"ఈ సరుకులు చూస్తేదాన్ని చూసినట్లు ఉంటుంది. ఇంక ముందు నుంచి ఇందుకు కూడా నోచుకోలేదు అన్నమాట!" అనుకుంటూ పైట చెంగుతో కళ్ళువత్తుకుంటూ ఒక్కొక్కవస్తువే సొరుగులో పెట్టసాగింది కాంతమ్మ. సొరుగు మూస్తున్నప్పుడు రాఘవయ్య హృదయంలో. సునంద జ్ఞాపకాలు సుతారంగా ఘొల్లుమన్నాయి.
ఆసాయంత్రం బజారునుంచి వచ్చేటప్పుడు చీరా. రవికల గుడ్డా, పళ్ళూ, పసుపు కొమ్ములూ పట్టుకొచ్చి "రేపు వాళ్ళ సీత బిడ్డనెత్తుకుని అత్తారింటి కెళుతోంది. వెళ్ళేటప్పుడు ఇల్లా రమ్మన్నాను చలిమిడికూడా చేసి. ఈ చీరా అదీ పెట్టిపంపించు "అని రాఘవయ్య పురమా యిస్తున్నప్పుడు. కాంతమ్మ తెల్లబోయింది.
"అలా ఆశ్చర్యంగా చూస్తావేమిటి? సీతని ఎరగవ్? సునందతో కలిసి మన యింటికి వస్తూ ఉండేది. దాని స్నేహితురాలు!
"ఏవిటీ.....సీత అప్పుడే రెండో పురిటికి వచ్చిందీ? దాని పెళ్ళయి ఎన్నాళ్ళయింది చెప్మా?
"మన సునంద పెళ్ళికి ఆర్నెల్ల ముందేగా? సీత పెళ్ళిలోచూసేగా మనగారాల కూతురు ఈ జగదేక వీరుణ్ణి తప్ప ఇంకెవర్నీ పెళ్ళిచేసుకోనని మారాంచేసి మన ఆశల్నీ తన బతుకునీ ఈకాడికి తెచ్చింది?
కాంతమ్మ నిట్టూర్చి "ఏవిటో .... దాన్ని కన్నాం కాని దాని అదృష్టాన్ని కన్నామా? ఈపాటికి సీతలాగే తనుకూడా ఒక బిడ్డనెత్తుకుని అత్తవారింటికి వెళుతూ. పుట్టింట్లోంచి పచ్చగా కాళ్ళకి పసుపు రాసుకుని.....ప్చ్...."అని ఆ మట్టుని ఉండిపోయింది.
మర్నాడు సాయంత్రం కాళ్ళ కి పసుపు రాయించుకుంటూన్న తన పాదాలమీద రెండు వేడి కన్నీటి చుక్కలు పడడంతో, ఒళపళ పడి ఒంగుని కాంతమ్మ ముఖంలోకి చూసి పిన్నిగారూ అంది సీత డగ్గుత్తికతో- కాంతమ్మ సీతని కౌగలించుకుని బావురుమంది. అంతవరకూ సీతలో సునందనిచూస్తూ, సీత కొడుకుని ఎత్తుకుని హాల్లో నుంచుని ఉన్న రాఘవయ్య అటు తిరిగి కండువాతో కళ్ళు ఒత్తుకున్నాడు. గుండెబరువుతో తడబడుతూ "వెళ్ళి వస్తానన్న" సీతతో మంచిదమ్మా అని అందామని ప్రయత్నించాడు రాఘవయ్య. కాని శబ్దం గొంతుదాటి బైటకు రాలేదు.
4
పక్కయింట్లో గడియారం "ఠంగ్" మని అరగంట కొట్టడం వినిపించింది. నాలుగున్నర ఆయింది కాబోలని మంచం మీంచి లేచింది. అప్పటికి గంటన్నర క్రితం మెళుకువ వచ్చి ఇంక నిద్రపట్టక పక్కమీద ఇటూ అటూ ఒత్తిగిలుతూ పడుకున్న సునంద. కిటికీ తెరిచి చూస్తే బయట వెన్నెల పిండి ఆరబోసినట్లు ఉంది. పుచ్చ పువ్వులా కాస్తూన్న ఆ వెన్నెట్లో అప్పుడే విచ్చుకుంటూన్న పరిమళాలతో పారిజాతం సన్న సన్నగానవ్వుతోంది. సన్నని మబ్బు పరదాల లోంచి తప్పించుకోలేకపోతోన్న శరశ్చంద్రున్ని చూసి కాబోలు! ... అబ్బ? .... ఆ వెన్నెట్లోకి. ఆ పారిజాతం కిందకి. వెళ్ళి కూచుంటే? ఆలోచనవల్ల వచ్చిన సుఖానుభూతితో సునంద ఒళ్ళు పులకరించింది.
వెన్నెల కాస్తూనే ఉంది.
సునంద చూస్తూనే ఉంది.
ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో పెద్ద మేఘం ముక్క ఒకటి వచ్చి హడావిడిగా పన్నీరు జల్లినట్లు గబగబా వర్షపు జల్లు కురిపించింది. వెన్నెలా! వర్షం వెండి కొట్లో వేళ్ళాడదీసిన వెండి చమ్కీ దారాల్లా మెరుస్తున్నాయి వర్షపు ధారలు తెల్లని తలంబ్రాలు తలమీద జల్లుగా పడుతూంటే. నిలువెల్లా పరవశిస్తూ తల వంచుకుని కూర్చున్న ఎల పెళ్ళికూతురులా ముగ్ధ మోహనంగా ఉంది. గున్న పారిజాతం. ఆ వెన్నెలనీ, వాననీ, పారిజాతాన్నీ చూస్తూ తనని తాను మరచి. అలా ఎంత సేపో ఉండిపోయింది సునంద....వానజల్లు తగ్గింది. చల్లగా వీచిన గాలిలో కలిపి, పారిజాత పరిమ ళాలు సునంద మనస్సుకి మత్త్తు కలిగించసాగాయి. గాలికి పారిజాత వృక్షం కదిలి ఒళ్ళు విరుచుకుంది. ఒక్కసారిగా, తడిసిన పువ్వులు వెన్నెట్లో మెరుస్తూ జల్లున రాలాయి. సుంమ్ద హృదయం కూడా ఝల్లుమంది. మెల్లగా వీస్తూన్న గాలికి. మబ్బుకూడా విడిపోయి తెల్లని దూది పింజలా తేలిపోతోంది ఆకాశంలో.
తన జీవితంలో మబ్బుకూడా ఇలాగే తేలిపోయి. శివరాం మామూలు ఆరోగ్యంతో కోలు కుంటే! ఆశగా ఆలోచించింది సునంద. ఈ అందమైన ప్రకృతిలో తనలాగే ఏకాంతంగా నిలబడి ఉంది ఈ పారిజాతం. పాపం విరహిణిలా జుట్టంతా విరబోసుకుని ఎలా ఊగిపోతోందో! ఇప్పుడే శివరాం కనక తన పక్కన నవ్వుతూ ఉంటేనా? సునంద హృదయంలో జివ్వుమని ఏదో చల్లని గాలి వీచినట్లయింది? నవ్వుతూ ఉండే శివరాం తన పిరికి మనస్సుకి ఎంత అండ? అసలు అతని నవ్వుముఖం చూసి నప్పుడే కదా మొదటి సారిగా జీవితానికి అర్ధం తనకి స్ఫ్రురించింది?
అప్పుడు..... సీత పెళ్ళిలో తను మొదటి సారిగా శివరాం ని చూసినప్పుడు సీత తనమీద పెట్టిన బాధ్యతలన్నింటిలోనూ ముఖ్యమైంది పెళ్ళి కొడుకు స్నేహితులకి మర్యాదలన్నీ అందుకు న్నాయో లేదో చూడ్డం సీత మొగుడికి చాలా మంది స్నేహితులున్నట్లున్నారు. పాతిక ముఫ్ఫై మంది అయితే వచ్చారు పెళ్ళికి. వాళ్ళకని వేరే మేడమీద విడిది ఇచ్చారు సీతావాళ్ళ నాన్నగారు.
