శుక్రవారమూ, శనివారము కూడా పుస్తకాలు ముందు వేసుకుని యేట్సు కవి మీద వ్యాసం తయారు చేయడం లో గడిచిపోయాయి. ఆదివారం నాడు తెల్లవారుతుండగానే మంజులా, గోపాలరావు దంపతులూ, ఇంకో తెలిసిన తెలుగాయన, అయన భార్యా, మరో స్నేహితుడూ కలిసి వెళ్ళిపోయారు, ఇందిర కు ఇల్లు అప్పజెప్పి. నాయర్ చేసిన టిఫిన్ తిని, సాయంత్రం దాకా రానని చెప్పి వెళ్ళిపోయింది ఇందిర పదిగంటల కల్లా. అసలు సాహిత్య సమావేశం మూడు గంటలకు ప్రారంభమవుతుంది. కానీఒంటరిగా ఇంట్లో కూర్చుంటే మనసుకు బాగులేక, రేణూ గదికి వెళ్ళింది. రేణూ ఇంకో స్నేహితురాలితో కలిసి ఒక చిన్న భాగంలో ఉంటుంది. రేణూ , మీరా కలిసి ఎక్కడికో భోజనానికి వెడుతున్నారట మధ్యాహ్నం. ఇందిర తను కూడా పోవాలని చెప్పి, పన్నెండు గంటల కల్లా పైకి వచ్చింది. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఇంటికి రానని చెప్పండి నాయర్ తోటి. మళ్ళీ ఎలా పోతుంది? ఆలోచిస్తూ బస్ స్టాపు దాకా వచ్చింది. వచ్చేపోయే బస్సుల్లో ఏవీ తనకు ఉపయోగించేవి లేవు. చిరాగ్గా అటూ ఇటూ చూస్తున్న ఇందిర కు ఎవరో పరిగెడుతున్న కార్లోంచి చెయ్యి ఊపారు. అరప్లర్లాంగు దూరంలో ఆగిన కారు మెల్లిగా వెనక్కి వచ్చింది. అందులోంచి జయలక్ష్మీ అయ్యం గారు దిగి ఇందిర చెయ్యి పట్టుకుంది. "నీకోసం పొద్దుటి నించీ ప్రయత్నిస్తున్నాను. ఏమైపోయావ్?......మరేం లేదు. ఇద్దరు అమెరికన్ విద్యార్ధులు మా ఇంటికి వచ్చారు. అన్నయ్య స్నేహితులే. ఈ రాత్రి కిక్కడే ఉండి రేపు నాగపూరు వెళుతున్నారు.వీళ్ళిద్దరూ తెలుగు వాళ్ళను కలుసుకోవాలని ఉబలాట పడుతున్నారు. నిజం చెప్పొద్దూ నువ్వు తప్ప నాకింకేవరూ బాగా తెలియదు. నాకు తెలిసిన తెలుగు వాళ్ళందరివి చాలావరకు బూజు పట్టిన భావాలు. ఆపైన మా ఇంటికి వచ్చి వీళ్ళని కలవమంటే మహా బెట్టు చేస్తారు. అందుకే నీ గురించి ఇంత తిరాగడం. ఇప్పుడేమయినా అర్జంటు పని ఉందా నీకు?" జయలక్ష్మీ ఇంగ్లీషు కూడా అరవం లాగే మాట్లాడుతుంది.
"ఊ హూ , లేదు."
"ఔనులే. ఉంటె బస్ స్టాండ్ దగ్గిర నుంచుని మనుషుల్ని లెక్క పెట్టెటంత తీరిక ఎక్కడ ఉంటుంది? నాతొ వచ్చెయ్య కూడదూ ఇప్పుడే?
"నాకు మూడు గంటలకు బందోపాధ్యాయ మీటింగు ఉంది. అప్పటి కి వదిలి పడతావా?"
"ఓ తప్పకుండా . నేనే డ్రాప్ చేస్తాను అక్కడ. సరేనా?" అంటూ ఇందిరను కార్లోకి ఎక్కించుకుని తీసుకు వెళ్ళింది జయలక్ష్మీ. అసలయిన మదరాసీ అయినా చాలామంది చదువుకున్న అయ్యంగార్ల లా వీళ్ళు కూడా ఆధునిక నాగరికత అలవరచు కున్నారు. జయలక్ష్మీ వాళ్ళ అక్క లేడీ హార్డింజ్ లో వైద్య వృత్తి చేస్తుంది. అన్న అమెరికాలొ పై చదువులు చదువుతున్నాడు. తమ్ముడు మాత్రం మిలటరీ ట్రెయినింగు పొందుతున్నాడు. ఇంటికి వెళ్లేసరికి ఇద్దరు అమెరికన్ యువకులూ అప్పుడే వచ్చారట నెహ్రూ మ్యూజియమ్ చూసి బొట్టు గురించీ, చీర గురించి పిచ్చి ప్రశ్నలు వేయకుండా తెలుగు భాష గురించి , సాహిత్యం గురించి, ఆధునిక ప్రక్రియలను గురించి చక్కగా సంభాషించారిద్దరూ కూడా. ఎరిక్ గాలోవే పొడుగ్గా , ఎర్రగా , అందవికారంగా, సాధారణ అమెరికన్ యువకుడి లా ఉన్నా, అఖండమైన తెలివితేట లూ, సమయస్పూర్తి ఉన్నవాడు. ఇల్లినాయ్ వచ్చిన రిచర్డ్ మన్ మాత్రం మరీ పొడుగూ కాదు, పొట్టీ కాదు. నల్లని జుట్టు, చక్కని తేనే రంగు కళ్ళతో చాలా ఆకర్శకం గా ఉన్నాడు. ఎరిక్ లా అతివాగుడు వాగకపోయినా , ఇతనూ తెలివైన వాడే. వీళ్ళిద్దరికి హిందూ మతం మీద, భారతీయ సంస్కృతీ మీద ఉన్న అపారమైన గౌరవం చూసి విస్తుపోయింది ఇందిర. ఎరిక్ విస్ కాన్ సిన్ లో తెలుగు ఒక సంవత్సరం అధ్యయనం చేసి మరీ వచ్చాడు. ఇలాంటి వాళ్లింకా ఎక్కువ మంది ఉంటె బాగుండు ననిపించింది. ఇందిర కు అమెరికన్ సాహిత్యం లో ఉన్న ప్రవేశానికి ఎంతో ముగ్దురాలయ్యా రిద్దరూను. వాళ్ళు కూడా గ్రహించని కొన్ని పాశ్చాత్య ప్రక్రియలను గురించి, తత్వాలను గురించి ఇందిర విమర్శ నాపూర్వకంగా మాట్లాడుతుంటే వాళ్ళెంతో ఆశ్చర్య పోయారు. ఇందిర ఇంగ్లీషు ఉచ్చారణ పక్కా బ్రిటీష్ దని పదేపదే అన్నారిద్దరూ కూడా. ఎరిక్, "అయితే ఇంగ్లండు లో చదువుకున్నావా? లేక ఇంగ్లీషు ట్యూటర్లు ఉండేవారా?" అని అడిగాడు కూడా. ఇందిర నవ్వి , "ఇంగ్లీషు మాట్లాడే భారతీయులు మూడు వంతుల మంది అలాగే మాట్లాడతా"రని చెప్పింది. మొత్తానికి జయలక్ష్మీ పుణ్యమా అంటూ ఇందిర ఆ మధ్యాహ్నం ఎంతో తృప్తి గా గడిపింది. వాళ్ళిద్దరూ కూడా మధ్యాహ్నపు సమావేశానికి వస్తామన్నారు. సంతోషంగా వాళ్ళిద్దర్నీ తీసుకు వెళ్ళింది. ఉపన్యాసకుడు ప్రఖ్యాత రచయిత కావడంతో భారతీయులు ఆంగ్లం లో చేస్తున్న రచనా వ్యాసంగాన్ని గురించిన చర్చ మరింత రసవత్తరంగా నడిచింది. సభ అయిన తరువాత ఉపన్యాసకుణ్ణి కలిసి అభినందనలు తెలిపి ముగ్గురూ పైకి వచ్చారు. ఎర్లిక్ అన్నాడు: మీ వల్ల ఒక చక్కని చర్చ విన్నాం. దాని కెంతో కృతజ్ఞులం.
మీరు శ్రమ అనుకోకుండా ఉంటె ఇంకో ఉపకారం చెయ్యాలి."
"ఏమిటి?"
"మా భారత దర్శనం లో మీరు చక్కని మార్గదర్శులయ్యారు. ఎయి ఫాక్స్ లో ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారుల చిత్ర ప్రదర్శన జరుగుతుంది కదా. మేం చూడదలుచుకున్నాం. మీరు కూడా మాతో వస్తే ఇంకా బాగుంటుంది . ఏమంటారు?"
"సరే, పదండి" అంది ఇందిర. లక్ష్మణ్ పాయ్ ఏ.ఏప్. హుస్సేన్ ల చిత్రాలు చూస్తూ , వాటిని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించారు వీరోచితంగా. హుస్సేను చిత్రాలయినా కొంత అర్ధమవుతాయి గాని ఫాయ్ వి అసలే కొరుకుడు పడవు. చివరి కా చిత్రాలను చూసి సంతోషించాలి గానీ, ఆర్ధం చేసుకోడానికి ప్రయత్నించరాదన్న నిర్ణయానికి వచ్చారు ముగ్గురూ. హాల్లోంచి పైకి వస్తుంటే జోగీందర్ కనబడ్డాడు. తన స్నేహితులిద్దరికీ జోగీని పరిచయం చేసింది ఇందిర. కాసేపు పేవ్ మెంట్ మీదే మాట్లాడుకుంటూ నున్చున్నాక, ఎరిక్ కీ, రీచార్డ్ కి వీడ్కోలు చెప్పింది ఇందిర. మెల్లిగా చీకటి పడుతుంది.
"నిన్నింటి దగ్గిర దింపుతాను , వస్తావా?" అడిగాడు జోగీ, తన స్కూటర్ వేపు దారి తీస్తూ.
"బాబోయ్! స్కూటరే! నే నెక్కను" అంది ఇందిర.
"మరీ పల్లెటూరి పిల్లలా మాట్లాడకు. స్కూటరెక్కితే వచ్చిన ప్రమాదం లేదు. కారేక్కితే సాభ్యతే కానీ, స్కూటరు మీద ఎక్కితే తప్పు కాబోలు . అయినా నేనేం నీకివాళ కొత్త కాదు ఊ, ఎక్కు" అన్నాడు జోగీ పట్టుదలగా.
జవాబెం ఇవ్వలేకా, స్కూటర్ మీద ఎక్కితే ఎలా ఉంటుందో చూడాలనే సరదా తో ఒప్పుకుంది ఇందిర. జాగ్రత్తగా , అట్టే వేగంగా పోనివ్వకుండా తీసుకు వెళ్ళాడు ఇంటికి ఇందిర ను. ఇంటి ముందు స్కూటరు దిగి, జోగికి ధన్యవాదాలు చెప్పి మేడ మీదికి చూసిన ఇందిర కళ్ళు రెండు క్షణాలు మూత పడలేదు. మేడ మీద వరండా లోంచి వెళ్ళిపోతున్న స్కూటరు వంక తదేకంగా చూస్తున్నాడు మాధవరావు.
రాత్రికి గానీ రారను కున్నవాళ్ళంతా త్వరగా రావడానికి కారబం ఇంట్లో కాలు పెట్టగానే తెలిసింది. సుందరమ్మ గారు ఎక్కడో కాలు జారి పడిందిట. దాంతో కాలు బెణకడం, బాగా ఒళ్ళు నొప్పులు చెయ్యడంతో, ఇంటి ముఖం పట్టారు అందరూ. గోపాలరావు గారు కూడా విపరీతమైన తలనొప్పితో పడుకున్నారు. బయలుదేరిన వేలా విశేషమేమిటో గానీ, ఎవరూ తృప్తిగా వచ్చినట్టు లేరు. మంజుల ముఖం ముడుచుకుని కూర్చుంది. ఈ అవస్థ కు తోడు నాయర్ ఇంట్లో లేడు సమయానికి. ఇంటి వాళ్ళకు తాళం చేవులిచ్చి ఎక్కడికో పోయాడట. తన చేతిలోని కాగితాలూ, చేతి సంచీ ఒక చోట పడేసి ఇందిర గబగబా లోపలికి వెళ్ళింది. ఎవరి మంచం మీద వాళ్ళు పడుకుని, తెగ మూలుగుతున్న పెద్దలిద్దరినీ చూసేసరికి ఇందిరకు పుట్టెడు జాలి వేసింది. అమృతాంజనం తీసుకుని ఇద్దరికీ చేరి కాస్త రాసింది. నొప్పి భరించ గలిగినా, తమ నెవ్వరూ చూసేవాళ్ళు లేరని మూలుగుతున్నారిద్దరూ.
ఇందిర ఉపచారంతో కాస్త తేరుకుని, "నా తల్లీ నువ్వు వచ్చావు, ప్రాణం కుదుట పడింది" అన్నారు గోపాలరావు గారు. "కాస్త కాఫీ కాచి ఇస్తాన"ని చెప్పి వంటింట్లో కి వెళ్ళింది ఇందిర.
