Previous Page Next Page 
బాంధవ్య బంధితులు పేజి 5


    "పోనీ, ఒప్పుకుందాం పరిస్థితుల ప్రభావం అని. కాని ఎంత పురుషుడైనా, ఒక స్త్రీతో సంబంధం ఏర్పరుచుకున్నవాడు ఆమెతో ఉండాలికాని, ఓ పదేళ్ళు కలిసిఉండి, పిల్లలుకూడా పుట్టాక తన దోవను పొమ్మని, ఇంకో పెళ్ళి చేసుకోవడం .....పోనీ, చేసుకుంటే వేరే విషయం. కనీసం ఆ విషయం భార్యతోనైనా చెప్పలేదంటే... స్త్రీ అంటే చులకన కాదూ?"
    ఆమె వాదన విని నవ్వుతూ ఉండిపోయాడు. కొద్ది క్షణాలు పోయాక, "అది తప్పే అవచ్చుగాని, క్షమ, ఓర్పు, సహనం స్త్రీ స్వంతం అంటారు కదా, అతనిని క్షమించలేకపోయిన డోరిస్ ని గురించి విమర్శించలేదేం? స్వజాతీయాభిమానమా?" నవ్వాడు శ్రీనివాస్.
    "స్వజాతి అభిమానం కాదు. ఆ కథలో డోరిస్ కి మంచి స్వభావం సృష్టించాలని ప్రయత్నించాడు రచయిత. మీకు జ్ఞాపకం ఉందోలేదో, డోరిస్ గైని విడిచిపోతూ అంటుంది-'పదేళ్ళుగా నా స్థానంలో ఇంకొకళ్ళు ఉన్నారంటే, నన్ను నేను సమర్ధించుకోలేను. కనీసం పిల్లలయినా లేకుంటే....అందులోనూ ముగ్గురు' అని ఆమె ప్రయత్నించింది. అది కాదనటానికి వీలులేదు."
    "ఒక విషయం ఆలోచించండి. మనిషి చేసే ప్రతిపనికి తన చుట్టూ పరిస్థితులు ఎంత బలమయిన స్థానాన్ని ఆక్రమిస్తాయో! డోరిస్ స్థానంలో మాన్ దేశ స్త్రీ ఉండిఉంటే ..."
    "ఉంటే ఏముంది? అతనితోనే కలిసి ఉండేది."
    "అదే నేననేదీను. మన సాంఘిక పరిస్థితులు భర్తను విడిచిపెట్టిన స్త్రీని గౌరవించలేవు. అలాటి బాధ తెల్లవారికి లేదు. అందుకే ఆమె భర్తను విడిచి పోగలిగింది. పరిస్థితుల ఒత్తిడికి ఎవరైనా తన ఒగ్గవలిసిందే!"
    "ఏమో నాకుమాత్రం తృప్తిగా లేదు. ఏదో వాదించుకోవడానికి ఒక కారణమేమో గాని."
    "వాదనవల్ల అభిప్రాయాలు ఎప్పుడూ మారవు. కాని వాటివల్ల ఇతర మార్గాలలో ఆలోచించేందుకు అవకాశం కలుగుతుంది."
    "మీరు లా చదివి ఉండవలసింది, మంచి లాయరుగా రాణించేవారు" అంది అనూరాధ ఉన్నట్లుండి.
    "పోనీ, రెండేళ్ళుగా, ఇప్పుడు మొదలుపెడతాను. రెడేళ్ళలో మీదగ్గిర అప్రంటిస్ కి చేరతాను."
    "నా దగ్గరా?.... నయం. ఆ ఉద్దేశంతో లా మొదలుపెట్టకండి. డబ్బులు రావు."
    "ఇప్పుడే కదండీ నేను మంచి లాయర్ని అవుతానన్నారు. ఈ రెండేళ్ళలో మీరు ప్రాక్టీస్ బిల్డప్ చేయగలరు లెండి."
    "నేను లా ప్రాక్టీస్ అంటూ మొదలుపెడితే మిమ్మల్ని తప్పకుండా పార్ట్నర్ గా చేసుకుంటాలెండి" అంది నవ్వుతూ.
    "లా చదవకపోయినా" అన్నాడు చిలిపిగా చూస్తూ.
    "ఇదేం అన్యాయం! లా చదవకుండా..." అని ఠక్కున ఆగిపోయింది. అతనివంక చూసి కళ్ళు దించుకుని, టేబిల్ మీద చెస్ బోర్డు పెట్టి, పావులు సర్దుతూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమెను పరికించడంలో నిమగ్నుడయ్యాడు శ్రీనివాస్ చిరునవ్వుతో.
    
                                   *    *    *

                                    8

    ఇంటినుండి దూరమయిన శ్రీనివాస్ కు అనూరాధ సాహచర్యం, రాజశేఖరం స్నేహం, వారి కుటుంబంతో పరిచయం ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయి. తరుచుగా వారింటికి రాకపోకలతో, వారి కుటుంబంలో ఒక ముఖ్య వ్యక్తిగా మారిపోయాడు. ఒకరోజు మధ్యాహ్నం లైబ్రరీలో పనిలో ఉన్నాడు. కాలేజినించి అనూరాధ ఫోనుచేసి వారింటికి ఆహ్వానించింది.
    రాజశేఖరం గారి ఇంటికి వెళ్ళేటప్పటికి ఇల్లంతా సందడిగా ఉంది. దసరా నవరాత్రులలో ముఖ్యమయిన రోజులు. ఆ మూడు రోజులు కొద్దిమంది స్నేహితులతో ఇల్లు కలకలలాడుతూంది. గడపలకు పచ్చని తోరణాలతో, పూజ తాలూకు అగరవత్తుల సువాసనలతో నిండిఉంది.
    శ్రీనివాస్ ను చూడగానే "రావోయ్..." అంటూ ఆహ్వానించారు రాజశేఖరంగారు.
    అక్కడ ఉన్నవారందరిని ఒకరి కొకరిని పరిచయం చేస్తూ, "ఈయన మా ఫామిలీ డాక్టర్. కె. జి. లో సర్జను. డాక్టర్ కృష్ణమూర్తి" అని అన్నారు ఒకరిని చూపిస్తూ.
    కరచాలనం చేస్తూ ఉంటే డాక్టర్ కృష్ణమూర్తిగారి దృక్కులు కొద్ది క్షణాలు నిలబడిపోయాయి. ఆయన కళ్ళలో ఏదో వాత్సల్యంతో నిండిన ఉత్సుకత నిండిపోయింది. శ్రీనివాస్ కు కూడా ఆయన్ని చూస్తూ ఉంటే లోలోపలే ఆశ్చర్యం వేసింది.
    లోపల దేవీపూజ మంత్రాలు వినిపిస్తున్నాయి. బయట ఉన్న పెద్దమనుష్యుల సంభాషణ దేశ కాల పరిస్థితుల దగ్గిర మజిలీ చేసింది.
    "ఏం డాక్టర్లయ్యా మీరంతా! పాపులేషన్ పాపం పెరిగినట్లు పెరుగుతూంది. ఏం చేస్తున్నట్లు మీరంతా?" అన్నాడు ఒకాయన హాస్యంగా కృష్ణమోహన్ తో.
    "డాక్టర్లేం చేస్తారండీ! మనుషుల్లో చైతన్యం, పరిపాలనలో నూతనత్వం రావాలిగాని."
    "ఎవరికి వారే వారు చేసే పద్ధతులలో తప్పు లేదంటారు. ఎప్పటికి మార్పులు వస్తాయో, ఎవరు చేస్తారో గాని?"
    "అదే మనం చేస్తున్న పొరపాటు. ఎంతసేపూ ఎవరు చేస్తారో అనేగాని, ఎవరికి వారు చెయ్యాలన్న ఉద్దేశం ఎవరిలోనూ లేదు. ఇలాంటి సమస్యలు ఏ ఒక్కరి వల్ల తీర్చబడేవి కావు, ప్రతిఒక్కరూ సహకరించితేతప్ప."
    "జనాభాలాంటి సమస్యలంటే ప్రజలు సహకారించాలిగాని, పాపులేషన్ కు పదిరెట్లున్న క్రిమికీటకాదులను అంతం చెయ్యడానికి గవర్నమెంటు చర్య తీసుకోవాలి కదా! నలభైనాలుగు కోట్ల మనుష్యులకు వారి కుటుంబాలతో పాటు ప్రతి మనిషికి ఎనిమిది ఎలకల్ని కూడా పోషించాలి. మనుష్యులకే పండే తిండి చాలక చస్తూంటే, వచ్చే పంటలో నాలుగోవంతు పందికొక్కులు, ఎలకలు ఖర్చుచేస్తున్నాయి."
    "మన పరిపాలనా పద్ధతులు మంచి మార్గాలలో నడవకపోవడానికి ఎవర్ని నిందిస్తాం చెప్పండి! మొదటినుండి మనలో జీర్ణించుకుపోయిన సంప్రదాయాలు అటువంటివి. జంతువులను చంపితే పాపం. పుట్టబోయే పిల్లలను ఆపితే పాపం. పుట్టిన పిల్లలను కనీసావసరాలుకూడా లేకుండా మాడ్చడం పుణ్యంగా భావిస్తారేమోగాని, ఇటువంటి పనులకు దోహదమివ్వరు. అదొక్కటేనా ... మగవాడికి చిన్నతనంనుండి బాధ్యతలు తెలియకపోవడానికి కారణం ఎవరంటారు? పెద్దవాళ్ళేగా."
    "ఈ కాలం కుర్రాళ్ళకు ఇదో పెద్ద ఫాషన్ అయిపోయింది, మాట మాటకు పెద్ద వాళ్ళను వెక్కిరించడం."
    "ఫాషన్ కాదండి. నూరుపాళ్ళ నిజం. కొడుకుకి చదువైనా కాకుండా, సంపాదనాశక్తి అయినా లేకుండా పెళ్ళి చేసేది మన పెద్దవాళ్ళు కాదా? కొడుకుని, కోడళ్ళని, ఆఖరికి మనవళ్ళనుకూడా పోషించే తండ్రులున్నారంటారా! పుట్టినప్పటి నుండి తమ అవసరాలన్ని తండ్రే చూస్తూ ఉంటే బాధ్యత ఎలా తెలుస్తుంది? అందుకే పాశ్చాత్యులు ఎప్పుడూ ఓ మెట్టు పైకే ఉంటారు. పెళ్ళి చేసుకున్న మరుక్షణం నుండి పెళ్ళాన్ని స్వంతంగా పోషించుకోవాలి. దానితో తన శక్తి ఎంత వరకో తెలుస్తుంది" అన్నాడు కృష్ణమోహన్.
    "కుర్రాళ్ళోయ్" అన్నాడా పెద్దాయన ఇంకేమనాలో తెలియక.
    కొడుకు చేస్తున్న ఆరోపణలు వింటూ చిరునవ్వుతో కేకలం ప్రేక్షకుడు గానే ఉండిపోయారు రాజశేఖరంగారు. శ్రద్ధతో, ఉత్సాహంతో మిగిలినవాళ్ళందరూ వింటూన్నా, డాక్టర్ కృష్ణమూర్తిగారి కళ్ళు మధ్య మధ్య శ్రీనివాస్ ను పరికించటంలో నిమగ్నాలవుతూనే ఉన్నాయి. అతన్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని ఉద్వేగం లోపలనుండి కదిలిస్తూంది. మెల్లిగా అతన్ని పలకరించాలని చూచారు.
    "ఏ ఊరు మీది?"
    "గుంటూరు."
    "ఇక్కడ చదువుతున్నావా?"
    "లేదండి" అన్నాడుగాని ఏం చేస్తున్నాడో తనకై తను చెప్పలేదు.
    "మీ నాన్నగారి పేరేమిటి?"    
    అతను చెప్పేలోపలే పూజ పూర్తి అయిందని శ్రీలక్ష్మి కబురు పంపింది అందరు చేతులు, కాళ్ళు కడుక్కుని పూజగదిలోకి వెళ్ళారు.
    మహిషాసురున్ని సంహరించడానికి అవతారం ఎత్తి, విజయాన్ని పొంది, పదవరోజున శక్తి రూపిణి అన్నపూర్ణ అవతారంతో పేదసాదలకు అన్నదానం చేసిన విజయదశమి ఆరోజు. ప్రతి సంవత్సరం లక్ష్మీదేవికి ఆ పదిరోజులు ఉదయం, సాయంత్రం ఒక పూజారిచే పూజలు చేయిస్తారు రాజశేఖరం గారింట్లో. విజయదశమినాడు పదిమందితోను కలిసి భోజనం చేస్తారు. పురోహితుడు ఇచ్చిన తీర్ధప్రసాదాలు తీసుకున్నారు. కర్పూర నీరాజనాల సువాసనలలో, పుష్పసౌరభాలలో, షణ్ముఖప్రియరాగంలో "అమ్మా, శ్రీదేవీ" అని ఆనందకరంగా లలిత ఆలపిస్తూ ఉంటే అందరూ నిర్మలదృక్కులతో నిశ్చలంగా నిలబడిపోయారు.
    భోజనాల అనంతరం ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. లలిత వాళ్ళమ్మ అనారోగ్యకారణంగా వెంటనే వెళ్లిపోయింది.
    "మీ స్నేహితురాలు అంత బాగా పాడతారని నాకు తెలియదండీ" అన్నాడు శ్రీనివాస్.
    "నిజంగానే! ఇన్నేళ్ళనుంచి చూస్తున్నా, నాకే తెలియదు ఈ సంగతి!" అన్నాడు కృష్ణమోహన్.
    "నువ్వు ఎప్పుడూ పెద్దగా గమనించలేదేమోగాని లలిత మన ఇంట్లో చాలాసార్లు పాడింది" అంది అనూరాధ చిలిపిగా చూస్తూ. "నా బొమ్మలకొలువు చూద్దురుగాని రండి" అంటూ పక్క గదుల్లోకి దారితీసింది.
    "ఈ ఆడవాళ్ళకేం పనులు లేవు, బొమ్మల కొలువులు, పేరంటాలు తప్ప. ఊరికే టైము దండగ" అన్నాడు కృష్ణమోహన్ నవ్వుతూ.
    శ్రీనివాస్ కూడా నవ్వుతూ, "ఏదోవిధంగా కాలక్షేపం చేసుకోవాలి కదండీ. అదికాక ఈవిధంగానే వాళ్ళ ఆర్ట్ కూడా బయటపడేది. ఆ శివుడి బొమ్మ చూడండి, ఎంత బావుందో!" అన్నాడు శ్రీనివాస్.
    వెండికొండమీద కూర్చున్న శివుడి శిరస్సునుండి గంగ పడుతున్నట్లు ఫౌంటెన్ ఏర్పాటు చెయ్యబడింది. నీలివర్ణపు ఆకాశంలాంటి కాగితంమీద నక్షత్రాలతో, చంద్రవంకతో ఆ గది నిండుదనం కలిగిస్తూంది.    
    "మా చెల్లెలికి పెద్ద సమస్య ఎదురైంది, శ్రీనివాస్" అన్నాడు కృష్ణమోహన్ నవ్వుతూ.
    "అదృష్టవంతురాలు. ఆవిడకు సమస్యలేమిటి?"
    "అదే! అదృష్టవంతురాలికి అదృష్టం వెదుక్కుంటూ రాబోతూంది. మా నాన్న అంటూఉండేవారు తప్పనంతకాలం చదివించాలని, తప్పగానే పెళ్ళి చెయ్యాలని. చదువుమీద శ్రద్దో, పెళ్ళిమీద భయమో ఇంతమటుకు ఆ సమస్య ఎదురవలేదు. ఈ సంవత్సరం తప్పినా, పాసయినా పెళ్ళి చేసుకోవాలి. చదువు అవగానే పెళ్ళి చెయ్యాలని మా అమ్మ కోరిక" అన్నాడు పకపక నవ్వుతూ. శ్రీనివాస్ కూడా శ్రుతి కలిపాడు.
    "ఏమిటన్నయ్యా, నువ్వు మరీను..." అంది బుంగమూతి పెట్టి.

                                


    ఆమె కోపం చూస్తే ఇంకా నవ్వు వచ్చింది. 'నిజంగానే అదృష్టవంతురాలు. కాకపోతే అనుక్షణం ఆనందంతో, సంతోషంతో నవ్వుతూ, తుళ్ళుతూ ఉండేవారి మధ్యలో ఉండి, వారిలో ఒకరవడంకంటే సంతోషకరమైనది ఇంకేముంది?' అనుకున్నాడు అభిమానంగా శ్రీనివాస్.
    ఎవరో వచ్చారన్న కబురు విని, ఎటో చూస్తూన్న అనూరాధవంక చూసి, మునిపళ్ళతో తలమీద చిన్నగా కొట్టి, "ఎందుకే అంత కోపం?" అంటూ, శ్రీనివాస్ వైపు తిరిగి, "ఇంక వెళ్ళాలండీ. ఎవరో వచ్చారు" అంటూ అతని దగ్గిర సెలవు తీసుకుని కిందికి వెళ్ళాడు కృష్ణమోహన్.
    పేముకుర్చీలో జారగిలబడి రెండు చేతులు గడ్డంకింద ఆనించి కిటికీలోంచి దృష్టి బయటకు సారించి సాలోచనగా కూర్చున్న అనూరాధవంక చూస్తూ కూర్చున్నాడు శ్రీనివాస్. విశాలమయిన నల్లని కాటుక కళ్ళు. నుదుట తీర్చిదిద్దినట్లు కుంకుమబొట్టు. తలస్నానంమ్ల్ల్లంగా నుదుట, చెంపలమీద పడుతూన్న నల్లని జుట్టు. ఆకుపచ్చని పండుగ పట్టుచీర అడుగున సింధూరంరంగు బార్డర్ మరింత అందాన్ని ఇస్తూంది. చీరతో కలిసేటట్లు ముత్యాలు, పగడాలు కలిపిన హారం. వీటన్నిటితోపాటు వయసు తెచ్చే శరీరపు మెరుపుతో ఆమె అందం వికసించిన గులాబిలా ఉంది. మధువు గ్రోలేందుకు పువ్వుమీద వాలే తుమ్మెదలా, పెళ్ళి కూతురికి పెళ్ళి బొట్టులా బుగ్గమీది పెసరగింజంత పుట్టుమచ్చ ఆమె అందానికి ఆకర్షణ కలిగిస్తూంది.
    నిశ్శబ్దం ఆవరించగా కొన్ని క్షణాలు మధురంగా, మౌనంగా గడిచిపోయాయి. సాలోచనగా కూర్చున్న అనూరాధను చూస్తూ ఎంతసేపయినా గడుపుతూ ఉండాలనిపించినా, సభ్యత అడ్డుపడటంతో మెల్లిగా చప్పుడు చేశాడు. ఇందాకటి చిరుకోపం ఇంకా పోలేదేమోనని, "నన్నొక కథ చెప్పమన్నారా?" అని అడిగాడు మృదువుగా.
    "చెప్పండి. మీ స్వంతమా?" అంది కుర్చీలో సర్దుకు కూర్చుంటూ.
    "అబ్బే. స్వంతం కాదండి. నేనేం రచయితనా, స్వంతంగా కథ చెప్పడానికి? నేను సెకండ్ ఫారమ్ చదువుతున్నప్పుడు మా మాస్టారు చెబుతూండేవారు. చెప్పమన్నారా?"
    "ఊఁ."
    "అనగా, అనగా ఓ ఊళ్ళో ఓ తాత."
    "హతోస్మి."
    "అదేం?"
    "తాత కథలా మీరు చెప్పేవి? ఇంకా నయం మిత్రలాభమో, మిత్ర భేధమో చెబుతాననలేదు."
    "మంచివారే! కథలంటే ఈ కాలం అబ్బాయిలవో, అమ్మాయిలవో అవ్వాలనేముంది? పోనీ, ఈ తాతకే ఓ అందమయిన మనుమడు ఉండకూడదూ? ముందుగానే అడ్డు తగిలారు."
    "ఇది మరీ బావుంది. మనవడే లేకపోతే అతను తాతెలా అయ్యాడు?"
    "పాయింటే. ఒప్పుకున్నాం. ఎంతైనా నేను మీలా వాదించలేను కదా. ముందు కథ పూర్తి అయ్యేదాకా అడ్డుతగలకండి. ఇంతకీ ఎంతవరకు వచ్చాం?"
    "ఎంతవరకూ రాలేదు. తాతదగ్గిరే ఉన్నాం."
    "ఓ. అవును. సరే, తాత ఉన్నాడు. ఆ తాతకు బాగా కోపం ఎక్కువ" అన్నాడు ఓరగా అనూరాధను చూస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS