"ఏదైనా పాడించమంటారా?" అలమేలు కాత్యాయనిని అడిగింది.
నిలువునా వణికింది జానకి.
కాత్యాయనీ అది గమనించింది.
"అక్కర్లేదు. పాటలోస్తే తనే పాడుకుంటుంది. రాకపోయినా ఫరవాలేదు" అనేసింది.
"ఇంక వెళ్ళమ్మా! అన్నట్టు నీకే రంగు ఇష్టమో చెప్పు" చిరునవ్వుతో అంది కాత్యాయని.
ఆ చిరునవ్వుకూ, ఆప్యాయత రంగరించుకున్న ఆ కంఠస్వరానికి ముగ్ధురాలయింది జానకి. సమాధానం చెప్పలేదు.
"చెప్పమ్మా!"
"మీకు ఇష్టమైన రంగే నాకూ ఇష్టమవుతుంది. దాన్నే ఇష్టంగా చేసుకోగలను"
కాత్యాయనీ ముఖం వికసించింది.
జానకి కాత్యాయనీలో నమస్కరించి లేచి వెళ్ళబోతూ గుమ్మం దగ్గర ఒక లిప్త మాత్రం ఆగి భుజం మీదుగా ఒక్కసారి మాధవ వంక చూసింది. అంతవరకూ మంత్రముగ్దుడిలా జానకినే చూస్తోన్న అతని చూపులతో జానకి చూపులు కలుసుకున్నాయి. చిత్రంగా జానకి కళ్ళు తళుక్కున మెరిశాయి. అంతలో లోపలి కెళ్ళి పోయింది.
లిప్తపాటు మెరిసిన ఆ కళ్ళ మెరుపు మాధవకు మిరుమెట్లుకొల్పింది.
ఏదో ఆలోచిస్తూ వుండిపోయాడు.
కాత్యాయనీ లెమ్మని హెచ్చరించగా లేచి శ్రీనివాసుకీ అలమేలుకీ నమస్కరించి కాత్యాయనీని అనుసరించాడు.
కాత్యాయనీకి జానకి చూడగానే నచ్చింది. ఒకవేళ మాధవకు ఇష్టం లేకపోతే జానకి లాంటి పిల్లని తన ఇంటికి తెచ్చుకో గలిగే అదృష్టం ఉండదేమోనని లోలోపల మధనపడిపోయింది. కాని జానకి వెళ్ళిన వైపే చూస్తూ అలా పరధ్యానంగా కూర్చుండి పోయిన మాధవను చూశాక ఆవిడ మనసులో బెంగ చాలావరకు తీరిపోయింది.
ఇంటికొచ్చాక మాధవ బట్టలు మార్చుకుని కాఫీ తాగుంటే చిరునవ్వుతో అంది " ఆ అమ్మాయి జానకి చాలా బాగుంది కదూ!"
మాధవ కాఫీ కప్పుమీదే దృష్టి నిలిపి "అవును' అన్నాడు.
"హమ్మయ్యా! నీకు నచ్చుతుందో లేదో అని చాలా భయపడ్డాను. ఇవాళే నిశ్చయ తాంబూలాలు కూడా పుచ్చేసుకుందాం. శాస్త్రులు గారిని ముహూర్తాలు చూడమంటాను. ఈ ఊళ్ళో మంచి చీరలు దొరుకుతాయో దొరకవో! పోనీ ఏదో దొరికిందే......" గడగడ సాగుతున్న కాత్యాయనీ వాగ్దోరణి తెల్లబోయి చూస్తున్న మాధవ కళ్ళు కట్టేశాయి.
"అదేం! ఎందుకలా చూస్తావూ?" సందేహిస్తూ అడిగింది కాత్యాయని.
"నేను.....నేను......పెళ్ళి చేసుకుంటానని చెప్పానా?"
"బాగుంది అంటే 'ఆవు'నని అనలేదూ?"
"అందమైనది కాదని ఎలా అనగలను?"
"మరి?"
"కాని.....కాని.....నా కిష్టం లేదు."
కాత్యాయని ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. కొన్ని క్షణాలు మాధవ ముఖంలోకి చూసి లోపలికెళ్ళిపోయింది.
మాధవ ప్రాణాలు విలవిల్లాడాయి.
ఈ బేలతనం ముందు తనెప్పుడూ ఓడిపోతాడు.
అత్తయ్య ఎందుకు తిట్టదు? ఈ అమ్మాయినే పెళ్ళి చేసుకోమని ఎందుకు శాసించదు? అప్పుడు తను అత్తయ్యని ఎదురించగలిగేవాడు. తను సరళనే చేసుకుంటానని నిర్భయంగా చెప్పగలిగేవాడు. కాని ఇలా బేలగా చూసి మాట్లాడకుండా వెళ్ళిపొతే అతని శక్తులన్నీ కుంగిపోతున్నాయి.
కాఫీ పూర్తీ చేసిన మాధవ దగ్గరకు వచ్చింది సరోజినీ.
"నిజమేనా! జానకి నీకు నచ్చలేదా?"
ఆశ్చర్యం, ఆవేదన ఆవిడ కళ్ళల్లో పోటీలు పడుతూ ప్రతిఫలిస్తున్నాయి.
'ఆవిడను నేను పెళ్ళి చేసుకోలేను."
పెళ్ళి చేసుకోలేకపోవటానికి, నచ్చక పోవటానికి బేధం ఏమిటో సరోజినీ కర్ధం కాలేదు.
"దాని కర్మ" అనుకుంది స్వగతంగాను. ప్రకాశంగానూ ఒక్క నిట్టుర్పు విడిచి వెళ్ళిపోయింది.
ఆ నిట్టుర్పులో నిరాశ మాధవకు సోకింది. ఆ నిరాశా నిశ్వాసపు వాయి తరంగాలలో జానకి చూపులలోని దైన్యం తెలిసి వచ్చి అతని హృదయాన్ని ఆవరించి నలిపి వేసింది ఒక్కక్షణం.
అంతలో తోలి యవ్వనపు తళుకులు చిరునవ్వుల;లో మెరుస్తుండగా ప్రతి కదలికలో చైతన్యం చిలకరిస్త్గూ కళ్ళతో అనురాగాలు కుమ్మరిస్తూ తన జీవితాన ప్రవేశించిన సరళ ఆ హృదయంలో కొంటెగా ఫకాలున నవ్వింది.
అంతే, సమస్తమూ మరిచిపోయాడు మాధవ. సంధ్య క్రమక్రమంగా అంతరిస్తోంది. ఆరుబయట వాలుకుర్చీలో కూర్చుని అరుణ కాంతుల్ని ముసురు కుంటూ , కమ్ము కొంటున్న చీకటి రేఖలను గమనిస్తున్నాడు మాధవ.
పక్షులన్నీ కిలకిలలాడుతూ బారులు బారులుగా ఎగురుతున్నాయి.
ఉత్సాహమో, సంభ్రమమో? ఏ ఉద్యేగం వాటి మనసుల్ని పాలిస్తోందో?
ఆ కిలకిలలన్నీ వాటిలో అవి చెప్పుకునే కష్ట సుఖాలా? వాటికి గూడా కష్ట సుఖాలు , మనసూ, ఆలోచనలూ, సమస్యలూ ఉంటాయా?
"సరోజినీ రేపోక్కరోజు ఇక్కడ ఉండమంటుంది" కాత్యాయని మాటలకు తన ఆలోచనలలోంచి బయటపడ్డాడు మాధవ. ఎప్పుడొచ్చిందో కాత్యాయని మల్లెపందిరి వారగా తివాసీ పరుచుకుని కూర్చుంది.
కాత్యాయని ముఖంలోకి పరిశీలనగా చూశాడు మాధవ. మాములుగా ప్రశాంతంగా ఉంది.
ఎన్నెన్ని దుఖాలనైనా మ్రింగేసి అలా ప్రశాంతంగా ఉండగలిగే శక్తి ఏ దేవుడిచ్చాడో కాత్యాయనికి! ఏరికోరి కాత్యాయని సౌదర్యాన్ని చూసి పెళ్ళి చేసుకున్న భర్త పట్టుమని పదేళ్ళయినా తన ముచ్చట తీర్చు కోకుండానే కళ్ళు మూశాడు.
ఆనాడూ కాత్యాయని ఇలా స్థిరంగానే ఉంది. భర్త పోయే సమయానికి ఆవిడ అయిదు నెలల గర్భిణి. అందరూ ఇది కొంత అదృష్టమన్నారు. ఆడపిల్ల పుట్టిపోయింది.
మృతశిశువును కొన్ని క్షణాలు అలా చూసింది కాత్యాయని. ఆ చూపులు గమనించిన అక్కడివాళ్ళు ఆవిడకు గుండె బద్దలవుతుందో, లేక పిచ్చెక్కుతుందో అనుకున్నారు.
కాని ఆ మరునాటికే అందరితో ప్రశాంతంగా మాట్లాడగలిగింది.
"విధి నాతొ చెలగాటాలాడుతోంది మాధవా. నేను కింద కూలబడి కుమిలి కుమిలి ఏడిస్తే చూడాలని దానికి సరదాలాగుంది. నేను చాలా అసహ్యించుకునే విషయాల్లో ఒకటి అలా కుమిలిపోవటం. చూస్తాను ఈ విధి ఇంకా ఎంతవరకు నన్ను కవ్విస్తుందో!"
ఈ మాటలు కాత్యాయని చిరునవ్వుతోనే అంది. కాని ఆ మాటలు పలికినప్పుడు వణికిన కాత్యాయని కంఠస్వరము, కన్నీళ్ళు రాకుండా నిగ్రహించుకున్న ఆ కళ్ళల్లో కదిలిన అనిర్వచనీయమైన దుర్భరావేదనా కాత్యాయని చిరునవ్వులోనే దారుణ దుఖానికి అద్దం పట్టాయి.
"ఏం మాధవా?"
తన ముఖం చూస్తూ, మాట్లాడకుండా కూర్చున్న మాధవను మరోసారి హెచ్చరించింది.
"తప్పకుండా ఉందాం అత్తయ్యా! నాకింకా సెలవులున్నాయిగా! అయినా నీమాట కాదనగలనా?"
