కాత్యాయని నవ్వింది. కాత్యాయని నవ్వినప్పుడు మాధవకు చాలా హాయిగా ఉంటుంది సామాన్యంగా గాని, ఈసారి కాత్యాయనీ నవ్వు మాధవను సన్నని సూదితో గుచ్చినట్లు నొప్పించింది.
"నిజంగా నామాట కాదనకుండా ఉన్నావా నువ్వు?" అన్నట్లుగా ఉందా నవ్వు.
కాత్యాయని నోటితో జానకిని చేసుకోమని శాసించలేదు నిజమే. అలా ఆవిడ ఎవరినీ ఎప్పుడూ శాసించదు. కాని జానకిని చేసుకోవటం ఆవిడ అభిమతమని తన కర్ధమవుతూనే ఉంది. ఆ మాత్రం తను అర్ధం చేసుకోగలడని అత్తయ్యకీ తెలుసు. అందుకే ఆ నవ్వు.
పైకి ఏ వేళా ప్రశాంతంగా ఉండే అత్తయ్య గుండెల్లో నిరంతరమూ జ్వలించే చిచ్చులో ఈ సంఘటన కొత్త సమిధలు వేసినట్లా వెయ్యనట్లా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు మాధవ.
ఈ ప్రశ్నకు సమాధానం కాత్యాయని ముఖం చూసి తెలుసుకొగలగటం పూర్తిగా అసంభవం మాధవకు.
* * *
నడుస్తూ నడుస్తున్న మాధవ పాదాలు చటుక్కున ఆగిపోయాయి. చెరువు గట్టున రేవు మెట్ల మీద బిందె పెట్టేసి , పై మెట్టు మీద చతికిల పడి మోకాళ్ళ మీద చేతులానించి , ఆ చేతులలో ముఖాన్ని ఇముడ్చుకుని , చెరువులో ప్రతిఫలిస్తోన్న నల్లని చీకట్లను గమనిస్తోంది జానకి.
ఆ క్రిందటి రోజు ఆ సమయంలోనే జానకి ఇక్కడ కనిపించింది. అంటే ఇంత తెల్లవారుజామున రోజూ ఈమె నీళ్ళకొస్తుందన్నమాట.
ఎవరో తనను చూస్తున్నట్లుగా వెనక్కు తిరిగింది జానకి. మాధవను చూసి కంగారుపడిపోతూ లేవబోయి కొంచెం తూలింది. చటుక్కున ముందుకు అడుగేసి పొదివి పట్టుకున్నాడు మాధవ. కుంచించుకుపోయింది జానకి.
వదిలేసి ఎడంగా నిలబడ్డాడు మాధవ.
"క్షమించండి. మీరు తూలితే పడతారని అంతే!....." అన్నాడు సిగ్గు పడిపోతూ.
జానకి ఏ సమాధానము చెప్పలేదు. తడబడే అడుగులతో మెట్లు దిగి బిందెలో నీళ్ళు నింపుకుని చంక నేత్తుకుంది. ఒక్కొక్క మెట్టూ పైకెక్కి ముందుకు నడవబోయి ఆగి వెనక్కి తిరిగింది. జానకినే చూస్తున్న మాధవ చూపులతో కలిశాయి జానకి చూపులు.
తప్పు చేసి దొరికి పోయినవాడిలా తలవంచుకున్నాడు మాధవ.
జానకి బిందె కిందకు దింపి రెండడుగులు ముందుకు వేసి మాధవకు కాస్త దగ్గరగా వచ్చి నిల్చుంది. దిగ్బ్రాంతితో చూశాడు మాధవ.
ఒక్కసారి సోగకళ్ళేత్తి మాధవ ముఖంలోకి చూసి చటుక్కున కనురెప్పలు వాల్చేసుకుంది జానకి. ఆమె చెప్పదల్చుకున్నదానిని చెప్పటానికి నిరాకరిస్తున్నట్లు పెదవులు వణికిపోతున్నాయి. ఇంత ఆవేదనకు తట్టుకోలేక గుండెలు కరిగి కళ్ళలోకి ఉరుకుతున్నట్లు కిందకు రాలనివ్వని కన్నీటి బిందువులు కనుపాపలలో తళతళలాడుతున్నాయి. ఆ కనుచీకటిలో సహితం ఆమె ముఖంలో అరుణిమ ప్రకాశిస్తోంది.\
"మీకు .....మీ అత్తగారికి ......ఒక సేవకురాలిగా ...." జానకి ధ్వని అరిగిపోతోంది. ఎంత ప్రయత్నం చేసినా వెలుపలికి రాబోయే మాటలను ఏదో బలవంతాన ఆణిచేస్తోంది.
మాధవ మనసు ద్రవించింది. "అలా ఆ రాతి మీద కూచోండి" అన్నాడు. తన కంఠధ్వనిలో ఏదో ఆప్యాయత ధ్వనించినట్లు అతనికి తెలియదు.
వెంటనే కూర్చుంది జానకి. అప్పటికే ఆవిడ కాళ్ళు వణికిపోతున్నాయి. ఇంక కొంచెం సేపు నించుంటే స్మృతి తప్పిపోతుందేమో అనిపించింది. మెదడులో ఏవేవో రకరకాల ధ్వనులు చెలరేగి తలను పగలగొట్టేస్తూన్నాయి. ఏ ఆలోచనా తోచటం లేదు. భాష కుదరటం లేదు. మాటలు దొరకటం లేదు. గొంతు పలకటం లేదు.
జానకికి కొంత దూరంగా మరో రాతి మీద కూర్చున్నాడు మాధవ.
"అందమైనది .....చాలా అందమైనది..... నిష్కారణంగా పెళ్ళి చూపులకు వచ్చి తిరస్కరించి ఈవిడను అవమానించాను" గొణిగింది మాధవ అంతరాత్మ.
జానకి ముఖంలోకి చూస్తూ "చెప్పండి " అన్నాడు.
"నేను చచ్చిపోగలను . అందుకు కాదు....."
మాధవకు అయోమయమయింది.
"ఏమిటిది?" అని అడగబోయాడు . కాని మానుకున్నాడు.
జానకి కంగారు పడటం చాలా స్పష్టంగా తెలుస్తోంది. తనిప్పుడు ఏదైనా మాట్లాడితే జానకి మరింత కంగారుపడుతుంది. ఆవిడనే చెప్పనీ - చీకట్లు విరిగి చల్లని అరుణ కాంతులు కమ్ముకోంటున్న ప్రాచీన దిశను చూస్తూ కూర్చున్నాడు మాధవ.
"నాకేం అక్కర్లేదు. నాకసలు ఏ కోరికలూ లేవు. కాని .....అన్నయ్య...."
తనెంత అస్తవ్యస్తంగా మాట్లాడినా మాధవ ఏమీ అనకపోవటంతో జానకి కాస్త స్థిమిత పడింది. అతని ముఖంలోకి చూస్తూ తను చెప్పదలుచుకున్నది మరిచిపోతానేమోనని తలవంచుకుని గబగబ నోటి కొచ్చినట్లు మాట్లాడేయ్యడం మొదలుపెట్టింది.
"నేను చచ్చిపోగలను. కాని అన్నయ్యకది దారుణ శిక్ష. చచ్చిపోయిన నాకు పైలోకాలలో నరకం ఉంటుందో ఉండదో కాని ఈ లోకంలో అన్నయ్యకు నరకం విధించినదాన్నవుతాను. ఎక్కడైనా కూలి చేసుకుని నా పొట్ట నేను పోషించుకోగలను. కాని, అన్నయ్య అందుకు ఒప్పుకోడు. అలా నన్ను వదిలేయ్యడు. కేవలం మీ అత్తయ్యకు ఆయాగా, మీ ఇంట్లో పనిమనిషిగా నన్ను స్వీకరించండి. కేవలం మా అన్నయ్య సంతృప్తి కోసం నా మెడలో తాళి కట్టండి. ఏ అధికారాలూ, ఆశించను. ఏ సౌఖ్యాలూ కోరను. మీరు ఎవరిని పెళ్ళి చేసుకున్నా అభ్యంతర పెట్టను. ఈ మారు మూల పల్లెటూరిలో జరిగిన పెళ్ళి ఎవరికి తెలుస్తుంది? నేను మీ భార్యనని ఎవ్వరికీ చెప్పుకోను...."
అదిరిపడి నోరు కొద్దిగా తెరిచి జానకి వంక చూసి "ఏమిటి?" అన్నాడు మాధవ.
ఆ చూపులతో తల మరింత కిందికి దించేసుకుని "నాకు తెలుసు ఆడజన్మ ఎత్తిన ఏ వ్యక్తీ నోటా ఇలాంటి మాటలు రావు. కాని.....కాని విధిలేక ఇలా మీముందు లజ్జ మాలి మాట్లాడుతున్నాను. మీరు కనికరం చూపించకలేకపోతే ఇక.....నాకు ఆత్మహత్య ఎలాగూ తప్పదు'."
"మీ వదిన మరీ అంత రాక్షసా?"
"కాదు.......కాదు......ఆవిడ తప్పు లేదు. ఆవిడకూ పెళ్ళికేదుగుతున్న కూతురుంది. ఇంకా ఇద్దరూ చిన్న పిల్లలున్నారు. ఇంటి ఖర్చు పెరుగుతుంది. అన్నయ్య జీతం తప్ప ఇంకో ఆధారం లేదు. చికాకు కలగదా ఎవరికైనా?"
గబగబా అనేసి ఏదో నేరం చేసినదానిలా సిగ్గుపడిపోయింది జానకి.
"పెళ్ళి అంటే ఏమిటో తెలిసినట్లు మాట్లాడతావెం? ఇప్పుడు ఎన్ని కబుర్లు చెప్పినా ఒక్కసారి నీ మెడలో తాళి కట్టానంటే నామీద నీకు సర్వాధికారాలు వచ్చేస్తాయి. అంత తేలిగ్గా వదిలించుకునే సంబంధం కాదు ఇది"
"నాకు తెలుసు. నన్ను నమ్మండి. పోనీ, నమ్మకండి. పెళ్ళికి ముందే మీతో విడాకులు సమ్మతమేనని రాసియిస్తాను. మీ వూరికి తీసుకెళ్ళి మా అన్నయ్యకు తెలీకుండా విడాకులిచ్చేయ్యండి. ఆ తర్వాత నా కర్మ నాది. అంతే! ఇంకేమీ కోరను......" అంటూ జానకి చటుక్కున తల తిప్పెసుకుంది. అది ఎంత అణచినా అనాక్కుండా ఉన్న కన్నీళ్ళు తనకు కనబడకుండా ఉండటానికని అర్ధమయింది. . అతినమ్రంగా ఉండే ఈ యువతిలో ఉన్న ఆత్మాభిమానం అర్ధమయింది మాధవకు. ఈ అభిమాని ఎంత దారుణ క్షోభననుభవిస్తూ తనముందు నిలిచి ఇలా చెయ్యి కాపగలిగిందో! చటుక్కున లేచి బిందె చంక నెత్తుకుని "నన్ను క్షమించండి. నేను కోరరాని భిక్ష కోరానని నాకు తెలుసు....మీ దయ....." అని కదిలిపోయింది జానకి.
తనను మాధవ వెనుకనుంచి గమనిస్తున్నాడని అర్ధం చేసుకున్న సంభ్రమంతో అడుగులు తడబడుతుంటే , సన్నని నడుము మీద ఇమిడిన బిందెలో నీళ్లు తొణికి చీర అటుపక్కా ఇటు పక్కా తడుపుతుంటే గబగబ నడిచిపోతున్న జానకిని కనుమరుగయ్యే వరకూ చూస్తూ కూర్చున్నాడు మాధవ.
* * *
