Previous Page Next Page 
చీకటి తొలగిన రాత్రి పేజి 5


    జూ అంతా తిరిగి, ఎలిఫెంట్ రైడ్, బోట్ షికారు అన్నీ పూర్తయ్యేసరికి ఆరుగంటలయింది, ఇంటికి వచ్చేసరికి ఏడయింది.

                                        *  *  *  *  *

    పూరీలో బి.యన్.ఆర్. హోటలు సముద్రం ఎదురుగా వుంటుంది.  సముద్రానికి దగ్గరగా వుండడంతో వీకెండ్స్ కి, శలవులకి వచ్చే ఫారినర్స్ తో ఆ హోటలు ఎప్పుడూ నిండుగానే వుంటుంద. రూమ్ కావాలంటే కనీసం ఇరవైరోజుల ముందన్నా బుక్ చేసుకోవాలి! ఆ హోటల్ నుంచి తిన్నగా సముద్రపు ఒడ్డువరకు సిమెంట్ తో పుట్ పాత్ వేశారు. స్విమ్మింగ్ కి వెళ్ళదలచిన వాళ్ళందరూ హోటలులోనే డ్రస్సయి తిన్నగా సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోతారు పైన ఏ బాత్ రోబ్ వో డ్రెస్సింగ్ గౌనో కప్పుకుని, హోటలంతా తెల్లవాళ్ళతో, పిలిచేసరికి హాజరయ్యే తెల్ల బట్టల నల్ల అటెండరతో కళకళలాడుతూ వుంటుంది. విదేశ పద్ధతులలో భోజనం, బ్రేక్ ఫాస్ట్ వగైరాలు సర్వ్ చేస్తారు.
    ముందుగానే మాకోసం రెండురూములు బుక్ చేశారు. ఉదయం బయలుదేరి తొమ్మిదిగంటలకల్లా పూరీ వచ్చేశాం. కారు హోటలుముందు ఆగేసరికి తెల్లటోపీలు పెట్టుకున్న బైస్తవాళ్ళు "గదాయిచోకి బాబూ!" అంటూ చుట్టుముట్టారు.
    "వీళ్ళెవరు ఏమిటంటున్నారు?" రామావతారం కుతూహలంగా అడిగాడు.
    "బైస్తవాళ్ళు...సముద్రంలో స్నానం చేస్తారా? అని అడుగుతున్నారు... ఈత రానివాళ్ళని పట్టుకుని జాగ్రత్తగా స్నానం చేయిస్తారు... సరిగా ఈదలేనివారి ప్రక్కనవుండి జాగ్రత్తగా చూస్తారు... వీళ్ళకి యిదే వృత్తి. రోజుకి అధమం వందేసి రూపాయలైనా సంపాదిస్తారు. సాధారణంగా యిక్కడికి వచ్చే ఫారెనర్స్ అందరూ స్విమ్మింగ్ కే వస్తారు.. పిల్లలని వీళ్ళకి అప్పచెప్పి చూడమంటారు. స్విమ్మింగ్ కి వెళ్ళినప్పుడు... కారు రాగానే పట్టుకుంటారు అందరినీ" అని చెప్పాను. "నై ఏదైనై! ఆమెరోయి బాకు ఆసిచ్చి, పోరే దేఖిబా" అంటూ వాళ్లని పంపేశాను.
    గదుల్లో సామాను సర్దుకుని కాఫీ తెప్పించుకు త్రాగాం.
    "ముందు దేవాలయానికి వెళదామా. సముద్రం దగ్గిరకి వెళదామా?" మీనాక్షిని అడిగాను.
    ఆ...ఆ.. ముందు సముద్రం దగ్గిరకే వెళదాం, స్విమ్మింగ్ కి అవకాశమే లేదు కలకత్తాలో... పిల్లలకి స్విమ్మింగ్ అంటే చాలా యిష్టం..." చిన్నపిల్లలా సరదాపడి లేచిపోయింది మీనాక్షి. మీనాక్షికి స్విమ్మింగ్ బాగా వచ్చట! తరచు వీకెండ్స్ కి సముద్రతీరాలకే వెళ్ళేవారట! స్విమ్మింగ్ సూట్ వగైరా తెచ్చుకుని వచ్చింది.
    రామావతారానికి స్విమ్మింగ్ రాదట!
    "ఆయనకి నీళ్ళంటేనే భయం... స్విమ్మింగ్ ఏమిటి నామొహం.... చెప్పాగా ఉత్త బుద్ధవతారం అని.. వెక్కిరిస్తూ" అంది మీనాక్షి. రామావతారాన్ని నేను పిలిస్తే "మీరు వెళ్ళండి.. ఐయామ్ నాట్ ఇంటరెస్టుడ్ ఇన్ స్విమ్మింగ్, మీరంతా వెళ్ళండి.. కాసేపు హాయిగా పడుకుంటాను" బద్ధకంగా అన్నాడు.
    శాంతీ రానంది. శాంతికీ ఈతరాదు. శాంతికీ ఓ విధంగా నీళ్ళంటే భయమే. "పోనీ వూరికే ఒడ్డున కూర్చోండి వచ్చి, సముద్రం చూద్దురుగాని రండి.." అని బలవంతపెట్టాను. మీనాక్షి, నేను ఇద్దరం వెళ్ళాలంటే కాస్త బిడియం అనిపించి పిల్చాను.
    "రండి బాబూ. ఇంతదూరం పడుకోడానికి వచ్చారేమిటి అక్కడొచ్చి కూర్చోండి" మీనాక్షి బలవంతపెట్టింది విధిలేనట్టు లేచాడు రామావతారం.
    మీనాక్షి బట్టలు మార్చుకోడానికి వెళ్ళింది. మీనాక్షి పిల్లలిద్దరూ స్విమ్మింగ్ సూట్లు వేసుకుని అప్పుడే తయారయిపోయాను. మా వాళ్ళిద్దరికి ఈత రాకపోయినా నీళ్ళలో గెంతాలని సరదా! శాంతి ఇద్దరికి బట్టలు మార్చి చిన్నచిన్న కట్ డ్రాయర్లు కట్టింది, నేనూ బట్టలు మార్చుకుని, స్విమ్మింగ్ ట్రంక్ తొడుక్కుని బాత్ రోబ్ కట్టుకుని వచ్చాను. బ్యాగ్ లో తువ్వాళ్ళు పెట్టింది శాంతి.
    డ్రస్సయి వచ్చిన మీనాక్షి వంక చూడ్డానికి నాకు కాస్త అదోలా అనిపించింది. సిగ్గుపడి మొఖం త్రిప్పుకున్నాను. ఆకుపచ్చ బికినీ, పైన తొడుక్కున్న పల్చటి నైలాన్ నెగ్ ల్చీలోంచి కనిపిస్తూంటే అదోలా ఫీలయ్యాను. మన ఆడవాళ్ళు స్విమ్మింగ్ సూట్లు, బికినీలు కట్టుకోడం అలవాటు లేకపోవడం చూడకపోవడం నించి అలా అనిపించి వుంటుంది. విదేశంలో ఇది సర్వసాధారణం. స్విమ్మింగ్ లు అవి బాగా అలవాటయిన మీనాక్షి ఏమాత్రం సంకోచం లేకుండా వచ్చి నిల్చుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS