బియ్యం, గోధుమలు, పప్పులు, పాలు, పాల పొడి, వెన్న, జామ్, మార్మ లేడ్, చీజ్, డెక్కలమీద వున్న మాంసం (Meat on hoof). తాజా మాంసం, టిన్ను మాంసం, చేపలు బిస్కట్లు, రొట్టె, నూనె, నెయ్యి, తాజా కూరలు, యెండుకూరలు, దుంపలు, తేనె, పంచదార, టీ, బసు, యింకా యింకా సమస్తం వున్నాయి. ఆ ఆహార గోడౌన్ల సైజు, వాటిలో వున్న సరుకుల బృహత్ పరిమాణం చూసి నేను మొదట గొప్ప గాభరాపడిపోయేను. తరువాత తెలివొచ్చి ముక్కు మీద వేలేసుకున్నా. అతి విశాలంగా, యెత్తుగావున్న ఒక్కొక్క గోడౌనులో కెళ్ళి, వాటిలో పేర్చిన వేల సంఖ్య బస్తాలు చూస్తుంటే నామటుకు నేనొక చీమలా తోచేను.
ఈ యుద్ధం సమయంలో దేశం మొత్తం మీద యిలాంటి రేషను స్టాండు లెన్నున్నాయి. హిమాలయ పరిమాణంలొ ఎక్కన్నించొస్తూందీ సరుకు? ఎక్కడెక్కడికి పంపిణీ ఔతూంది? ఎవరి పొట్టల్లో కెళుతూందీ! శలవల్లో మా వూరు వెళ్ళినప్పుడల్లా అక్కడ పరిస్థితి చూశా. ఆ పరిస్థితాదేశం అంతటా వుంది. సామాన్య ప్రజలకి వెన్న, జామ్, మార్మ లేడ్ అక్కర్లేదు, తోడేల్ని దూరంగా వుంచడానికింత అన్నం కావాలి. పసిపిల్లలకి పాలల్లోకి చంచాడు పంచదార కావాలి. ఏదో గుడ్డి వెలుగుకోసం ఒక అరసీసా కిరసనాయిలు కావాలి. నగ్నత్వం దాచుకుందికి మూరెడు బట్టకావాలి. వీటికే వచ్చిన యిబ్బందల్లా.
.jpg)
.jpg)
ఆ రేషను స్టాండులో పనిచేసేవాళ్ళు, కంట్రాక్టర్లూ పందికొక్కుల్లా వున్నారు. దుమ్ముల గొండుల్లా నవ్వుతున్నారు, అక్కడుండే వాచ్ మను ల దగ్గరకూడా రేషనుకోసం వచ్చే పెద్ద పెద్ద ఆఫీసర్లు సైతం వినయంగా ప్రవర్తింస్తున్నారు.
కంట్రాక్టర్లు గింజ గింజా అధిక ధర్లకి షేకరించి, ప్రజల నోట్లో మన్నుకొట్టి, మిలిటరీ సప్లయిలు ధారాళంగా చేస్తున్నారు. సప్లయిచేసిన సరుకులో సగం రేషను స్టాండు సిబ్బంది తిరిగి చీకటి బజరులోకి పంపించి వేలు, లక్షలు గడించి, జీవితం విలాసంగా గడుపుతున్నారు. మిగిలిన సగంలో మూడొంతుల నిర్లక్ష్యం వల్ల దండుగౌతుంది. ఆ మిగిలింది కాస్తా పటాల సిబ్బందికి సరఫరా అవుతుంది.
అక్కడ వేలాది సామాన్య ప్రజా పిడికెడు బియ్యం, పట్టెడన్నంలేక! రోజులతరబడి వుపోషాలు చేసి ఆకలిచావులు చస్తున్నారు.
ఈ ఆలోచనల్లోంచి బయటపడేసరికి నాకు కందిపప్పు జ్ఞాపకం వచ్చింది. కందిపప్పు ఎక్కడ దొరుకుతుంది? అదే సమస్య.
"రేషను సప్లయి గురించి ఎవర్ని భోగట్టా చెయ్యాలి?" ఆకడ తిరుగుతున్న ఒక కెప్టెన్ని భోగట్టా చేశా. అతను చిరునవ్వు నవ్వేడు కొంటెగా.
"అటు చూడు- అదిగో- ఆ గదిలో ఒక హవల్లారున్నాడు. అతన్ని కలుసుకో......"
నేనా గది దగ్గిరకెళ్ళి క్షణం జంకుతూ గుమ్మంలో నించున్నా. అందులో యే కల్నలో. మేజరోకూడా వుండొచ్చని. కాని అదేంకాదు-అసలే అది మరీచిన్నగది. అందులో వొక చిన్న బల్లముందు కుర్చీలో ఒకడు కూచున్నాడు. తలొంచుకుని రాసుకుంటున్నాడు. నేను పరికించి చూసేను.
"కమల్....మీరా....?"
అతను తలెత్తి చూసేడు. నవ్వేడు.
నా తలలో ఆలోచనలు రైలు పెట్తెల్లా దొర్లిపోతున్నాయి.
"ఏం యిలా వచ్చేరు?" కమల్ లేస్తూ ప్రశ్నించేడు.
"అబ్బే మరేం లేదు. మా యూనిటుకి కంది పప్పు సప్లై చెయ్యడం లేదు. సిపాయిలంతా గోల చేస్తున్నారు. అంచేత ఓసారి స్వయంగా రేషను స్టాండుకి వెళ్ళి ప్రయత్నిద్దామని వచ్చా. ఇక్కడ మిమ్మల్ని కలియడం చాలా ఆశ్చర్యం కలిగిస్తూంది, కమల్..."
"ష్" అని ముక్కుమీద వెలేసి "పదండి" అన్నాడు. బైట సిగరెట్టు కాలుస్తున్న ఆర్గర్టీని పిల్సి ఆఫీసులో వుండమన్నాడు. ఆ ఆఫీసుకి కమల్ ఒక్కడే సిబ్బంది, సర్వాధికారి. రేషను యిచ్చే తంతులో చివరి ఘట్టం అతని ఆఫీసు. అంటే గరిటె అతనిచేతులో వుందన్న మాడ.
ఆఫీసు గది పక్కనే అతని భాషా వుంది. అది విశాలంగా వుంది. కాని యేమంత నీటుగా లేదు, రెండుమూడు కుర్చీలు, వొక బల్ల వున్నాయి. బట్టలు ఎలా బడితే అలా తాళ్ళమీద వేళ్ళాడుతున్నాయి. గోడకి తలుపుల్లేని ఒక అల్మారా వుంది దాంట్లో ఓవల్ టెన్, కొకో, వెన్న, జామ్, మార్మలేడు మొదలైన టిన్నులున్నాయి. మేం కూచోగానే అతను పృథ్విలా అని అరిచేడు. జీ సాబ్ అంటూ పృథ్విలాల్ వొచ్చేడు. రెండు కప్పులు ఓవల్ టెను కలిపి తీసుకురా అన్నాడు కమల్.
ఓవల్ టెన్ తాగుతూన్నంతసేపూ మేం మౌనంగా వున్నాం కాని నా ఆలోచనలకి అంతులేదు.
కమల్ మిలిటరీలో యెందుకు చేరేడు? ఎప్పుడు చేరెడు. అసలతనికి యుద్ధం అంటే కిట్టదే. ఆగర్భ శ్రీమంతుడి కేవిటీ అవస్థ? అతన్ని కిందటిసారి చూసి సుమారు సంవత్సరం కావస్తూంది. అతనెడతెగకుండా మాట్లాడేవాడు. ఎందుకో అందుకు పదేపదే నవ్వుతూ నవ్విస్తూండేవాడు. ఇప్పుడేవిటీ తీవ్రభావం? ఇతనా కమల్ కాడేమో! కాకపోతే నే నెలా పోలుసా నాకళ్ళు నన్నంత మోసం చేస్తాయా? అసలు అతను నన్నెలా గుర్తుపడతాడు! పద్మ యెలా వుంది? ఆమె తండ్రి, చెల్లెళ్ళు తమ్ముడూ బావున్నారా? ఎన్నో ఆలోచనలు. ఎన్నో అపోహలు, అతని కొక సిగరెట్టిచ్చి, నేనోటి ముట్టించా.
"కమల్..."
"ష్! నా పేరు కమల్ కాదు. రాయ్! నన్నిక మీద అలాగే పిలవండి...."
నాకు అంతుపట్టలేదు.
రాయ్! ఇతను రాయా? మారు పేరు? నేను విడని చిక్కులో సతమతమౌతున్నా, అతను లేచి తలుపు దగ్గిరగా వేసివచ్చాడు. "చూడండి రావ్ జీ మిమ్మల్ని అట్టేవేపు సందేహంలో వుంచను. నా పేరు రాయ్.... ప్రసన్నకుమార్ రాయ్.... హవల్దార్ రాయ్"
"నాకేం అర్ధం కావడం లేదు..."
"అదే నాకు కావాలి..... నా గురించి సరిగా అర్ధం కాకూడదు. పై వాళ్ళకి అర్దమైతేనే నాకు ప్రమాదం. కాని నాకందుకు భయం లేదు. పద్మ కేమైనా ప్రమాదంజరిగితే నేను భరించలేను" కమల్ గుండె బిగువుతో అన్నాడు.
పద్మ! పద్మ! అయితే యితను కమలే నా సందేహం తీరింది.
"మిస్టర్ కమల్ .... సారీ రాయ్ ! మీరు నిస్సందేహంగా మీరే. కాని నేను నేనే అని మీరెందుకు బైటపడ్డం లేదో నాకర్ధం కాదు. పద్మ కులాసాగా వుందా...?"
"కులాసా? పద్మ ఎలా వుందో తెలీదు. నా విషయం చెప్తా. కాని యిది గొప్ప రహస్యం. యిది మీ రెవ్వరికీ చెప్పకూడదు..... ప్రామిస్?"
"ప్రామిస్" చేతిలో చెయ్యివేశా. అతనేం చెస్తాడో అని గుండె వేగంగా కొట్టుకుంటూంది.
అతను తలుపు వేపు మరోసారి చూసేడు. బైట లారీలు గుర్రుగుర్రుమంటున్నాయి. మనుసుల పిలుపులు. నవ్వులు, ఈలలు- గోలగా వుంది.
"చూడండీ- ప్రామిస్సేనా?" కంగించేడు.
"ముమ్మాటికీ ప్రామిస్. మీ రహస్యం నా బొందిలో ప్రాణం వుండగా బైటపెట్టను! సరా?"
అతనొక క్షణం తీవ్రంగా ఆలోచించి. చివరికి మొదలెట్టేడు అసలు సంగతి.
"నేనొక మనిషిని చంపా..........."
కరెంటు దెబ్బతిన్నట్లయింది నాకు.
"ఎవర్ని?"
అతను తలెత్తకుండా క్షణం నడికొప్పువేపు చూసేడు. తిరిగి నా వేపు చూసేడు. అతని విశాల మైన తెల్లగుడ్ల మీది యెర్రచీరలు మరీ యెరుపెక్కేయి.
"షిప్ ఫూల్.... మా మేడకింది భాగంలో వున్న ఆర్టిలరీ బ్రిగేడు ఆఫీసు సూపరెంటు..."
"కారణం?"
అతను మళ్ళీ తలెత్తకుండా నడికొప్పువేపు సూసేడు. "ఆ సన్నగా, పొడుగ్గా, తోడేల్లా, "ఇయాగో" లా వుండే వెధవ పద్మ మానాన్ని భగ్నం చేసేడు. ఆ తుక్కు వెధవకి గులాబీ పువ్వేదో, వుమ్మెత్తి పువ్వేదో తెలీదు..."
అసలదెలా సంభవించింది. పద్మ చాలా జాగ్రత్తయిన పిల్లే...
"కుట్ర-పెద్ద కుట్ర! వాడితో మరో యిద్దరు నాకైలు కూడి ఈ అత్యాచారం సాగించేరు. ఒక శనివారం సాయంత్రం, పద్మ రానం టున్నా మొహమాటం వెట్టి ఊళ్ళోకి తీసుకెళ్ళేరు.
అక్కడొక అనువైన హోటల్లోకి తీసుకెళ్ళేరు. ఆ హోటలు గదిలో వాళ్ళ పన్నాగం సాగించేరు...."
"మీకీ విషయం యెప్పుడు తెలిసింది?"
'పద్మ వెళ్ళిపోయిన పదిరోజుల తర్వాత...."
"ఎక్కడికెళ్ళిపోయింది?"
"వాళ్ళ ఊరు. కొమిల్లా, తీరని పరిస్థితులు కారణం చూపించి ఉద్యోగం నించి విడుదల పొందింది. నేనప్పు డూళ్ళో లేను. వెళ్ళిపోతూ నాకిమ్మని, వొక వుత్తరం అమ్మకిచ్సింది. అది చదూతూంటే నారక్తం పెట్రోలు లా మండింది. నక్క వెధవ ఫిష్ ఫూల్ని భారతదేశం మట్టిదాటి పోనివ్వకూడదనుకొన్నా. వాణ్ణి నేనొక హోటలుకి తీసుకెళ్ళా. అక్కడ బాగా తాగించా. తాగి తూలుతున్న వాడి గొంతు ముడి విరిచి హతమార్చా. వాడు గుడ్లు తేలేస్తూంటే, "పద్మని తల్చుకోరా. మోక్షమన్నా వస్తుంది, అని జోడు కాలుతో వాడి మొహం మీద నాలుగు తన్నా. హోటలు బైటకొచ్చి తిన్నగా ఢాకా పారిపోయా అక్కడ మిలిట్రీలో భర్తీ అయిపోయా. అంబాలాలో మూడువారాలు ట్రెయినింగై యిక్కడి కొచ్చా....."
"మీ అమ్మగారికీ సంగతి తెలుసా?"
"తెలుసు అంబాలా నించి ఒక వుత్తరం రాశా. అమ్మ యిప్పుడు కలకత్తాలో లేదు. కల కత్తాలో యింటిపై భాగం కూడా అద్దెకిచ్చి, అమ్మ డార్జిలింగులోనే వుంటుంది. నేనొకసారి డార్జిలింగు వెళ్ళి అమ్మ దగ్గిరో రోజున్నా, అమ్మ ధైర్యం గానే వుంది. నాకంత కన్నా భయం లేదు.
"తరువాత పద్మని కలిసేరా?"
"లేదు. ఇప్పటి వరకూ కలియలేదు."
"పద్మ యిల్లు తెలుసా?"
"ఎలా తెలుస్తుంది! ఎప్పుడైనా రానిస్తేనా. పద్మ. నా పద్మ! పువ్వులాంటిది. ఎలావుందో వెళ్ళాల్నుంది, కాని ధైర్యం చాల్దు."
"ఫరవాలేదు. పద్మ కులాసాగానే వుంటుంది. నాకు తెలుసు. మనిద్దరం కలిసి వోరోజు వెళ్దాం అతన్ని వోదార్చేడు.
ఆనాడు లాంచీలో ప్రయాణం చేస్తున్న ప్పుడే గ్రహించా కమల్ తొందరపాటు వాడని. పద్మని అతను నిండు హృదయంతో ప్రేమించేడు. ఆమెకి జరిగిన అవమానాన్ని సహించలేకపోయాడు, తీవ్రమైన చర్య తీసుకున్నాడు.
మనిషి మంసిహిని హత్య చేసేటప్పుడు అతని నెత్తురు సలసల కాగుతూంటుంది. ఆ మరుగుతున్న నెత్తురు విచక్షణాజ్ఞానాన్ని నాశనం చేస్తుంది, కొందరికి హత్యలు వృత్తి, మనిషిని చంపుతూంటే వాళ్ళ నెత్తురు వేడెక్కదు. మామూలుగానే వుంటుంది. అలాంటి హత్యనే 'కోల్డు బ్లడెడ్ మర్డర్" అంటారు. బాగా ఆలోచించి, నిశ్చయానికొచ్చి చేసిన హత్య వంకాయ తరిగి పోపులో వేసినట్టే. కమల్ చేసిన హత్య అలాంటిది కాదు.
కమల్ నా లారీలో సరుకులు నింపించేడు. నేను బైల్దేరుతూ "తిరిగి త్వరలో కలుద్దాం" అన్నా. మా యూనిటెక్కడుందో చెప్పా.
ట్రక్కు సామాన్ల బరువుతో వెళుతూంటే నా మనసుకూడా ఆలోచనలతో బరువుగా వూగిస లాడుతూంది. ఎంత పని చేసేడు కమల్!
ఒక పెద్దయుద్ధం మానవజీవితపు బాటలో ఒక మలుపు దిద్దుతుంది. ఈ రెండో ప్రపంచ మహా యుద్ధం మానవుడి మనుగడలో కాళరాత్రి లాంటిది. తెల్లవారితే కొత్తమలుపు కాదు. కొత్త యుగమే ఆరంభమౌతుంది.!
సీతని రావణాసురు డెత్తుకుపోయేడు. అప్పుడొక యుద్ధవైంది. అతిరధులు, మహారధుల సమక్షంలో, నిండుకొలువులో అంటరాని స్థితిలో వున్న ద్రౌపదిని నిలబెట్టి వివస్త్రని చేసేడు. అప్పుడొక మహాయద్ధం జరిగింది. తరవాత యెన్నో యుద్ధాలు జరిగేయి. ఇంకా జరుగుతూనే వున్నాయి. ముందు కూడా జరగొచ్చు. యుద్ధం జరుగుతున్నప్పుడే మానవడు ఘోరాలు చూసి జడుస్తాడు. మరి యుద్ధం పద్దు బాబో అనుకుంటాడు. యుద్ధం ముగిసి పోగానే కుక్కతోక తిరిగి వంకర. మానవ జీవితం ఒక ఎడతెగని యుద్ధం, శాంతి ఒక విరామం లాంటిది. నాటకంలో రంగానికీ, రంగానికీ మధ్య కిందికి జారే తెరలాంటిది, ఆ స్వల్ప విరామంలో కూడా తెరవెనక తతంగం జరుగుతూంటుంది. అది ప్రేక్షకులికి తెలీదు. నాటకం నడిపించేవాళ్ళకే తెలుసు!
మా ట్రక్కు వస్తూంటే కిటికీలోంచి చూసి ఓసీ బైటకొచ్చి ఎండలో నవ్వుతూ నిలబడ్డాడు.
