Previous Page Next Page 
ఇంద్రధనుస్సు పేజి 5

 

    "ఏమిటమ్మా?" అన్నారు నెమ్మదిగా.
    "నా పిండాకూడు! నా శ్రాద్ధం! అంత కానిదాన్నై పోయానట్రా? శారద ఈ ఇంటి కోడలవుతుందని అందరికీ తెలుసు. నువ్విప్పుడు ఆ జులాయి గాడు-- ప్రకాశానికి యివ్వాలని మధ్యస్తల చేశావటగా...."
    విశ్వనాధయ్య గారు ఆశ్చర్య పోయారు. రత్నమ్మకు ఈ విషయం ఎలా తెలిసిందో వారికీ అర్ధం కాలేదు. సుందరమ్మ పొరపాటున కూడా నోరు జారదు. శారద కూడా చెప్పదు. ప్రకాశం , సావిత్రమ్మ వాళ్ళ ద్వారా తెలిసే అవకాశమే లేదు. ఇక....పాలేరు నాగడు. వాడే చెప్పి ఉండాలి.
    "అవునమ్మా " అన్నారు విశ్వనాధయ్య గారు, చాలా నెమ్మదిగా నవ్వుతూ.
    "ఏం? నా కూతురు నీ కొడుక్కు తగదా?"
    "కాదు. నా కొడుకు నీ కూతురికి తగడు."
    "వాడికేం? రత్నం లాంటి బిడ్డ!"
    "వాడు రత్నమో, రాయో నాకూ తెలుసు."
    "ఇదంతా ఎందుకు విశ్వనాధం! మీ కిష్టం లేకపోతె ఇంట్లోంచి వెళ్ళగొట్టండి. దాని పీక నులిమి ఏ బావిలోనే వేసి నేనూ హరీ అంటూ దూకుతాను."
    "ఆ మాట ఎవరన్నారమ్మా? అలాంటి మాట లెందుకంటావు?' అంది సుందరమ్మ.
    రత్నమ్మ సుందరమ్మ మీద గయ్ మని లేచింది.
    "నాకు తెలుసులేవే తల్లీ! నంగనాచి టుంగుబుర్రా! మొగుడితో చెప్పి నా కూతుర్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టించి , తర్వాత నువ్వే స్వయంగా నన్ను గెంటుదూ కానీ. అయ్యో! నాకు తెలీదనుకున్నా వేమిటి, నీ నక్క జిత్తులు? నాకూ తెలివీ, గిలివీ ఉన్నాయ్...."
    "ఎందుకు చెల్లమ్మా, ఇన్ని మాటలు? శారదను ఉమాపతి చేసుకోవడానికి యిష్టపడితే నాకేం అభ్యంతరం లేదు. వాణ్ణి రమ్మని రేపే ఉత్తరం రాస్తాను. సరేనా?" అన్నారు విశ్వనాధయ్య గారు.
    సుందరమ్మ గుండె జలదరించింది. తాము యిన్ని దినాల నుంచీ అనుకున్నదానికి భిన్నంగా విశ్వనాధయ్య గారు అనేసరికి ఆవిడ తెల్లబోయింది. ఒకవేళ ఉమాపతి పెళ్ళికి ఒప్పుకుంటే తమ ఇల్లు గుల్లవుతుంది. ఉమాపతిని చిటికిన వ్రేలికి కట్టి ఆడిస్తుంది రత్నమ్మ.
    "ఉమాపతిపెళ్ళికి ఒప్పుకుంటే ఎలాగండీ?' ఆరోజు రాత్రి సుందరమ్మ అడిగింది.
    "మన బిడ్డ సంగతి మనకు తెలీదా సుందరం! వాడు ఎంత చండాలంగా చేడిపోయాడో తల్చుకుంటే ఏ బావిలోనో దూకి కన్ను మూద్డామనిపిస్తుంది. లేకపోతె పంపిన మనిఅర్దరు తిరిగొస్తుందా? వాడు ఊళ్ళో లేడు. స్పెషల్ క్లాసులున్నాయని చెప్పి ఎక్కడికో ఉడాయించాడు. అలాంటి వెధవ పెళ్ళికి ఒప్పుకుంటాడా?' అన్నారు విశ్వనాధయ్య గారు.
    సుందరమ్మ మనస్సులో ఆ మాటలు నిప్పులుగా కురిశాయి. చేతి కందిన బిడ్డ నోటి కందని కదిలాగై పోతుంటే ఆవిడ మనస్సు గిలగిలలాడిపోయింది .

                                *    *    *    *
    ప్రకాశం సెంట్రల్ లో దిగి సరాసరి సారధి గదికే వెళ్ళాడు. సారధి గదిలో లేడు. తర్వాత అతడు పనిచేసే పత్రిక ఆఫీసుకు వెళ్ళాడు. ఆఫీసు లోకి వెళ్ళి సారధిని చూట్టానికి తాతలు దిగి వచ్చారు. ప్రోప్రయిటరు గారి అల్సేషియన్ కుక్క మొదలుకొని, మానేజరు గారి గూర్ఖా వరకూ నానా హంగామా చేశారు. చివరికి "అలవైకుంఠపురంలో నగరి లో నా మూల సౌధంబులోఎక్కడో సినిమా వార్తలు వ్రాస్తున్న సారధి కనిపించాడు.ప్రకాశాన్ని చూడగానే ఎగిరి గంతేశాడు.
    "గ్లాడ్!వచ్చేశావన్న మాట. అనుకుంటూనే ఉన్నాను, నువ్వు వస్తావని."
    "వచ్చేశాను" అన్నాడు ప్రకాశం నవ్వుతూ.
    సారధి ఆ రోజు సెలవు తీసుకుని బయలుదేరారు. దారి వెంబడి మరుసటి రోజు జరుగబోయే 'రుద్రవీణ' అవిష్కరణాన్నీ గురించీ, కొత్తగా మొదలు పెట్టిన 'విప్లవాత్మక ' నవలను గురించీ చెప్పాడు. అలా అతడు సాయంకాలం దాకా చెబుతూనే ఉన్నాడు.
    సాయంకాలం తన పనుల మీద సారధి వెళ్ళాడు. ప్రకాశం ఉమాపతి గదికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి విచారిస్తే ఇంటివాళ్ళు చెప్పారు.
    "ఏదో , నాయనా , మొదట మనిషిని చూసి మర్యాదస్తుడే అనుకున్నాం. తర్వాత ఇంటిని ముండల కొంప చేసేస్తుంటే ఖాళీ చేసెయ్యమన్నాం.ఏం చేస్తాం?"
    "ఖాళీ ఎప్పుడు చేశాడండీ?"
    'ఆ మెడికల్ కాలేజీ పిల్లా, ఇతగాడూ బెంగుళూరు వెళ్ళి రాగానే--"
    "ఆ పిల్ల పేరేమిటో మీకు తెలుసా?"
    "విమల."
    ప్రకాశం విమలను గురించి మెడికల్ కాలేజీ హాస్టల్లో విచారించాడు. చెడు ప్రవర్తన వల్ల కాలేజీ హాస్టలు నుంచి గెంటేశామని చెప్పింది వార్డెన్. కానీ విమల ఇప్పుడెక్కడ ఉంటుందో తెలియలేదు. ఉసూరు మని తిరిగి వస్తుంటే హాస్టల్లోకి వస్తున్న ఎవరో స్టూడెంట్ కనిపించింది. ఆవిడతో కాస్త నవ్వుతూ మాట్లాడి, కాఫీ తాగి, విమలను గురించి అడిగాడు. ఆవిడ విమల ఉంటున్న గది అడ్రసు చెప్పింది.
    ప్రకాశం విమల గది చేరేసరికి దాదాపు ఆరుగంటలు కావస్తుంది. అప్పటికే మద్రాసు , నాగరికత బజార్ల మీద షైరు తిరుగుతుంది. ప్రొద్దు గ్రుంకుతుంది. ప్రకాశం వెళ్ళి విమల గది తలుపు తట్టాడు. క్షణంలో తలుపు తెరచుకుంది. ఎగిరి మీద దూకి కౌగలించుకోబోయిన విమల ఆగి కళ్ళు పెద్దవి చేస్తూ నిలబడి పోయింది.
    "నాపేరు ప్రకాశం . మాది రొంపిచర్ల" అన్నాడు ప్రకాశం.
    విమల ముఖంలో కాంతి అదృశ్యమైంది "రండి" అంది.
    ప్రకాశం వెళ్ళి కుర్చీలో కూర్చుని గదంతా కలయ చూశాడు. గది నానా చీదరగా ఉంది. చీరలు, పాంట్లూ, ప్లాక్ షర్టులూ దండాలకు వేలాడుతున్నాయి. విమలను చూశాడు ప్రకాశం. నీటుగా తయారై ఎక్కడో బయలుదేరటానికి సిద్దంగా ఉంది. లోపల కట్టుకున్న లంగా కనిపించే ఉల్లిపోరలాంటి చీర, రవికె కు , చీరకు మధ్య ఉన్న జానెడు పలుచని పొట్ట, ఎగదువ్వి రింగులో నుంచీ దూర్చిన వంకీల జుత్తు- వేషం నవనాగరకంగా ఉంది.
    "విమల గారూ మీరేనా?" ప్రశ్నించాడు ప్రకాశం.
    "ఈ ప్రశ్న చాలా ఆలస్యంగా వేస్తున్నారు." అంది విమల , విలాసంగా కనుచివరాల నుండీ చూస్తూ.
    ప్రకాశం తృళ్ళీ పడ్డాడు.
    "క్షమించండి' అన్నాడు.
    "క్షమించాము. మీరు రావటం నాకోసమేనా?"
    "కాదు. మా ఉమాపతి కోసం."
    "పని?"
    "అతని పెళ్ళి విషయం మాట్లాడాలి" అన్నాడు ప్రకాశం. ఆ మాటతో విమల పెడసరి తనం కుదురుతుందనుకున్నాడు. కానీ లాభం లేక పోయింది.
    "మిస్టర్ ప్రకాశం , ఫరవాలేదు! మీ వేషం చూసి మోసపోయాను. మీకూ కాస్త తెలివి తేటలున్నాయి."
    "చాలా సంతోషం! ఉపామతితో మాట్లాడాలి. ఎప్పుడొస్తాడు?"
    "ఉమాపతి ని నేనేమీ కొంగున ముడేసుకోవడం లేదు. అతడు ఇష్టం ఉన్నప్పుడు వస్తాడు. అతనికి నా మీద ఇష్టం ఎప్పడు పుడుతుందో తెలుసుకోవటానికి నాకు జ్యోతిషం రాదు. అసలు దాని మీద నాకు నమ్మకమూ లేదు."
    ప్రకాశం కాస్త అలోచించి అన్నాడు.
    "మిమ్మల్ని వివాహం చేసుకుంటానని ఉమాపతి ఒక స్నేహితుడితో అన్నాట్ట. నిజమేనా?"    
    విమల విరగబడి నవ్వింది. ఆ నవ్వడం లో ఆవిడ పైట జారి తొడల మీద పడింది. విమల పైటను సర్దుకోనైనా లేదు. ఉన్నతంగా ఉన్న వక్షాలు అతనిలోని పురుషత్వాన్ని సవాలు చేస్తున్నాయి. ప్రకాశానికి హటాత్తుగా ఆవిడ తన చుట్టూ వల పరచటం లేదు కదా అని సందేహం కలిగింది.
    'అలాగైతే మీరిద్దరూ వివాహం చేసుకోరా?" మళ్ళీ అమాయకంగా అడిగాడు ప్రకాశం.
    "లేదు. మేమిద్దరమే కాదు, మేము ఇద్దరమూ మరెవర్నీ కూడా ఈ జన్మలో వివాహం చేసుకోకూడదని ప్రమాణం చేసుకున్నాం.మా కిద్దరికీ వివాహం అంటే గిట్టదు. కోరికల్ని చంపుకుని,పీనుగులుగా బ్రతికే బ్రతుక్కు మేమిద్దరం వ్యతిరేకులం" అంది విమల, ప్రతి పదాన్ని చక్కగా ఉచ్చరిస్తూ. అందులో కొంచెం వ్యంగ్యం, కోపం కలిపి పలికింది.
    "పెళ్ళి చేసికుంటే కోరికల్ని చంపుకోవాలని ఎవరూ చెప్పలేదు. కోరికల్ని శాంతితో తీర్చుకోవచ్చు. అందులోనే ఆనందం ఉంది. భగవంతుని సృష్టిలో నియమరహితమైంది లేనప్పుడు, మానవజీవితాని కెందుకు నియమం లేకపోవాలి?" అన్నాడు ప్రకాశం.
    "మీకు ఏయే కూరగాయాలంటే ఇష్టం?" వ్యంగ్యంగా ప్రశ్నించింది విమల.
    "దాదాపు అన్నీ."
    "అలాంటప్పుడు మీకు జీవితాంతం వంకాయ కూరపెడితే తింటారా?"
    "జీవిత సమస్యలకూ, వంకాయ కూరకూ సంబంధం లేదు."
    "ఎందుకు లేదు? బోలెడుంది."
    'అలాగైతే జీవితంలో క్రమం , జీవితాని కొకదారి అక్కరలేదా?"
    "తాను ఏ దారిలో వెళ్ళాలో ఆడదానికీ తెలుసు, మగాడికి తెలిసు. అంతేకానీ ఆడదానికి మగాడు, మగాడికి ఆడది దారి చూపించనక్కర లేదు." తీవ్రంగా కోపంతో కళ్ళు పెద్దవి చేసి అంది విమల. తలుపు చప్పుడైంది. విమల వెళ్ళి తలుపు తీసింది. ఉమాపతి లోపలికి వచ్చాడు. ప్రకాశాన్ని చూడగానే ఉమాపతి ముఖం పాలిపోయింది. అనేక భావాలు అతని మనసులో రేగాయి.
    "ఎప్పుడొచ్చావు ప్రకాశం?" నీరసంగా ప్రశ్నించాడు . ప్రకాశం జవాబు చెప్పేలోగా విమల అందుకొంది.
    "అర్ధగంటైంది. వచ్చినప్పటి నుండీ నీతిని గురించి ఒకటే ధర్మ పదేశం చేస్తున్నాడు."
    ప్రకాశం లేచి నిలబడ్డాడు.
    "కాస్త బయటి కొస్తావా-- ఒకమాట" అన్నాడు. ఉమాపతి విమల కేసి చూశాడు.
    "వెళ్ళు, నీకూపదేశం చేస్తాడు" అంది విమల.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS