వస్తువులు సర్ది పుస్తకము పట్టుకుంది. మనసు చదువు మీదికి మళ్ళలేదు. ఎన్నో సమస్యలు ఆమె ముందు నిలిచాయి. ఒంటరిగా ఉండటము దుర్భర మనిపించింది. లేచి అత్తగారున్న చోటికి వెళ్ళింది. కూరగాయలు బుట్ట చెత్తగా కనిపించింది. దానిని చక్క బెడుతూ కూర్చుంది.
"ఎంతోమంది ని చూచాను. పిల్లలు లేని వారు ముద్దోచ్చిన పిల్లలను దగ్గరకు తీస్తారు. నీకు పిల్లలంటే అసహ్యమా అరుణా?" టపీమని అడిగింది రుక్మిణి.
"దానికి పిల్లలంటే అసహ్యమని నువ్వెలా అనుకున్నావు రుక్మిణి?"
"వచ్చినప్పటి నుండి చూస్తున్నాను , పిల్లలను పలుకరించనైనా లేదు. మా చిన్నవాడిని బస్సులో బండి లో వెడుతున్నా , తెలియని వారు కూడా ఎంతో ప్రేమగా ఎత్తుకుంటారు."
'అయితే అందరూ ఎత్తుకోవాలని ఎక్కడుందీ? అధసలె కడుపు నొప్పితే బాధపడుతుంది. పిల్లలను ఎత్తుకునే సత్తువయేది?"
"నువ్వూ మరీ నత్తా. దగ్గరకు పిలువచ్చుగా!"
"అవన్నీ అదృష్టవంతులకే రుక్మీణీ . మాలాంటి దురదృష్టవంతులము ఇతరుల పిల్లలను ప్రేమగాచూచినా దృష్టి తగులుతుంది."
"అంతమాటేవరన్నాత్తా. వారి నోరు పడి పోను." అన్నది.
"ఎవరయినా అంటారు. అరుణా, సత్తిని పంపి కాసిన్ని పచ్చి మిరపకాయలు తెప్పించమ్మా." అరుణ లేచింది. సత్తిని పంపించి , మామగారికి పేపరు చదివి వినిపించింది. అతను కళ్ళు మూసుకున్నాడు. లేచి వెళ్ళి మంచములో పడుకుంది . రుక్మిణీ వచ్చింది.
"ఈ రెండవ మంచ మెవరిది? ఆనంద్ పైన పడుకుంటాడని విన్నాను." ఆమె ప్రశ్నకు జవాబు ఇవ్వాలని లేకపోయినా, బావుండదని చెప్పింది.
"ఈ మధ్య ఏదో పెంచు కోవాలని ,దత్తత చేసుకోవాలని అనుకుంటున్నారట నిజమేనా?"
"పెద్దవారికి తెలుసు. నాముందలాంటి ప్రస్తావన తేలేదు."
"మా మేనత్త వేర్రిదా? నీ ముందు అలాంటి మాట మొదలే ఎత్తితే , నీవైపు వారిని తెచ్చుకుంటావని భయము. తనవారి నెవరినో ఎన్నిక చేసుకుని నెమ్మదిగా నీ చెవిన వేస్తుంది. నీవు వద్దనవని తెలుసు.
"మంచిదేగా?"
"ఏం మంచిదమ్మా. వెర్రి పిల్లా. మీ అన్న పిల్లలనో, అక్క పిల్లలనో , తెచ్చుకో.
"వారికి ఇవ్వాలని ఉండొద్దూ. అయినా అక్కయ్య కు ఇద్దరే. అన్నయ్యకు ముగ్గురు. ఎవరి పిల్లలు వారికి కావాలి. నాకెందుకిస్తారు?"
"బావుందే నువ్వేం పరాయిదానవా?"
"పరాయిదానను కాకపోయినా కన్నతల్లిని కానుగా. ఈ విషయలేప్పుడూ నేను ఆలోచించలేనత్తయ్యా. నాకంటే ముగ్గురు పెద్దవారున్నారు ఇంట్లో."
"కన్నతల్లి అంటే కనగానే సరా! నీవు ప్రేమించలేవా? నిన్ను చూస్తె గుండెలు నీరవుతున్నాయే. ఒంటరిగా ఉండాలి. ఆనంద్ ఆఫీసుకు వెళ్తాడా? నా పిల్లలలో నీకు నచ్చిన వాడిని తీసుకోవే. వాడిని కొట్టు, చంపూ . నేను అడ్డు వస్తే అడుగు." అన్నది. ఆవిడ రాకలో ఉద్దేశం అర్ధమయింది.
"నేను చెప్పాను కదా అంతా అత్తయ్యకు తెలుసనీ."
"ఆమె ఆనంద్ కు తల్లి. అతన్ని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు వచ్చేవారు నీసంతానము. నీ ఇష్ట మొచ్చిన వారిని పెంచుకోవచ్చు."
"నా సంతానమా! నాకంత అదృష్టమేది? ఈ ఇంట్లో నన్నెప్పుడూ అత్త, మామ పరాయి వ్యక్తిగా చూడలేదు. వారిని కాదని మాత్రమూ నేనలా ప్రవర్తించగలను?"
"వారిని కాదని ఎవరనమన్నారు. మావాడు నీకు నచ్చాడా?"
"వాడికేం దొరబాబులా ఉన్నాడు." అన్నది క్లుప్తంగా. నిజంగా రుక్మిణి పిల్లలందరూ ముద్దుగా ఉన్నారు. ఇక ఎక్కువ ఏం మాట్లాడలేక పోయింది. అరుణ ఆవిడ వెళ్ళిపోయాక బాధగా నిట్టూర్చింది.
రెండవ రోజు అదివారమని ఆనంద్ స్నేహితులతో ఏటో వెళ్ళిపోయాడు. రుక్మిణి తెలిసిన వారింటికి వెళ్ళింది. అత్తగారు వచ్చి తన మంచం మీద కూర్చోగానే ఆదరంగా లేచింది.
"ఫరవాలేదమ్మా కూర్చో." అరుణ కూర్చుంది.
"వచ్చే నెలలో అమ్మను తీసుకుని మద్రాసు వెళ్ళిరా. నేను వచ్చేదాన్ని మామగారు ఇబ్బంది పడతారేమో. మొదట మీరు వెళ్ళి వచ్చాక నేను అవసరమను కుంటే వస్తాను." అన్నది.
'అలాగే ఈరోజు అమ్మకు ఉత్తరము వ్రాస్తాను."
"రుక్మిణితో పిల్లలను గూర్చి అడిగావా?"
"ఎందుకు అలా అడుగుతున్నారు? మిమ్మల్ని కాదని నేను అడుగుతానా?"
"నాకు తెలుసుకే. తన బిద్దలంటే నీకు చాలా ముద్దని, నీకు పెంచుకోవాలని ఉన్నా ఇచ్చే వారు లేరని బాధపడ్డావుట. అప్పుడే అనుకున్నాను దారపు పోగు ఆధారంగా దుప్పట్లేనిస్తుంది మా రుక్మిణి. ఆమె మాటలెం చెవిన పెట్టకు." అత్తగారు లేచి వెళ్ళిపోయారు. మరో రెండు రోజులు గడిచాయి. సరస్వతమ్మనే ధైర్యంగా తన బిడ్డను తీసుకోమని చెప్పే ధైర్యం లేదు రుక్మిణి కి. ఆమె ప్రయత్నాలలో ఆమె ఉంది.
"అరుణా! కాస్త మేడ పైకి రాగలవా?" ఆనంద్ పిలిచాడు. అరుణ వెళ్ళింది. అతను ఈజీ చైర్లో కూర్చుని సిగరెట్టు వెలిగించాడు. అతనికి దగ్గరగా కుర్చీ జరుపుకుని కూర్చుంది.
'అరుణా! నీకు రుక్మిణి వదిన పిల్లలంటే ఇష్టమా?"
"నాకే యేమిటి . పిల్లలంటే ఎవరి కిష్టముండదూ?"
"వదినంది , తన పిల్లలలో యెవరి నిచ్చినా, నీకు పెంచుకోవాలని ఉందట. అమ్మకు జడిసి ఊరకుంటున్నావులా ఉంది. నీ కిష్టమయితే చెప్పు, అమ్మను నేను ఒప్పిస్తాను." నీవు సంతోషంగా ఉండటమే నాకు కావాలి."
"మీ వదిన ప్లీడరు కావాల్సింది." నవ్వి జరిగిన విషయాలు చెప్పింది. "ఆమెకు ఇలా పరిహాసమాడాలంటే సంకోచము కలుగలేదా?"
"మన జీవితాలే పరిహాసంగా మారాయి ఆరూ. కొన్నిసార్లు మనకున్న డబ్బు ఉపకారం కంటే అపకారమే చేస్తుంది. పోనిద్దూ, ఆవిడంతట ఆవిడే ఇస్తానంటుంది. అమ్మతో సంప్రదించి ఒక అబ్బాయిని తీసుకుందాము. ఏమంటావు......."
"నేను ఏమీ అనే స్థితిలో లేను. పెద్దవారిని సంప్రదించండి." అన్నది. పెద్దవారిని సంప్రదించాడు ఆనంద్. సరస్వతమ్మ అంత ఇష్టము కనబరచలేదు.
"ఏమోరా, వీళ్ళు చాలా చాదస్తము మనుష్యులు. మా అక్క మనమడున్నాడు వాడిని తెచ్చుకుందాము."
"యెవరో ఒకరు. కాస్త ఇంట్లో సందడిగా ఉంటుంది. కొన్నాళ్ళు ఉంచుకుందాము. మనలో కలిసిపోతే ఫరవాలేదు. లేకపోతె పంపించి వేద్దాము." సరస్వతమ్మ కు అయిష్టంగా ఉన్నా కొడుకు అభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడే అలవాటు లేదు. అంగీకారంగా తలాడిన్సింది.
"తెచ్చి పెంచుకోవాలనే ఉంటె, ఈ బంధువుల పిల్లల కంటే, యే అనాధశ్రమము నుంచో తెచ్చుకుంటే నయము. మనవారితో కడకు నిష్టూరమే మిగులుతుంది." రంగారావు తన అభిప్రాయము వెల్లడించాడు.
"బావుందండీ. కులమూ, గోత్రమూ లేని పిల్లలనా, రుక్మిణీ మూడో కుర్రాడు బాగానే ఉన్నాడు. నిష్టూరాలు యెవరితో నైనా వస్తాయి." అన్నది. అందరూ కలిసి రుక్మిణీ అబ్బాయిని తీసుకోవాలని అంగీకరించారు. అరుణ మౌనంగా చూడసాగింది. పెద్దవారి నిర్ణయము విన్న రుక్మిణి పొంగిపోయింది. రెండవ రోజు అత్త, కోడళ్ళు పూజ గృహము లో ఉండగా కుర్రాడిని తెచ్చి అరుణ వడిలో కూర్చో బెట్టింది.
"ఒరేయ్ మాధవా, ఇక నుండి అరుణ పిన్నె నీకు అమ్మరా. అమ్మ చెప్పినట్లు వినాలి" అన్నది. వాడికవెం తెలియవు . అరుణ ముందున్న పళ్ళెం లో పండ్ల వైపు చూస్తూ ఆమె దగ్గర కుదురుగా కూర్చున్నాడు.
"ఇక వాడినేం చేసినా నీ భారము చెల్లాయి. నా బిడ్డలు నాకు బరువని కాదు, నీ బాధ చూడలేక ఇచ్చి వెళ్తున్నాను. వాళ్ళ నాన్న ఏమంటారో, అన్నా నచ్చ చేబుతానులే." అన్నది కళ్ళు ఒత్తుకుంటూ.
"నీ తెలివితేటలు అఖండమే. వాళ్ళ నాన్నతో సంప్రదించనిదె ఆనంద్ తో యెలా మాట్లాడావు. వదిలినట్టు కాదు, మా కుర్రాడేనన్న నిశ్చింత లో ఉండాలి. మాటికి మాటికి రావడాలు పోవడాలు వద్దు." సరస్వతమ్మ అంటుంటే అరుణకు చాలా బాధ వేసింది. ఏదో ఆశతో వదులుతారు గాని పిల్లలంటే తీపి లేనిది యెవరికి. అత్తగారి అజ్ఞాపన అర్ధం లేనిదిగా కనిపించింది.
"నీ మీద నమ్మకము లేకపోవడము ఏమిటత్తా. నీ ఇంట్లో వాడికేం తక్కువని...." రుద్ద కంఠంతో పలికింది. డబ్బుకు దాసోహమని. పిల్లాడిని ఇచ్చి వెళ్తున్నా. మాతృహృదయమో మూల మూల్గుతూనే ఉంది. అక్కడి వాతావరణము తేలిక చేయాలని, మూడేళ్ళ మాధవ్ ను తీసుకుని బయటకు వచ్చింది అరుణ. మరురోజు ఉదయమే అబ్బాయి లేవక మునుపే కన్నీటితో ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోయింది రుక్మిణీ. మాధవ్ ఉదయము లేస్తూనే అమ్మా అన్నప్పుడు అరుణ హృదయము కలుక్కుమంది. దగ్గరగా వెళ్ళి, "ఏం బాబూ" అంటూ వీపు తట్టింది.
'అమ్మ అమ్మేది?' గదంతా కలియచూచాడు.
"అమ్మ బజారు వెళ్ళింది. నేను అమ్మను కానా బాబూ" కుర్రాడిని దగ్గరకు తీసుకుంది.
"పో నువ్వు అమ్మవు కావు పిన్నివి" వాడిని వదిలి దూరము జరిగింది. మరుక్షణమే ఆమె హృదయము జాలితో నిండిపోయింది. వాడికింకా ఈ ప్రపంచపు మొహాలెం తెలుసు? స్వచ్చమైన మనసు గలవాడు. అమ్మ ప్రేమ కావాలి. వాడికి దగ్గరగా వచ్చింది . వీపు నిమురుతూ కూర్చుంది.
"చూడరా మాధవా! నాతొ స్నేహంగా వుంటే నీకు బొమ్మలూ బిస్కెట్లూ చాకలేట్లూ అన్నీ కొనిస్తాను." అన్నది కళ్ళు పెద్దవి చేసి.
"కావాలి." లేచి కూర్చున్నాడు. "పిన్నినీతో స్నేహంగా ఉంటాను." అన్నాడు. వాడి కళ్ళలో కనిపించిన ఆశకు నవ్వుకుంది.
"ఇప్పుడే బాబాయి గారు లేచాక వెళ్దాము."
"అన్నా, చిన్నా, అందరునా?"
"అన్నా, చిన్నా అమ్మతో బజారు వెళ్ళారు. వాడు నిరుత్సాహ పడి పోయాడు. మాటలు చెప్పి మురిపిస్తూ వాడికి స్నానము చేయించి, బట్టలు వేసి పైకి తీసుకు వెళ్ళింది.
"మీ వెంట బజారు కోస్తామండి. వీడికి అట వస్తువులు కొనాలి.
'అప్పుడే ప్రారంభ మయిందా, నీకోనుడు" నవ్వుతూ లేచాడు. ఇరువురూ తయారై మాధవ్ ను తీసుకుని మేడ దిగుతుంటే సరస్వతమ్మ మొదట సంతోషించినా, తరువాత ఆమె మనస్సు చివుక్కుమంది. సరస్వతమ్మ మనుమడని ఎవరంటారు? పెంపుడు మనమడనే అంటారు పైకి గంబీరంగా ఉండి పోయింది.
అటవస్తువులూ, రెడీ మేడ్ డ్రస్సు లూ , బిస్కెట్ పాకెట్లు కొని ఇల్లు చేరారు. అవన్నీ చూస్తూ తాత్కాలికంగా తల్లిని తనవారిని మరిచి పోయాడు. ఇంట్లో అల్లరి నవ్వులు వినిపించితే కాస్త దిగులు మరిచి పోయారు. సత్తితో కలిసిపోయి అట ప్రారంభించాడు. అరుణ తేలికగా ఊపిరి పీల్చింది.
