"ఎందుకు నాయనా, నీ ప్రశ్నలతో ప్రాణాలు తోడెయ్యటానికా?" అవధాన్ల జవాబుకు గోపాలం ముసిముసిగా నవ్వుకున్నాడు.
ఇంతలో ఏదో శవం ఎదురయింది. శవవాహకులు ;హరేరామ హరేరామ!' అంటున్నారు. పక్కనే నడుస్తున్న కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు. కొందరి మొహాల్లో విషాదం అలుముకొనివుంది. చనిపోయినవాని కొడుకు నిప్పుకుండ పట్టుకొని తలవంచుకొనినడుస్తున్నాడు.
'అట్లా ఎదురెళతావేం? కొంచెం తప్పుకో!" అంటూ అవధాన్లు గోపాలం రెక్క పట్టుకుని పక్కకు లాగాడు.
అవధానులు పేవ్ మెంటుమీద ఓరగా నిల్చొని, కళ్ళు మూసుకుని భగవంతుని ధ్యానించాడు. "భగవాన్! ఈ మృతుని ఆత్మకు శాంతి కలుగునట్లు చెయ్."
గోపాలం అవధాన్లనే చూస్తూ నిల్చున్నాడు. చావు బ్రతుకుల గురుంచి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. బ్రతుకులో వుండీ చావులో లేనిదీ ఏమిటి? అంతవరకు ప్రవహించే అంతర్వాహిని ఒక్కసారిగా ఎలా ఎండిపోతుంది? ఆ చైతన్య స్రవంతి అకస్మాత్తుగా ఎలా గడ్డ కట్టుకు పోతుంది? బ్రతుకులో వున్న సమస్యలూ, బాధలూ చావులో ఉండవు. కాని మానవుడు చావంటే ఎందుకు భయపడతాడో? బహుశా తనులేని ఈ ప్రపంచాన్ని ఊహించుకొని సహించలేకనేనేమో?
"ఇవ్వాళ ముక్కోటి ఏకాదశి! ఎంత పుణ్యంచేసుకుంటే ఇవ్వాళ చావు లభిస్తుంది!" తన్మయత్వంతో అన్నాడు అవధాన్లు.
"అదేంటండోయ్! ఆ చావు మీకే లభించినంత ఆనందబడిపోతున్నారు." అనేసి గబుక్కున నాలుక కరచుకున్నాడు గోపాలం.
అవధాన్లు చురచురా చూశాడు గోపాలం మొహంలోకి.
గోపాలం తన చూపుల్ని మరోవైపుకు తిప్పుకున్నాడు. సిద్దాంతి కోపాన్ని గమనించనట్లే అన్నాడు. "అయితే గురువుగారూ! ఇవ్వాళ చనిపోయినవాళ్ళ ఆత్మ తిన్నగా వైకుంఠానికే వెళుతుందంటారు! అవునా?"
ఆ ప్రశ్న మళ్ళీ సిద్దాంతిని తన్మయంలోకి నెట్టేసింది. "అవునయ్యా గోపాలం, ఇవ్వాల్టి రోజు వైకుంఠ ద్వారాలన్నీ బార్లా తెరిచి వుంటాయి. తిన్నగా ఆ శేషతల్పశాయి పాదపద్మాల దగ్గరకే వెళ్ళి పోవచ్చును." అరమోడ్పు కన్నులతో సాక్షాత్తూ తనే వెళ్ళి ఆ శేషతల్ప శాయి పాదాల దగ్గిర నిల్చున్నట్లు ఆనంద పారవశ్యంలో అన్నాడు.
"అయితే స్వామీ! ఆత్మ అనేది ఒకటి వుందంటారు?"
"అయ్యో! అయ్యో! ఎంతమాట! ఈ క్షణభంగురమైన శరీరంలో అమరమైన ఆత్మ వుంటుంది. ఆత్మకు చావులేదు. ఆత్మ అమరం. ఈ శరీరం కేవలం మన ఒంటిమీది చొక్కాలాంటిది. అది మాసిపోతే తీసేసి మరొకటి ధరిస్తాం. అలాగే ఆత్మకూడా శిధిలమైన శరీరాన్ని విసర్జిస్తుంది."
"మరి ఒకోసారి పసి శరీరాన్ని, మంచి వయసులో వున్న శరీరాల్నికూడా అకస్మాత్తుగా వదిలేస్తుంది మీ ఆత్మ?"
సిద్దాంతి ముఖంలో కోపం చిక్కుపడింది. "అదంతా పూర్వజన్మ కృతవిశేషం. ఈ భూమిమీద వారికి ఎంత రుణంవుంటే అంతే అనుభవించి వెళ్ళిపోతారు."
"కొందరు పుట్టగానే ఏమీ అనుభవించకుండానే వెళ్ళిపోతారు. కొందరు పుడుతూనే జీవరహితంగానే పుడతారు?"
సిద్దాంతి ముఖంలో చిక్కుపడిన కోపం గట్టిముడిగా మారింది. పలక్కుండా నడుస్తున్నాడు.
"కోపం వచ్చినట్లుందే?"
"కోపం ఎందుకూ?" కోపంగా అన్నాడు సిద్దాంతి.
"ఒక్క ప్రశ్న అడగమంటారా?"
"ఊఁ"
"ఆత్మ అంటే ఏమిటి స్వామీ ! దానిని ఈ శరీరం తాలూకు ఆది వ్యాధులూ, ఈతిబాధలూ సోకుతాయా? ఈ శరీరంతోపాటు మనిషి లోని ఆత్మకూడా బాధకు గురి అవుతుందా?" గోపాలం తెచ్చిపెట్టుకొన్న వినయంతో ప్రశ్నించాడు.
అవధాని ముఖంలో కోపం ముడివిడిపోయింది. అలారా దారికి! అనుకున్నాడు. ముఖం గంభీరంగా మారిపోయింది.
శరీరం, ఇంద్రియాలూ, మనస్సు, బుద్ధి, వీటి అన్నిటికీ అతీతమైంది, సత్-చిత్-ఆనందస్వరూపమైందీ ఒకటి వుంది. అదే ఆత్మ. ఆత్మనిత్య నిర్మలమయింది. సర్వస్వతంత్రమైంది. ఆత్మస్వయం ఆనంద స్వరూపం. దానికి బాధలేమిటీ? ఆత్మ కేవలం ఆ పరమాత్మ అంశమే. దానికి శరీరం తాలూకు అధివ్యాధులు కానీ కల్మషంగానీ అంటవు." ఉపన్యాసం ఇస్తున్న ధోరణిలో చెప్పుకుపోతున్నాడు సిద్దాంతి.
"మీలోనూ నాలోనూ ఉన్న ఆత్మ ఒకటేనా స్వామీ?"
"అక్షరాలా! నీలోనూ, నాలోనూ, ఆమాటకొస్తే సమస్త జీవరాసుల్లో వున్న ఆత్మస్వరూపం ఒకటే. అంతా ఆ పరమాత్మ అంశం. యోగమాయచేత కప్పబడిన ఆత్మ తన అసలు స్వరూపాన్ని విస్మరించి ఈ భౌతిక సుఖాల కోసం ప్రాకులాడుతుంది." గొప్ప తత్వవేత్తలా మొహంపెట్టి మాట్లాడుతున్న సిద్దాంతిని చూస్తుంటే గోపాలానికి నవ్వొచ్చింది.
"ఎందుకయ్యా నవ్వుతావ్?" ఉక్రోషంగా ప్రశ్నించాడు సిద్దాంతి.
"పరస్పర విరుద్ధంగా వుండే మీ సిద్దాంతాలను వింటుంటే నవ్వొస్తుంది." అన్నాడు గోపాలం చిరునవ్వుతో.
అవధాన్లుకు అగ్గిలో వేసి పొర్లించినట్లుంది.
"రండి! అలా ఆ బెంచీమీద కూర్చుందాం." అవధానిజవాబుకు ఎదురుచూడకుండానే గోపాలం పబ్లిక్ గార్డెన్ గేటుకు దగ్గిరగా వున్న బెంచీమీద కూర్చొన్నాడు.....అవధాన్లు గోపాలాన్ని యాంత్రికంగా అనుసరించాడు. అతని మనస్సు గోపాలం వేసిన ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. ఈ గడుగ్గాయి చిన్నప్పటినుంచీ ఇంతే. అప్పటికి గోపాలానికి మహావుంటే ఎనిమిదేళ్ళుంటాయేమో! ఒకనాడు తను గోపాలం నాన్నతో ఎవరో చచ్చిపోయారని చెబుతున్నాడు. ఆ పక్కనే బొమ్మల పుస్తకాల్లోని బొమ్మల్ని కత్తిరిస్తూ కూర్చున్న గోపాలం లేచి తండ్రి దగ్గర కొచ్చాడు.
