Previous Page Next Page 
తామరకొలను పేజి 5

 
    రత్న మాట మారుస్తూ.
    సుశీలమ్మ గారు చిన్నగా నవ్వి:    
    "అలా అనకమ్మా. శ్రమేముంది మీకోసం పత్యేకంగా ఏంచెయ్యాలి గనుక? మీరు రావటం నాకెంతో సంతోషంగా ఉంది" అన్నారు.
    రత్న - కొంగుపట్టుకుని నిల్చున్న పాపను, "నీ పేరేమిటమ్మా" అంటూ పలకరించారు.
    పాప సిగ్గుతో జవాబు చెప్పలేదు.
    "ఊఁ చెప్పుమరి. ఇల్లెగెరిపోయేట్టు కబుర్లు చెప్తావు. అవ్వ పేరడిగితే చెప్పలేవూ?" అన్నాడు శేషగిరి నవ్వుతూ.
    "ఆశ" అంది పాప.
    మగవాళ్ళు కబుర్లు చెప్పుకొంటూ కూర్చున్నారు. రత్న సుశీలమ్మగారి వెంట వంటింట్లోకి వెళ్ళింది. అప్పటికే వంటంతా అయిపోయింది. ఇక అప్పడాలు వేయటమే తరువాయి.    
    "నే నేం చెయ్యను? నాకూ ఏదైనా నని చెప్పండి" అంది రత్న.
    "నువ్వేం చెయ్యకమ్మా. అలా కూర్చో" అంటూ పీట వాల్చారు సుశీలమ్మగారు.
    కూర్చున్న రత్నవైపు పరిశీలనగా చూశారు.
    సాదా వాయిల్ చీర కట్టుకుని, రెండు జడలు వేసుకుంది రత్న. ఆమె మాటలు ఎంతో సరళంగా ఉన్నాయి. కాని, ఒకపిల్ల-తల్లి అయ్యాక కూడా రెండు జడలు వేసుకోవటం సుశీలమ్మగారికి అంతగా నచ్చలా.
    రత్న తనే ఆకులు వేసి, నీళ్ళు చిలకరించింది. సూక్ష్మంగా ఏది ఎక్కడుంది అనే విషయాలు గమనించి ఉప్పు, ఊరగాయ వడ్డించి, గ్లాసులలో నీళ్ళు పెట్టింది.
    సుశీలమ్మగారి కాస్త బెంగ కూడా తీరిపోయింది. అంత సరళంగా సహజంగా ప్రవర్తిస్తున్న ఆ పిల్లను తన ఇంటి పిల్లలాగే ఆదరించవచ్చుననుకున్నారు.
    "నువ్వూ భోజనానికి కూర్చో" అని ఎంత చెప్పినా వినక రత్న "నేనూ మీతోబాటే" అనేసింది.
    మగవాళ్ళ భోజనాలయ్యాక సుశీలమ్మగారు, రత్న భోజనానికి కూర్చున్నారు. రత్నతో కలిసి భోంచేస్తూంటే, సుశీలమ్మగారికి శాంతే గుర్తుకొచ్చింది. తన కోడల్ని గురించి చెప్పింది రత్నకు.
    "ఆమె కూడా ఉంటే, ఎంతో బావుండేది" అంది రత్న.
    భోజనాలయ్యాక, "కాసేపు పడుకుని విశ్రాంతి తీసుకోమ్మా" అన్నారామె.
    "మేముబొంబాయినుండే నడిచి రాలేదు సుమండీ' అనేసింది రత్న.
    సాయంకాలం రమేష్ ఇంటికి రాగానే, కొత్త వాళ్ళెవరో తల్లితో మాట్లాడుతూ కూర్చుని ఉండటం చూశాడు. రత్న రెండు జడలు ముందు కనిపించాయి. వెను-తిరిగి వెళ్ళి పోబోతున్న రమేశుడిని పిలిచి, రత్నకు పరిచయం చేశారు సుశీలమ్మగారు.
    "వీడేనమ్మా, నాచిన్న కొడుకు. ఈ సంవత్సరంతో వీడి చదువు పూర్తయిపోతోంది. వీడికి పెళ్ళిచేస్తే మా బాధ్యత తీరిపోతుంది" అన్నారు.
    రత్న రమేశుడి వంక చూసింది.
    'నమస్తే" అన్నాడు రమేశ్.
    తరువాత తల్లివైపు తిరిగి, "అమ్మా! నేను వెళ్ళాలి. టైమయిపోతోంది" అని తొందర చేశాడు.
    సుశీలమ్మగారు కాఫీ-టిఫిన్ అందించారు. మళ్ళీ పది నిమిషాలలో బయటకు వెళ్ళటానికి సిద్ధంగా నిల్చున్నాడు. అప్పుడే బయటనుండి వస్తున్న కృష్ణమూర్తి, శేషగిరితో:
    "ఇడుగోనోయ్, నా తమ్ముడు రమేశ్. త్వర లోనే మీ ఫీల్డులోకే ప్రవేశించబోతున్నాడు. వీడికి వెన్నెలవంటి దేహచ్చాయగల అమ్మాయి కావాలిట. మరి కళ్ళేమో సంపంగి పువ్వులా ఉండాలిట. కదుట్రా......... అంటూ తమ్ముడిని చూసి తృప్తిగా నవ్వాడు.
    రమేశ్ ఆడపిల్లలా సిగ్గుపడ్డాడు. అతడి మొహం ఎర్రబడింది.
    "అన్నయ్య మాటలు నమ్మకండి......" అంటూ నసిగాడు.
    "ఎక్కడికోయ్ వెడుతున్నావ్?" అని అడిగాడు కృష్ణమూర్తి.
    "సింగ్ సాంగ్ ఆడటానికి వెడుతున్నానన్నయ్యా"
    "ఇవాళ్టికి అలా షికారుకు వెళ్ళొద్దాం రావోయ్" అన్నాడు కృష్ణమూర్తి.
    రమేశుడికి వాళ్ళతో వెళ్ళడానికి ఇష్టంలేదు. కాని, ఎలా చెప్పటం?
    "ఆటకు వెళ్ళాలనుంటే వెళ్ళనీ" అన్నాడు శేషగిరి.
    "అది రోజూ ఉండేదేగా. ఈరోజు మనతో వస్తాడులే" అన్నాడు కృష్ణమూర్తి.
    ఇహ తప్పించుకోలేకపోయాడు రమేశ్. విధి లేక బయల్దేరాడు.
    రత్న ఆశకు వేరే గుడ్డలు తొడిగి, అలంకారం చేసింది. తనూ, చీర మార్చుకుని బయల్దేరింది.
    కబుర్లలో రాను రాను శేషగిరి గమనం కృష్ణమూర్తి నుండి రమేశుడి వైపుకు తిరిగింది. ఎంతయినా వృత్తి-బాంధవులు. ఆ గొడవలే మాట్లాడుకో సాగారు. ఇహ కృష్ణమూర్తి విధిలేక ఆశను మాట్లాడించసాగాడు. చివరికి ఆ గుంపులో రత్న ఒంటరిగా మిగిలిపోయింది. శాంతయినా ఉంటే, బావుండేది అనుకుందేమో.
    ఇంటికి వెళ్ళిపోతే బావుండుననిపించింది. కాని, ఎవరికీ ఆ ఆలోచన ఉన్నట్టు లేదు. రత్న అర్ధ-గర్భితంగా చూసినా, శేషగిరి గమనించే స్థితిలో లేడు.
    బయలుదేరినప్పటినుండి నోరు మెదపకుండా నడుస్తున్న రత్నను చూసి, జాలేసింది రమేశుడికి. ఆమెకు విసుగ్గా ఉందేమో పలకరిద్దామనుకున్నాడు. కాని, ఏమని పలకరించటం? తల్లిని మెప్పించగలగటం పిల్లల ద్వారానేకదా!
    "ఆశను బళ్ళో వేశారా?"
    "లేదు"
    ఆ సంభాషణ అక్కడికి ఆఖరయింది. ఆమెను మాటల్లోకి దింపటం చాలా కష్టమనిపించింది రమేశుడికి. మితభాషిణి అనుకున్నాడు.
    "వదిన ఉంటే, మీ కింత విసుగనిపించేది కాదు" అన్నాడు రమేశ్.
    "విసుగేమీ లేదు.........." అంది రత్న నవ్వటానికి ప్రయత్నిస్తూ.
    "అలాకాదు. మా స్టెతాస్కోపు, పల్సుల ప్రపంచం మీకేం నచ్చుతుంది?"
    "స్టెతస్కోపు-హారంలా వేసుకునేవాళ్ళకి. హారం వేశాక, మరి అన్నీ నచ్చాల్సిందే" అంటూ నవ్వాడు కృష్ణమూర్తి.
    రత్న మాట్లాడలేదు.
    కాఫీ-హోటల్ నుండి ఇంటికి పోదామనుకున్నపుడు రత్న హాయిగా నిట్టూర్చింది. ఇంటికి రాగానే పంజరం నుండి బయటపడ్డ పిట్టలా సుశీలమ్మ గారివద్ధకు వెళ్ళింది.
    "ఎక్కడికి వెళ్ళి వచ్చారమ్మాయ్" అని అడిగారు సుశీలమ్మగారు.
    "ఇక్కడినుండి వెళ్ళి, అక్కడ కాఫీ - హోటల్ లో కూర్చున్నాం" అంది రత్న.
    "ఏమీ చూడటానికి వెళ్ళలేదేం?"
    "కబుర్లతోనే సరిపోయింది."
    "రమేశుడి స్వభావమే అంత. కబుర్లలో పడ్డాడంటే, మరింకేమీ అక్కర్లేదు వాడికి. వదిన పుట్టింటికి వెళ్ళిన దగ్గర్నుండి ఇంట్లో మాటలే తగ్గించేశాడు."
    "వాళ్ళ వదిన దగ్గర చాలా చనువనుకుంటాను మీ చిన్నబ్బాయికి."
    "ఊఁ తనే అలా అలవాటు చేసింది. ఇక భోజనానికి వస్తారా?"
    రత్న ఆవిడకు వడ్డించడంలో సాయపడింది.
    రెండు రోజులు మాత్రం ఉండి శేషగిరి దంపతులు మూడవ రోజున ప్రయాణమయ్యారు. స్నేహితుడిని మరో నాల్గు రోజులు నిలుపుకోవాలని కృష్ణమూర్తి ఎంతో ప్రయత్నించాడు.
    "వీల్లేదురా! సెలవులేదు. వెళ్ళి తీరల్సిందే అన్నాడు శేషగిరి.
    "ప్రైవేట్ - ప్రాక్టీస్ కదా నీది? నీకేమిటి?"
    "నా రోగుల గతో" అంటూ నవ్వాడు శేషగిరి
    రెండ్రోజులు గా కలకలలాడుతున్న ఇల్లు, గిరి, రత్న, ఆశా వెళ్ళిపోగానే బావురుమంది.
    "ఏమీ తోచటంలేదు. శాంతిని పిలిపిస్తే బావుంటుంది" అంటూ గొణిగారు సుశీలమ్మగారు.
    రమేశ్ వెంటనే వదినకు ఉత్తరం రాశాడు.
    "అమ్మకు ఏవీ తోచడం లేదట. మీరు వెంటనే రావాలట."
    రమేశుడి ఉత్తరానికి శాంత నాన్నగారు జవాబు రాశారు; శాంత ఆరోగ్యం ఏమంత బాగుండటంలేదని.
    కోడలి అనారోగ్యం విషయం విని, మామగారు శాంత తండ్రికి ఉత్తరం రాశారు. అది చూసుకుని ఆయన కూతుర్ని తీసుకుని వచ్చారు.
    శాంత నవ్వుతూ ఇంట్లోకి అడుగు పెట్టింది. నవ్వొక్కటే ఆమెలోఉన్న వస్తువు అనిపించింది రమేశుడికి. సామాన్యంగా దేన్నీ గమనించని కృష్ణమూర్తి కూడా భార్య ఇలా కృశించిపోవటం చూసి కంగారు-పడ్డాడు.
    ఎముకల గూడులా ఉన్న కోడల్ని చూసి సుశీలమ్మగారి కళ్ళలో నీళ్ళు నిండాయి. శాంత కళ్ళు మునుపటి కళ్ళ కాంతులను కోల్పోయి నిర్జీవంగా ఉన్నాయి.

                                         4

 

               

    "రమేశ్! మీ వదినకు ఏదైనా మందు చూడరా"
    అంటూ వాపోయాడు కృష్ణమూర్తి.
    "పుట్టింట్లో రాజోపచారం జరుగుతూందని పెళ్ళి నెలల తరబడి కూర్చుంటే మనమేం చెయ్యగలం" అన్నాడు  రమేష్ మోటుగా.
    "ఇంకా నెలకూడా పూర్తికాలేదు" అంటూ గొణిగింది శాంత.
    "దగ్గరదగ్గర నెల కావస్తోంది. ఆరోగ్యం బాగా అలేనప్పుడు వెంటనే బయల్దేరటానికేం" అంటూ వదినమీద విరుచుకుపడ్డాడు రమేశ్.
    "అయిందేదో అయింది. ఇప్పుడేం చేద్ధామో చెప్పు" అన్నారు శేషగిరిరావుగారు.
    "నాకేం తెలీదు. మీ ఇష్టం. ఏమైనా చేసుకోండి" అన్నాడు రమేశ్.
    "నీ కివ్వాల్సిన ఫీజు నీకు ముట్టచెబుతాలే" అంది శాంత.
    రమేశ్ కోపంగా వదిన మొహంలోకి చూసి ఊరుకున్నాడు.
    అతడి కోపం తగ్గేసరికి పొద్దుకూకింది.    
    మర్నాడే శాంతను తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళాడు రమేష్. డాక్టరు ఆమెను పరీక్షించి హాస్పిటల్ లోనే ఉండాలని చెప్పారు. శాంత అక్కడే ఉండిపోవటానికి ఏమాత్రం ఇష్టపడలేదు.
    కాంతి హీనమైన కళ్ళను పెద్దవిగా చేసి రమేశుడివైపు చూస్తూ.
    "ఉహుఁ" అంది.
    రమేశ్ కూడా తన కళ్ళను అంతే పెద్దవిగా చేసి వదినను బెదరించాడు.
    "ఇక్కడ ఉండటం మంచిది. మేము పరీక్ష చేసి చికిత్స చేయటానికి వీలుగా ఉంటుంది. తరువాత వస్తే, మా బాధ్యతేమీ ఉండదు" అన్నారు డాక్టరుగారు.
    "ఇక్కడే ఉంటారు" అన్నాడు  రమేశ్ శాంతకు బదులుగా.
    "ఆ మాట విని శాంతకు ఏడుపువచ్చింది.
    "ఇంట్లో ఎవర్నీ అడగక్కర్లేదా?"
    "నేను చెప్తున్నాగా చాలదూ? ఎవర్నో ఎందుకు అడగటం? రేపు నేనే వచ్చి అడ్మిట్ చేస్తాను."
    రమేశుడి నిర్ణయం చూసి శాంతకు దిక్కుతోచలేదు.
    దారిపొడుగునా మరిదితో దెబ్బలాడుతూనే వచ్చింది.
    "నీకు నేనంటే పడదు. అందుకే నన్ను ఆస్పత్రిలో పడేసి ఇంట్లో హాయిగా ఉందామనుకుంటున్నావు. నేను అక్కడే చచ్చిపోవాలనే నీ కోరిక"
    రమేశుడు అవేమీ పట్టించుకోకుండా:
    'రోగుల మాట పట్టించుకోరాదు" అన్నాడు.
    శాంతను ఆస్పత్రిలో చేర్చటం నిశ్చయమై పోయింది. శాంత-ప్రతిఘటనను లెక్కచెయ్యకుండా సుశీలమ్మగారు, రమేశ్ బలవంతాన శాంతను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. తన మాట వినకుండా హాస్పిటల్లో పడేశారన్న కోపంతో శాంత ఆరోజు అన్నంకూడా తినలా.
    రమేశుడి కాలేజి, హాస్పిటల్ ఎదురుగానే ఉండటంవల్ల తనకు తీరికున్నప్పుడల్లా వదినదగ్గరే కూర్చునేవాడు. ఆ వాతావరణం, హాస్పిటల్-జీవితం విసుగు-పుట్టించకుండా ఉండేందుకుగాను పత్రికలూ, పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడు.
    ఓ సాయంత్రం రమేష్ వచ్చేసరికి శాంతనిద్రపోయింది. పత్రిక చూస్తూ కూర్చున్నాడు.
    "రమేష్" - అనే పిలుపు విని, వదినవైపు చూశాడు రమేష్.
    "హాస్పిటల్ లో ఉండటం కూడా ఓ విధంగా చాలా బావుంది."
    "ఎందుకేమిటి?"
    "మునపటికన్నా ఎక్కువసేపు నిన్ను చూడగలుగుతున్నాను. ఇంట్లో ఉనప్పుడు నువ్వు కనబడటమే గగనమయ్యేది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS