3
మరో పదిహేను రోజులు గడిచాయి. ఆరోజు ఒకటో తారీఖు . ఉద్యోగుల జీవితాలు జీతాల తోనే గడుస్తాయి. జీతాలు వచ్చిన రోజున వాళ్ళ మనస్సు లలో వెన్నెలలు కురుస్తాయి. జీతాల కన్న అప్పులు ఎక్కువగా ఉన్నవారు ఉన్నారు. వాళ్ళు జీతాలు నిరాశ తోనే తీసుకుంటారు. సాయంత్రం నాలుగయింది. జీతం తీసుకుని సీటు కొచ్చి కూర్చున్నాను. ఎన్నడూ ఆఫీసుకు రానివాడు ఆరోజున అన్నయ్య ఆఫీసు కొచ్చాడు. ఇంటి దగ్గర వాళ్లకు ఏదయినా ప్రమాదం జరిగిందేమో ననుకున్నాను. నన్ను చూస్తూనే.
"సుధా జీత మొచ్చిందా . అర్జంటు గా ఓ పాతిక రూపాయలు కావాలి. మళ్ళీ వారం రోజుల్లో ఇచ్చేస్తాను." అని చెయ్యి చాపాడు. నా మనసులో అనేక అనుమానాలు ముసిరినా అవన్నీ ఆఫీసులో అడక్కూడదని వెంటనే పాతిక రూపాయలూ ఇచ్చాను. ఇట్లా జరుగుతూ ఉండగానే ఆఫీసులో అన్నయ్యకు తెల్సిన వాళ్ళు, ముగ్గురు నలుగురు వచ్చి,
"ఏం గురూ, మా టైపిస్టు కే వేస్తున్నావ్ టోపీ నీ దృష్టి లోనూ పడింది" అన్నారు. నా శరీరం మంచు గడ్డయిపోయింది. అన్నయ్యంటే వాళ్ళకు ఏపాటి గౌరవం ఉందొ క్షణం లో తేలిపోయింది.
"టోపినా. ఓహో మీ ఆలోచన అంత వరకూ పోయిందన్న మాట. సుభాషిణి ఎవరో కాదు. మా చెల్లెలు" అని వెళ్ళిపోయాడు. వాళ్ళు నిర్ఘాంత పోయి ఒకరి ముఖా లొకరు చూస్తుకున్నారు.
"మా అన్నయ్య మీకు తెలుసా" అన్నాను.
"వాణీనాధం మీ అన్నయ్య ని ఇప్పుడే తెల్సింది." ఆ మాటలో తేలిక భావం కనిపించింది. అంతవరకూ నామీద వాళ్ళ కున్న గౌరవ భావం ఒక మెట్టు జారినట్టు గ్రహించాను.
ఆ రాత్రి బాగా పొద్దు పోయాక అన్నయ్య ఇంటి కి వచ్చాడు. అంతకు క్రితమే అన్నయ్య ఆఫీసు కు వచ్చి పాతిక రూపాయలు తీసుకు వెళ్ళినట్లు నాన్నకు చెప్పాను.
'అంత అర్జంటుగా పాతిక రూపాయలూ ఎండుక్కావాల్సివచ్చిందిరా అన్నయ్యా" అడిగాను.
"ఎందుకో కావాల్సోచ్చింది. అదంతా నీ కనవసరం. వారం రోజల్లో నీ బాకీ తీర్చేస్తాను." కోపంగానే అన్నాడు.
"మా ఆఫీసు లో వాళ్ళు నీకు తెలుసా?"
"ఆ, వాళ్ళ బతుకులు నాకు బాగా తెల్సు. అ నలుగురూ బ్రాకెట్ అడేవాళ్ళే. మంచి పేకాట రాయుళ్ళు."
"నీ ఉద్యోగమూ అదేగా"
"సుభా . అదంతా నీకు అనవసరం."
నాకూ కోపం వచ్చింది. అన్నయ్య ఆపీసుకు రావడంతో వాళ్ళ నలుగురి భావాలూ నాకు కళ్ళకు కట్టినట్లు కనిపించటంతో ఈ విషయమూ ఇప్పుడే తెల్సుకోవటం మంచిదని అనేశాను.
"నీకు డబ్బు కావాలిస్తే ఇంటి దగ్గరే అడుగు నా కోసం ఆఫీసుకు ఎన్నడూ రాకు. నన్ను గౌరవంగా ఉద్యోగం చేసుకొనీ."
నాన్నా, అమ్మా విభ్రాంతి తో చూశారు. అన్నయ్య ప్రయోజకత్వం వాళ్ళకూ తెల్సినా నేనింత సూటిగా మాట్లాడుతానని వాళ్ళను కోలేదు. అక్కయ్య వెర్రి చూపులు చూస్తూ గుమ్మాని అనుకుని నిల్చుంది.
"ఓహో, నేను మీ ఆఫీసు కి రావటం వల్ల నీ గౌరవం పోయిందన్న మాట. అంటే నీ దృష్టి లో నేను గౌరవం లేని వాడ్నే నన్నమాట. వెరీ గుడ్. పోనీలే నా సత్తా ఏమిటో నాకు తెలియకపోయినా నువ్వన్నా చెప్పావు."
విసురుగా అని గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. అన్నయ్య మరేం కొంప మీదికి తెస్తాడో నని భయపడ్డాను.
ఆఫీసు కు వెళుతున్నాను. వస్తున్నాను. వాతావరణం ప్రశాంతం గానే ఉన్నది.
వారం రోజులు గడిచాయి. ఒక రోజున లంచ్ టైం లో టిఫిన్ తిని కాఫీ తాగుతున్నాను. శ్రావణ కుమార్ నా సీటు దగ్గరకు వచ్చాడు. అందరూ కాఫీకి వెళ్ళారు.
"మీరు టీ పార్టీ ఇవ్వాలి. కనీసం కాఫీ అయినా" అన్నాడు.
"ఎందుకో చెప్తే తప్పకుండా కాఫీ ఇప్పిస్తాను."
"వాణీ నాధం మీ అన్నయ్య అయినందుకు."
కాస్త కలవరపడ్డా తేరుకున్నాను.
"వాడు మా అన్నయ్య ఇప్పుడు కాలేదు. నేను పుట్టినప్పుడే వాడు నాకు అన్నయ్య నవ్వి అన్నాను.
"మాకు తెల్సింది ఇటీవలనే కద. అందుకని ఇప్పించాలి. తప్పదు.'
జవాన్ని పిలిచి ఫ్లాస్కు ఇచ్చి పంపాను కాఫీ టిఫిన్ తేవటానికి.
"నిజంగా తెప్పిస్తున్నారా.'
"ఆ మా అన్నయ్య మీకెట్లా తెలుసు."
"కొంతమందికి కొన్ని అలవాట్లుంటయ్యి. నాకు పేకాట ఫ్రెండ్. కాని అలాంటి వాడు మీకు అన్నయ్య కావటం ఒక క్రెడిట్.' అన్నాడు ఏదో ఆలోచిస్తూ.
"ఎందుకని."
"అతను చాలా సమర్ధుడు. నిక్కచ్చి మనిషి. జులాయి గా తిరిగినట్లు కనిపిస్తాడు కాని నాలుగు డబ్బులు సంపాదించుకోగలడు. కాకపోతే దుర్గునాలు మానవుడిలో ఉంటయ్యి గాని, మానుల్లో వుండవు కదా. వాణీ నాధం మీ అన్నయ్యని తెల్సిన వాడెవరూ మీ జోలికి రాడు."
అన్నయ్య ప్రతాపాలు కధలుగా చెప్పుకునే రీతిలో వున్నయ్యని కాస్త కాస్త తెలుస్తున్నది. మంచి తెలుసు కోడానికి సంవత్సరం కావలసివస్తే చెడు తెలుసుకోటానికి నెల రోజలు చాలన్న మాట.
"పోనీలెండి. యిప్పుడు వాడి ప్రతాపం ఎందుకు. ఆ మీకు కాఫీ, టిఫిన్ ఆఫీస్ మెంబర్ గా ఇస్తున్నా గాని, వాడు మా అన్నయ్యని కాదు తెల్సిందా" ఎందుకనో అన్నయ్య మీద అభిమానం పెంచుకోలేక పోతున్నాను.
"అట్లాగే నా మీద కోపం పోయిందా."
"ఆఫ్టరాల్ టిపిస్ట్ ని నాకోపం మిమ్మల్నేం చేస్తుంది." ఎగతాళి గా అన్నాను.
"ఏం చెయ్యక పోయినా కోపం పోనట్లే కదా. ఒక ఆడపిల్లకు ఆ మాత్రం కోపం నా మీద ఉన్నదంటే అదీ ఒక అదృష్టమే" సిగరెట్ వెలిగించు కొబోయాడు. అంతలోనే మళ్ళీ సిగరెట్ పెట్టె జేబులో వేసుకున్నాడు.
"మీ మీద నాకు కోపం ఉండటం అదృష్టం ఎలా అవుతుంది."
"కోపంగా నైనా మీ మనస్సులో నేనుంటాను కనుక" గుండె ఝల్లు మన్నది. సిగ్గుపడ్డాను. జవాను టిఫిన్ తెచ్చాడు.
నెల గడిచింది. ఉదయం పది గంటలయింది. భోజనం పూర్తయింది. ఆఫీసు కు వెళ్ళటాని కి తయారవుతున్నాను. శ్రావణ కుమార్ సైకిల్ మీద వచ్చాడు. ఆశ్చర్య పోయాను. ఎండుకోచ్చాడో ఊహకు అందలేదు.
"గుడ్ మార్నింగ్ సుభాషిణీ చిన్న సహాయం కోసం వచ్చాను. ఏమీ అనుకోరు కద" అన్నాడు .
ఏమీ అనుకోను చెప్పండి" కొంచెం ఇబ్బంది గానే చూస్తూ అన్నాను. ఆఫీసు స్నేహం ఇంటి దాకా రావటం లో అంతర్యం ఏమిటో నాకు బోధపడలేదు.
"కొంచెం అర్జంటు పని ఉంది ఆఫీసుకు రాలేను. ఈ క్యాజువల్ లీవప్లికేషన్ ఆఫీసులో ఇవ్వండి." అని సెలవు కాగితం ఇచ్చాడు .
'అట్లాగే"
"శ్రమకు మన్నించాలి" అతను వెళ్ళిపోయాడు.
వాళ్ళ ఇల్లెక్కడో నాకు తెలీదు. సైకిల్ మీద ఆఫీసు కే వెళ్లి సెలవు కాగితం ఇవ్వచ్చుగా ఎందుకిట్లా చేసినట్లు; ఇతని సెలవు కాగితం నేను తీసుకు వెళ్లి ఇస్తే ఆఫీసు లో ఏమనుకుంటారు. శలవు కాగితాలు తెచ్చి ఇచ్చేంత వరకూ స్నేహం వృద్ది చెందిందనుకుంటారా.
శలవు కాగితం అతను ఇవ్వటం నేను తీసుకోటం అక్కయ్య చూస్తూనే ఉంది. "ఎవరే మీ ఫ్రెండా"
'ఆఫీసులో క్లార్క్.
"ఆఫీసులో ఇవ్వాల్సిన కాగితం నీ కివ్వటం ఎందుకూ"
"నేను ఆఫీసు కు వెళుతున్నా కనుక" కోపంగానే అన్నాను, అక్కయ్య అడిగిందని కాకపోయినా అతను అట్లా ఇవ్వటం నాకూ బాగుండ లేదు.
"పెళ్లి కాకుండా వుంటే బావుండును."
"నువ్వు చేసుకుంటావా." నాకూ వళ్ళు మండిపోయింది.
"ఇహిహిహి" వెకిలిగా నవ్వుతూ వెళ్ళింది అక్కయ్య.
మనస్సు సరిపెట్టుకుని ఆఫీసు కు వెళ్ళగానే జవాను చేత అతని శలవు కాగితం హెడ్ క్లార్క్ దగ్గరకు పంపించాను.
మరో అయిదు నిమిషాల్లో జవానోచ్చి" మిమ్మల్ని హెడ్ క్లార్క్ గారు రమ్మంటున్నారు" అన్నాడు.
వెళ్లాను. విష్ చేశాను.
"శ్రావణ కుమార్ శలవు కాగితం మీ కెట్లా వచ్చింది" అన్నాడాయన.
"నేను ఆఫీసు కు బయల్దేర బోతుంటే సైకిల్ మీద మా యింటికి వచ్చి ఆఫీసులో ఇమ్మని చెప్పి వెళ్ళాడు." అన్నాను.
'ఇట్లాంటి ట్రిక్కు లు ఇతనికి అలవాటే. ఇంకెప్పుడూ ఇతని శలవు కాగితాలు తీసుకోకండి. యుకేన్ గో" అన్నారాయన. నా సీట్లోకి వచ్చేశాను.
శ్రావణ కుమార్ ఆఫీస్ లో చాలామందికి ఇంత వ్యతిరేక భావం ఎందుకున్నదో నాకు అర్ధం కాలేదు. ఒక ఆఫీసులో ఇన్ని రాజకీయాలుంటే అసలు రాజకీయవేత్తలు ఎత్తుగడలూ, ఉపన్యాసాలూ ఆ మాత్రం లేకపోతె వాళ్ళు చలామణి కారను కున్నాను.
