కమలమ్మగారు కంగారుగా "ఏమిటే ఏమయింది" అన్నారు.
"మరేం....అన్నయ్య ఫస్టు క్లాసులో పాస్ అయ్యాడు" అంది మీర.
కమలమ్మగారు సంతోషంతో "ఉండు, పంచదార, కొబ్బెరకోరు కలిపి తెస్తాను" అంటూ లోపలికి వెళ్ళారు.
కృష్ణయ్యగారు కొడుకు రిజల్ట్స్ తెలుసుకొని, ఎంతో సంతోషించారు. కమలమ్మగారు ఇచ్చిన తీపి కొద్ది కొద్దిగా నోట్లో వేసుకొంటూ,
"తరువాత ఏం చేస్తావురా అబ్బాయ్" అన్నారు.
"ఇంటర్ లో చేరుతాను నాన్న"
"ఆప్షనల్స్ ఏం తీసుకుంటావ్?"
"సి.బి.జడ్. తీసుకుందామని ఉంది. తరువాత యం.బి.లో చేరడానికి వీలుంటుంది.'
"నువ్వలా ఆశించటం సహజమే. నాకూ చదివించాలనే ఉంది. కాని యంబి.లో సీటు దొరకటం దుర్లభం. దొరికినా చదివించే స్తోమత నాకు లేదు."
గోపాలం ఆవేశంతో "బాగా చదివి, మంచి మార్కులు తెచ్చుకొంటే సీటు ఎందుకు దొరకదు సీటు దొరికితే ఎలాగోలాగ చదవవచ్చు" అన్నాడు.
గోపాలానికి డాక్టరవాలన్న కాంక్ష తీవ్రంగా ఉండటాన్ని గమనించి కృష్ణయ్యగారు మరేమీ మాట్లాడలేకపోయారు.
మీర అన్నయ్య వెనుకనే అతని గదిలోకి వెళ్ళింది.
"యం.బి. అంటే ఏమిటన్నయ్యా?"
"అది చదివితే డాక్టరవుతామన్నమాట"
"అంటే నీకు డాక్టరవాలని ఉందా?"
"అవును, నీకు లేదూ?"
మీర కళ్ళముందు నర్మద తండ్రి డాక్టర్ సుబ్బారావుగారి రూపం మెదిలింది. ఆయన గవర్నమెంట్ డాక్టర్. ఆ ఠీవిదర్పమూ, మీర
మనస్సును ఆకర్షించాయి. లక్ష్మీ, సరస్వతుల కటాక్షమువల్ల కారు, పెద్ద బంగళా, రేడియో నౌకర్లు, అన్నీ సౌకర్యాలతో వైభవంగా అనుభవిస్తున్నారు. ప్రజలు ఆయనకు చూపే గౌరవం మీరను ముగ్ధపరచేది. ఇవన్నీ తలచుకొని మీర.
"అవునన్నయ్యా, నాకూ డాక్టరవాలనే ఉంది అలా అయితే ఎప్పుడు నర్మద నాన్నగారిలా కారు లోనే తిరగొచ్చు" అంది.
"ఏ నర్మదా? డాక్టరుగా రమ్మాయా? దంత వక్రం కదూ?"
"నర్మదెలా ఉంటే నీకేమిటన్నయ్యా? నువ్వే మన్నా పెళ్ళి చేసుకోవాలా ఏం?" అని తన స్నేహితురాలీని వెనకేసుకొచ్చింది మీర.
"బాబోయ్ ఆ అమ్మాయినే? పెళ్ళి చేసుకోవటమే! పళ్ళు చూసే పారిపోవాలి......"
"చాల్లే వూరుకో అన్నయ్యా పళ్ళు బాగలేక పోతేనేం. మొహం అందంగా లేదూ!"
"ఉంది. నిజమే. కాని ఎక్కువగా నవ్వద్దని చెప్పు?"
మీర నవ్వింది. ఎర్రటి పెదిమెల వెనుక ఆమె సన్నటి పలువరస తళుక్కుమంది.
రెండేళ్ళు తొందర తొందరగా గడచిపోయాయి. గోపాలంమొదటినుండి తన కోర్కెను నెరవేర్చుకోవటానికోసం శ్రద్దగా చదివాడు. అనుకున్నట్టుగానే ఇంటర్లో ఫస్టుక్లాసు వచ్చింది. ఆ విషయం తెలిసిన రోజున మీరకు తన అన్నయ్యంత తెలివి గలవాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరనిపించింది.
రిజల్ట్స్ వచ్చిన రోజు మధ్యాహ్నం అందరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. శ్రీపాదు, గోపాలాన్ని "పార్టీ తప్పక ఇవ్వాలన్నయ్యా" అని గొడవ చేస్తున్నాడు. మీర చిరునవ్వుతో,
"పెదనాన్నా, ఇంతవరకూ మీకో విషయం చెప్పకుండా దాచాను" అంది.
"అమ్మ దొంగా. నా క్కూడా చెప్పకుండా నా? ఏమిటమ్మా అది?"
"మా కాన్వెంటులో ఈరోజు పేరెంట్సుడే."
"అలాగా, చెప్పవేం మరీ"
"టీచరూ, మొదటే ఇంట్లో చెప్పేయకండీ. ఏకంగా ఒకేసారి, వేడి వేడి కబురుచెప్పి ఆశ్చర్యపరుద్దాం!" అన్నారు. అందుకనీ......"
ఇదంతా వింటున్న కమలమ్మగారు "నువ్వేం వేషం వేయడంలేదుగదా, కొంపదీసి" అన్నారు. మీర బిక్క మొహంతో గోపాలంవేపు చూసింది గోపాలం,
"వేషంవేస్తే తప్పేమిటమ్మా? మీర ఇంకా చిన్నపిల్ల" అన్నాడు.
"చిన్నపిల్లేమిటి తొమ్మిదేళ్ళు దాటితేనూ"
"తొమ్మిదేళ్ళకే మహ వయసయిపోయిందా ఏంటి?"
అంతలో కృష్ణయ్యగారు కల్పించుకుని
"నువ్వూరుకో కమలా. మీర ఇంకా పసిపిల్ల. వూరుకోరా అబ్బాయ్. సాయంత్రం మీర అభినయం చూస్తే ఆవిడికే తెలుస్తుంది."
శ్రీహరి అడిగాడు "ఏం నాటకం వేస్తున్నారు?"
"సిండ్రెల్లా నాటకం."
శ్రీపాదు కుతూహలంతో "నువ్వేం వేషం వేస్తున్నావు" అన్నాడు.
"సిండ్రెల్లా"
"అయితే తప్పకుండా చూడాల్సిందే" గోపాలం అన్నాడు.
"నాటకం ఇంగ్లీషా, కన్నడమా?"
"ఇంగ్లీషు నాటకం"
"మరి మీరు మాట్లాడే మాటలకంతా మీకు బాగా అర్ధం తెలుసా?"
"వో అన్ని తెలుసు. మా కన్నడం మాస్టారు అంతా బోధపరిచారు" అంటూ మీర లోపలికి వెళ్ళి తన పుస్తకంలో దాచుకొన్న ఆహ్వానపత్రిక తెచ్చి కృష్ణయ్యగారి కిచ్సింది.
సాయింత్రం ఐదు గంటలకల్లా ఆహ్వానితు లతో నిండిపోయింది కాన్వెంటు హాల్. లేత ఆకు పచ్చ లంగా, తెల్లటి సిల్కు జాకెట్ వేసుకొన్న అమ్మయి గేటు దగ్గిర నుంచుని ఎవరికోసమో ఎదురు చూస్తోంది. నర్మద లోపలినుండి పరిగెత్తుకుంటూవచ్చి, "మీరా టీచర్ పిలుస్తున్నారు. డ్రస్ చేసుకుందువుగాని రా" అంబ.
"కాస్త ఉండవే. పెదనాన్న, అన్నయ్య అందరు అయిదింటికే వస్తామన్నారు. ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నా" అంది దూరంలో వస్తూన్న శ్రీపాదు కనిపించగానే "అమ్మయ్యా" అనుకొంటూ లోపలికి వెళ్ళిపోయింది.
ఆరోజు చర్చ్ బిషప్ ఒకాయన అధ్యక్షత వహించారు. ఐదున్నర గ,టలకు కార్యక్రమం ప్రారంభమయింది. ప్రార్ధనానంతరం ఆటల పోటీ లలో గెలిచినా వారికి బహుమతులు పంచిపెట్టారు. తన కొచ్చిన నాలుగు బహుమతులనూ మీర అందుకున్నప్పుడు అందరికన్నా ముందు, చప్పట్లు కొట్టడం ప్రారంభించి, ఆఖరులో నిలిపింది శ్రీపాదు. లంబాడీ నృత్యం, జపానీ నృత్యాలయ్యాక సిండ్రెల్లా నాటకం మొదలయింది. మీర తన శక్తికిమించి అభినయించింది. అందమైన మొహం మరలు గొలిపే అభినయం హావభావాలు అందరి మనసులనూ చూరగొన్నాయి. దేవత ప్రత్యక్షమై తన దండంతో సిండ్రెల్లాను ప్సృశించినప్పుడు క్షణమాత్రంలో చింపిరి దుస్తులు తీసివేసి సర్వాలంకార భూషితురాలై నిలచిన సిండ్రెల్లా చాక చక్యాన్ని అందరూ మెచ్చుకున్నారు, రాజకుమారునితో చేసిన నృత్యం, హాలివుడ్ నృత్యానికన్నా మనోహరంగా ఉందని పొగిడాడు గోపాలం.
