ఆ సాయంత్రం నేను, నా స్నేహితులిద్దరూ ఎనిమిదోక్యాంపు వేపు షికారువెళ్ళేం. అదొక మైలుదూరం వుంటుంది. ఆ క్యాంపు అమెరికన్లది. వాళ్ళు స్థలాన్ని వారం క్రితమే విడిచి వెళ్ళేరు. అక్కడ సుమారు యాభై బాషా లున్నాయి. అన్నీ ఖాళీగా "దిం" మంటూన్నాయి. క్యాంపుకి వొకపక్క విశాలమైన సమతల మైదానం వుంది. మైదానంఅవతల వొకమైలు దూరంలో యేదోపల్లె వున్నట్టు మినుకుమినుకు మనే దీపాలవల్ల తెలుస్తూంది. క్యాంపుకి రెండో వెంపు, వెనక తట్టు యెత్తుపల్లాలు, చెట్లూ చామలూ చిట్టడివి, క్యాంపులోపలా బైటా తిరుగుతూ కొంతసేపు కబుర్లాడుకున్నాం,
మేలాసింగు నాలాగే యువకుడు, అతనికి పెళ్ళయింది, అతని కెప్పుడూ భార్యమీదే ధ్యాస. కర్తార్ కౌర్ ని తలవని నిముషం లేదు. తల్లి దండ్రులంటే మహాకోపం, వాళ్ళు చచ్చిననాడు "ఖీర్" వండించి తింటాననేవాడు. తను దగ్గిరున్నప్పుడే కర్తార్ ని తెగ సాధిస్తారు. తన పరోక్షంలో వాళ్ళామెని యేం హింస పెడుతున్నారో అని బెంగ.
ప్రభూ నడివయసువాడు, అతని పూర్తి పేరు ప్రభాకరన్ నాయర్, అతని పళ్ళు మొలక వజ్రాల్లా మెరుస్తూంటాయి, భార్యపంపిన నల్ల పళ్ళపొడితోనే యెప్పుడూ పళ్ళుతోముకోనేవాడు-పళ్ళమీద మచ్చలు పడిపోతాయని కాఫీ, టీ తాగే వాడుకాడు, అతని భార్య బి, ఏ, బి, టి. వై కోమ్ లో టీచరు. ముగ్గురు పిల్లలు, ప్రభూ భార్య వుత్తరాలు జోరుగా రాసుకునేవారు. నేను ఆవిడ రాసిన వుత్తరాలు చూసి ముచ్చటపడేవాణ్ణి. నాకు మళయాళం చదవడంరాదు. కాని ఆ చేవ్రాలు ముత్యాఫలాల్లా వుండేది. ఆ చక్కని చేవ్రాలు బట్టి ఆమె కూడా అందంగా వుండాలని వూహించే వాణ్ణి.
మా కబుర్లు సాధారణంగా స్వగ్రామాల గురించి మనుషులు, భాషలుం అలవాట్లు ఆచారాలగురించి సాగేసి.
ఇంతలో పంజ చీకటి పడింది. మావేపు నల్లగా, పొట్టిగా ఓ ఆకారం వస్తుంది. ఇంత చీకటి పడ్డాక యిక్కడ యింత చిన్న కుర్రాడెవరు చెప్మా అని మేం ఆశ్చర్యపోతున్నాం. మా ముగ్గుర్లో సిగరెట్టు కాల్చేది నేనొక్కన్నే. ఆ కుర్రాడు నా ముందు టక్కని ఆగి. సలాంచేసేడు వాడికి పది పదకొండేళ్ళుంటాయి.
"సలాం సాయబ్..."
"ఎవడ్రా నువ్వు యింత చీకట్లో.....?" నేను తెలుగులోనే అన్నా.
చీకట్లో వాడికళ్ళు, ఛిరునవ్వు మెరిసేయి.
"సిర్ గిరేట్ దాప్ సాయబ్..." సిగరెట్టడి గేడు. ప్రభుకి వాదిమాటలు వినగానే చెప్పలేని సంతోషం కలిగింది. "రేయ్! ఉన్ పేరెన్న? వయసెత్తర?" తమిళంలో ప్రశ్నించేడు. వాడు మళ్ళీ దీనంగా "సిర్ గి రేట్ సాయబ్" అన్నాడు. మేలాసింగు ముందుకొచ్చి, వాడి చెయ్యి పట్టుకున్నాడు. "దేఖో! తూ యేక్ గానా గావ్. తబ్ తుమ్హే యేక్ బిడియా సిగరేట్ మిలేగా. సమ్ ఝే" మౌలా.

వాడు మౌలాసింగ్ వేపు జాలిగా చూసేడు.
"పాట్ట, పాట్ట, మస్సలయిల్లా - గానా - గాన్ - ఆ....ఆ" ప్రభూ.
"గాన్ జానీనా సాయబ్ (పాటరాదు" నావేపు చూసి అన్నాడు 'గానా నహీ - సిగరెట్ నహీ - గానా హై, సిగరెట్ హై" మౌలా, "అచ్చా సాయబ్ - రావ్"
నేనొక సిగరెట్టిచ్చి అగ్గిపుల్ల గీసి వెలిగించేను. వాడు రెండు దమ్ముల్లాగేడు. హుషారెక్కి పాట అందుకున్నాడు. "ఓ బిదేశ బంథోరే.... అమీ తొరే చాయ్ నా..... జొఖోన్ తొరెమొనేపొడీ... తొఖోన్ తొరెషాయేనా..."
నిశ్శబ్దమైన సంజలో ప్రతిధ్వనిస్తూ, అతి సున్నితమైన విపలంబ శృంగారభావంగల ఆ పాట ఆకాశాన్ని దూసుకుపోయింది.
వాడు పాటముగించి, సలామ్ సాయబ్ అని- "గోరూగోరూ" (పశువులు పశువులు) అంటూ మైదానం వెంపు పరిగెత్తేడు. వాడు కాస్తూన్న పశువులు మైదానం మీంచి దూరపు దీపాల ఆన వాలున పల్లెవెంపు వెళ్ళిపోతున్నాయి. వాడా చీకట్లో "గోరూ హెయ్- గోరూ హెయ్' అని పశువుల్ని అదలిస్తూ, సిగరెట్టు వూపుకుంటూ పరిగెత్తుతున్నాడు.
మేం యింకా నవ్వుకుంటూనే వున్నాం. వాడు వందగజాలైనా వెళ్ళి వుండడు. ఒక భయం కరమైన అరుపు అరిచేడు. మేం తుళ్ళిపడి అటు చూసేం. వాన్నేదో అడివి జంతువు పట్టుకొని- పక్కనున్న గోర్జిలోకి పలపల యీడ్చుకు పోతూంది. చిరతపులై వుంటుంది. మేం నేరస్తుల్లా వొకరి మొహాలొకరు చూసుకున్నాం.
వాడు రాత్రి యింటికి రాక వాడితల్లి యెంత బెంగటెల్లిపోతుందో. ఇందులో మా దోషం ఏమైనా వుందా? మేం వాడిచేత సిగరెట్టు ఆశ చూసి బలవంతాన పాడించేం. వాడి గొంతు వినే చిరత గొడ్డు వచ్చిందా? ఏమో!
* * *
5
ఆ పశువుల కాపరి కుర్రాడి విషాద ఉదంతం నన్ను చాలా రోజులు వెంటాడింది.
మూడు వారాలు కాదు. మూన్నెల్లు గడిచి పోయాయి. నేను కొమిల్లా వెళ్ళడం పడలేదు. పద్మని ఆమె శలవల్లో చూళ్ళేదు- ఆమె శలవై పోగానే తిరిగి కలకత్తా వెళ్ళిపోయుంటుంది. కమల్ ని పెళ్ళి చేసుకుందికామెకి ధైర్యం చాలడంలేదు. నిజానికామెకి అతనిమీద గాఢవైన ప్రేముంది. కాని అతన్ని వివాహం చేసుకుని తను కలకత్తాలో స్థిరపడిపోతే యింకా యెదిగి, ఎదుగుతూన్న చెల్లెళ్ళు, బొత్తిగా చిన్నవాడు తమ్ముడు. గొర్రెతో కలాంటి జీతం సంపాదిస్తూన్న తండ్రి యేం కావాలి? ఇదే ఆమె ఆలోచన, ఈ ఆలోచనే నన్నూ బాధిస్తూంది. పద్మ విషమ పరిస్థితితో కుస్తీ పడుతూంది.
