3
ఇంక ఆరోజు పాపను పట్ట పగ్గాలు లేవు. ఇల్లంతా పరుగెత్తింది. కమల కన్నీ చూపించింది.క్షణం తీరిక లేకుండా తిరిగింది. కమలీని తిప్పింది. రాత్రి ఎడయ్యే టప్పటికా పసిదానికి నిద్ర ముంచు కొచ్చింది. కాస్తే అన్నం తిన్నదని కమల గ్లాసుతో పాలుపట్టి మూతి తుడుచి పడుకో బెట్టింది. నిద్రపోయేవరకూ రమణమ్మని అచాయలకు రానివ్వలేదు పాపం. నిద్రపోయే వరకు కమల చెయ్యి వదల్లేదు.
ఆ రాత్రి నిద్రలో లేచి కమల కోసం వెతికింది. కమల పక్క మంచంలో పడుకుని వుండటం చూసి తను లేచి వెళ్ళి కమల పక్కన పడుకుని నిద్రపోయింది. నిద్దట్లో చెయ్యి వేసిన కమల తనని అనుకుని పడుకున్న పాపను దగ్గరకు తీసుకుని, మీద చేతులేసి తృప్తిగా పడుకుంది. మర్నాడు ఇద్దరూ ఏడైనా లేవకపోవడంతో వచ్చి చూసిన రాజేశ్వరీదేవి వాళ్ళిద్దరిని అట్లా చూసేటప్పటికీ కళ్ళ నీళ్ళు తిరిగినై.
పాప కమల లేకుండా ఓక్క క్షణం కనపడలేదావిడేకి. ఎప్పుడూ కమల చేతుల్లో గర్వంగా కూర్చుని తిరుగుతూనో, చెయ్యి పట్టుకు లాక్కుపోతూనో , కబుర్లు చెప్తూనో కనపడేది. పాప తను తినే ప్రతిదీ కమలకి పెట్టాలని చూసేది. కమలే మరిపించి పాప చేత తినిపించేది. పాప యెవరి పిలుపూ వినిపించుకునేటట్టు కనపడలేదు. రాజేశ్వరిదేవికి కమల పాపని మరీ గారబం చేసి చెడగోడ్తుండెమో ననిపించింది. ఆమాటే కమలతో అంటే 'ఏం లేదమ్మా . మీ కన్నానా' అని నవ్వింది.
అంతలో రాజేశ్వరి తనకూతురు నీరజ ని తీసుకు రావటానికి బొంబాయి వెళ్ళాల్సి వచ్చింది. నీరజ భర్త వ్యాపారం మీద నాలుగు నెలలు అమెరికా వెళ్తున్నాట్ట. ఆ నాలుగు నెలలు ఇక్కడ వుండటానికి వొస్తున్నది. వాళ్ళ అత్తగారు వాళ్ళకి బొంబాయి లో పెద్ద ప్యాపార సంస్థ వుంది. మామగారు లేరు గాని , ముగ్గురు అన్నదమ్ములు అందులోనే పనిచేస్తారు. నీరజ భర్త ఇంజనీరు కొన్ని యంత్రాలు, వాటి భాగాలు తయారు చెయ్యటానికి అవసరమైన విషయాలు తెలుసుకోటానికి విదేశాలకు వెళ్తున్నాడు.
నీరజ బావగారు ఆ సంస్థ మీద పర్యవేక్షణ చేస్తారు. మరిది లాయరు. సంస్థకి సంబంధించిన లా విషయాలు చూస్తూ వుంటాడు. ఇంకా పెళ్ళి కాలేదు. వాళ్ళ బంధువులే మిగతా భాగస్వాములు. మిగతా విషయాలన్నీ వాళ్ళు చూస్తారు.
బావగారికి మేనమామ కూతుర్నే ఇచ్చి చిన్నప్పుడే పెళ్ళి చేశారు. ఆయనకి ఇద్దరు కూతుళ్ళు. ఒకకొడుకు. పెద్దవాడి కింకా పదిహేనేళ్ళు నిండలేదు.
తోడికోడలు సరస్వతి తమ్ముడు రాజు కూడా ఇంజనీరే. ఇందులోనే పనిచేస్తూ వీళ్ళ ఇంట్లోనే వుంటాడు.
ఇంటి అజమాయిషీ అంతా అత్తగారిది, కొంతవరకు తోడికోడలుదీను. నీరజ ఇప్పటి దాకా ఏ బాద్రాబంది లేకుండా హాయిగా కాలక్షేపం చేస్తున్నది.
కొద్ది కాలంలోనే కమల రాజేశ్వరికి ఎంతో అప్తురాలైంది. తనతో తోడుగా ఎక్కడికి వెళ్ళినా తీసుకేళ్తున్నది. బజారు వెళ్ళినా, ఎవరింటి కైనా వెళ్ళినా, ఆఖరికి వ్యాపార విషయాలు మాట్లాడటానికి వెళ్ళినా సరే కమల వెంటే వెళ్తున్నది. ఎవరైనా అడిగితె ' మా వాళ్ళమ్మాయే ఇక్కడ వుండటానికి వొచ్చిందని' చెప్తున్నది.
రాజేశ్వరి చాలా స్థానిక సంస్థలకి ప్రెసిడెంటు గాను, మెంబరు గాను వుంటున్నది. అక్కడ ఒక అనాధాశ్రమముంది. దానికి రాజేశ్వరి దేవి బాగా విరాలాలివ్వటానికి ప్రెసిడెంటు గా వుంటున్నది. అక్కడి బాగోగులు వివరంగా తెలుసుకుని కావాల్సిన సదుపాయాలూ చెయ్యటం ఆమెకి చాలా ఇష్టం. నెలకి పదిసార్లైనా ఆశ్రమానికి వెళ్ళేది. కూడా వున్న కమల అన్నీ వివరంగా తెలుసుకునేది. 'నీకెందుకు కమలా ఈ ఆశ్రమం అంటే ఇంత ఆసక్తీ' అంటే "ఏం లేదమ్మా పాప పెద్దదైనాక నేనిక్కడ పని 'ఏం చెప్తానంది' అప్పుడే ఎంత ఆలోచన చేశానంటూ రాజేశ్వరి ఆశ్చర్యపోయింది.
కమల వూరికే కలిపించుకుని , చొరవ చూపకుండా అడిగినప్పుడే సమాధానం చెప్తూ, అవసరమైతే తోచిన సలహాలిస్తూ చేదోడు వాదోడు గా వుంటున్నది. నీరజ పెళ్ళి అయి - వెళ్ళినాక ఆమెకి కలిగిన వంటరితనం కమలతో తీరుతున్నది.
కమల మొదటి రెండు రోజులు కొంచెం బెరుగ్గా వున్నా రానురాను ఇంట్లో పిల్లల్లె తిరగటం మొదలెట్టింది. పాప పనితో సరిపెట్టుకోక , వంట విషయాలు మొదలుకుని బైటి విషయాల వరకు అన్నీ కమలకే వదిలేస్తున్నది రాజేశ్వరి. ఇప్పుడు వంట పంతులు దగ్గర్నించి డ్రైవరూ ఖదర్ వరకూ అన్నీ కమలనే అడుగుతున్నారు. రమణమ్మ సంగతి సరేసరి. శ్రీనివాసరావు గారు కూయా ఇప్పుడు "అమ్మాయ్ కమలా రాజేశ్వరేది? ఆ కాయితాలెక్కడ పెట్టింది? ఈ సంగతేం తేల్చింది.' అని అన్నీ కమలనే అడుగుతున్నారు.
రాజేశ్వరి బైటికి వెళ్లినప్పుడల్లా పెత్తనం అంతా కమల కే ఇచ్చి వెళ్తుంది. తనని ఎవరైనా ఏదైనా అడిగినా "పోయి కమల నడగమంటుంది.'
ఇంతేకాక కొంత డబ్బు కూడా ఇంట్లో ఖర్చుల కానీ కమల కిచ్చేది మొదటిసారి కమల భయపడ్డది. కాని వొద్దనే ధైర్యం లేక తీసుకున్నది. తను ఖర్చు పెట్టిన ప్రతి పైసకిలేక్క రాసింది. ఆ ఇచ్చిన డబ్బై- పోయినాక కమల పుస్తకం తీసికెళ్ళి చూపించింది.
'ఏమిటమ్మా కమలా' అంటూ తీసుకు చూసిన ఆవిడకి భ్రాంతి కలిగింది. తను డబ్బు ఇచ్చిందే కాని ఎప్పుడు దాన్ని గురించి కాని, కమల ఆ డబ్బెం చేసిందని కాని ఆలోచించలేదు. అడగాలన్న వూహే రాలేదు. ఈరోజు కమల తారీకు ప్రకారం డబ్బు లెక్క పట్టుకొచ్చేటప్పటికి ఆవిడా కింకా తమాషాగా తోచింది.
తను గానీ శ్రీనివాసరావు బాబాయ్ కాని ఎప్పుడూ మనుషులను అంచనా వెయ్యటంలో తప్పరు. ఆనాడు కమలని చూడగానే వాళ్ళిద్దరి సద్భావమే కలిగింది. ఆ అమ్మాయి ప్రవర్తన చూపించిన కాయితాలు, చెప్పిన జవాబులు అడిగిన ప్రశ్నలు వీళ్ళకి చాలా యధార్దాలుగా తోచినై, అమాయకంగా వున్నా ఆ కమల చూపులు, చెప్పిన విషయాలు , ఆ భావాన్నే దృడపరిచినై, వాళ్ళకి విపరీతమైన నమ్మకం కుదిరింది. పాపని అప్పగించటానికి నిశ్చింతగా వొప్పుకున్నారు. కమల వొచ్చి చేరిన ఈ కొద్ది రోజులుగా వారికి చిన్న పిల్ల చేత నౌతుందో కాదో అన్న అనుమానం కూడా తీరిపోయింది.

అందుకనే సాధారణంగా ఎవరినీ నమ్మని రాజేశ్వరి కమలని నమ్మింది. రాజేశ్వరి పినతండ్రి శ్రీనివాసరావు గారు కూడా ఆ నమ్మకంలో చెయ్యి కలిపారు.
కమల లెక్కలు చూపించేటప్పటికి తను కమలని వ్యర్ధంగా అభిమానించడం ;లేదని రూడై నవ్వుతూ "ఈ కోమటి లేక్కలేమిటి కమలా? నిన్ను నేను లెక్క అడిగానా నీ సంగతి తెలియదూ? లెక్కలు చూపించాలా నువ్వు?' అంటూ ఇంకొంచెం డబ్బు తీసి ఇవ్వబొయింది.
కమల పుస్తకం గాని, డబ్బు గాని తీసుకోలేదు. తలవంచుకు నిలబడ్డది. ఇది చూసిన రాజేశ్వరి 'పిల్ల గడుసుదే. తన ఇష్ట ప్రకారం తప్ప పొదనుకుని 'అట్లా నుంచున్నావెం కమలా తీసుకో" అంది.
కమల మెల్లగా 'చూడండమ్మా మీరు శ్రీమంతులు, మీకు డబ్బు విరివిగా వుంది. నామీద మీకు నమ్మకం కూడా వుండొచ్చు. కాని నేను లేనిదాన్ని. మీ కన్ను గప్పి మీ డబ్బు నేను వాడుకున్నానన్న మాట ఎవరైనా అనొచ్చు. నేనుమీకే విషయం లోనూ తక్కువ చెయ్యను. కాని నలుగురి లో నాకు గౌరవం వుండాలంటే నేనుమీకు లెక్క చెప్పక తప్పదు. మీరు చూడక తప్పదు' అని వూరుకుంది.
రాజేశ్వరి కనులను తేరిపార చూసి ఈ మాటలు చెప్పటానికి కమల ఎంత ధైర్యం కూడదీసుకోవాల్సి వొచ్చిందో తెలుసుకో గలిగింది. వెంటనే 'సరే కమలా అట్లాగే చూస్తా.' అంటూ గబగబా అన్నీ చూసి సంతకం పెట్టి ' ఇదుగో ఈ నాలుగొందలు వుంచమని , పుస్తకం లో ఆ మొత్తం వేసి మరీ ఇచ్చింది. అప్పటికీ కమల పుస్తకం, డబ్బూ తీసుకుని వెళ్ళడం చూసి రాజేశ్వరి కి కమల పట్ల గల అభిమానం ఇంకా పెరిగింది.
ఈ మధ్య రాజేశ్వరి కమలని 'అండీ' అనొద్దనడంతో మిగతా వాళ్లల్లె అమ్మా అనడం మొదలెట్టింది. మాధురి సంగతి చెప్పక్కర్లేదు. ఎప్పుడూ 'కమలీ కమలీ' అంటూ తిరుగుతూ వుంటుంది. ఇప్పుడు రమణమ్మ పొడ కూడా పనికి రావటం లేదు. అన్నీ కమలీయే చెయ్యాలి నీళ్ళు పొయ్యటం దగ్గర్నించి, అప్పటి వరకు వూరుకున్న రాజేశ్వరి, ఒకరోజు కమల తన దగ్గరేదో పని చేస్తుండగా నూనె కారుతూ 'కమలీయే తలంటి పోయ్యాలని' తప్పించుకు పారిపోయోచ్చిన పావని చూసి కోప్పడ్డది. 'మరీ అగడంగా వుంది నీపని. రమణమ్మ పోస్తే చాలదా' అని. తనేం చేసినా వూరుకునే మామ్మ కోప్పడేటప్పటికి బావురుమంది. 'కొప్పడకండి' అంటూ కమల తన బట్టలు పాడౌతయి అనైనా చూడకుండా పాప నెత్తుకుని లోపలికి వెళ్ళింది. తను అన్నం పెడితే తినడం లేదని రమణమ్మ చెప్పగానే కమల లేవటం చూసి ' పాపని నువ్వే పాడు చేస్తున్నావన్నది కోపంగా. కాని కమల పట్టించుకోకుండా వెళ్ళటం తో అక్కడే నిలబడ్డ రమణమ్మ తో నవ్వుతూ 'కమల వచ్చినాక నీ పని హాయిగా వుంది కదూ రమణమ్మ . పాపం కమలే అన్నీ చూసుకుంటుంది.' అన్నది.
ఆ మాటకొస్తే ఇప్పుడు రమణమ్మ కి మిగతా వాళ్ళకి కూడా హాయిగా వుంటున్న మాట నిజం. మునుపు ప్రతిదానికి బిక్కుబిక్కుమంటూ అమ్మగారి దగ్గరికి పోవాల్సి వొచ్చేది. లేకపోతె అమ్మగారి పినతండ్రి దగ్గరికో. ఇప్పుడా భయం లేదు.
ఈ మధ్య ఒక చిన్న సంఘటన జరిగింది. ఒకరోజున వంటింటి వైపు వెళ్ళిన కమల కి చంద్రమ్మ తో ఏదో చెప్ప్తున్న పని మనిషి అదేమ్మ ఏడవటం వినపడ్డది. ఏమిటని అడిగితె అదేమ్మ కొడుక్కి నాలుగు రోజులుగా సుస్తీగా వుందిట కన్ను తెరవకుండా పడివున్నాడుట. కమల వెంటనే 'వుండు అదేమ్మ' అని రాజేశ్వరిదేవి ని వెతుక్కుంటూ , శ్రీనివాసరావు గారి దగ్గర వున్నారని తెలిసి అక్కడికి వెళ్ళింది. 'ఏం కమలా' అన్న వాళ్ళకి సంగతంతా చెప్పి శ్రీనివాసరావు గారొక వుత్తరం డాక్టరు కి రాసిస్తే అదేమ్మ ని పంపుతానన్నది.
'అవ్వన్నీ మనకెందుకు కమలా' అని రాజేశ్వరి అంటే.' అదేంటమ్మా, మన దగ్గర పనిచేస్తున్నవారు కదా. మనం వాళ్ళని కనిపెట్టి ఉండొద్దా? అదీ కాక రేపు నాలుగు రోజులు అఫీ ఈ కారణంగా రాకపోతే కష్టం మనకే కదా. దాని వల్ల నాలుగు రూపాయలు నష్టమైనా మనకి మంచి మిగుల్తుంది, పనీ గడుస్తుందన్నది. శ్రీనివాసరావు గారు కూడా ఇది బాగుందనటంతో రాజేశ్వరి వోప్పుకుంది. అదెమ్మ ఏనుగెక్కినంత సంతోషంతో మందు తెచ్చి వేసి తగ్గినాక కమల కాళ్ళు పట్టుకుని 'చల్లగా బతుకు తల్లీ' నీ పేరు చెప్పుకు దీపం పెట్టుకుంటున్నా' నంటూ వెళ్ళింది. దీంతో పని వాళ్ళంతా కమల దేవతంటూ కమలని అడ్డం పెట్టుకుని వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అందుకని రమణమ్మ కూడా వెంటనే "ఔనమ్మా నిజమే' అన్నది.
తనకి చేదోడుగా అన్నీ చూస్తున్నది కదా అని రాజేశ్వరిదేవి నెలాఖరున జీతం ఇస్తూ వందరూపాయల నోట్లు మూడు కమల చేతిలో పెట్టింది.
