Previous Page Next Page 
జీవన వలయం పేజి 5


    "వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్పుకొంటున్నాను. మిమ్ములను క్షమించమని అడగటం కూడా న్యాయం కాదేమో?" కళ్ళెత్తి చూసింది లత. గుమ్మంలో సుధ నెత్తుకుని నిలుచుంది సరోజ. లత ఏమీ మాట్లాడలేదు. సరోజ వచ్చి లత పక్కనే కూర్చుంటూ అంది: "మీరు మరోలా భావించకండి. వాళ్ళకు మనుష్యులను అవహేళన చేయడమే తెలుసు. కాని అలా చేయడం వలన వారెంత బాధపడతారో ఆలోచించరు. అలాటప్పుడు వారి మాటలు లెక్కచేయకపోవటమే మంచిది."
    ఈసారి కూడా లత ఏమీ మాట్లాడలేదు.
    "మీ కింకా కోపం పోలేదు. కాని ఈ విషయమైనా నమ్మండి. ఆఫీసర్ల భార్యలంతా అదే ధోరణిలో ఉంటారని మాత్రం అనుకోకండి."
    "అనుకోను... ఎందుకంటే మా నాన్న గారు ఆఫీసర్. మా మామయ్యలు ఆఫీసర్లు. మా వారి అన్నగార్లూ ఆఫీసర్లు. వాళ్ళందరి మధ్య మెలిగే నేను ఎన్నడూ అలా అనుకోను. కాని ఇలాటివారు ఎప్పుడు, ఎలా మారతారా అని ఆలోచిస్తున్నాను" అంది నెమ్మదిగా లత. ఒక్కసారి సరోజ ఆశ్చర్యపోయి తరవాత తృప్తిగా నిట్టూర్చింది.

                                *    *    *

    "లతా డియర్,
    నాలుగు రోజులో, కాకపోతే ఒక వారమో ఉంటానని వెళ్ళావు. కాని పది హేను రోజులు ఉండి పోయావు. కాదు, నేనే ఉంచాను. ఏం చెయ్యను చెప్పు? ఇది పెద్ద సిటీ కాకపోయినా ఇల్లు వెదికేటప్పుడు మాత్రం సిటీలకు తాత అనిపించింది. ఇప్పటి కయితే ఇల్లు కుదిరింది. ఎలాటి దనుకొన్నావు? నీకు నచ్చే ఇల్లు. నీవు మెచ్చే తోట ఉంది. అలాటిది సంపాదించ గలిగినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అది ఎలా కుదిరిందో తరవాత చెపుతాను. నీవు ఎప్పుడు వచ్చేదీ వెంటనే వ్రాయి. నీ రాకకోసం వేయికళ్ళతో ఎదురు చూసే పక్షి ఇక్కడ విలవిలలాడిపోతూందని తెలుసు గదూ!
                -నీ రమ."
    చదివిన ఉత్తరం కవర్లో పెడుతూ దీర్ఘంగా నిట్టూర్చింది లత. ఈమధ్య ఆమె మనస్సు ఏమీ బాగుండటం లేదు. మాటిమాటికి రమాకాంత్ గుర్తు వస్తున్నాడు. ఎప్పుడు వెళ్ళి అతని చేతుల్లో వాలిపోదామా అనిపిస్తూంది. అక్కడే ఆమెకు నిజమైన శాంతి లభించేది.
    కారు రాగానే లేచి గుమ్మంలోకి వెళ్ళింది లత. రాజా రెండు చేతుల్లోను పాకెట్లు పట్టుకొని లోపలకు వచ్చాడు. సుధ, రవి కాళ్ళకు చుట్టు కొన్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన గీత ఒకసారి వాళ్ళను చూసి "ఏమిటో తెచ్చారే?" అంటూ పాకెట్లు విప్పింది. ఆకాశపు రంగు పట్టు జరీచీరె, అదే రకం జాకెట్టు ఒక దానిలో, రెండవ దానిలో రెడీమేడ్ గౌను, నిక్కరు, షర్టు ఉన్నాయి. చీరెను అటూ ఇటూ మార్చి చూస్తూ, "అబ్బ! ఎంత బాగుందో!" అంటూ తన భుజంపై వేసుకొని చూసుకొంటూంది గీత.
    "అని లతకు, పిల్లలకు తెచ్చాను." సౌమ్యంగానే అన్నాడు రాజా.
    "కాకపోతే నా కని ఎలా అనుకొంటాను! ఏనాడైనా తెచ్చారు గనకనా? ఇదుగోనమ్మా, లతా, ఇప్పుడే పెట్లో పెట్టుకో లేకపోతే ఎవరైనా ఎత్తుకు పోగలరు" అంటూ లత ఒడిలో పడవేసి వెళ్ళిపోయింది. ఏమీ మాట్లాడలేక లత అలాగే కూర్చుంది. రవి, సుధ మామయ్య ఇచ్చిన బిస్కట్ల మీద దాడి సాగిస్తున్నారు. లత లేచి అన్నీ అలమారులో సర్ది వచ్చి, "ఆయన ఉత్తరం వ్రాశారన్నయ్యా" అంది.
    "ఏం వ్రాశాడేమిటి?" తల తిప్పకుండానే అడిగాడు రాజా.
    "ఇల్లు దొరికిందట. వెంటనే రమ్మని వ్రాశారు."
    నిట్టూరుస్తూ అన్నాడు రాజా: "అవును నువ్వు వెళ్ళాల్సిందేగా? ఎన్నాళ్లని ఉండగలవు ఈ ఇంట్లో!"
    "అదేమిటన్నయ్యా నే నెప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తాను. ఆయన సంగతి నీకు తెలుసుగా?"
    "అవునమ్మా నువ్వు వెళ్ళటమే మంచిది. మరి కొన్నాళ్ళు నిన్ను ఆపి నీ స్వర్గతుల్యమైన సంసారంతో ఈ సంసారాన్ని పోల్చి చూసుకొనేటట్లుచేసి, నీ మనశ్శాంతిని హరించలేను. జన్మ జన్మలకూ మీ దాంపత్యం చల్లగా ఉండాలి."
    "అన్నయ్యా!"
    "ఏమమ్మా?"
    "నువ్వలా మాట్లాడితే నే వెళ్ళలేను."
    "పిచ్చిదానా! అన్నయ్య మీద నీ కెంత ప్రేమ..."
    "ఎందుకు ఉండదు? వందరూపాయల చీరెతెస్తే..."
    గీత మాటలతో ఉలిక్కిపడింది లత. లత తలను నిమురుతూన్న రాజా ఒక్కసారి అసహ్యంగా గీతవంక చూసి,
    "డబ్బుతో మనుష్యులను కొలిచే నీకు, డబ్బుకోసం పాకులాడే నీకు ప్రేమలూ, అనురాగాలూ ఎలా అర్ధ మవుతాయి! చీరెలకోసం నటించే ప్రేమలు నీకు తెలుసుకాని లతలా నిష్కల్మషంగా ప్రేమించగల గటం నీకు వెయ్యి జన్మలెత్తినా రాదు" అన్నాడు లత. మెల్లిగా అతని చేయి పట్టుకొంది. "ఫర్వాలేదులే, లతా" అంటూ రెండడుగులు వేశాడు గదిలోకి. వెళుతున్న వాడు వెనక్కు తిరిగి, "గీతా, ఈ బట్టలు లతకు పళ్ళు, పసుపు కుంకుమలతో అందించు. ఆమె రేపు వెలుతూంది. ఈ ఒక్కరోజైనా నోరు కంట్రోల్ లో ఉంచుకొంటే బాగుంటుంది" అని వెళ్ళిపోయాడు. నేను నిస్సహాయురాలి నన్నట్లు చూసింది లత. ముఖంలో ఏ భావం కనపడనీయకుండా ట్రేలో పళ్ళు, బట్టలు పెట్టటం మొదలుపెట్టింది గీత.
    ఆ రాత్రి ఎవరికీ సరిగ్గా నిద్ర లేదు. ఒకరికి తెలియకుండా ఒకరు లత, గీత, రాజా చాలా సేపు మేలుకొన్నారు. రాజాకు ఈమధ్య మరీ గీత మీద కోపం వస్తూంది. లత విషయంలో ఆమె అలా ప్రవర్తించటం ఏమీ బాగుండలేదు. ఒక్కగానొక్క చెల్లెలు. తల్లీ, తండ్రీ లేని దాన్ని తను తీసుకురాకపోతే ఎలా? అసలు అమ్మ లతను ఎంత గారాబంగా పెంచిందని! దాని వివాహం విషయంలో అంతా తన మాటమీదే జరిగింది. తను కోరుకున్నట్లు లతది చల్లని సంసారమైంది. తనకు లత సంసారం తలుచుకొంటే చాలు ఎండాకాలం పన్నీట స్నానం చేసినట్లు ఉంటుంది. కాని.... కాని తన సంసారం! తన సంసారం గురించి ఎన్ని కలలు కన్నాడు! అన్నీ కల్లలే అయినాయి! అసలు గీతకు తన మీద ప్రేమ అంటూ ఉంటేకదా! లతను మాత్రం అలా చూడట మేమిటి? ఆ మాటలేమిటి? ఆడపడుచు అనే అభిమానం, గౌరవం ఏమన్నా ఉన్నాయా? అసహ్యంతో, క్రోధంతో మనస్సు మెలికలు తిరుగుతూండగా ఎప్పుడో నిద్రపట్టింది.
    ఒడిలో పుస్తకం ఉన్నా లత దృష్టి మాత్రం గోడపై నున్న అన్నయ్య, వదినల పెళ్ళి ఫోటో మీద ఉంది. 'ఎంత చక్కని జంట!' అనుకొంది. ఇదే మాట అన్నయ్య పెళ్ళిలో కూడా అంతా అన్నారు. అందం, హోదా, డబ్బు, హృదయం-అన్నీ ఉన్న అన్నయ్య వదిన నాకర్షించలేక పోతున్నాడు, ఎందువల్ల? మగవారి నాకర్షించటానికి వదిన అందమే చాలు. అయినా అన్నయ్య ఆమె దగ్గరకు రాలేకపోయాడు, ఇదెలా సంభవం? ఏ ఒక్కరి మీద నెపం వేయడానికి వీలు లేనట్లు కనిపిస్తూంది. ఈ పది హేను రోజుల్లో ఒక్కసారి కూడా వారిద్దరూ ఒక్కచోట కూర్చోవటం కాని, నవ్వుతూ సరదాగా మాట్లాడటం కాని తాను చూడలేదు. రాత్రిళ్ళు కూడా అన్నయ్య నిద్రపోతే వదిన చదువుకొంటూనో, కుట్టుకొంటూనో కూర్చుంటుంది. అన్నయ్యా అంతే. వదిన పడుకొన్నా తను ఎంతో రాత్రివరకు మేలుకొనే ఉంటాడు.
    "టైమ్ పదకొండు అయింది. ఇంకా మేలుకొన్నావా?" గీత కంఠం విని చూసింది లత.
    "పదకొండు అయిందా? అయితే పడుకొంటాను. లైటు ఆర్పు, వదినా" అంటూ లేచింది లత. లత మంచంపై పడుకొన్న తరవాత లైటార్పి, బెడ్ లైట్ వేసి ఆమె పక్కలోనే కూర్చుంది గీత. లత కొంచెం ఆశ్చర్యపోయి లేచి కూర్చుని, "వదినా!" అంది ఆప్యాయంగా.
    "లతా! నన్ను క్షమించు, లతా" అంటూ లత రెండు చేతులూ తన ఒళ్ళోకి తీసుకొంటూ అంది గీత.    
    "అవేం మాటలు! నువ్వు భలేదానివే. ఇప్పుడే మయిందని?"
    "కాదు. క్షమించానంటేనే వెళతాను."
    "అలాగేలే వెళ్ళు" అంది ఏమీ అనలేక.
    మరికొంచెం సేపటికి, 'ఆమెగార్ని క్షమాపణ కోరాగా? ఇంకా ఏమిటి మీ గొడవ?" అని విసురుగా అంటున్న వదిన మాటలు వినిపించి విస్తుపోయింది లత! గీత ఎంత విసుగు, కోపం చూసినా అన్నయ్య శాసిస్తే కాదనలేదనే విషయం ఆమె ఎప్పుడో గ్రహించింది.

                                     *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS