శశిరేఖా కొన్ని నిమిషాలు మాట్లాడలేదు. చివరికి. గోపాలం "చాలా ఇంటరెస్ట్ గా ఉన్నాడు కాదూ?" అన్నాడు.
"రామానందా?.....అవును. కాలేజీలో నూ చాలా స్నేహంగా ఉండేవాడు. ఇక్కడ అతనికి ఫ్రెండ్సు లేరు. పాపం......అతనూ కాలం గడపలేకపోతున్నాడు....మంచివాడు" అంది.
"భవిష్యత్తుఉంది ఉజ్వలంగా..."
"ఆఁ..."
వాళ్ళిద్దరి మధ్యా వొచ్చిన తెరలలోనించే మాట్లాడుతున్నారు ఇద్దరు. ఇద్దరికీ సిగ్గుగానే ఉంది.....ఉండరాని ఆ తెరల నీడల్లాగ. కాని, ఇద్దరూ తొలగించుకోలేకపోతున్నారు.
"పద, కాస్సేపు తిరిగివొద్దాం..."
సముద్రపు వొడ్డుదాకా వెళ్ళి ఇసుకలో కూర్చున్నారు. చాలాసేపు నిశ్శబ్దంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు వుండిపోయారు. సూర్యాస్తమయం ఐపోయి కనుచీకటి పడిపోయింది.
నెమ్మదిగా అతనామె చేతులు తనచేతుల్లోకి తీసుకున్నాడు. తనకిప్పుడు మిగిలిన ఆశల్లో రంగం కానిది శశిరేఖ ఒక్కటే. ఆ ఆశని తన అసూయలో, అశాంతిలో పాడుచేసుకోలేడు....ఆమె చేసినదానిలో ఏమీ తప్పులేదు....అసూయతో నిండిన తన కళ్ళ దృష్టిలో తప్ప.
ఆమె అతని దగ్గరగా జరిగింది....అతని భవిష్యత్తు ఉజ్వలంగా ఉండకపోవచ్చు? అతనికి సిరిసంపదలు బాగా ఉండక పోవొచ్చును. కాని. అతను తనవాడు- లాంఛనాలు చూపక్కరలేని. తనవాడు. ఈరోజు కాకపోతే రేపు అతని జీవితం సుఖంగా కాకపోతే దుఃఖం లేకుండా గడిచిపోతుంది. కాని అతని హృదయం ఇంకా ఇంకా పెద్దదౌతూనే ఉంటుంది. తన కలలు సిరిసంపదలకోసంకాదు. సుఖం కోసం. ఆ సుఖం తాను పొందగలిగేది అతని చేతుల్లోనే ఉంది.... అతను తన చేతులు వొదలనంతకాలం.....అతనికి తాను దూరం కానంతసేపు.
ఎంతసేపు ఆ సాన్నిహిత్యంలో గడిచి పోయిందో టవర్ కాక్ తొమ్మిది కొట్టేదాకా అతనికీ ఆమెకి తెలియలేదు. లేచి బట్టలకి అంటుకున్న ఇసక దులుపుకుని ఇంటికి బయలుదేరేరు.
భోజనం చేసి అతను ఇల్లుచేరేసరికి పదిన్నర ఐపోయింది. లలిత పుస్తకం ఏదో చదువుతూంది.
"గోపాలం......సాయంత్రం వొట్టి చేతుల్తోనే వెళ్ళేవా? నేను మరిచిపోయాను" అంది పుస్తకం కిందనిపెట్టి.
"అవును వొదినా!.....నేనూ మరిచిపోయాను" అన్నాడు.
"ఏం మనిషివయ్యా!.....ఇలాటి విషయాలు మరిచిపోవక పోవడంలోనే ఉంది జీవన మాధుర్యం .... శశి ఏమంది?"
"అలాగ రావడమే సంతోషం అంది"
నవ్వి, "ఆ మాటకి చాలా అర్ధాలు ఉన్నాయిలే పడుకో" అని లోపలికి వెళ్ళిపోయింది అతనూ కొంతసేపు చదివి నిద్రవొచ్చి, కళ్ళుమూసు కున్నాడు. మగతనిద్రలో రామానంద్ టైటేపిన్నూ. మరుక్షణం వసంత మెడ తెల్లదానం జ్ఞాపకం వొచ్చి నిద్ర కరిగిపోయింది.
6
ఉదయం లేచేసరికి అతనికి ఒంట్లో కులాసాగా అనిపించలేదు. రాత్రి సరీగా నిద్రపట్టలేదు! జ్ఞాపకం లేని ఏవో వింత వింత కలలు. తెలివి వొచ్చేసరికి ఇంకా చీకటి ఉంది. పెరట్లోకి వెళ్ళేసరికి లలిత బాబుకి నీళ్ళుపోస్తూ తనని చూసి "ఇవాళ తొందరగా లేచేవు.....ఏమిటి విశేషం?" అంది.
"ఏమీలేదు వొదినా - నిద్రపట్టలేదు"
"అలాగే అనుకున్నాను -" బట్టలనిండా ఇసక చూసి అంది నవ్వుతూ లలిత.
పది జవాబులు తట్టేయి త్వర త్వరగా. కాని, గాభరాలో ఏమి అనకుండానే ఉండిపోయాడు గోపాలం. ఇసక అలాటిది- పాడుజ్ఞాపకాల్లాగ వొదలదు అనుకున్నాడు.
అతను ముఖం కడుక్కుని కాఫీ తాగుతుంటే అన్నయ్య లేచాడు. గోపాలాన్ని చూసి, "నాలుగు రోజులై నిన్ను చూడనే లేదురా రాత్రి రెండు గంటలకి వొచ్చాను ఇవేళ డే డ్యూటీ గనక కాని ఇంకో రోజు గడిచిపోను!" అన్నాడు.
"అంత ఓవరు టైము ఎందుకు చేస్తావు ఆరోగ్యం చూసుకోవొద్దా అన్నయ్యా?" అన్నాడు గోపాళం.
సరళ వెళ్ళి ఐపోనీరా- వారానికి ఒక రోజు కన్న ఓవర్ టైము చెయ్యను. "అంటూ రామం టూత్ బ్రష్ తీసుకుని పెరట్లోకి నడిచాడు.
ముల్లుతో గుచ్చినట్లయింది గోపాలానికి ఇన్నాళ్ళూ చెల్లెలి,మాటే జ్ఞాపకం రాలేదు తనకి. అన్నయ్య ఆమెని మరచిపోనూలేదు...
వంటింటిలోనే కూర్చుని బాబు అన్నంతింటూంటే వాడితో కబుర్లు చెప్తూ అన్నయ్య వచ్చే దాకా ఉన్నాడు గోపాలం. రామం కాఫీ తాగుతూ "ఏ. జీ. ఆఫీసు నుంచి ఏం జవాబు రాలేదా?" అన్నాడు.
"లేదన్నయ్యా....అదే ఉండిపోయిన ఆశ" అన్నాడు.
"అంత నిరాశ దేనికిరా?- ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరిస్తావా? నిన్న రామ్మూర్తి కనిపించాడు. ఏదో వేకెన్సీ వొస్తుందనీ. నువ్వు కావాలంటే రావొచ్చని అన్నాడు. నీకు నచ్చదని చెప్పాను.....అదంతా కిందటిసారే ఆలోచించాం కదా! - ఏదో ఒకటి రాకపోదు...."
ఆలోచనలో పడ్డాడు గోపాలం. ఆరు నెలల కిందట రామ్మూర్తి తనకి ఆఫర్ చేశాడు నూట ఏభై ఇస్తానని అప్పటి ఆశాజనక పరిస్థితులో తనకి నచ్చలేదు.
"మళ్ళీ సందర్భం వస్తే, చేరుతానని చెప్పు.
కొంచెం ఆశ్చర్యపడి "అంత నిరాశలో వున్నావా గోపాలం.....లేక ఉపాధ్యాయత్వం ఒక్కసారిగా వచ్చిపోయిందా!" అన్నాడు రామం.
"రెండూ కాదన్నయ్యా - ఊరికే కూర్చోడము మరీ విసుగ్గా వుంది. ఏదో ఒకటి చేస్తే తరవాత చూసుకోవచ్చును" అన్నాడు గోపాలం.
"అదీ మంచిదేకాని. నువ్వేం బాధపడి చేరక్కర లేదు ఆలోచించుకో."
"ఆలోచించే చెప్తున్నా నన్నయ్యా. రామ్మూర్తి తో మాట్లాడు. కావాలంటే నేనే వెడతాను"
"వొద్దులే. నేనే ఫోన్ చేస్తాను" కొంత తేలికపడ్డాడు. ఈ ఆశాకిరణంచూసి గోపాలం- కాని ఇంకా మనస్సు గందర గోళంగా ఉంది.
కూర్చుని ఆలోచించసాగేడు పేపరుచూస్తూ లోపల అన్నయ్యా , ఒదినా మాట్లాడుకుంటున్నారు.
-నిన్నటి ఆలోచనల కశ్మలంనించి ఇంకా తాను తేరుకోలేదు....ఆ ఈర్ష్యని తాను గుర్తించినా ఆమె సాన్నిహిత్యం ఆకాశంకింద తనని ఊరడించినా నేరంచేసినట్లు ఉంది తనకి. నిన్నరాత్రి శశిరేఖ బాధపడి ఉంటుంది.... తన ప్రవర్తనచూసి, తన ఓర్వలేని తనానికి అసహ్యించుకోకుండా ఉండగలిగినా, ఆమె దానిని గుర్తించే ఉంటుంది.
స్నానం చేసి బట్టలు వేసుకుని బయలుదేరేడు. శశిరేఖతో మాట్లాడి తన నిజాన్ని చెప్పేదాకా తనకి శాంతి ఉండదు.
లోపలినించి పిలిచింది లలిత. అన్నయ్య స్నానం చేస్తున్నాడు.
"టేబిల్ మీద పది రూపాయలు పెట్టేను జేబులో పెట్టుకో" అన్నది.
నాదగ్గిర ఇంకా ఉన్నాయి వొదినా!"
"దగ్గర ఉంచుకో వాదించకు."
ఆ క్షణంలో ఆమె ఒక్కసారి తన క్షేమం కోరే వ్యక్తిగా మాతృమూర్తిగా కనిపించింది. నోటు జేబులో పెట్టుకుని త్వరగా నడిచి శశిరేఖ ఇల్లు చేరుకున్నాడు.
బయట రెండు రిక్షాలు నిలబడ్డాయి.
లోపల హడావుడిగా ఉంది.
అతను వెళ్ళేసరికి శశిరేఖ లోపల ఉంది. అతను కూర్చున్న పది నిమిషాలకి ఆమెవొచ్చి, "మంచి సమయానికి వొచ్చావు గోపాలం....ఊరికి వెడుతున్నాను" అన్నది.
"ఎక్కడికి?"
"బెజవాడ - నాన్నగారికి ఒంట్లో బాగా లేదుట ప్రమాదంగా ఉందని మామయ్య వొచ్చాడు.....ఎక్స్ప్ లో వెడుతున్నాము. ఉత్తరం రాస్తాను, జవాబు రాయి"
ఆమె ఎక్కువ మాటలాడే పరిస్థితిలో లేదని గ్రహించాడు గోపాలం. ఆమె తల్లిదండ్రుల విచిత్రగాథ తనకీ తెలుసును. పరిస్థితులవల్ల దూరమైనా తండ్రిమీద ఆమెకి ఉన్న గాఢానురాగం అతనికి తెలుసును.
ఆమె దగ్గర సెలవు తీసుకుని, తిరిగి వొచ్చాడు ఇంటికి పదకొండు దాటుతూంది ఏదో విచిత్రమైన భావ పరంపర అతన్ని చుట్టుముట్టి బాధిస్తోంది శశిరేఖ భవిష్యత్తు ఏమిటని?....
శశిరేఖ తండ్రి చాలా పెద్ద భూస్వామి. పూర్వపురోజులో పెళ్ళయిన నాలుగు సంవత్సరాల దాకా పిల్లలు లేక గొడ్రాలికి వొచ్చే కష్టాలన్నీ వొచ్చేయి ఆమె తల్లికి. అటు అతి మామూలు పెట్టెకష్టాల్లో, ఇటు తన మనస్సులో రోజురోజుకీ పెరిగిపోతూన్న అగ్నిగుండంలో రెండేళ్ళు బాధపడింది.
చివరికి అతను అనిష్టంగానే ఇంకోపెళ్ళి చేసుకున్నాడు. ఆ ముందరిరోజే ఆమె పేర విశాఖపట్నంలో ఈ ఇల్లూ కొన్ని పేర్లూ ఆమె జీవితానికి సరిపడే రొక్కమూ రాసిఇచ్చి ఆమెని పుట్టింటికి పంపివేశాడు. అప్పటికి ఆమె తల్లి మాత్రం బతికి ఉండేది.
నెలరోజుల్లో తెలిసింది తను తల్లి కాబోతూన్న దని. కాని అతనికి ఆవిషయం ఆమె తెలియ జేయలేదు. అతనితో తనసంబంధం ఈ జన్మకి పూర్తి ఐనట్టే భావించుకుని. ఆ తర్వాత శశిరేఖ పుట్టింది. తన జీవితమంతా ఆ పిల్లలో దాచుకుని ముందు బి.ఏ దాకా కాకినాడలో చదివించి తరువాత ఇక్కడ ఇల్లు ఖాళీ చేయించుకుని యూనివర్శిటీలో చదివేందుకు ఇక్కడికే వొచ్చే శారు తల్లీ శశిరేఖ.
శశిరేఖని చూసేందుకు ఆమె తండ్రి రావడం ఆమె ఐదో ఏట జరిగింది, అప్పటికి అతని ద్వితీయ కళత్రం అతన్ని నానాబాధలూ పెట్టి. పిల్లలు లేకుండానే చనిపోవడం, అతను ఆమెని రమ్మనడం తిరిగి అతనితో కాపురం చెయ్యడానికి ఆమె అంగీకరించకపోవడం జరిగింది.
"నాకు బాగా జ్ఞాపకం ఆయన నన్ను చేతుల్లోకి తీసుకుని కన్నీరు కార్చడం మొదలు పెట్టేరు. నాకు బోధపడలేదు.... ఆయన నాన్న గారని అమ్మచెప్పింది. అంతకన్న నాకు తెలీదు.... ఆయన దుఃఖంచూసి నాకూ దుఃఖం వొచ్చేసింది. మరో పది నిమిషాలలాగే గడిచి పోయాయి. ఆ తరవాత ఆయన. "వెడతాను లక్ష్మీ! అని బొంగురుగా కేకవేసి ఒక్కసారి వృద్ధాప్యం వొచ్చినట్లు నెమ్మదిగా నడుస్తూ బయటకి వెళ్ళి కారులో కూర్చుని వెళ్ళిపోయారు.
"అమ్మ నన్ను కౌగలించుకుని హద్దు లేకుండా ఏడవటం మొదలుపెట్టింది. నాకు దుఃఖం ఆగలేదు. ఎందుకో తెలీకుండా' అని చెప్పింది శశిరేఖ.
ఎంత బాధపడినా అతన్నించి దూరంగానే నిలబడింది ఆమె. నెలకొకసారి అతనువొచ్చి శశిరేఖని చూసేవాడు. సంవత్సరం దాకా లక్ష్మి అతనికి కనడపలేదు. ఆ తరవాత క్రమ క్రమంగా, నిర్జీవంగానే మాట్లాడుకునే వారు.
ఆ అజ్ఞానంలో తండ్రి గాఢప్రేమని మనస్సు తోనే అర్ధం చేసుకుంది శశిరేఖ "ఎప్పుడూ అమ్మా నాన్నా నాదగ్గరే ఉండాలని కలలు..కాని, అచంచలంగా వ్రతం పట్టిన అమ్మతో ఏమీ అనలేకపోయేదాన్ని....ఆమె నా కోసం అంగీకరించినా, అంత త్యాగం ఆమెనించి కోరడానికి హక్కు లేదనే జ్ఞానం ఉంది నాకు..." అని చెప్పింది శశిరేఖ.
ఆమె ఇక్కడి కొచ్చిన రెండేళ్ళలోనూ తండ్రిని చాలాసార్లు చూడలేకపోయింది. మూడేసి, నాలుగేసి నెలలకోసారి వచ్చేవాడు. ఉదయం చేరుకుని శశిరేఖని చూసి మళ్ళీ సాయంత్రం బండిలో వెళ్ళిపోయేవాడు.
"అదొక విచిత్రమైన సంబంధం.....అమ్మకి నేను ప్రాణం. చివరికి నాన్నగారికీ నేను ప్రాణం ఐపోయేను. ఆయన స్మృతి చిహ్నంగా జీవితంలో ఉండిపోయినదీ నే నొక్కటే. ఆత్మ గౌరవం ఎక్కువ అమ్మకి.... ఓపినన్నాళ్ళూ అన్ని బాధలు భరించింది. ఆయన్నీ భరించింది. కాని చివరికి ఆమెను పంపివేశాక అతనంటే ఏదో నిర్లిప్తత వొచ్చేసింది. ఆయన్ని తన సుఖంతోనే పరిత్యాగం చేసింది. కాని ఏ రోజూ ఆయన్ని ఒక్కమాట అనలేదు. అలాగే క్షమించింది.....నాకు ఎప్పుడూ అదే బాధ - అదే కల. దైవం సమకూర్చిన ఈ కథలో విచిత్రమైన పాత్ర నాది..." అని నిట్టూర్చేది శశిరేఖ.
ఆలోచించినకొద్దీ ఆమెపరిస్థితికి పరిష్కారం తన ఊహలకీ దూరం ఐపోతూంది. ఆమె మనోవేదనకి తనకి బాధకలుగుతుంది. ఉపశమనం చెయ్యడానికి తానులేడుదగ్గర.....అతను చనిపోకుండా ఉంటే బాగుండును-" అనుకున్నాడు గోపాలం.
"ఏమిటి గోపాలం, ఆలోచిస్తున్నావు?"
"శశిరేఖ ఊరికి వెడుతోంది. వాళ్ళ నాన్నగారికి జబ్బుగా ఉందిట..."
"ఇప్పుడే వెడుతూందా?"
"ఆఁ...ఎక్స్ ప్రెస్ లో..."
"నేషన్ కి వెళ్ళలేకపోయావూ?"
"తట్టలేదు వొదినా..."
రామానంద్ ఐతే ముందర ఆ మాట ఆలోచించును. అనుకున్నాడు గోపాలం.
"నిజం చెప్పు ట్యుటోరియల్ కాలేజీలో ఎందుకు చేరతానన్నావు?"
హఠాత్తుగా అడిగింది వొదిన.
"ఊరికేనే కూర్చోలేక"
"అంతేనా?......మీ అన్నయ్య అనుకుంటారు-వొదిన బాధపడలేక అని, ఆదా?"
"లేదు....నీకు తెలుసును"
"థాంక్స్ గోపాలం. నువ్వు పరాయివాడిని కాదు. కనీసం నా దృష్టిలో."
ఆమె కొంత తృప్తిగా లోపలికి వెళ్ళి పోయింది మళ్ళీ ఆలోచనల్లో శశిరేఖ.....ఈపాటికి ఆమె రైల్లో వెడుతూ ఉంటుంది.
మధ్యాహ్నం భోజనానికి రామంవొచ్చి, "వచ్చేవారంనించీ నువ్వు రామ్మూర్తికాలేజీలో జాయిన్ ఆవు....ఉదయం అతనే ఆఫీసుకి వొచ్చి వొప్పేడు" అన్నాడు.
పెద్దబరువు దించినట్లయింది గోపాలానికి, తాను పూర్వం కలలుగన్న గెజిటెడ్ ఉద్యోగం కాకపోవచ్చు. ఇప్పుడు కలలుగంటోన్న గవర్నమెంట్ ఉద్యోగం కాకపోవచ్చు.
కాని, తాను నిరుద్యోగికాదు!
"వెరీ గుడ్!" అన్నాడు.
లలిత నవ్వి, మళ్ళీ పుస్తకాలు తియ్యి! ఈ రోజులో పిల్లలకి లెక్చరర్లంటే భయంలేదు అంది.
భోజనంచేసి పుస్తకం చదువుతూ నిద్ర పోయాడు గోపాలం. లేచేసరికి నాలుగుగంటలైపోయింది.
* * *
