసిముసి నవ్వు నవ్వుతూ ఆవిడ. తల్లి మాటల్లోని అర్ధాన్ని సరిగా గ్రహించాడో లేదో గాని....ఏదో ఆలోచించుకుంటూ అవతలి కెళ్ళి పోయాడు రఘు.
    స్వతహాగా గంబీరమైన స్వభావం గలవాడు. ఏ విషయం లోనూ దబ్బున పైకి తెలడు. అలాగే మిగతావారి స్వవిషయాల్లో నూ జోక్యం కల్గించుకోడు. అనవసరపు పనుల్లో జోక్యం చేసుకోడు. ఉపయోగం లేని బాతాఖానీ చెయ్యడు ఎవ్వరితోనూ తర్కాలు పెట్టుకోడు. అలాగని తన లక్ష్యాల కడ్డం కల్గించే ఏ విషయాన్నయినా సరే నిర్మొహమాటంగా ఖండిస్తాడు గాని ఊర్కోడు. అన్నింటి కన్నా ముఖ్యంగా తన ఆదర్శాల్ని కాపాడుకోవడం లో ఎంతటి అవాంతరాల్నయినా సహించెంత శక్తి అతని కుంది. ఇన్ని విధాలైన అలవాట్లన్నీ వున్నా, ఒక్క సుధ విషయం లో మాత్రం ప్రతి విషయం లోనూ తనంతట తనే కల్గజేసుకుంటుండడం , అతనికే ఒక్కొక్క సారి ఆశ్చర్యాన్ని కల్గిస్తూ వుంటుంది.
    మొత్తానికి ఇంట్లో వారికీ, బయట వారికీ కూడా రఘు యందు మంచి గౌరవ భావం వుంది. అలాగే అతని అభిప్రాయాల్ని ఎడురించాలంటే ఒక విధమైన జంకు కూడా. ఇక వేణా అన్నీ రఘు అలవాట్ల కి విరుద్దమైన అలవాట్లే అతనివి ఎప్పుడూ ఏదో ఒక చిలిపి పని చేసి ఎదుటి వార్ని అల్లరి పెడుతూ డబ్బా వాగుడు వాగడం, కోపాన్నీ, సంతోషాన్నీ కూడా ఆపుకోలేక పోవడం, కోపాన్ని పట్టలేక అరిచేసి, అంతలోనే జాలిపడి పోతాడు. మొత్తానికి ఏదో సరదాగా కాలక్షేపం చేసుకు పోతుండడమే తప్ప, అతనికొక ప్రత్యెక అలవాట్లంటూ ఏమీ లేవు. అందుకే దీక్షగా చదువుకోవాలన్నప్పుడు పెద్ద బావ దగ్గరికీ, సరదాగా కాలక్షేపం కావాలనుకునేతప్పుడు చిన్న బావ దగ్గరికీ చేరుతూండడం సుదకి అలవాటు. అటువంటి సుధ ఇప్పుడు కొత్త మనిషిలా వుండి పోవడం రఘుకి కష్టం తోచినా ఇటువంటి విషయాల్ని లెక్క చేయడం అలవాట్లే ని వేణు మాత్రం ఏమీ అనుకోవడం లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS