స్వర్ణదీ స్వర్ణ కంజ కింజల్కములకు
పసిమి దిద్దెడి గిరికన్య పాణితలము
పట్టుకొని వీడగాలేడు భవుడు; మేను
పులకరింపగ వలపులు తొలకరింప.
ముద్దు లొలికెడి పగడాలమోవిమీద
తళుకు చిఱునవ్వు ముత్యాలు తద్గుణింప
"స్వామి! యేమిది?" యనుచు లజ్జా వినమ్ర
ముఖి యయి యొకింత వారించె ముగుద మునిని.
.jpg)
అంత మహేశ్వరుండు హృదయమ్మును మెల్లగ నిగ్రహించి య
త్యంత తపోవిభంగమున కాగ్రహముం గొని, విఘ్నకారణ
మ్మింతకు నెద్దియంచు గనియెన్ నలుదిక్కులు - కానిపించె నా
పొంతనె పువ్వుటీరమున పూవిలుకాడు సతీసమేతుడై.
ఆక్షణమ శూలి రూక్ష ఫాలేక్షణమున
ఉదయమందెను ప్రళయ మహోగ్రశిఖలు;
"పాహి పాహి ప్రభో! ప్రభో! పాహి" యనెడి
సురల యార్తధ్వనుల్ మింత సుళ్ళు తిరిగె.
అగ్గిరిశు ఫాలనేత్రంపు టగ్గిలోన
భగ్గుమన్నాడు క్షణములో ప్రసవశరుడు;
మంచుగుబ్బలి గుహలలో మారుమ్రోగె
తేటి జవరాలి జాలి కన్నీటిపాట.
ఆ కరుణగానమే - ఆ యనంత విరహ
విశ్వసంగీతమే -పంచమస్వరాన
గాన మొనరించినది మన "కాళిదాస"
కోకిలమ్ము "వియోగినీ" కూజితముల.
పుష్పవిలాపము
చేతులారంగ నిన్ను పూజించుకొఱకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను;
గంగలో మున్గి ధౌతవల్కలము గట్టి
పూలు గొనితేర నరిగితి పుష్పవనికి.
నే నొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళువిప్పి "మా
ప్రాణము తీతువా" యనుచు బావురుమన్నవి - క్రుంగిపోతి - నా
మానసమం దెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై.
"తల్లి యొడిలోన తలిరాకు తల్పమందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె! మోక్షవిత్తమ్ముకొఱకు!
హృదయమే లేని నీపూజ లెందుకోయి?
జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు!
బుద్ధియున్నది; భావసమృద్ధి గలదు;
బండబాఱెనటోయి! నీ గుండెకాయ;
శివునకై పూయదే నాల్గు చిన్నిపూలు?
ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తుము -తదీయ కరమ్ములలోన స్వేచ్చమై
నూయల లూగుచున్ మురియుచుందుము -ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము - ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.
గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ముబోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో
తాళుము త్రుంపబోవకుము; తల్లికి బిడ్డకు వేఱుసేతువే!
ఆత్మ సుఖమ్ము కోసమయి! అన్యుల గొంతులు కోసితెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును! నెత్తురు చేతిపూజ వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచరవర్తి ప్రభుండు మా పవి
త్రాత్మల నందుకోడె; నడుమంత్రపు నీ తగులాట మేటికిన్?
ఊలుదారాలతో గొంతు కురి బిగించి
గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము
అకట! దయలేనివారు మీ యాడువారు!
గుండెతడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపుకొఱకు
పులుముకొందురు హంత! మీ కొలమువారు!
అక్కట హాయిమేయు మహిషాసురు లెందరో నాల్గుప్రక్కలన్
ప్రక్కలమీద చల్లుకొని, మా పసిమేనులు పాడుకాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి -దొర్లి - మఱురోజుదయాననె వాడి వత్తలై
ఱెక్కలు జారిపోన్ పరిహరింతురు మమ్ముల బెంటదిబ్బపై !
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవనమెల్ల కొల్లగొని ఆపయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురుగదా! నరజాతికి నీతి యున్నదా!
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్యచేసెడి హంతకుండ!
మైలపడిపోయెనోయి! నీ మనుజజన్మ.
పూజలేకున్న బాబు నీ పున్నెమాయె!
కోయబోకుము మా పేద కుత్తుకలను;
అకట! చేసేత మమ్ముల హత్యచేసి
బాపుకొనబోవు ఆ మహాభాగ్యమేమి?"
ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి
నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;
ఏమి తోచక దేవర కెఱుక సేయ
వట్టిచేతులతో నిటు వచ్చినాను.
.jpg)
అది రమణీయ పుష్పవన - మావనమం దొక మేడ - మేడపై
నది యొక మాఱుమూలగది - ఆ గదితల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్ల యీడుగల బాలిక - పోలిక రాచపిల్ల -జం
కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందకు మెట్లమీదుగన్ !
కన్నియలాగె వాలకము కన్పడుచున్నది - కాదు కాదు - ఆ
చిన్ని గులాబి లేత అరచేతులలో -పసిబిడ్డ డున్నయ
ట్లున్నది - ఏమి కావలయునోగద ఆమెకు - అచ్చు గ్రుద్దిన
ట్లున్నవి - రూపురేక - లెవరో యనరా దత డామెబిడ్డయే!