ఫలహారాలూ కాఫీ పట్టించుకొని. ఆ విడిదికి వెళ్ళింది తను. అప్పటికి ఆ మిత్రబృందమంతా ఓహ్, మంచి కోలాహలంగా ఉంది. మొహాలు రుద్దుకునేవాళ్ళూ ఫేస్ పౌడరు కొట్టుకునేవాళ్ళూ, అద్దంలో చూసుకుని విజిల్ వేసుకుంటూ "టై"లు కట్టుకుంటూన్న వాళ్ళూ, బూట్ల లేసులు ముడి పెట్టుకుంటూన్న వాళ్ళూ ఇలా అంతా హడావిడిగా ఉన్నారు. మొహం రుద్దుకుంటూన్న వాడి పక్కనున్న చెంబు తీసేస్తున్నాడు ఒక యువకుడు. "టవల్ టవలో" అని అరుస్తూ చేరువలో ఉన్నవాడి షర్టుపెట్టి మొహం తుడిచేసుకుంటున్నా డింకొక యువకుడు. "ఒరేయ్ తేరగా వచ్చిందని తెగపులిమేస్తున్నట్లున్నావు చూసి మరీ రాసుకో చాక్ పౌడరో ఫేస్ పౌడర్ అది" అంటూ అరుస్తున్నాడో అబ్బాయి. ఇలా కేకలతో అరుపులతో నానా హంగామాగా ఉన్న ఆ స్నేహ బృందానికి తనరాక ఏమీ పట్టినట్లు లేదు. వాళ్ళ చిలిపి అల్లర్లు చూస్తూ ఆకతాయి మాటలు వింటూ వస్తూన్న నవ్వుని పంటికీ. పెదిమకీ మధ్యన నొక్కి పడుతూ ఇవతల హాల్లో నిలబడింది, తను, పట్టించుకువచ్చిన ఫలహారపు పళ్ళేలమధ్య.
ఇంతలో ఈ శివరామే. టవల్ తో ముఖం తుడుచుకుంటూ "షాదీ!......షాదీ!" అని సన్నగా పాడుకుంటూ తనకి దగ్గరగా వచ్చేసి. అక్కడే నిలబడి ఉన్న తనని చూసి గతుక్కుమని ఆగిపోయి చట్టున పాట ఆపేశాడు. అనుకోకుండా ఓ కొత్త వ్యక్తి అందులోనూ సమవయస్సులో ఉన్న యువతి ఎదురుగుండా తటస్థపడడంవల్ల కాబోలు, తెగ కళవళపడిపోయి, శరీరములో సమస్తచలనమూ ఆగిపోయి. గుడ్ల ప్పగించి తనకేసి చూస్తూ గుటకలు మింగుతూ ఉండిపోయాడు. ఆ స్థితిలో ఆయన్ని చూస్తే తనకి నవ్వువచ్చింది. అయితే అతి ప్రయత్నం మీద ఆపుకొంది.
అతడు తడబడుతూ ... "మీ....రు.....?......మీ....రు?" అన్నాడు. వయస్సులో ఉన్నవాళ్ళకి అంతదగ్గరా ఎప్పుడూ నిలబడడం తటస్థించలేదేమో తనకి ముచ్చెమటలూ పోశాయి. పైగా తడబడుతూన్నా ఆ కంఠంలోని గాంభీర్యంఏదో తనమీద వశీకరణాన్ని ప్రయోగిస్తున్నట్లు అని పించింది. చాలా దగ్గరగా నుంచుని ఉన్న ఆ పురుషమూర్తి నుంచి వస్తున్నగాలి, వంటికి తగిలి శరీరాన్నంతా తిమ్మిరెక్కిస్తోంది. అతిప్రయత్నం మీద తనని తాను సంబాళించుకొని నాలికతో పెదిమలు తడుపుకొని గుటకవేసి "పెళ్ళికూతురు సీత నా ఫ్రెండ్. మీ అందరికీ ఫలహా రాలు పట్టించుకు వచ్చాను......అవిగో.....ఈ మాటలు తను పైకే అందో లోపల అనుకుందో ఇప్పటికీ అనుమానమే.
ఆయన కళ్ళతో తనని కొరుక్కుని తింటున్నట్లు చూస్తున్నాడు పచ్చగా బలంగా చెయ్యంత ఎత్తు మనిషి. ఎంత ఆకర్షణగా ఉన్నాడీయన! మగవాళ్ళలో కూడా ఇంత అందమైన వాళ్ళు ఉంటారన్నమాట! అందంతోపాటు ఎంతో తెలివి ఉంటేనే కాని అంత తేజస్సుగా ఉండదు ముఖం. ఒళ్ళంతా ఒక్కమారు ఝల్లుమంది. పైట సర్దుకుని సిగ్గుతో పక్కకి చూస్తూ ఉండిపోయింది తను.
"మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది"
తనకీ అలాగే అనిపిస్తోంది. ఇంతలో ఆయన మిత్రులు నలుగురైదుగురు అక్కడికి వచ్చారు తనకి సిగ్గేసింది ఆయనతో అప్పటివరకూ ఏకాంతంగా నిలబడినందుకు. అడుగు కదపబోయింది. "అయ్యో వెళ్ళిపోతారేవిటి మాకు తెచ్చిన టిఫిన్లు పెట్టించకుండా" అన్నాడు వచ్చిన వాళ్ళలో ఒకడు.
"టిఫిన్ మాట సరేకాని మిమ్మల్ని నేను ఎక్కడ చూశాను." అన్నారాయన. ఏం చెబుతుంది తను?" మీ పేరు? అన్నారాయన. తను కళ్ళెత్తి చూసింది. ఆయన నవ్వుతూ "నా పేరు శివరాం. ఈ మారు చెప్పండి మీ పేరు" అన్నాడు. ఎలాగో ఇబ్బందిపడి సు...నం..ద అని ఆ మూడు అక్షరాలూ పలికించింది వణికే ఆ గొంతులోంచి.
"ఏం చదువుతున్నారు?"
"ఫైనల్ బి.య్యే."
"ఏ కాలేజీలో?"
"ఒరేయ్ నీ పోలీసు ఎంక్వయిరీ తగలెయ్యా ఇక్కడ కూడా డ్యూటీ యేట్రా. ఓ మూలనుంచి ఆకలేసి చస్తూంటే! అమ్మా ఆ ఫలహారాలేవో పెట్టే ఏర్పాటు చేయించండి" అన్నాడు మఫ్లర్ ని మెడకి చుట్టుకున్న ఓ పన్నడ భూషణుడు.
"ఓ......అయామ్ సారీ! అబ్బాట్లు మన వాళ్ళంతా బకాసుర లగ్నంలో పుట్టినవాళ్ళు కదూ.....ఊ.....అయితే సరికానియ్యండి.....మా వాళ్ళు పెట్టుకు తింటారులెండి మీరేం శ్రమపడక్కర్లేదు మిస్ సునందా.....ఆ.....సారీ మిమ్మల్ని మిస్ అని పిలవచ్చా." అన్నాడు శివరాం. తనకి నవ్వు వచ్చింది. తల ఊపుతూ" ఓ.......నిరభ్యంతరంగా" అంది. ఆ సమాధానంతో, పరిష్కారం కాకుండా అప్పటిదాకా ఉండిపోయిన సమస్య ఏదో తీరిపోయినట్లు. తృప్తిగా నిట్టూర్చాడు శివరాం. తను తిరిగి వచ్చే స్తూంటే, అప్పుడే వెళ్ళిపోతారా అన్నట్లు దీనంగా చూశాడు. అతని ముఖంచూసి తను చిలిపిగా నవ్వుకుంది.
పెళ్ళి వేళ సమీపిస్తోంది. బనారస్ చీరకట్టుకుని సీత పెళ్ళి కూతురు ముస్తాబులో ఆకర్షణగా ఉంది. ఎంత సేపయినా ఏ చీర కట్టుకోవాలో నిర్ణయం కాలేదు తనకి. శివరాం ఏ చీర లైక్ చేస్తాడో! ఏ చీర ఇష్టమో అతనికి....వెంటనే తన మీద తనకే కోపం వచ్చింది. అలా అనుకుంది ఏవిటి? అతనెవరు? అతనికి ఇష్టమైన చీర ఎందుకు కట్టుకోవాలి తను?" బుద్ది లేదూ? అని మనస్సుని చివాట్లు పెట్టింది. కాని నిజంగా దానికి బుద్దిలేనట్టే ఉంది. మళ్ళీ అదే ఆలోచన.
చివరకి కనకాంబరం రంగుచీరా అదేరకం బ్లౌజూ వేసుకొంది. వాలుజడలో బరువుగా కనకాంబరాలు పెట్టుకుని అందంగానూ సింపిల్ గానూ అలంకరణ పూర్తి చేసింది. ఒకటికి పదిసార్లు అద్దంలో చూసుకోసాగింది. అలా చూసుకోగా బుగ్గని చుక్కా నుదుటి కళ్యాణతిలకం కనిపించసాగాయి. పల్లకీలో కూచుని శివరాం వస్తున్నట్లు అనిపించింది. వెంటనే తత్తరపడి ఒళ్ళు గిల్లుకుని చూసుకుంది. తనలో తను నవ్వుకుని ఊహకి కూడా ఊపిరి ఉంటుంది కాబోలు" అనుకుంది. నిజానికి ఆ రెండు రోజులూ తను ఊహాలోకంలోనే ఉండిపోయింది.
పెళ్ళిలో ఎప్పుడేనా సీతని వెనకేసుకు వస్తూ పెళ్ళికొడుకుని వేళాకోళం చేస్తే అతని తరఫున తనకి శివరాం జవాబు చెప్పేవాడు సరిబేసిలు దగ్గరా తలుపులు దగ్గర పేరు చెప్పించే సందర్భంలోనూ తనకీ శివరాం కీ వాగ్వాదం పడేది. అతను ఉండుండి ఓ మాటు. "అబ్బబ్బ మీతో వేగడం మహా కష్టం అండీ" అన్నాడు. తనకై ఉక్ర్రోషం ఆ వెంటనే కోపం. వచ్చేశాయి. చుర చురా అతనికేసి చూస్తూ "నాతో వేగడం దేనికి మీరు?" అంది. స్నేహితులంతా ఘొల్లుమన్నారు. తనకి భలే పౌరుషం వచ్చింది. ఇంకా పూటంతా అటు వెళ్ళకుండా. గాడి పొయ్యి దగ్గరా కొట్టుగది చుట్టూనూ కాలక్షేపం చెయ్యసాగింది.
ఎంత కళ్ళేలు బిగించినా మనస్సు శివరాం వైపే పరిగెడుతోంది. అతణ్ణి చూసింది లగాయతు మనస్సు ఇలా మెత్తగా. మత్తుగా అయి పోతోందేవిటి? అతని రూపే హృదయం నిండుగా నడుచుకుంటోందేవిటి? ఆ విశాలమైన కళ్ళల్లో, కన్యగా తను ఇన్నాళ్ళనుంచీ ఊహించుకొంటూన్న కోరికల కోటలేవో కనిపించసాగాయి. ఇదివరకు లేని దివ్యశక్తి ఏదో తనలో ప్రవేశించినట్లూ, చుట్టూ ఉన్నవారి అందరిలో శివరాం మాత్రం ఎంతో ఉన్నతుడుగా ప్రకాశిస్తున్నట్లూ, లోకం అంతా వెయ్యి వెలుగులతో అందంగా మారిపోతున్నట్లూ అనిపిస్తోంది.
ఎవరో అంటూండగా వినిపించింది "పెళ్ళి కొడుకు స్నేహితులు ఈ పూటే వెళ్ళిపోతారుట" అని! "ఆ! నిజంగా?" అని ఒక్కక్షణం తను బాధగా ఉండిపోయింది. ఇంతలో "పెళ్ళి కూతుర్ని విడిదిలోకి తీసుకురమ్మంటున్నారు. తన స్నేహితులకి ఆమెని పెళ్ళికొడుకు పరిచయం చెయ్యాలట" అన్నారు ఎవరో. సీతతో సాబూ తనూ సాయంగా వెళ్ళవలసి వచ్చింది విడిదికి. తను అలా వస్తానని ఊహించే ప్రత్యేకప్రార్ధన మీద శివరాం పెళ్ళికొడుకు చేత ఈ ఏర్పాటు చేయించాట్ట ఆ సంగతి శివరాం తనకి తర్వాత చెప్పాడు. తనూ సీతా విడిదికి వెళ్ళేటప్పటికి అంతా రెడీగా ఉన్నారు. శివరాం మాత్రం ఒంగుని పెట్టే సర్దుకుంటున్నాడు.
"ఏరా బ్రదర్ ఎంతకీ పెట్ట్టి సర్దుకోవడం పూర్తి కాదేం? అన్నాడు స్నేహితుల్లో ఒకడు.
షర్టో పేంటో ఏదో పోయినట్టుంది. పెట్టి వెలితిగా ఉంది" అంటూ ఇటూ అటూ విసుగ్గా వెదుకుతున్నాడు, శివరాం.
