Previous Page Next Page 
ఆఖరి మజిలీ పేజి 5

 

    "అదే నువ్వు....ఇందిర....ఆ ఇందిర...."
    "నీరజా....!" అమాంతంగా నీరజను కౌగలించుకుంది ఇందిర    "ఇందూ!' ఆప్యాయంగా వీపు నిమురుతూ ఇందిర భుజం మీద తల అన్చింది నీరజ.
    "అయ్యో! మన గొడవలో పడిపోయి ఈవిడ సంగతి మర్చిపోయాం! ఇందూ! ఈవిడ పరిస్థితి యెట్లా ఉంది?"
    "చాలా ప్రమాదకరంగా వుంది. ఆపరేషను చేసి శిశువును తీసేయ్యాలి! లేకపోతె ఇద్దరికీ ప్రమాదం. అయినా ప్రాణం మీద కొచ్చేదాకా ఏం చేశావు?"
    "అయ్యో ! నాకు తెలియదు ! మా వారు కూడా ఊళ్ళో లేరు" గద్గాదికంగా అంది నీరజ.
    "మీ వారు వూళ్ళో లేకపోవటానికి దీనికీ ఏం సంబంధం?పద - హాస్పిటల్ కు యంబులేన్స్ కోసం ఫోను చేద్దాం" గబగబా ఫోను దగ్గరకు పరుగు తీసింది.
    క్షణాల మీద సరోజను హాస్పిటల్ కు చేర్చారు. కొంతసేపటికి ఆపరేషను దియేటర్ నుంచి విచారంగా బయటకు వచ్చింది ఇందిర    "ఇందూ! ఎట్లా ఉంది....." నీరజ ఆదుర్దాగా అడిగింది.
    "ఇంకో గంట బ్రతికితే గొప్పే! లాభం లేదు....ఆడపిల్ల! చూద్దువు గాని రా"
    "ఇందూ! ఎలాగైనా సరోజను బ్రతికించు నా ప్రాణం తీసుకోనయినా సరే. సరోజ బ్రతకాలి....ఇందూ. సరోజ...."
    "ఏమిటి నీ పిచ్చి ! ఇచ్చి పుచ్చుకోటానికి ఇదేమైనా వస్తువా! సరోజను బ్రతికించాలనే విశ్వ ప్రయత్నం చేశాం-- కాని లాభం లేదు"
    "ఇందూ!" గొల్లు మంది నీరజ.
    "ఉష్! ఊరుకో. ఇది ఆసుపత్రి. రా లోపలకు" చెయ్యి పట్టుకుని లోపలకు తీసుకెళ్ళింది. ప్రశాంతంగా పడుకుని ఉంది సరోజ. భగవంతుడికి మారు రూపమైన - అభం శుభం తెలియని పసిపాప అమాయకంగా కాళ్ళు చేతులు కదిలిస్తూ, పాప భూయిష్టమైన ఈ లోకంలోకి వచ్చిన నేరానికి "కేర్ కేర్" మంటున్నది. నీరజ చేతనారహితంగా చేష్టలుడిగి కళ్ళప్పగించి ప్రతిమలా నిల్చుండి పోయింది.
    "డాక్టర్!" ఆదుర్దాగా పిలిచింది నర్స్.
    ఇందిర దగ్గర కెళ్ళి చూసింది. నర్సు తెల్లని దుప్పటి సరోజ ముఖం మీదకు లాగింది.
    "ఇందూ! ఏమయింది..ఏం జరిగింది" అస్పష్టంగా పిచ్చి దానిలా ఏదో మాట్లాడ సాగింది నీరజ.
    "సరోజ జీవితం అయిపొయింది -- పద నీరజ...!' నీరజ భుజం చుట్టూ చెయ్యి వేసి బయటకు తీసు కేల్తూ అంది ఇందిర  
    నీరజ కెవ్వున అరిచి విరుచుకు పడిపోయింది.
    నీరజ కళ్ళు తెరిచి చూసింది. తనేక్కడుంది? పక్కనే తెరిచి ఉంచిన గవాక్షం నుంచి బాల భానుడి లేత బంగారు కిరణాలు పల్చగా గదంతా పరుచు కుంటున్నాయి. దూరం నుంచి పక్షుల కిలకిలా రావాలు మృదువుగా వినపడుతున్నాయి. చల్లని గాలి నెమ్మదిగా వీస్తున్నది. అప్పుడే ఇందిర నీరజ దగ్గరగా వచ్చింది.
    "ఇందూ! ఏం జరిగింది? నేనెక్కడున్నాను?' నీరసంగా అంది నీరజ.
    "ఏమీ కాలేదు? మా ఇంట్లోనే వున్నావు" నీరజ పక్కనే కూర్చుంటూ అంది ఇందిర.
    "పాపేదీ?"
    "పాపకేం ఫరవాలేదు. చూస్తావా? తీసుకొస్తా నుండు."
    పొత్తిళ్ళ లో పాపను చుట్టి నెమ్మదిగా తీసుకొచ్చింది ఇందిర పాపను చూస్తూనే వెక్కి వెక్కి ఏడ్చింది నీరజ.
    "నీరూ! అట్లా అధైర్య పడితే యెట్లా చెప్పు! ఈసమయంలో నువ్వు ధైర్యంగా ఉండక పొతే నీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఎంత నీరసంగా ఉన్నావో తెలుసా?"
    "ఇందూ! నీకు తెలియదు . నేను యెట్లా బ్రతుకుతున్నానో! అసలు నేనెందుకు ఎవరి కోసం బ్రతకాలో తెలియని స్థితిలో ప్రాణాలు తీసుకునే ధైర్యం లేక నిర్జీవంగా బ్రతుకుతున్నాను. ఇప్పుడు ఈ స్థితిలో భగవంతుడు నాకీ విషమ పరీక్ష పెట్టాడు...." ఆయాసంతో గుండెలు ఎగిసి పడుతుంటే బాధగా చేత్తో గుండెలు రాసుకుంది నీరజ.
    "నీరూ ఇప్పుడు నువ్వేమీ మాట్లాడవద్దు! ఇదిగో ఈ మాత్ర వేసుకుని పాలు తాగి పడుకో"
    నీరజ కు మాత్ర వేసి పాలు తాగించి నీరజను నిద్ర పొమ్మని మరీ మరీ చెప్పి పాపను తీసుకుని లోపల ఉయ్యాలలో పడుకో బెట్టింది . వేడి నీళ్ళ స్నానం చేసి కాసిని పాలు తాగి వంటమనిషి సుందరమ్మ తో నీరజను, పాపను జాగ్రత్తగా చూడమని చెప్పి మేడ మీదకు తండ్రి దగ్గరకు వెళ్ళింది.
    "ఇందూ ఎవర్ని తీసుకొచ్చావు? రాత్రి కనబడనే లేదేమమ్మా! అంటూ ఆత్రంగా అడిగారు మాధవరావు గారు కూతుర్ని చూస్తూ.
    "డాడీ! నీరజ....మన నీరజ. జ్ఞాపకం ఉంది కదూ! దానికి రాత్రంతా స్పృహ లేదు. అందుకని మీ దగ్గరకు రావటానికి వీలు కాలేదు"
    "ఎవరూ? నీరజా! స్పృహ లేక పోవతమేమిటమ్మా! ఎట్లా వుంది ఇప్పుడు. భగవంతుడు నాకు కాలు చెయ్యి లేకుండా చేశాడు. యెట్లా ఉందమ్మా నీరజకు... అసలెలా వచ్చిందిక్కడికి...?" ఆదుర్దాగా అడిగారాయన. జరిగిన విషయమంతా క్లుప్తంగా చెప్పింది ఇందిర.
    "సాయంత్రానికి కులసాగానే ఉంటుంది డాడీ. షాక్ కి తట్టుకోలేక పోయింది. కొంచెం కులసాగానే ఉంటె సాయంత్రం మీ దగ్గరకు తీసుకు వస్తాను" నేను హాస్పిటల్ కి వెళ్తున్నాను... మీరీ మందులు వేసుకోండి" అని బయలుదేరింది ఇందిర.    
    మధ్యాహ్నం ఇంటికి వస్తూ దారిలో డాక్టర్ శేఖర్ డిస్పేసరీ కి వెళ్ళి అతన్ని తన వెంట తీసుకొచ్చింది ఇందిర.
    శేఖర్ డిస్పన్సరీ పెట్టుకున్న ఇంటాయనకీ మాధవరావు గారికి బాగా స్నేహం. మాధవరావు గారిని చూడటానికి ఆయనెప్పుడూ శేఖర్ కారు లోనే వచ్చేవాడు. ఇద్దరూ డాక్టర్లవటం వలన ఇందిరకూ, శేఖర్ కి మంచి స్నేహం కుదిరింది.
    శేఖర్! నా స్నేహితురాలు. నీరజ " అని పరిచయం చేసింది శేఖర్ కి.
    "నమస్తే అంది నీరజ.
    కొంతసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఇందిర శేఖర్ ని తండ్రి దగ్గరకు తీసుకెళ్ళింది.
    "శేఖర్ రాత్రిళ్ళు నిద్ర ఏమాత్రం పట్టట ల్లేదు! చాలా బాధగా ఉంటున్నది" అన్నారాయన.
    బి.పి. చూసి పక్కనే పెడ్తూ అన్నాడు శేఖర్. "మీరు బాగా ఆలోచిస్తున్నట్టున్నారు-- మనసులో ఏ ఆలోచనా ఉండకూడదు -- మీకు ఏ రకమైన ఉద్రేకమూ పనికి రాదు"
    "ఏముందయ్యా ఆలోచన -- మా ఇందిర పెళ్ళి గురించి తప్ప" అన్నారు నీరసంగా.
    శేఖర్ ఇందిర వైపు చూసి నవ్వుతూ "ఎండుకాలోచన పెళ్ళి చేసుకుంటే అయన మనసు నిశ్చింతగా ఉంటుంది కదా!" అన్నాడు.
    ఇందిర ముఖం నల్లగా కమిలిపోయింది.
    ఏవో కొన్ని మందులు ఇచ్చి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు శేఖర్.
    వెళ్ళేటప్పుడు ఇందిరకు పదేపదే చెప్పి వెళ్ళాడు -- అయన పరిస్థితి ఏమీ బాగాలేదని -- ఎటువంటి ఆందోళనా అయన హృదయం భరించగలిగే స్థితిలో లేదని.

                                     
    శేఖర్ వెళ్ళిపోయిన తరువాత నీరజచేత భోజనం చేయించి తను కూడా కొద్దిగా తిని తండ్రికి మాత్ర ఇవ్వటానికి పైకి వెళ్ళింది ఇందిర.
    "ఇందూ! నేనింకా ఎంతో కాలం బ్రతకను-- బాగా ఆలోచించుకో" అని చెప్పారాయన పడుకో బోతూ.

                       *    *    *    *
    నాలుగు రోజుల తర్వాత నీరజ కాస్త కోలుకుని లేచి ఇంట్లో తిరగసాగింది. సాయంత్రం పాపకి పాలు పట్టి పడుకో బెట్టి ఇంటి ముందు లాన్ లో కుర్చీలు వేసుకుని కూర్చున్నారిద్దరూ.
    ఇందిర పాపకు స్వెట్టర్ అల్లుతున్నది. నీరజ జాజిపూలు దండ కడుతున్నది. ఒడిదుడుకులు సర్దుకుని ప్రశాంతంగా కూర్చున్నారిద్దరూ.
    ఇందిరను పరిశీలనగా చూసింది నీరజ. స్కర్టు, స్లీవ్ లెస్ బ్లౌజు - బాబ్డ్ హెయిర్ -- ఆ రోజుల్లో ఇందిరకూ , ఈ ఇందిరకూ అసలు పోలికే లేదు.
    తెల్లని చీర -- చేతి నిండా గాజులు -- నుదుట కుంకుమ -- సాధారణ స్త్రీలా ఈ చిన్న కుటీరం లో ఏ బాదరబందీ లేకుండా ఒక యోగి నిలా ఉంది. చిలిపితనం, అహంభావం, పొగరు మోతు తనం పెల్లుబికిన ఆ నీలి  కళ్ళల్లో -- చక్కని ప్రశాంతత దైవ దర్శనం కోసం భక్తుడి ఆవేదన లాంటిది చోటు చేసుకున్నాయి. శూన్యం లోకి చూస్తె ఆ కళ్ళల్లో నిరీక్షణ కొట్టవచ్చినట్టు కనబడుతూనే ఉంది.
    నీరజ ఆశ్చర్యపోయింది.
    "ఇందూ! ఒక విషయం అడుగుతాను"
    "అడుగు...." అంది నవ్వుతూ.
    "నీలో ఇంత మార్పు నాకాశ్చర్యంగా వుంది. అప్పుడు చదువుకునే రోజుల్లో నీకూ... ఇప్పటి నీకూ అసలు సంబంధమే లేదు"
    ఇందిర పెదవుల పై చిరునవ్వు తళుక్కు మంది.
    "ఇందూ! ఇంత అందం అడవి కాచిన వెన్నెలయితే ఎలా?"
    అస్తమిస్తున్న సూర్యుడి ఎఱ్ఱని కిరణాలకు చెవుల కున్న దిద్దు లలోని రవ్వలు -- కెంపులు నీలాల కాంతులు చెక్కిళ్ళ మీద దోర్లిస్తుండగా ఆ చెక్కిళ్ళ అందాలు చూస్తూ అంది నీరజ.
    ఇందిర మాట్లాడలేదు.
    "ఇందూ! ఇంకో విషయం. హటాత్తుగా మీరు వెళ్ళిపోయారా! తర్వాత ఎంత గొడవ జరిగిందనుకున్నావ్?"
    "ఏం జరిగిందేమిటి?"
    "శ్రీధర్ లేడూ -- నీ రైవల్! అతన్ని డిస్ మిస్ చేశారనీ -- దానికి కారణం నువ్వే ననీ -- రకరకాలుగా అనుకున్నారు-- కాని పాపం అతను మళ్ళీ కనపడనే లేదు. ఏమయ్యాడో ఎక్కడున్నాడో "
    కడ్తున్న మాల వంక చూస్తూ చెప్పుకు పోతున్న నీరజ తెలేత్తేసరికి అక్కడ ఇందిర లేదు.
    అరె! ఇదేమయింది? ఎక్కడికి వెళ్ళింది" అనుకుంటూ లోపలికి నడించింది నీరజ  ఇల్లంతా వెతికినా ఎక్కడా కనపడలేదు ఇందిర. వంట గది పక్కగా ఉన్న ఒక చిన్న గదిలో కృష్ణుడి పటాని కెదురు గుండా నిలబడి నిశ్చలంగా చూస్తూ నిలబడి ఉంది. కొంతసేపు తనూ అక్కడే చూస్తూ నిలబడింది నీరజ.
    "సారీ! ఇందూ' నీ మనస్సు నొప్పించాను కదూ"
    "అబ్బే! అదేం లేదు" రోజూ నేనీ వేళకు ప్రార్ధన చేసుకుంటాను-- అందుకని లేచి వచ్చేశాను- అంతే" అంది ఇందిర బయటకు వస్తూ.

                            *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS