6
ఆగస్టు నెల ఏడవ తారీఖున చారుమతి గరల్సు హైస్కూల్లో ఉద్యోగంలో చేరింది. ఫస్టు ఫారం, సెకండ్ ఫారం వాళ్ళకి ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు చెప్పాలి. ఆ రోజు చాలా సంతోషంగా ఉంది చారుమతికి. తండ్రికి కొంచెం ఆరోగ్యం కోలుకుంది.

సాయంత్రం శ్రీదేవి, పద్మ చారుమతి ఇంటికి వచ్చి అభినందనలు చెప్పారు. పద్మని చూసి కొంచెం ఆశ్చర్య పోయింది చారుమతి. ఎందుకో బాధపడుతున్నట్లుంది పద్మ. కొత్త పెళ్ళికూతురులో తొంగిచూసే ఉత్సాహం, కొత్త కళ లేవు.
"పద్మ అలా ఉందేం?" అంది చారుమతి శ్రీదేవిని చూస్తూ.
"ఇవాళ తన శ్రీవారి దగ్గిరనుంచి ఉత్తరం రాలేదు. అందుకే చిన్నబోయింది అమ్మాయిగారి ముఖం" అంది శ్రీదేవి పద్మని హాస్యం చేస్తూ.
పద్మ నవ్వేసి ఊరుకుంది. కాని ఆ నవ్వు వెనకాల ఏదో దిగులు ఉన్నట్లు గ్రహించింది చారుమతి. కాని ఏమీ గమనించనట్లు ఊరుకుంది. పద్మని ఉత్సాహ పరచాలని, "పింగళి-కాటూరి' రాసిన 'ప్రణయలేఖలు' గుర్తుందా" అని అడిగింది పద్మవైపు చూశూ.
"ఏది?"
"మనకి చాలా నచ్చిన భాగం అప్పుడే మరిచి పోయావా?"
"నిన్ను నెద నిల్పి నేను ధ్యానించునట్లు
నీవు నన్నెద నిల్పి ధ్యానింతువేని
అన్యయామృత బిందు నిష్యంద మధుర
భావ సంయోగ రససిద్ధి బడయనగును!"
రాగ వరసలో చదివింది చారుమతి.
"విరహంలోనే ప్రణయం ఎక్కువవుతుందట. విరహంకూడా సుఖమే అంటారు అనుభవించినవాళ్ళు" అంది శ్రీదేవి.
"మన అమ్మాయి తీరు చూస్తే విరహం సుఖంగా ఉన్నట్టు లేదు. ఎప్పుడెప్పుడు ఆయన ఒళ్ళో వాలుదామా అన్నట్టుంది."
చారుమతి మాటలకు శ్రీదేవి గట్టిగా నవ్వింది. పద్మ నవ్వలేదు. పూర్వమైతే "ఛీ ఛీ, వెధవ మాటలు!" అని అలక నటించేది.
"ఇంకో టాపిక్ ఏదైనా మాట్లాడకూడదూ?" విసుగ్గా మొహం పెడుతూ అంది పద్మ. అల్లరి చేస్తున్న స్నేహితురాళ్ళ నోళ్ళు కట్టుబడ్డాయి.
చారుమతే సంభాషణ మార్చి కాలేజీ విశేషాలలోకి దింపింది. కాలేజీలో మగపిల్లల అల్లరి గురించి, అమ్మాయిల అలంకరణల గురించి సంభాషణ గంటసేపు సాగింది. చీకటి పడగానే శ్రీదేవి, పద్మ లేచి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
రెండు నెలలు గడిచేసరికి చారుమతికి ఉద్యోగం అలవాటైపోయింది. పిల్లలకు పాఠాలు చెప్పడంలో కూడా ఎంతో ఆనందం ఉందనుకుంది. ముఖ్యంగా చెప్పిన పాఠం సరదాగా ఉంటే, అర్ధం అవుతూ ఉంటే పిల్లలు చూసే శ్రద్ధ వాళ్ళ కళ్ళలో వెలిగే ఉత్సాహం చూస్తే చారుమతికి తృప్తి కలిగేది. ఓపికగా, సరదాగా పాఠాలు చెప్పే చారుమతి అన్నా, ఆమె క్లాసు అన్నా పిల్లలు ఇష్టపడేవారు.
పిల్లలమధ్య స్కూలులో ఉన్నప్పుడంతా కాలం ఇట్టే నిశ్చింతగా గడిచిపోయింది. ఇంటికి వస్తే ఏదో శూన్యంగా ఉండేది చారుమతికి. రాత్రి పడుకుంటే లెక్కలేనన్ని కోరికలు, కలలు మనసులో ముసురుకొనేవి. కాలేజీలో చదవాలి. డిగ్రీ తీసుకోవాలి. మంచి భర్త రావాలి. తనకి దొరకనివి తన స్నేహితురాళ్లిద్దరికి అందుబాటులో ఉన్నాయని తోచగానే ఒక్కసారి ఈర్ష్య లాంటి భావం ఎక్కడో మెదిలేది. తిరిగి తనని తనే తిట్టుకునేది. శ్రీదేవి మీద, పద్మమీద ఈర్ష్య ఏమిటి? వాళ్ళు కలకాలం సుఖంగా ఉండాలి. తనకు ఏమీ లభ్యం కాకపోయినా వాళ్ళయినా సంతోషంగా ఉండాలి. తన మనసులో నీచమైన భావాలు రాకుండా చూడమని భగవంతున్ని ప్రార్దించేది.
ఆ ఏడాదే నవంబరు మొదటి తారీఖున ఆంధ్రప్రదేశ్ అవతరించింది. హైదరాబాద్ రాజధాని అయింది. ఆంధ్రుల కలలు పండాయి. సందర్భాన్ని పురస్కరించుకుని కాలేజీలో ఆంద్ర వార్షికోత్సవాలు పెద్ద ఎత్తున మొదలుపెట్టారు. తనకు స్కూలు ఉండడంవల్ల ఉదయం జరిగే ఉపన్యాసాలకి వెళ్ళలేక పోయినా రాత్రి నాటకాలకు వెళ్ళేది చారుమతి. రోజూ సాయంత్రం శంకరం ఆనాటి విశేషాలు చెప్పేవాడు. ఒకరోజు మాటల సందర్భంలో శంకరం అన్నాడు:
"మిస్ పి. ఆర్. కాలేజీ ఎవరో తెలుసా?"
"ఎవరు?" అంది చారుమతి అతను అడిగేది ఏమిటో తెలియక.
"మీ ఫ్రెండ్ పద్మ. ఆమె ఇప్పుడు కాలేజీ బ్యూటీ. పద్మ చాలా అందంగా ఉంటుంది, చారూ. అబ్బాయిలు పిచ్చివాళ్ళయిపోతున్నారనుకో."
నవ్వు వచ్చింది చారుమతికి. 'అమ్మాయిల అందం గురించి ఆలోచించేంత పెద్దవాడయిపోయాడా శంకరం' అనుకుంది మనస్సులో. వెంటనే ముందు రాత్రి జరిగిన సంఘటన గుర్తుకువచ్చింది. రాత్రి నాటకాలని శ్రీదేవి, చారుమతి, పద్మ కలిసి వెళ్ళారు. ఆడిటోరియంలోకి అడుగుపెట్టగానే అరుపులు వినిపించాయి. "మిస్ కాలేజ్", "బ్యూటీ క్వీన్" అంటూ. కాని అది పద్మని గూర్చే అని తోచలేదు. పద్మలో ఏ భావం లేదు. తల వంచుకుని వచ్చి తమతో కూర్చుంది.
'లోకమంతా తన అందాన్ని మెచ్చుకున్నా, చేసుకున్న వాడు ఆ సౌందర్యాన్ని గుర్తించలేకపోతే, ఆ అందానికి ఉన్న నిలవేమిటి?' అనుకుంది పద్మ. ఈ బిరుదులు సంతోషంకంటే విచారమే ఎక్కువచేసేవి పద్మలో.మాధవరావు దగ్గిరనించి ఒక్క ఉత్తరంకూడా తను అందుకోలేదన్న సంగతి జ్ఞాపకంవచ్చినప్పుడల్లా ఆ రోజు మనస్సంతా చికాకయిపోతుంది. రాత్రి నిద్ర పట్టదు.
7
"అబ్బబ్బ! ఏం చలి, ఏం చలి! ఈ ఘటం వెళ్ళిపోతే బాగుండును. ఈ చలి భరించలేనురా. బాబూ" అంటూంది డెబ్బైఏళ్ల ముసలామె, సూర్యారావు తల్లి, నీళ్ళకాగు కింద మంటదగ్గిర కూర్చుంటూ. ఆమెకి, చలికాలానికి అసలు పడదు. డిసెంబరు నెల మొదటినించీ సంక్రాంతి వెళ్ళేవరకూ రోజూ ఆవిడ చలిమీద విసుక్కుంటూ "శ్రీమన్నారాయణుడు తొందరగా పిలిస్తే బాగుండును. ఈ చలి ఎన్నాళ్ళు భరించమా?' అని గొణుక్కుంటూ ఉంటుంది. ముక్కోటి ఏకాదశినాడు పోవాలనీ, తిన్నగా వైకుంఠం చేరుకోవాలనీ ఆవిడ కోరిక. ఏకాదశి రోజంతా మరణం గురించే తలుచుకుంటుంది.
"మామ్మా, ఇవాళ వైకుంఠ ఏకాదశి. ఇవాళ ప్రయాణం అయితే మంచిది" అన్నాడు శంకరం మంటదగ్గిర చేరుతూ.
"ఎక్కడికిరా ప్రయాణం?" అంది ముసలమ్మ.
"ఎక్కడికేమిటి, స్వర్గానికి .... తిన్నగా శ్రీమన్నారాయణుని సన్నిధికి" అన్నాడు శంకరం.
పనిమీద అంటే వచ్చిన శాంతమ్మ ఆ మాటలు విని నొచ్చుకుని, "ఏమిటిరా! పొద్దున్నే లేచి ఆ మాటలు? మామ్మతో హాస్యాలా? పెద్ద తరం, చిన్నతరం లేదురా!" అంటూ శంకరాన్ని చీవాట్లు వేసింది. ఆ మాటలు విన్న ఆడపిల్లలు సన్నగా నవ్వుకున్నారు.
ఇంతలో సూర్యారావు గట్టిగా దగ్గుతూ ఉండడం వినిపించి శాంతమ్మా, పిల్లలూ ముందరిగదిలోకి వచ్చారు. సూర్యారావు మంచంమీదినించి ముందుకు వంగి కూచుని దగ్గుతున్నాడు. భానుమతి వెంటనే మందు తెచ్చి ఇచ్చింది.
"ఇవాళ ఇంట్లోనే పడుకో, నాన్నా! కోర్టుకి, ప్లీడరు గారి ఇంటికి వెళ్ళకు. విశ్రాంతి తీసుకో" అంది చారుమతి.
"తగ్గిపోతుందమ్మా" అన్నాడు సూర్యారావు.
"ఒక్కరోజు కోర్టుకు వెళ్ళకపోతే కొంపలంటుకు పోవు. మీ ఆరోగ్యం కంటే ఎక్కువా పని? ఇవాళ మానేయండి" అంది శాంతమ్మ.
సూర్యారావు అలాగే అన్నట్టు బుర్ర ఊపి ఊరు కున్నాడు. తొమ్మిదింటికి భోజనాలు కానిచ్చి చారుమతి, మాలతి, భగవతి స్కూళ్ళకి, శంకరం కాలేజీకి వెళ్ళిపోయారు. పది గంటలకు సూర్యారావుకూడా కొద్దిగా ఎంగిలిపడి కోర్టుకు వెళ్ళిపోయాడు.
సాయంత్రం అయిదు గంటలకు చారుమతి ఇంటికి వచ్చేసరికి సూర్యారావు పొద్దున్నలాగే దగ్గుతూ కనిపించాడు. కొద్దిగా ఆయసంకూడా వస్తూంది. భానుమతీ, శాంతమ్మా చెరోపక్కా కూర్చున్నారు దిగులుగా.
"ఏమిటమ్మా, ఇలా కూర్చున్నారు? నాన్నకి మళ్ళీ దగ్గు వచ్చిందా?" అడిగింది చారుమతి వస్తూనే.
"మళ్ళీ వచ్చిందమ్మా, మీ నాన్నగారు ఎవరి మాటేనా వింటారా ఏమైనానా? ఈ రోజు విశ్రాంతిగా ఇంట్లో పడుకోండి అంటే వినక పదిగంటలకంతా పరిగెత్తారు బయటికి. మూడింటికి 'దగ్గు వస్తూంది' అంటూ వచ్చేశారు. ఏం మాయదారి ఉబ్బసమో. మనిషిని పీల్చేస్తూంది." శాంతమ్మ నిష్ఠూరంగా మాట్లాడినా, ఆ మాటల వెనక భర్త మీద ప్రేమా, ఆయన ఆరోగ్యంపట్ల ఆందోళనా ఉన్నాయి.
