Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 5


    అలాంటి పరుగుల ఊహల్లో సోరుగున మామ్మ అగపడింది. ఆమెకు యెవరూ లేరు. ఉన్న ఒక్క కొడుకూ పిచ్చి వాడై పోయాడట. ఏవో పొలాల మీద కొద్ది పంట వస్తుంది. అది అమ్ముకొని యింటికి అద్దె యిచ్చుకుని కాలం గడుపుతోంది. ఆ పల్లెటూరి కి పోకుండా యిక్కడే వుండటానికి కారణం ఆమె అప్పుడప్పుడూ పిచ్చాసుపత్రికి వెళ్లి కొడుకును చూడాలన్న భ్రాంతే!
    ఆమె వయసు అందాన్ని మింగలేక పోయింది. ఇంకా ఆమెలో ఆనాటి రూపు రేఖలు, రంగు టద్దాల్లో ప్రకృతి చూస్తె యెలా కనిపిస్తుందో అలా కనిపిస్తున్నాయ్. ముఖం లో తేజో రేఖలు ముడతలు పడటానికి తృణీకరిస్తున్నాయ్. ఆమె కళ్ళను కనీరు తడిపి తడిపి కంటి పాపలను ముంచి ముంచి చివరకు విసిగి వేసారి విడిచి పెట్టాయ్. ఆమె తన ఒంటి బ్రతుకునకు విచారించటం, దీనత్వాన్ని ఒకరితో చెప్పుకోవటం , సూర్యం వినలేదు. బ్రతకటం ఒక విధిగా తీసుకున్నట్లుంది. అలాంటప్పుడే యెలాంటి భారమైనా నీటిలో ముంచి తాడుతో లాగినట్లు తేలి పోతుంది. నెరసిన తల వెంట్రుకలు తెల్లని సిల్కు దారాల్లా వేలాడుతున్నాయ్. ముక్కు బాగా పూసిన గులాబి పువ్వులా నుండి తాకాలన్న కోరిక పుట్టిస్తోంది.
     ఆమె సంధ్యా కాలం లో యెరుపు దేరిన పశ్చిమాకాశం వేపు తిరిగి తలవంచిన సూర్యాకాంతపు పువ్వులా వుంది. ఆ పువ్వు ఆరోజు వుదయమే తూర్పు వేపు తిరిగి తలెత్తే కాలంలో తను పుట్టనందుకు సూర్యం చింతించాడు. ఆమెను వయసులో చూసీ, మాట్లాడి యెన్నెన్నో తీయని వూహలు అల్లుకునే అదృష్టం తనకు లేనందుకు విచారించాడు. రానిదీ, కానిదీ పట్టుకుని వూగులాడకుండా వచ్చిన దానికి అయిన దానకి రూపులు దిద్దుకుని సంతోషించటం , సుఖ పడటం నేర్చుకోవటం అలవాటు చేసుకుంటున్నాడు. ఈ అలావాటే సంసారికి సుఖానిస్తుంది. సుఖం కోసమే మనిషి సంసారి కావాలి.
    సూర్యం కు సంసారి కావాలని వుంది. పెద్దలు సృష్టించిన పూల వనాన్ని పీకి తనో క్రొత్త బృందవనాన్ని సృష్టించాలని లేదు. ఆ వనం లో మరికొన్ని కొత్త పూల మొక్కలాను నాటగలిగి ఆ చెట్లు పెరగటానికి నీరు పొయ్యగలిగే తోట మాలిగా నుండాలని వుంది. గతంలో నిల్చున్న కాళ్ళను భవిష్యత్తు కోసం వర్తమానం లో గాలిలో యెగరనివ్వదలచు కోలేదు. గతంలో నిల్చొని , భవిష్యత్తు కోసం వర్తమానం లో క్రొత్త వూహలను చేతలతో ఆకారం యివ్వదలచాడు. అందుకు అతను వృత్తి చే చిన్నవాడు కావచ్చు. ఈ మహా సంగ్రామం లో అక్షోణీ ల సేవలలో ఒక గుర్రపు నాడు కున్న మేకే కావచ్చు తను. దేని విలువ దాని కుంది. ఒకనాడు యే విలువా లేదని వదిలిన యిసుక రేణువులు కొన్నాళ్ళ కు అద్దాలై యెవరి రూపాలను వాళ్ళకే చూపించాయ్. ఆ రేణువు లే మళ్లీ కాల ప్రవాహం లో శబ్దాన్ని సృష్టించే ట్రాన్సిష్టర్లు అయ్యాయ్. ఒక వ్యక్తీ విలువ యెదుటి వాడు తెలుసుకోనంత మాత్రాన వాడికి విలువ లేకపోదు.
    అప్పటికి అతను రేణువు లాగే చిన్న వుద్యోగం లోనే వున్నాడు. దాని విలువ కనిపెట్టే సైంటిస్టు లా అతని పై ఆఫీసరు సూర్యం లోని నిజాయితీ ని తెలివి తేటలను, బాధ్యతలను పైన వేసుకొనే సమర్ధత ను కనిపెట్టునే పనులు అప్పచెప్పి పరీక్ష చేసే వాడు. ఫలాపేక్ష లేని అతని నిజాయితీ కి వీపు తట్టేవాడు. ఎదుటి వాని గొప్ప తనం గుర్తించటంలోనే మనిషి తను గోప్పవాడౌతాడు. అలానే మామ్మ గొప్పతనాన్ని సూర్యం గుర్తించ సాగాడు.
    మామ్మ సూర్యానికి మర్యాద యిచ్చేది. ఆ మర్యాద కొద్దిగా సిగ్గుతో చూపించేది. ముఖాముఖి ఆరు నెలలైనా యింకా మాటాడ లేదు 'బాబు తిన్నారా?' 'ఈ వేళ బాబు ఆఫీసుకు శలవా?' 'బాబుకు వంకాయ ముద్ద కూర యిష్టమేనా?' - ఇలా యెన్నెన్నో తన గురించి తల్లితో ప్రశ్నిస్తుంటే సూర్యం ఆ పలుకులు వినేవాడు. తన బాగోగులు యిష్టా యిష్టాలు కోరి తెలుసుకుంటున్నప్పుడు అభిమానం హృదయమంతరాళం లో వుండి తీరాలి.
    ఒకరోజున 'నీకేం తల్లీ? గంపెడు పిల్లలను కన్నా తోలి కాన్పు ఒక రత్నాన్ని కన్నావు. ఈ వయసు బిడ్డలు తుప్పున త్రుళ్ళుతారు. కాస్త గొంతుక తగ్గించి 'చుట్టూ యింతమంది అమ్మాయిలూ తుళ్లుతున్నారు గాని మీ బాబు దించిన తల యెత్తడు.'
    ఈ మాటలు విన్న సూర్యం ఆమె గురించే ఊహించసాగాడు. యౌవ్వనం వెన్నల వెలుగు లాంటిది. ఒకోసారి మేఘాలు కప్పినా ఆ వెలుగులో అందం ఉంది. ఏ కోరికలు పుట్టినా, ఏం సాధించినా , ఏం నేర్పినా , ఒర్చినా -- జీవితంలో వసంతం యౌవ్వనం. యౌవ్వనం లోనే ఎండుటాకు లో గడచిన పచ్చదనం, నిశీధం లో వెలుగు, కష్టాల్లో సుఖాలు వూహించి తృప్తి పడగలిగేటట్లు మామ్మ ముసలి తనం లో యౌవ్వనాన్ని సూర్యం వూహించి తృప్తి పడ్డాడు. ఆమె యౌవ్వనం లో వుండి అభిమానంతో తన బాగోగులు తెలుసుకున్తుందనే భావన కలిగింది. ఎదురుగా నున్న కొబ్బరి చెట్టుకూ మామ్మ కూ భేదమేమిటి? మిగతా జంతు జాలాలకూ, వృక్ష  జాతులకు మనిషి కీ బెధమేమిటి? ఈ కొబ్బరి చెట్టులా కొన్ని కోట్ల కొబ్బరి చెట్లు కనిపిస్తాయే కానీ మామ్మ రూపుతో యింకో మనిషి కనపడదు. ఒక మనిషికి యింకో మనిషికి రూపులో గుణం లో తేడా లుండబట్టే కామోసు మనిషికి ప్రాణుల్లో ప్రత్యేకత వచ్చింది. అలానే ఒకరి జీవితంలో తేడా లున్న మార్పు వలన ప్రత్యేకత వస్తుందేమో?
    ఒకనాటి సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేసరికి పొరుగింటి అరుగు మీద ఒక అమ్మాయి కూర్చుంది. తనవేపు ఆ పిల్ల ఒక్కసారి దీక్షగా చూసి లోనికి సిగ్గుతో కదలి పోయింది. సూర్యం కు ఆ కళ్ళు సరిగ్గా తన కంటి పాపలనించి హృదయం లోనికి చూసినట్లయింది. ఎలాంటి విశాలాక్షులవి -- ఎవరీ పిల్ల? 'పల్లెలో నున్న మనుమరాల్ని పట్నం లో చదివించాలని మామ్మ తెచ్చిందని' తల్లి చెప్పగానే సూర్యం చోటు లేకుండా ఒకే కోర్కెతో మనస్సు నింపేసాడు. మామ్మే చిన్న వయసు లో లంగా జాకెట్టు వేసుకుని కోర్చున్నట్టుంది. మామ్మ ఆకారం వున్న యీమేలో మామ్మ గుణాలే వుండి, మామ్మకు తన పై నున్న అభిమానమే యీ పిల్లకూ తన పై నుంటే తనెంత అదృష్ట వంతుడనుకున్నాడు.
    పెరట్లో కాళ్లు కడుక్కోడానికి వెళ్ళగానే, ఆ పిల్ల వాళ్ళ పెరట్లో నిల్చుంది. మళ్లీ తనవేపు అలానే ఒకసారి పరీక్షగా చూసింది. ఆ కళ్లల్లో ఏదో భావం, కోరిక తొట్రు పాటు-- తృప్తి ఎన్నెన్ని అనుభూతులు, యెన్నెన్ని భంగిమలు ఆ కొద్ది సెకెండ్ల చూపుల్లో వెలిగి పోయాయ్.
    'అమ్మా-- విశాలా' మామ్మ పిలుపు.
    'ఆమె విశాలక్ష్మీ! ఆ విశాల నేత్రాల ప్రేమ చూపులను అందుకొని జవాబిచ్చే భాగ్యం యెవరి కుంటుందో?తన కెందుకు కుండ కూడదు?'
    కోరికలు పూల తీగలై మనస్సంతా అల్లుకున్నాయ్. క్షణం పోయాక వీచిన గాలికి తీగలో పూచిన పూలు రాలసాగినాయ్. ఎమో యీ మనసు ఆశలతో పూలను సృష్టించు కుంటూ సంశయాల పెను గాలితో ఆ పూలను రాలుస్తుంది. మళ్ళీ కొత్త పూలను కొత్త రంగులతో సృష్టించటానికి కామోసు! ఆశే బూడిదైతే ఆ బూడిద లో యింకో ఆశ మొక్క పుట్తుంది! అలా పుట్టించ గలిగినవారే బహుశా బ్రతకగలరేమో?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS