"ఈ చుట్టుపక్కల ఏదైనా చూడదగిన వూరుందా?" నేను.
"దూరంగానా, దగ్గిర్లోనా?"
"ఇరవై ముఫ్ఫై మైళ్ళలో..."
"బ్రహ్మంబరియా వుంది. పాతిక మైళ్ళు. చిన వూరు. కాని మీరక్కడ ఏం చూస్తారు?"
"ఊరు చూస్తాం..." ప్రభూ
"ఎక్కడా కూచోం" నేనన్నా. దాసు నవ్వి "అచ్చా సాయబ్" అన్నాడు.
"ఆ వూళ్ళో దంతవైద్యుడున్నాడా? నా పన్ను తీయించుకోవాలి..."
"ఉంటాడు సాయబ్. గుర్తులేదు."
మర్నాడాదివారం. మేం ముగ్గురం. దాసూ బైల్దేరేం. ఉదయం పదిగంటలకి బ్రహ్నం బరియా చేరాం. బాగా యెండగా వుంది.
బ్రహ్మంబరియా చిన్నపట్నం, సుమారు పాతిక వేలు జనాభా వుంటుంది. మంచి హోటళ్ళు లేవు, ఉన్న వేవో పరిశుభ్రతకి చారెడు దూరంలో వున్నాయి. ఇడ్లీ, దోశ ఆ ప్రపంచంలోవి కావు. కనీసం కారపూస, కారబ్బూంది అయినా లేవు. ఏవేవో తీపి పదార్ధాలున్నాయి. అవి మా ముగ్గురికీ దిగవు. దాసు ఏమీ తిననన్నాడు. మేం టీ తాగేం.
ఆ వూళ్ళో సైను బోర్డులన్నీ ఒక్క బెంగాలీ భాషలోనే వున్నాయి. ఇంగ్లీషు మచ్చుకైనా లేదు పళ్ళ డాక్టర్ని పట్టడం కష్టమైంది. భాష ఏదైనా పళ్ళడాక్టరు ఆస్పత్రిముందు సాధారణంగా పళ్ళనోరు, బోసినోరు బొమ్మలుంటాయి.
ఇక్కడవీ లేవు, పళ్ళ డాక్టరు కోసం తిరిగే సరికి మా కాళ్ళరిగిపోయాయి. తిరిగి తిరిగి పన్నెండుగంటల కెలాగో ఓ పళ్ళ డాక్టర్ని పట్టెం. పది రూపాయలిచ్చి మౌలా పన్నూడ గొట్టించుకున్నాడు. మళ్ళీ హోటల్లో యేదో తిని, టీ తాగి ఊరు చూడ్డానికి బైల్దేరేం.
బ్రహ్మలబరియా జనాభాలో మాకు ముస్లింలే ఎక్కువ కనిపించారు.
మాకు అక్కడ అన్నిటికన్న ఒక్కటి కొట్టొచ్చినట్టు కనిపించింది. ముష్టి వాళ్ళు, జబ్బు వాళ్ళు, అస్తిపంజరంలా వున్నవాళ్ళు ప్రతి చోటా వున్నారు. ఇలాంటి వాళ్ళు అత్యధిక సంఖ్యలో వున్నా వాళ్ళనెవరూ గమనించినట్టు లేదు. గమనించలేరు కూడా.
నల్లబజారు రాజ్యం యేలుతున్న ఆ ప్రదేశంలొ ప్రతి మనిషికీ బతుకు ఒక చావులా వుంది. వాళ్ళచుట్టూ ఊగిసలాడుతూన్న మిలిటరీ వాతావరణం, శవదహనం జరుగుతూంటే పొగలు రేగే స్మశాన వాతావరణంలా వుంది.
అక్కడ హిందూ, మహమ్మదీయ భేదం కనిపించలేదు. వర్తకులెందరో ముస్లిములు, అంతా ఒకేభాష మాట్లాడతారు. అంతా ఒకేలాంటి తిండి తింటారు. అందరిదీ ఒకే ఆశ - బతకాలని. అందరిదీ ఒకే సమస్య- ఎలా బతకాలని.
మనదేశాన్ని వ్యాపారస్తులు, అధికార మదంకలవాళ్ళూ, స్వాతంత్ర్యానికి ముందే, అంటే ఈ యుద్ధ సమయంలోనే హస్తగతం చేసుకున్నారు. నిత్యవిలాసం, నిరు పేదరికం, ఈ రెంటి సహజీవనం ఆనాడే ఆరంభమైంది.
స్త్రీ శరీరం అమ్ముకుని పొట్టపోసుకునే బజారు బ్రహ్మంబరియాతో చాలా పెద్దదుంది. అక్కడ ఓ మాదిరి వెడల్పయిన వీధులు మొదలు కోని, పద్మవ్యూహంలాంటి సంధులు గొందెల వరకూ వున్నాయి. ఆ వ్యాపారస్తులకి పాట రాదు. ఆటరాదు. వాళ్ళ వ్యాపారానికి వాళ్ళ శరీరాలే మదువు. ఈ వ్యాపారం చేస్తూ, శరీరం, ప్రాణం వేరైపోకుండా చూసుకుంటారు.
అక్కడున్న వాళ్ళలో నూటికి తొంభై పాలు ఆకలికి తట్టుకోలేక వ్యాపారానికి దిగినవాళ్ళే-వాళ్ళు పూర్వాశ్రమంలొ కలకల్లాడే కుటుంబాల్లో. ముద్దుగా, ముచ్చటగా, మురిపెంగా, గౌరవంగా, గర్వంగా వున్న భార్యలు, తల్లులు, కూతురు, అక్కలు, చెల్లెళ్ళు, రోజులతరబడి నిట్రుపాపాలు చేసి, శరీరం తూలిపోయి, కళ్ళు పచ్చబడిపోయి, స్వంతబాధకన్న తల్లి దండ్రుల, తోబుట్టువుల, భర్తల నోరులేని పసిపిల్లల ఆకలి చావులు చూళ్ళేక, కుటుంబజీవనం నరకంలా తోచి, భవిష్యత్ జీవితపు చీకటించి అంధకారంలో ఒక సన్నటి వెలుగురేక కూడా కనిపించక, గుండెలు బద్దలై అక్కడినించి పారిపోయి, యిక్కడికి వచ్చేరు. వీళ్ళకి సిగ్గు సిరం లేదు. తాగడానికి మద్యం. తినడానికి మాంసంతో కూడిన ఆహారం కావాలి. తాగుతూ తింటూంటే, అచ్చంగా చచ్చిపోయిన జంతువుల్లా వుంటారు. కుళ్ళి కంపుకొడుతూన్న శవం తనమీద ఒకేసారి పది పన్నెండు రాంబందులుపడి నాలుగు పక్కల్నించీ పీక్కుతింటూటే యేం ఖాతరు చేస్తుంది. వీళూ అచ్చంగా అంతే
అక్కడ ఒక యింట్లో నాకు "పల్మా" కనపడింది. విశాలమైన స్థలం. ఎటు చూసినా ఆకు పచ్చని ప్రకృతి, చెరువు, అంతులేని ఆకాశం ఆ పులకించిన ప్రకృతిలో మెరుపు తీగెలా వుండే సల్మాకీ, ఇక్కడ - ఈ గొందెలో, కాలవల దుర్గంధంలో. మరుగుదొడ్డిలాంటి బల్లచెక్కల చీకటి యిరుకుగదిలో వున్న సల్మాకీ యెంత తేడా!
పశులకాపరి కుర్రాన్ని ఆకలిగొన్న పులి తినేసింది. సల్మాని ఆకలిపులి తినేసింది. అంతే తేడా.
సల్మాకి ఈ పులి గుహలోకి దారిచూపింది దాసు.
దాసు మాతో తిరిగిరాలేదు. అక్కణ్ణించి ఢాకా వేపున్న బైరిబ్ బజారు వెళ్ళేడు. తన కక్కడ రాచకార్యాలున్నాయన్నాడు. మేం తిరిగి క్యాంపుకొచ్చే సరికి చీకటి పడుతూంది.
నేను చెరువుకి బయల్దేరాను. తోవలో అబ్దుల్ కనిపించాడు. అతణ్ణి చూస్తే నాకు జాలివేసింది. అతనికి సల్మా నిజంగా ఏమైందో తెలియదు. పులివాత పడిందనే అనుకుంటున్నాడు. నేను నిజం చెప్పలేదు. చెప్పి ప్రయోజనం లేదు. సల్మా అదృశ్యమైన తరువాత పోలీసు దర్యాప్తు జరిగింది. పోలీసులు కూడా సల్మాని పులెత్తుకు పోయిందనే రిపోర్టు పంపారు.
మా వర్కు షాపు అప్పటికింకా ఆర్. హెచ్. క్యూతో వేరుపడలేదు. పగలంతా ఆఫీసు పని. సాయంత్రం షికార్లు, రాత్రి నిద్ర, మా నెత్తి మీద ఆకాశంలో ఎప్పుడూ విమానాలు హోరు పెడుతూ తిరుగుతుండేవి. రాత్రి, పగలు విరామం లేదు. శత్రు విమానాలు (అంటే జపానీయులని) ప్రతి రోజూ మా మీంచి ఎగురుతుండేవి. ఎప్పుడు గుంపులుగా వచ్చేవి కావు. రెండు మూడు చొప్పున వచ్చేవి. అదికూడా వేరువేరు దిక్కు ల్నించి. సాధారణంగా మిట్టమధ్యాహ్నం వచ్చేవి. కంటికి కనిపించీ కనిపించనంత ఎత్తున ఎగిరేవి, మండు టెండలో వెండితునకల్లా మెరుస్తూ పల్టీలు కొడుతూ మహావేగంతో వచ్చేవి-వెంటనే సైరన్ల అరుపులు, విమాన విధ్వంసక శతఘ్నుల మోతలు, వాటి పేలుడువల్ల ఆకాశం మీద పడిన తెల్లటి మచ్చలగుపించేవి.
సాధారణంగా శత్రు విమానాలు వచ్చినపని ముగించుకుని, వెంటనే వచ్చినప్పటి కంటే రెట్టింపు వేగంతో పారిపోయేవి. ఒక్కొక్క ప్పుడు ఓకే విమానాన్ని ఇరవై శతఘ్నులు అన్ని దిక్కుల్నించీ అభిమన్యున్ని కౌరవ సేనలా ముట్టడించేవి. ఆ అభిమన్యుడు దొరికిపోయేడు. కాని వీడు దొరికేవాడు కాదు. గెద్ద వాటుగా విమానాన్ని చివాల్న కిందికిదింపి. శతఘ్ని స్థావరం మీద. యింకా శతఘ్ని నెత్తి మీద బాంబుపేల్చి, తిరిగి గెద్దలా పర్రున విమానాన్ని అంతరిక్షంలోకి తీసుకుపోవడంలో జపాను వాళ్ళు సాటిలేని వాళ్ళు.
"ఆల్ కి యర్" అవగానే మాకు. "ఎబుల్" "బేకర్" "చార్లీ" ("A" "B" "c") బ్యాట రీలకి, శతఘ్ని స్థావరాలకీ మధ్య సంభాషణలతో టెలిఫోను తీగలు తెగిపోయినంత పని అయేది. తరవాత కొంతసేపటికంతా పదు. తిరిగి కందిరీగ అరుపులా నిదానంగా గస్తీ విమానాలు మోత- అది అనంతం.
మాకు తిండికీ బట్టకీ కొదవలేదు. విలాస వస్తువులకీ, సిగరెట్లకీ, తాగుడు పదార్దాలకీ కరువులేదు సరేకదా అవెప్పుడూ కోకొల్లలు-ధర్మరాజు రాజసూయయాగం తలపెడితే, అతనినలుగురు తమ్ముళ్ళూ ఆశేతు శీతాచల పర్యంతం వున్న దేశాల రాజుల్నందర్నీ చావగొట్టి ధనకనక వస్తు వాహనాల్ని మోసుకొచ్చి అన్నయ్యముందు పడేశారు. ఈ మానవ మారణ యాగంలో కూడా అదె తంతు జరిగింది. రాయల్ ఇండియన్ ఆర్మీ సప్లై కోర్ వాళ్ళు తమ కబంధహస్తాలతో దేశాన్ని గాలించి అన్నిరకాల సరుకులూ, రాసులూ, మేటులూ తరుగులేకుండా తెచ్చిపడేస్తూన్నారు. ఉప్పుతో తొమ్మిది దినుసులు కాకుండా తొంభై తొమ్మిది దినుసులు, దిమ్మా తిరగా వుండేవి. వీటిలో మూడొంతులు అంచీ ఆంచీనా తిరిగి చీకటి బజార్లోకి వెళ్ళేది.

పూర్వం చీకటి తప్పంటే ఒకటే ఇప్పుడు అనేకం, దీనివల్ల ఓడలు బళ్లయేయి, బళ్ళో డలయేయి. ఇది అప్పుడు యుద్ధ రోగం వల్ల సమాజానిక్కలిగిన్ తాత్కాలిక లక్షణం అనుకున్నాం. కానీ యిది క్రమేణా మనిషితత్వంలో యిమిడింది.
* * *
మా యూనిట్లో నూటికి తొంబైమంది మద్రాసీలే, అంటే తెలుగువాళ్ళు, తమిళులు, మళయాళీలు, కన్నడిగులు అందరూ కలిసి మద్రాసీలుగా చలామణీ అయేవాళ్ళు.
ఓసారి రేషను స్టాండు వాళ్ళు మూడు నాలుగు వారాల పాటు మాకు మినపప్పూ, శనగపప్పూ యిచ్చేరు. కందిపప్పివ్వలేదు. దాంతో సీపాయిల్లో గునువులు, గుసగుసలు బైల్దేరాయి. అని అలా అలా అడ్జటంటు చెవిని పడ్డాయి. అతను మొదట దీన్ని అంతగా పట్టించుకోలేదు. ఓమాటు ఫిర్యాదు తెచ్చినవాళ్ళమీద కోప్పడి, 'మనం యుద్ధంలొ వున్నాం. కందిపప్పు కావలసినవాళ్ళు జపాను వెళ్ళండి" అన్నాడు. కాని సిపాయి లేమీ తక్కువ వాళ్ళు కారు. మరీ గోల చేసేరు. అడ్జంటీ విషయం మా ఓ సీ తో చర్చించి నన్ను పిలిచేడు.
'కందిపప్పు లేదని సిపాయిలు గోలపెడుతున్నారు" అడ్జటంటు.
"నిజమే. కందిపప్పు రేషను స్టాండు వాళ్ళివ్వడంలేదు, దక్షిణాదిని కందిపప్పే ముఖ్యంగా తింటారు..." నేను.
"హుఁ! నువ్వేమైనా చెయ్యగలవా, మా ఓ సీ అన్నాడు.
"రేషను స్టాండుకి వెళ్ళిచూడాలి..."
"రేపు నువ్వెందుకెళ్ళకూడదు?"
"అలాగే..."
మర్నాడుదయం ఆరుగంటలకి రేషను ట్రక్కు నా బాషాముందాగింది. నేను"టీ, చపాతీ" ముగించి బైల్దేరా.
ట్రక్కు అడివి కచ్చారోడ్లమీద మెలికలు తిరుగుతూ వెళ్ళిపోతూంది. అక్కడ పచ్చని అడివి అందం తాండవిస్తూంది, వర్షాలెక్కువగా కురిసి గుంటలు, చెరువులు పూర్తిగా నిండేయి. నేల సారవంతమైంది. కాని సాగుచేసి పండించడానికి సౌకర్యాలు లేవు. చదువుసంధ్యల్లేక, జీవనోపాధిలేక బక్కచిక్కిన ఆ మనుషులు నిస్సహాయంగా వున్నారు.
అది త్రిపురా సంస్థానం. పూర్వం త్రిపురాసురు డిక్కడే వుండేవాడేమో. ఇప్పుడిక్కడున్న పచ్చదనం, పచ్చదనం చూస్తే పురాణ కాలంలో శంకరుడి మూడో కన్నులోంచి వచ్చిన మంటలకి కాలి బూడిదైనదీ స్థలమేనా అనిపించింది.
నా ట్రక్కు యేడెనిమిది మైళ్ళు ప్రయాణం చేసి, రేషను స్టాండు చేరింది. నేనంత కుముందు అక్కడికి వెళ్ళలేదు.
అక్కడ అప్పుడే సుమారు మూడువందల ట్రక్కులున్నాయి. అవిగాక రేషను స్టాండుకి చెందిన లారీలున్నాయి. అక్కడ చూస్తే ధర్మ రాజు రాజసూయం చేసినప్పుడు కూడా అంత రేషను సమకూర్చుకుని వుండడనిపించింది.