ఒక సాయంత్రం అగర్తలా వూళ్ళో హఠాత్తుగా దాసు తారసపడ్డాడు. నన్ను చూసి సలాం సాయబ్ అన్నాడు. నేనతన్ని వెంటనే పోల్చుకోలేక పోయేను. అతనే జ్ఞాపకం చేసేడు. అప్పుడు నాతో మౌలాసింగు కూడా వున్నాడు. నేను అగర్తలా వచ్చినప్పుడు దాసు నాకు కొంత సాయం చేసేడని మౌలాతో చెప్పా.

"సాబ్! మీ యూనిట్లో క్యాంటీనుందా?" దాసు.
"లేదు..." నేను.
"మీరు అనుమతిస్తే నేను క్యాంటీను పెడతా..."
నేను మేలాసింగువేపు చూశాను.
మా యూనిట్లో రెండు వందలమంది పైగా వున్నారు. పెద్ద క్యాంటీనే కావాలి. పెడతావా?" మౌలా.
"అలాగే సాబ్...."
"రేపుదయం పదిగంటలకి అక్కడికి రా..."
మర్నాడుదయం దాసు వచ్చేడు. అతన్ని మా అడ్జటంటు కెప్టెన్ ఎలమ్ స్లీ దగ్గిరికి తీసుకెళ్ళేం. అతను అనుమతించేడు. ఆ సాయంత్రం యెనిమిది గంటలకి దాసు మా యూనిట్లో క్యాంటీను పెట్టేడు. సబ్బులు. వాసన నూనెలూ' బేడ్లు, బూటు పాలిషు మొదలైన నిత్యవాడకం వస్తువులే కాక, టీ, ఆమ్లటు, బన్నులు, బిస్కత్తులు మొదలైన తినుబండారాలు కూడా సప్లై చేస్తున్నాడు.
దాసు తమాషా అయిన మనిషి. నిరాడంబరంగా వుంటాడు. తక్కువ మాట్లాడతాడు, కాని చాలా ఘటికుడు. చాంద్ పూరునించి ఢాకా వరకూ అతనికి తెలియని వూరులేదు. స్థలం లేదు. అతని పరిచయాలు లెక్కలేనవి. అతని వ్యాపారంలో వైవిధ్యం యింకా అంతా కాదు.
అతను వచ్చిన్నాడే షిరాజ్ పూర్లో ఒక చిన్న యిల్లు కట్టించుకున్నాడు. అన్ని యిళ్ళల్లాగే అదికూడా మట్టి వెదురుతో కట్టింది.
అతని రాకకి షిరాజ్ పూరులో యే అలజడీ జరగలేదు. వచ్చిన నాటి నుంచీ అబ్దుల్ భుజం మీద చెయ్యేసి తిరిగేడు. అప్పుడప్పుడు రాత్రుళ్ళు ఆ ఊళ్ళోనే గడిపేవాడు. దాసు వ్యాపారరంగం చాలా పెద్దది. అంచేత ఏ రోజెక్కడుంటాడో యెవ్వరికీ తెలీదు. అర్ధరాత్రివరకూ ఒక దగ్గరున్నవాడు, తెల్లవారితే అక్కడౌపించడు.
దాసు క్యాంటీనులో సిపాయిలందరూ క్రమంగా కాతాలు పెట్టేరు. కాతా పద్దులప్పుడప్పుడు నేను కుతూహలం కొద్దీ తిరగేసేవాణ్ణి. ఓమాటు మొత్తం బాకీలు మూడువేలు దాటేయి. నేనొక నాడు దాసుని హెచ్చరించేను.
"చూడు దాస్! మేం యిక్కన్నించి యెప్పుడు వెళ్ళిపోతామో చెప్పలేం, అంచేత కాతాలు యింత యెక్కువగా పెరగనీకు, నీకే ప్రమాదం.
దాసు నవ్వేడు. నేనీ విషయం ఎడ్జటంటుతో చెప్పా. ఆ నెల జీతాల అడ్వాన్సులిచ్చినప్పుడు. దాసుని కాతాపుస్తకంతో దగ్గిర కూచోబెట్టుకుని ప్రతిసిపాయి చేత బాకీ మూడొంతులిప్పించి చెల్లు పెట్టించేను. కాని కొద్దిరోజుల్లో కాతాలు మళ్ళీ యథాప్రకారం పెరిగేయి.
ఒకనాడు సిపాయిలు గుసగుసలాడుకుంటున్నారు. నేను వాళ్ళదగ్గిర కెళ్ళి యేవిటీ గుసగుస అని అడిగేను. ఆరుళయ్య అనే ఒక డ్రైవరు విరగబడి నవ్వేడు. ఆరుళయ్య మా యూనిటు హాస్యగాడు. ప్రతి మిలిటరీ యూనిటుకీ నాటక సమాజంలాగే వొక హాస్య పాత్ర వుంటుంది.
"ఏం ఆరుళయ్యా! ఏవిటా నవ్వు..." నేను,
"పులిసార్ పులి..."
"ఎక్కడ?"
"మీసాల కెప్టెను,క్వార్టరు మాస్టరు బంగళాలో... రాత్రి"
"చంపేశారా?"
మళ్ళీ నవ్వేడు,
"ఆడపులి సార్! సీర కట్టుకున్న ఆడపులి..."
"ఓహ్..." నా కర్ధమైంది.
"దాసు క్యాంటీను పెట్టిందగ్గిర్నించి రాత్రిళ్ళు క్యాంపులోకి ఆడ పులు లొస్తున్నాయి ..." అరుళయ్య.
అంతా గొల్లున నవ్వేరు.
అబ్దుల్ నాలుగో భార్య సల్మాకి పందొమ్మిదేళ్ళుంటాయి చాలా అందంగా వుంటుంది. కాని సరైన తిండిలేక చిక్కింది.
సల్మా అప్పుడప్పుడు చెరువుకి నీళ్ళ కొచ్చేది. కోతిమూకలాంటి సిపాయిలందరూ ఆ చెర్లోనే స్నానం చేసేవారు: మళయాళీ సిపాయిల్లో గజీతగాళ్ళున్నారు. వీట్లో చేపల్లా ఈదుతూ రకరకాల విద్దెలు చేసేవారు. పాటలు పాడేవారు. సల్మా చెరువు కొచ్చినప్పుడు సకిలింపులూ, యికిలింపులూ చేసేవాళ్ళు. ఒక్కొక్కప్పుడు సల్మా మీద నీళ్ళు చిమ్మడం, వెంటపడ్డం చేసేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళ నీటివిద్దెలు. వికారాలు ముచ్చటగా చూస్తూ ఆమె కూడా నీళ్ళ సంగతి మర్చిపోయి గట్టుదగ్గిర నిలబడిపోడం కద్దు, అలాంటప్పుడు వాళ్ళు మరీవికారాలు చేసేవాళ్ళు. ఏదైనా గలంతు జరిగినప్పుడు అబ్దుల్ నాతో దీనంగా, తీవ్రంగా చెప్పుకునేవాడు. అతని ముఖకవళికలుబట్టి సంగతి గ్రహించి సిపాయిల్ని మందలించేవాన్ని.
అప్పుడప్పుడు మా యూనిటుకి చెందిన తెల్ల సోల్జర్లలొ కొందరు రాత్రివేళ ఆ గ్రామంలోకి జొరబడేవారు, కొంత అలజడి జరిగేది. కాని ఏదోవిదంగా అలాంటి తగాయిదాలు పరిష్కార మయేవి.
ఆకలి మనిషిని ఎంత హీనదశకైనా క్రుంగదీస్తుంది, సమయం కనిపెట్టి పనిచేసేవాడు దాసు. అతడల్లిన సాలెగూట్లోకి పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని యీగలు జొరబడి చిక్కుకు పోయేవి. అందుకే రాత్రిళ్ళు మా క్యాంపులోకి పులు లొస్తున్నాయని సిపాయిలు హేళనగా అనే వాళ్ళు.
ఒక సాయంత్రం నేను చెరువుకి స్నానానికి వెళుతున్నా. అబ్దుల్ కాలిబాట పక్కని రాతిమీద దిగాలుగా కూచున్నాడు. నేను దగ్గిరికి రాగానే తలెత్తి వెర్రివాడ్లా చూసేడు, నేను నవ్వుతూ పలకరించేను. అతను లేచి నడ్డిమీద చేతులు పెట్టుకుని ఏదో గొణిగేడు. అతనికి మాట పెకలడం లేదు. కళ్ళంట నీళ్ళొస్తూన్నాయి. ఏదో అంటాడు. నా కర్ధంకాదు. సలసల ఏడుస్తున్నాడు. నా కర్ధం కాలేదు కాని యేదో విపత్తు జరిగిందని గ్రహించేను. అతను నా చెయ్యి పట్టుకుని యింటి వైపు తీసుకెళ్ళేడు.
మేం గుమ్మం దగ్గిర కెళ్ళగానే, అతని భార్యలు, యింకా చుట్టుపక్కలవాళ్ళు గుమిగూడి యేదో చెప్తున్నారు. మధ్యమధ్య "సల్మా" అన్నమాట వినిపిస్తూంది. కాని యేం జరిగిందో తెలీదు. సల్మా యెక్కడుందని నేను సగం వాచికం, సగం అభినయంతో అడిగేను. అబ్దుల్ యిక దుఃఖం ఆపుకోలేకపోయాడు. గదిలోంచి ఒక చిరిగిపోయిన చీరతెచ్చి చూపించేడు. దాని మీద నెత్తురుమరకలున్నాయి. నాకు అదిచూస్తే మరీ అయోమయంగా వుంది. ఇంతలో అక్కడికిదాసు వచ్చేడు.
"దాసూ, సల్మా కేమైంది? వీళ్ళంతా ఏమంటున్నారు? అబ్దులుకి ఏం ఆపదొచ్చింది?". నేను.
'సాబ్! నిన్న సాయంత్రం నుండీ సల్మా కనిపించడం లేదు, రాత్రి గొడవపడ్డాం. లాంతర్లు, కర్రలు పట్టుకుని చుట్టుపక్కల అడివంతా వెలికేం-ఎక్కడా జాడలేదు.." దాసు.
"కన్నవారింటికి వెళ్ళిందేమో..."
"దానికి కన్నవారెవరూ లేరు. వెతగ్గా వెతగ్గా దూరంగా డొంకల్లో సల్మా చీర కనబడింది- చీర చిరిగిపోయింది. రక్తం మరకలున్నాయి. అదుగో ఆ చీరే, పులెత్తుకు పోయిందన్న మాట. పాపం సల్మా చచ్చిపోయింది. కాని శవం కనపళ్ళేదు...."
నాకు చమట పోసింది. "హే రామ్" అనుకున్నా. అబ్దుల్ మొహంలోకి చూడగానే నా కళ్ళు కూడా చమర్చేయి. సల్మా సవితులతో పాటు ఊరంతా గోలుగొలున యేడ్చేరు. దాసు వాళ్ళ వోదార్చేడు.
నేను చెరువ్వేపు నడుస్తూ అనుకొన్నా - సంజపడ్డాక యిలా ఒంటరిగా తిరిగితే యెప్పుడో నన్నుకూడా పులెత్తుకుపోతుంది.
రెండుమూడు వారాలు పోయిన తరవాత వోనాడు మేలాసింగు యేదైనా వూరు వెళదాం అన్నాడు, నేను అర్దోక్తిగా యేం కథ అన్నా, "అబ్బే, మరేం లేదు. నాదంత మోటి పుచ్చి పోయింది. అది ముందు తీయించాలి. తరవాత వీలుచూసుకుని కొత్త దంతం కట్టించుకోవాలి. అందుకొక డెంటిస్టు దగ్గిర కెళ్ళాలి. దాసుని పిలిచేం.
