Previous Page Next Page 
అన్వేషి పేజి 5

 

    అయన గొంతు సవరించుకుని కొంతసేపు కూనిరాగం తీసి "గోవర్ధన గిరి ఎత్తిన గోగోపకులా ..." అని పాడి 'అందుకో" అన్నాడు.
    "ఏం దయ్యగారూ-- మళ్ళీ అనండి!"
    "గోవర్ధనగిరి ఎత్తిన గోగోపకులా....."
    "గోవర్ధనగిరి ఎత్తిన గోగోపుకులా....."
    అయ్యగారు నవ్వి, "గోగోపులకా ఏమిటి నీ బొంద! గోగోపకులా..." అని "గోగోపకులా " అని రాగయుక్తంగా పాడారు.
    "గోవర్ధన గిరి నెత్తిన గోగోపులకా" అని పాడింది.
    ఆ పక్కనే ఉన్న గాడిద మంగను ఎవరైనా కొడుతూ ఉంటె ఏడుస్తున్నదనుకుందో ఏమో వెనక కాళ్ళతో పంతులు గారుని తన్నబోయి కట్టేసి ఉండటం వల్ల వీలు కాక తనూ గొంతెత్తింది.
    కస్తూరి కి నవ్వు ఆగక గబగబా అక్కడి నుంచి వచ్చేసింది.

 

                             *    *    *    *


    కస్తూరి అన్వేషణ సాగింది. గిరిధారి అభిరుచులు తెలుసు కనక పూర్వపు గది ఖాళీ చేయటానికి గల పరిస్థితులు కూడా వివరించింది.
    కాని ఎవరూ ఆ విషయాలు పట్టించుకోలేదు.
    అయన ఎవరు? ఏ ఊరు? పెళ్లైందా ? ఏం ఉద్యోగం? ఒకే ప్రశ్నలు.
    "పనీ పాటా లేకుండా ఖాళీగా ఈ ఊరు కెందు కొచ్చి ఉంటున్నారు?" అని మరి కోందరడిగారు. వీటిల్లో వేటికీ ఆమె వారికి నచ్చిన సమాధానాలు చెప్పి మెప్పించ లేకపోయింది. తత్కారణం గా ఆమె ప్రయత్నం ఫలించలేదు.
    అలిసిపోయి కాసిని మంచి నీళ్ళు తాగి వెళదామని అపర్ణ ఇంటికి వచ్చింది.
    "ఏమిటే అలా ఉన్నావు? ఎవరితోనైనా పోట్లాడి వస్తున్నావా?" అని అడిగింది అపర్ణ.
    "కాదమ్మా!" అంటూ సందర్భం వివరించింది. సంగీతం మాట వచ్చేసరికి మంగాలు పాట గురించి చెప్పింది.
    అపర్ణ విరగబడి నవ్వింది. "హాసిని పాపం! నీకూ మీ అయ్యగారికి పెద్ద చిక్కే వచ్చిందే!" అంటూ మళ్ళీ నవ్వింది.
    "అదమ్మా సంగతి . "తేట మజ్జిగ తాగి కొంగుతో చెమట తుడుచుకుంది కస్తూరి.
    'సరే! నీకూ, మీ అయ్యగారికి ఆ సంగీత పాటకురాలి బాధ ఉండదులే, వెళ్ళు. అయితే ఆ అయ్యగారు రసికుడు కూడా నన్న మాట."
    "ఏ అయ్యగారు?"
    "మీ అయ్యగారు కాదులే! నీ మాటలను బట్టి మీ అయ్యగారు గౌతమబుద్దుని అపరావతారం లా కనిపిస్తున్నారు. సంగీతమయ్య గారి విషయం!"
    "మీరు నేర్చుకుంటూన్నారా, అమ్మా! అంతే అయి ఉంటుంది. అవునవును, అదుగో -- ఆ నవ్వే చెబుతోంది. ఎలా రానిచ్చారమ్మా ఆ సంగీతమయ్యను! అడ కరువున పడ్డవాడిలా ఆ చూపులూ, ఆయనా-- ఎబ్బే-- ఛీ ఛీ!"
    "అది సరేలే! అయితే మంగ ఏం పాడిందీ గోగోపులకా" అంటూ అపర్ణ మళ్ళీ నవ్వింది.
    "సరే లెండమ్మా! తీరిగ్గా నవ్వుకోండి! నే వస్తాను."
    "కస్తూరీ! ఈ పుస్తకాలు చదివేశాను. తీసుకెళ్ళి ఇంకేమైనా తెచ్చి పెట్టు" అంటూ ఆ పుస్తకాలిచ్చింది అపర్ణ.
    అవి అందుకుని వెనక్కు తిరిగింది కస్తూరి.

 

                                   10


    కావాలనే కొంచెం వెనకపడి నడుస్తున్న గిరిధారి అప్పటికి దగ్గరగా వచ్చాడు. అటు పక్క మొహరీ మీద కూర్చున్నాడు. నీరు పలచగా పారుతుంది. పెద్ద చెలమలు తీసి నీరు నిలువ చేసి బట్టలు ఉతుకుతున్నారు రజకులు. పని పూర్తీ చేసుకున్నవారు గాడిదల పై బరువు లెక్కించి తిరుగు ముఖం పట్టారు. దూరాన పెద్ద బండ పై కూర్చున్న వ్యక్తీ-- సంగీతం మాస్టారు లా ఉంది- ఎలుగెత్తి ఏవో దరువులు వేస్తూ పాడుతున్నాడు. వంతెన కివతల ఏదో శవం కాలిన బూడిద దూదితో పేర్చిన పడకలా ఉంది. అ ఒడ్డున రెండు వరసల్లో శిధిలమౌతున్న సమాధులు. వాటి కివతలి కాలి బాట పక్కన వర్షాకాలంలో శవ దహనం కోసం కట్టిన మంటపం. ప్రకృతి సాయం సంధ్యకు ముభారి రాగాలాపన తో స్వాగతం చెబుతున్నట్లుగా ఉంది.
    ఏదో లారీ పెద్ద చప్పుడు చేస్తూ ఆలోచనకు అంతరాయం కలిగించింది. ఎంకన్న ఇంకా ఆ జాగాలోనే కూర్చుని ఉన్నాడు. సంఘం హర్షించని మార్గాన ఈ ప్రపంచం లోకి వచ్చినందుకు తను భర్త కాకపోయినా తనను తనే నిందించుకున్నాడు. ఆ కర్తకు ఈ జీవి ఉనికి తెలుసునోం లేదో?
    వెళ్ళి ఓదార్చాలని ఉంది. ఏమని?
    ఇలాంటి సమాధానం దొరకని ప్రశ్నలు సృష్టిలో ఇంకెన్ని ఉన్నాయో? భూగోళం పై జరిగినంత అభివృద్ధి ఖగోళం పై జరిగిన నాడు కూడా ఇవి సమాధానం లేని ప్రశ్నలే!
    ఒక రిక్షా పల్లె వేపు పోతుంది. పల్లెలో ఉంటూ రోజూ పట్నం వచ్చిపోయే రిక్షా అతనేమో!
    "ఒరే, వెంకా! ఈడ కూసున్నావెంరా?" అని పలకరించారు.
    "ఆ! ఏం లే! ఎవరైనా తోడు దొరికితే కలిసి పోదారని!"
    "రా!" రిక్సా ఎక్కు!"
    "నువ్ పోలే!"
    "ఒర్రారా! డబ్బు అడగనులే!"
    ఎంకన్న లేని నవ్వు తెచ్చుకుంటూ వచ్చి ఎక్కాడు. రిక్షా సాగిపోయింది. గిరిధారి లేచాడు. మళ్ళీ వెనక్కు తిరిగాడు.
    ఇంకొక పది గజల్లో తన నివాసం చేరతాడనగా వెనక నుంచి ఎవరో పేరు పెట్టి పిలివటం వినిపించింది.
    తిరిగి చూస్తె నవనీతకృష్ణ. కాంపౌండు గోడ మీది నుంచి అతని తలా భుజాలూ మాత్రం కనిపిస్తున్నాయి.
    "మిమ్మల్నేనండి, మహానుభావా! ఏమిటలా కలలో లాగా నడిచి పోతున్నారు పిలిచినా వినిపించుకోకుండా!"
    గిరిధారి నవ్వుతూ అతన్ని సమీపించి గోడ మీది నుంచే కరస్పర్శ చేశాడు.
    "రండి! లోపలికి వచ్చి మా ఇల్లు పావనం చేయండి!"
    "ఇప్పుడా!"
    "ఏం?"
    "ఏం లేదు. బాగా చీకటి పడింది. వెళ్ళి దీపం వెలిగించాలి!"
    "ఊహూ! అంత బలమైన కారణం కాదు." చేయి వదలలేదు కృష్ణ.
    "రేపు! రేపు తప్పక వస్తాను."
    "మరొక వాగ్దానం!"
    గిరిధారి నవ్వి, "వస్తానుగా?' అని నమ్మ బలికాడు.
    కృష్ణ చేయి వదిలాడు. "సరే! వెళ్ళిరండి!"
    తన గదికి వచ్చి గిరిధారి చేసిన మొదటి పని దీపం వెలిగించటమే. దీపానికి నమస్కరించి పూర్తిగా రాని శ్లోకం చదువుతూ గదిలో దీపం వెలిగించాడు. ఈ పూట ఇదమిత్దమని, స్థిరత్వం లేని ఆలోచనలు మనసును చీకాకు పరుస్తున్నాయి. బ్రతుకులాటను మార్చాలనుకుని సాగిన తను దారి తప్పిన బాటసారి కాలేదు కదా? అర్ధం కాని వ్యధతో , అనుభవానికి దూరమైన శాంతి కోసం అన్వేషిస్తూ తానేక్కడి సాగిపోతున్నాడు? ఏది తన మార్గం? ఎక్కడికి  తన  పయనం?
    గేటు దాటి లోనికి రాగానే కనిపించేవి అటూ ఇటూ ఉన్న పది పన్నెండు కొబ్బరి చెట్లు. గోడ వారగా రకరకాల పూలమొక్కలు, దారికి రెండు వైపులా ముద్ద బంతి చెట్లు, వాకిలి ముందు పందిరి, దానికి దట్టంగా అల్లుకున్న బటాణీ తీగల నుంచి తోరణాలు కట్టినట్లు వేలాడుతున్న రెండు రంగుల పూల గుత్తులు. ఇది నవనీత కృష్ణ , ఇంటి ముందు ఆవరణ లో గల చిన్న తోట తాలుకూ సమగ్ర స్వరూపం. ఇంకా ఏపుగా పెరగవలసినవీ, నిలదొక్కుకుని ప్రాణం పోసుకోవలసినవీ మరికొన్ని మొక్క లున్నాయి.
    "బాగుంది" అన్నాడు వాకిలి అరుగు పై ఉన్న బల్ల మీద కూర్చోబోతూ.
    "ఏమిటి బాగుంది? లోనికి రండి! మిమ్మల్ని బయట వారిని బయట నుంచే సాగానంపటానికి గాదు పిలిచింది?"
    "మరెందుకు? ఎక్కడైతేనేం లెద్దురూ!"
    "ఫర్వాలేదు , రండి సార్! మొహమాట పడకండి! మనం స్నేహితులం."
    దగ్గరకు వచ్చి లెవదీశాడు. ఇంక తప్పదని లేచాడు గిరిధారి.
    లోపల హాలు! ఒక పెద్ద బల్ల మీద రేడియో! దాని మీద ఏవో పత్రికలు, పుస్తకాలు. వాటిల్లో కొన్ని తన దగ్గరి నుంచి వచ్చినవి. గది మధ్యలో పెద్ద గుండ్రని బల్ల . దాని చుట్టూ ఆరు ఫేము కుర్చీలు హాలులో నుంచి లోపలకు వెళ్ళే గది కటూ ఇటూ రెండు అద్దాల బీరువాలు. ఒక దానిలో భారత భాగవతాది గ్రంధాలు. మరొకదానిలో దశావతారాల మట్టి బొమ్మలు మొదలుకొని , గాజు పింగాణి బొమ్మలూ , సముద్రపు చిప్పల వరకూ ఉన్నాయి. హాలు కుడి ఎడమలుగా గదులూ , వాటి సరదాలు!
    గిరిధారిని హాలులో కూర్చోబెట్టి లోనికి వెళ్ళాడు కృష్ణ. అతను గోడ మీది ఫొటోలనూ, ఫ్లవర్ వాక్ లనూ చూడసాగాడు. అలా చూస్తూ ఉండగా ఒక ఫోటో పై అతని దృష్టి ఆగిపోయింది. అందులో ఉన్నది కీర్తి శేషుడైన గృహమేది కావచ్చు. కృష్ణ రాయలు ముమ్మూర్తులా కనిపిస్తున్నాయి. రంగుల ఎన్నర్తిమెంటులో ఠీవిగా వెలిగి పోతున్నాడు.
    కృష్ణ ఇంకా రాలేదు. పరిచయం కాకముందే అవమానించినందుకు ఎదుట పడబోతున్న అపర్ణ కు ఎలా క్షమాపణలు చెప్పుకోవాలో మననం చేసుకుంటూ కూర్చున్నా డతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS