అయినా సాంబయ్యను ఊళ్ళో వాళ్ళు వెలివేసినట్లు చూడసాగారు. కాని నిజానికి జరిగింది - సాంబయ్యనుంచి వాళ్ళే దూరమైపోయారు. సాంబయ్యకు ఇటు అత్తవారితో కూడా సంబంధాలు తెగిపోయినై.
దుర్గమ్మ చావుతో సాంబయ్యలో కొంత మార్పు రాకపోలేదు. పొలమూ, సంపాదనామీద కేంద్రీకరించివుండే అతనిధ్యాస కొంతవరకు కొడుకుమీదకుకూడా మళ్ళింది.
నామకరణం రోజున ఊళ్ళోవాళ్ళను కొందర్ని పిలిచాడు. అ పిలిచినవాళ్ళలో కూడా వచ్చినవాళ్ళు చాలా తక్కువమంది. అందులో ముఖ్యుడు కనకయ్య. కనకయ్య చాలా బీదతనంలో వున్నాడు. అతను చేసే పనల్లా పొలాలు అమ్మిపెట్టటం, కొనిపెట్టటమూను. ఆ సందర్భాల్లోనే సాంబయ్యకు కనకయ్య అవసరం కలిగేది ఏ కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో వుందో, దొడ్డీదోవలు ఎవరెవరు అమ్ముకొనే స్థితిలో పడ్డారో - ఆరాలు తీసి కనకయ్య సాంబయ్య చెవులో ఊదేవాడు. అప్పట్నుంచి సాంబయ్య, వాళ్ళు అమ్మేదాకా పనికట్టుకొని వెళ్ళి వాళ్ళను పలకరించి వస్తూండేవాడు సాంబయ్య కనకయ్యను పూర్తిగా నమ్మేవాడుకాదు. గీచిగీచి ఆరాలు తీసేవాడు సాంబయ్య.
"ముహూర్తం దగ్గిరపడుతుంది. మరి నామకరణం కానిద్దామా?" అన్నాడు పురోహితుడు.
"కొంచమాగండి! ఇంకా రావాల్సినవాళ్ళు చాలామంది వున్నారు" అన్నాడు కనకయ్య.
"వచ్చినంత వరకు చాలు, ఇహ కానియ్యండి" అన్నాడు సాంబయ్య.
ఇక వచ్చేవాళ్ళు లేరని సాంబయ్యకు తెలుసు. ఆ సంగతి తెలిసే, సాంబయ్య దృష్టికి తేవటానికి అలా అన్నాడు కనకయ్య. సామ్బయ్యకు కావాల్సినవాడు తనేననే ఉద్దేశ్యాన్ని సాంబయ్యకు తెలియజెప్పడంలో లౌక్యాన్ని ఉపయోగించాడు కనకయ్య.
సాంబయ్య కొత్తపంచలు కట్టుకొని, కొడుక్కు కొత్తచొక్కా తొడిగి ఒళ్ళో కూర్చోపెట్టుకొని పీటమీద కూర్చున్నాడు. తతంగం పూర్తిచేసి పురోహితుడు అడిగాడు:
"పేరు - పేరు చెప్పండి!"
"వంశోద్దారకుడు వాడు. వాళ్ళనాన్నగారిపేరే పెట్టుకుంటాడ్లే సాంబయ్య." కుర్రాడి బుగ్గ నిమురుతూ అన్నాడు కనకయ్య.
సాంబయ్య ఓ క్షణం ఆలోచనలో పడ్డాడు.
"వెంకటపతి!"
"ఆహా తండ్రి పేరు కలిసొచ్చేట్టు మామంచిగా పెట్టుకొన్నాడు సాంబయ్య" అన్నాడు కనకయ్య సాంబయ్యను ఉబకేస్తూ.
ఎప్పుడూ నవ్వని సాంబయ్య మొహంలో నవ్వు కన్పించింది.
"మాతాతపేరు చలపతి. మా నాన్నపేరు వెంకయ్య. తండ్రి తాతల పేర్లు కలిసొచ్చేట్టు పెట్టాను. ఎలా వుంది?" అన్నాడు సాంబయ్య.
"ఓహో! ఇంకేం? తండ్రి తాతల పేర్లు బాగా కలిశాయి. వెంకటపతి! చాలా బాగుంది. ఇదిగో ఇక్కడ బియ్యంమీద రాయండి!" అన్నాడు పురోహితుడు బ్రహ్మయ్య.
సాంబయ్య ముఖం చూసి నాలుక్కొరుక్కొని బ్రహ్మయ్య తనే పళ్ళెంలో వున్న బియ్యం మీద "వెంకటపతి" అని రాశాడు. మరో పది నిముషాలు హడావిడి చేసి, సంభావనలన్నీ రాబట్టుకొని చక్కాపోయాడు పురోహితుడు బ్రహ్మయ్య.
భోజనాలయాక కనకయ్య వెళ్తానని లేచి, మళ్ళీ కూర్చున్నాడు. సాంబయ్య పసికట్టి భుజాన నిద్రపోతున్న పిల్లవాణ్ణి లోపల పడుకోపెట్టటానికి వెళ్ళాడు. ఇంట్లోకిపోతే మళ్ళీ త్వరలో బయటకురాడని గ్రహించిన కనకయ్యకూడా సాంబయ్యతో పాటు లోపలకు వెళ్ళాడు.
"ఈ రోజు దుర్గమ్మ వుంటే ఎంత సంతోషించేదో?" అన్నాడు కనకయ్య.
పిల్లవాణ్ణి వత్తిగిల పడుకోబెడుతున్న సాంబయ్యకు ఆ మాటలు గుచ్చుకున్నాయి. మాట్లాడకుండా వచ్చి పంచలో మంచంమీద కూలబడ్డాడు. సాంబయ్యవంతు బాధకూడా తనే పొందుతున్నట్టు మొహంపెట్టి కనకయ్య సాంబయ్య పక్కనే కూర్చోబోయాడు.
"కనకయ్య! వెళ్తా నంటేనే మరి?"
"ఆ అవును! వెళ్ళాలి, చాలా తొందరపనేవుంది. ఐదురూపాయలు కావాలి. వచ్చే బేస్తవారం ఇచ్చేస్తా!" అసలు సంగతి జారవిడిచాడు కనకయ్య.
సాంబయ్య కావిడి పెట్టి తెరిచి, వెనకవున్న కనకయ్యకు కన్పించకుండా, గుడ్డమూటవిప్పి, మూడు రూపాయలు బయటికి తీసి, మళ్ళీ మూటకట్టి, కావిడిపెట్టె మూసివచ్చాడు.
"ఇంద, మూడు రూపాయలు. లోగడ పాత బాకీ తాలూకు రెండుంబావలా ఇంకా నువ్వు ఇవ్వాలి. అంతా కలిపి బేస్తవారం ఇచ్చేయ్!" అన్నాడు సాంబయ్య.
కనకయ్య బిత్తరపోయాడు. ధాన్యం అమ్మినప్పట్లో ఆ బాకీ రద్దుచేశాడనే ఉద్దేశ్యంతో వున్న కనకయ్య అతన్ని కొంతకాలం అప్పు కూడా అడగలేదు. అది మాఫీ చేశాడని నిర్ధారణ చేసుకున్నాకనే కనకయ్య అదీ మంచి అదను చూసుకొని తెలివితేటల్ని ప్రదర్శించాడు.
"అమ్మ! సాంబయ్య! డబ్బంటే ఎంత బిగువు?" అనుకోని, "ఏది? అదా? అదే - ఆ చిల్లరబాపతు! సద్దుబాటు చేశాననుకున్నానే?" అంటూ సాంబయ్య చేతినుండి రూపాయలు వడిసిపట్టి గుంజుకొని, "మళ్ళీ చస్తే నీ గుమ్మం తొక్కుతానా?" అన్నట్టు ముఖంపెట్టి అంగలు పంగలు వేసుకొంటూ వెళ్ళిపోయాడు కనకయ్య.
4
సాంబయ్యకు ఇటు ఇంట్లో పసిగుడ్డు, అటు పొలాన పంటా, రెండూ సాగటం కష్టంగా అనిపించింది. చాకలి రత్తిని పిల్చి రెండు రోజులు ఇంట్లో పిల్లాడ్ని చూసుకోమని చెప్పి సాంబయ్య భార్య పుట్టింటికి వెళ్ళాడు.
అత్తా మామా, బావమరదులు సాంబయ్యను చూసి ముభావంగా వున్నారు. బయటివాణ్ణి చూసినట్లు చూశారు. ఏదో గొంతుమీదకు రాకపోతే ఇలా రాడని వాళ్ళల్లో వాళ్ళు మధనపడ్డారు.
"బుడ్డోడు ఎట్టా వున్నాడు! ఆన్నికూడా తీసుకొస్తే చూసేవాళ్ళంగా?" అన్నాడు సాంబయ్య మామ.
"బాగానే వున్నాడు. అది పనిమీదే వచ్చాను" అన్నాడు సాంబయ్య.
"వాడికి నీళ్ళూ, పాలూ ఎవరు చూస్తున్నారూ?" అడిగింది సాంబయ్య అత్త.
"అదే కష్టంగా వుంది. ఎవరైనా మీఎరికలోవుంటే చూడండి" అన్నాడు సాంబయ్య ముక్తసరిగా.
సాంబయ్య ధోరణి చూస్తే అల్లుడు మళ్ళీ పెళ్ళి చేసుకొనే ప్రయత్నంలో వున్నాడనిపించి వాళ్ళు బిగిసిపోయారు.
"నీకు బరువైతే ఆన్ని ఇక్కడే వదిలేయ్. ఆమాత్రం పెంచలేమా?" అంది సాంబయ్య అత్త.
"వాడు నాకేం బరువు? వాడికోసమేగా ఈ అవస్తంతా? వాణ్ణి చూసుకుంటూ ఇంట్లో వుండే ముసలమ్మ ఎవరన్నా మనవాళ్ళల్లో దొరుకుతారేమో చూడమని చెప్పటానికే వచ్చాను" అన్నాడు సాంబయ్య.
అత్తా మామా ఊపిరి పీల్చుకున్నారు.
"భోజనానికిలే. ఏవేఁ? ఒడ్డించు!" భార్యను పురమాయించాడు సాంబయ్య మామ.
ఆ మధ్యాహ్నం సాంబయ్యమామా అత్తా బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు. వాళ్ళకు దూరపు బంధువుల్లో వయసు మళ్ళిన ఓ ముసలావిడ వుంది. చెల్లెలి భర్త తాలూకు బంధువుల ఇంట్లో వూడిగం చేసి బతుకుతోంది. ఆ మనిషి అయితే తమ మనవడికి పోషణ బాగా జరుగుతుందనీ, తమ మనిషికనక సాంబయ్య ఇంట్లో మళ్ళీ జొరబడే అవకాశం దొరుకుతుందనీ ఆశపడ్డారు.
రాత్రికి ఆవిడను పిలిపించి సాంబయ్య ముందు నిలబెట్టారు. సాంబయ్యకు ఆవిణ్ణి చూడగానే "ఇది మరీ ముసల్ది! ఏం పని చెయ్యగలుగుతుందబ్బా!" అని అనిపించింది. గత్యంతరం లేక, ఆవిడ నమ్మకాన్ని గురించి అత్తమామలు పదేపదే చెబుతుంటే ఒప్పుకున్నాడు.
