Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 5


    అభినయ్ వంక అలానే చూస్తుండి పోయింది.
    "ఏమిటీ.... నిర్లజ్జగా చెబుతున్నాను అనా? ప్రపంచంలొ నేను భయపడేది ఆకలికి. ఆకలి అంటే నాకు భయమే కాదు. భక్తీ, గౌరవమూ కూడా....
    ఈ ఆకలి వుంది చూశారూ.... అది తను బాధపడదు. మనల్ని బాధపెడుతుంది. టీవీలో తరుచూ నేనీ యాడ్ చూస్తుండే వాడిని. "నేను కలకనే వాడినని..." అంటూ ప్రారంభమవుతుంది ఆ యాడ్!"
    అలా.... నేనోకల తరచూ కంటూ వుంటాను. అదేంటో తెలుసా? నేను బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నట్టు..... వేడివేడి అన్నం కడుపునిండా, తనివితీరా తిన్నట్టు.... అలా చెబుతున్నప్పుడు అభినయ్ కంఠం వణికింది.
    ఒక్క క్షణం విరజ ఒంట్లో చిన్న ప్రకంపనం. ఒళ్ళు చిన్నగా జలదరించింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    "నాకు ఆకలి దగ్గర మొహమాటం లేదు. ఎనీవే.... ఈరోజు అనుకోకుండా కళ్ళు తిరిగి, టాంక్ బండ్ లో పడ్డ నన్ను కాపాడి, అన్నం పెట్టారు. ఫుడ్డు దాతా సుఖీభవ..... ఫ్యూచర్ టెన్స్ లో ఎప్పుడో ఒకప్పుడు మీ అన్నం బాకీ తీర్చుకుంటాను" అంటూ లేచాడు అభినయ్.
    చిత్రంగా అభినయ్ వంక చూసింది విరజ. తనకు తారసపడ్డ అతి విచిత్రమైన వ్యక్తి. ఫ్రాంక్ గా ఎలా చెప్పాడు. ప్రాక్టికల్ గా మాట్లాడాడు. ఆకలి బాధ యింత భయంకరంగా వుంటుందా? అవున్లే.... ఆకలి గురించి తనకెలా తెలుస్తుంది. తన జీవితంలొ 'ఆకలి' అంటే ఏంటో ఎరగదు. అసలలాంటి పదం ఒకటి డిక్షనరీలో ఉందని కూడా గుర్తుండని జీవితం తనది.
    "హల్లో.... ఏమిటాలోచిస్తున్నారు?" అభినయ్ అడిగేసరికి, ఆలోచనల్లో నుంచి బయటపడుతూ అంది విరజ.
    "ఆకలి యింత భయంకరంగా వుంటుందా అభినయ్ గారూ....!"
    "అభినయ్ నవ్వి అన్నాడు.... "ఓసారి ట్రయ్ చేసి చూడండి. వూహూ...వద్దులే.... పగవాళ్ళను కూడా ఆకలిబాధ కలక్కూడదు".
    "ఓసారి ఆకలి బాధ ఎలా వుంటుందో చూడాలని వుంది. మీరోపని చేయండి. ఈ ఒక్కరోజుకు యిక్కడే వుండండి.
    నేను ఈ ఒక్కపూట అన్నం తినకుండా వుంటాను. దాని రిజల్ట్ ఎలా వుంటుందో చూస్తాన్నేను".
    నవ్వాడు అభినయ్....
    "ఎందుకలా నవ్వుతారు?" ఉక్రోషంగా అనడిగింది విరజ.
    "ఒక్కపూట అన్నం తినకుండా వుంటానంటే నవ్వొచ్చింది"
    "ఎందుకు?"
    "అవును...... మర్చేపోయాను...." అంది నాలిక్కర్చుకుని విరజ.
    "మీ లాంటి వాళ్ళు ఒక్కపూట కాదు మేడమ్, వన్ అవర్ కూడా ఉండలేరు తినకుండా. గ్రైండింగ్ మిషన్ లా ఏదో తింటూనే వుంటారు. అయినా ఒక్కపూట తిననంత మాత్రాన మీకేమీ కాదు..... దాని రియాక్షన్ తెలియదు".
    "ఓహ్.... ఆల్ రైట్.... ఓ రెండ్రోజులు".
    "వద్దులెండి. మీరు అన్నం తినని పాపం నాకెందుకు?" అన్నాడు అభినయ్.
    "అలా కాదు.... ఓసారి సరదాగా చూస్తాను".
    "మీ యిష్టం... అయితే ఓ షరతు.... నేను రెండ్రోజులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ వుంటాను. ఈ రెండ్రోజూలూ ఫుడ్డు ఫ్రీగా అరేంజ్ చేయాలి నాకు. యిందులో నా స్వార్ధం ఏమిటంటే.... రెండ్రోజులు ఫుడ్ ప్రాబ్లెం తప్పుతుంది నాకు...." సిన్సియర్ గా చెప్పాడు అభినయ్.
    "డన్" అంది విరజ.
    "మేడమ్! ఆలోచించుకోండి బాగా....ఆకలి అంత భయంకరమైనది మరోటి లేదు. ప్లీజ్ అండర్ లైన్ దిస్...." అన్నాడు జాలిగా విరజవైపు చూస్తూ.
    "నో ప్రాబ్లెం..." అంది విరజ.
    "మీ ఇష్టం.... నాకు మాత్రం టూ డేస్ నో ఫుడ్. ప్రాబ్లెం... హమ్మయ్య" అన్నాడు.
    విరజ నవ్వింది. పూలు విరిసినట్టుగా!
    
                                   * * *
    

    అనుకున్నట్టుగానే విరజ ఫుడ్స్ తినకూడదన్న పందెం ఆరోజు నుండే ప్రారంభమైంది.
    విరజ ఉదయం నుండీ ఏమీ తిన్లేదు.
    మధ్యాహ్నం దాటింది. మూడు..... నాలుగు.... అయిదు గంటలు గడుస్తూనే వున్నాయి.
    విరజ లేచివెళ్ళి ఫ్రిజ్ లోని వాటర్ బాటిల్ తీసి గడగడా తాగింది.
    అభినయ్ మాత్రం మధ్యాహ్నం సుష్టుగా భోంచేశాడు. పైగా అంతటితో వూర్కోకుండా....
    "అనకూడదు గానీ విరాజ గారూ.... మీ వంటమనిషి చికెన్ ఫ్రై బాగా చేశాడు. అబ్బ.... ఏం టేస్టండీ.... సాంబారు అయితే చెప్పాల్సిన పనేలేదు. అద్దిరిపోయింది. పైగా మునక్కాడలు వేసారేమో.... నాలుక్కి ప్రాణం లేచి వచ్చింది. బుజ్జినాలిక ముండ.... ఈ రుచులన్నీ....చూసి ఎన్నాళ్ళయిందో దానికి. పెరుగువేసిన కొబ్బరి పచ్చడి..... ఓహో....!"
    అప్పటి వరకూ బిగపట్టుకొని వున్న విరజకు నోరూరడం మొదలెట్టింది. పైగా మెల్లిమెల్లిగా ఆకలి మొదలవుతోంది.
    దాంతో నీరసం పెరిగింది.
    రాన్రాను కోపం వస్తోంది.
    తనపైన తనకే. ఇలాంటి పందెం కాయడం ఏమిటి? బుద్ది లేకుండా.
    సాయంత్రం అయిదున్నర.
    ఇక ఆగలేక పోతోంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి.
    పోనీ ఏదైనా పనిలోపడి మర్చిపోదామా అంటే....ఏపనిపైనా మనసు లగ్నం కావడం లేదు...... టి.వి. ఆన్ చేస్తే ఏడుపులు, కష్టాలు, కన్నీళ్ళతో ఛానల్స్ అన్నీ మునిగి తడిచిపోయాయి.
    అవసరం వున్నా, లేకున్నా ఆడ పాత్రలన్నీ ఏడుస్తూనే వున్నాయి కంటిన్యూస్ గా సీరియల్ అంతా. 'డెయిలీ సీరియల్సూ....! వర్ధిల్లండి..." అనుకుని ఆఫ్ చేసింది.
    బుక్స్ తీసింది చదువుదామని బుర్రకెక్కితేగా.... బుక్ మూసేసింది.
    అటూ.... ఇటూ తిరగసాగింది.
    ఆమె అవస్థ అంతా చూస్తూనే వున్నాడు అభినయ్. ఆఖరికి అడగనే అడిగింది.
    "మిష్టర్ అభినయ్....జ్యూస్ గట్రా తాగొచ్చా?" అడిగింది డైనింగ్ టేబుల్ మీద వున్న జ్యూస్ వంకచూస్తూ.
    "ఆ.... మరే! ఓ రెండు గ్లాసుల జ్యూస్ తాగి, మరో రెండు గ్లాసుల మిల్క్ షేక్స్ తాగండి. ఇంకా వుండలేకపోతే మరో రెండు గ్లాసుల బీరు తాగండి హాయిగా నిద్రపడుతుంది." వెక్కిరింతగా అన్నాడు అభినయ్.
    "అబ్బ.... ఆ జ్యూస్ చూసి టెంప్టయ్యాను లెండి. నిజంగా నాకేం అవసరం లేదు. ఏదో తాగొచ్చేమోనని....అడిగానంతే.... దానికే మీరిలా రెచ్చిపోవడం...."
    "టెంప్టయ్యారా? దాన్ని చూసి? దానికో చిట్కా వుంది..." అన్నాడు అభినయ్....
    "ఏమిటది?" ఆసక్తిగా అడిగింది విరజ.
    "ప్రాక్టికల్ గా చూపించనా? థియరీ చెప్పనా?"
    "థియరీ ఎందుకు? మనకంతా ప్రాక్టికలే అలవాటు" అంది గొప్పగా.
    వెంటనే అన్నదే తడువుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ ని గటగటా తాగి "ఇదిగో.... యిప్పుడిక మీకు జ్యూస్ తాగాలన్న కోరిక పుట్టదు.... పుట్టినా తాగలేరు.... ఎందుకంటే జ్యూస్ యిక లేదు కాబట్టి" చిరునవ్వుతో అన్నాడు అభినయ్.
    డైనింగ్ టేబుల్ మీద వున్న వాటర్ జగ్ ని అభినయ్ నెత్తికేసి కొట్టాలన్న కోరికను అతి బలవంతంగా అణుచుకుంది.
    "చూడండి. సరదాగా, జాలీగా ఫ్రెండ్స్ తో కట్టే పందెం లాంటిది కాదిది. ఆకలి పందెం....కష్టమైన పందెం... అందుకే కాస్త ముందూ, వెనకా ఆలోచించి కాయాలి. ఇలా ఏది పడితే అది...."
    "స్టాప్ నాన్సెన్స్..." అంటూ అరిచి అక్కడి నుండి వెళ్ళి బెడ్ పై వాలిపోయింది.
    
                                  * * *


    రాత్రి ఎనిమిదయ్యింది.
    అభినయ్ హాల్లో టివి చూస్తున్నాడు.
    "వద్దని చెప్తున్నానా...." గట్టిగా కసిరింది. మళ్ళీ భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
    ఇదంతా కిటికీలో నుండి చూసిన అభినయ్ నవ్వుకున్నాడు తృప్తిగా...
    
                                    * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS