బాలభానుడు కిటికీ చువ్వల్లోంచి తొంగి చూస్తూ వెచ్చగా తట్టి లేపుతుంటే , కళ్ళు తెరచింది కౌసల్య. గడియారం అప్పటికే ఎనిమిది గంటలు కొట్టింది. గబగబా లేచింది. టూత్ పేస్టూ, బ్రెష్ తీసుకుని బాత్ రూంలో కెళ్ళింది. మొహం కడుకున్నాక అన్నయ్య దగ్గరకు వెళ్ళి అన్ని విషయాలు చెప్పాలనుకుంది. కాఫీ గ్లాసు నందిస్తున్న వదినతో "అన్నయ్యేడోదినా?" అనడిగింది.
"పానకాలు గారి దగ్గరి కెళ్ళారు" అంది ఆమె.
"ఎందుకూ?" కంగారుగా లేచి నుంచుని అడిగింది కౌసల్య.
"అయన ఓ గంట కిందట వొచ్చారు. వాళ్ళ వాళ్ళందరిని పెళ్ళికి ఒప్పించాడట! అన్నయ్యని ముహుర్త్యాలు పెట్టించమని చెప్పారు."
"వొదినా! అంత కొంపెం మునిగిపోయిందని వెంటనే ముహూర్తాలు పెట్టించడం? రేపే పెళ్ళి చేసేస్తారా?" పిచ్చిదానిలా అరిచింది కౌసల్య.
"కౌసల్యా! పెళ్ళి చేసుకోవాలనుకున్నాక ఎప్పుడైతే ఏముందమ్మా? దానికింత కోపమెందుకు?"
"అది కాదోదినా! దయచేసి నా మాట విను. అతనొట్టి మోసగాడు. అందరూ అతణ్ణి ధూ....ధూ..అని చీదరించుకుంటుంటే నేను అతనేందుకలా ప్రవర్తిస్తున్నాడూ? ఏం కారణమై వుంటుందీ తెలుసుకుందామని , పోనీ కదా పాపం అమాయకుడేమోనని జాలి పడి పలకరిచేదాన్ని. ఆ విషయం మొదట్లో నా స్నేహితులు జోక్ చేసేవారు 'నీ ప్రేమికుడు' అంటూ రానురాను ఎవరు పుట్టించారో తెలీయదు, నేనేతన్ని ప్రేమిస్తున్నానన్న పుకారు . దాన్ని ఆసరాగా తీసుకొని , పానకాలు మేము పెళ్ళి చేసుకోబోతున్నామని అందరికీ చెప్పేసి, నేను షాక్ తో మాట్లాడ లేకుండా ఉన్నప్పుడు, ఈ సంగతి మన ఇంట్లో కూడా చెప్పేస్తానని నన్ను బెదిరించి బయలుదేరాడు." భోరున ఏడుస్తూ చెప్పింది.
"కౌసల్యా! ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా? ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదూ?" కౌసల్య కేసి అయోమయంగా చూస్తూ అంది రాధ.
"నన్ను చెప్పనిస్తే గా నిన్న! ఇప్పుడు చెబ్దామని అనుకున్నాను కాని ఆ పానకాలు ఇంత పొద్దున్నే వచ్చి , అన్నయ్యని తీసికెళ్ళిపోతాడని అన్నయ్య వాడి మాటలు అంత తొందరగా నమ్మేస్తాడనీ అనుకోలేదు.' వొదినని కౌగలించుకుని పసిపిల్లలా ఏడ్చింది.
"కాలంతకుడిలా ఉన్నాడే! భగవంతుడా, ఇప్పుడెం చెయ్యాలి? ఆమె కూడా కన్నీరు కార్చింది.
"వొదినా! వాడి మాటలు నమ్మొద్దు! నాకీ పెళ్ళి వద్దు!! ప్లీజ్! అన్నయ్యకు చెప్పోదినా!" అంటూ పసిపిల్లలా ఆమెను చుట్టేసి , ఏడుస్తోన్న కౌసల్యని పట్టుకుని "అలాగేనమ్మా! అలాగే చెప్తాను! ఊరుకో!" అని ఓదారుస్తుండగానే "రాధా! రాధా" అని పిలుస్తూ , "ఇంకేం, కౌసల్య ఇక్కడే ఉంది చూడు ఈ కార్డ్ ల్లా వున్నాయో! నేనూ పానకాలు గారూ కలిసి కొన్నాం. సెలెక్షన్ అతనిదే! మనిషి చుడ్డానికలా కనిపించినా తెలివైనవాడే! అంటూ శుభలేకల కోసం కొన్న కార్డు చూపించాడు.' అన్న!
"ఏమండీ! ఇప్పుడె ఏం తొందర? కౌసల్యని కూడా....." అని చెప్పేలోపలే, సుధాకర్ విసుక్కుంటూ, "నీకు లేదేమో తొందర , కానీ నాకుంది. కౌసల్య పెళ్ళి నా కన్నకూతురు పెళ్ళి లాగా వైభవంగా చేస్తానని మాటిచ్చాను అమ్మకి. రేపు పెద్దయ్యాక స్మిత పెళ్ళేలా చేస్తానో అలాగే నా చెల్లెలు కౌసల్య పెళ్ళి కూడా చేస్తాను. కౌసల్యా నేను చూసిన సంబంధం నీకు నచ్చుతుందో లేదోనని అనుకున్నా. కాని నాకాబాధ లేకుండా నువ్వే నీకు కావలసినవాణ్ణి వెతుక్కుని, నాకా శ్రమ తప్పించావు." అన్నాడు.
'అన్నయ్యా!"
"ఏమిటమ్మా! నేను కోప్పడతాననుకున్నావా? మనిషి చూడ్డానికి బాగులేడని నేనేమైనా అంటాననుకున్నావా? పిచ్చిదానా! ఎన్నిసార్లు మనం వాదించుకోలేదూ' ఫిజికల్ బ్యూటీ కంటే మెంటల్ బ్యూటీ ఎంతో గొప్పదనీ, శాశ్వతమైనదనీ! అన్నమాటలను అక్షరాలా ఆచరించి చూపించావు కోసల్యా! అమ్మకి నేనిచ్చిన మాట నిలబెట్టు'కుంటానమ్మా! నీ పెళ్ళి ఎంతో ఘనంగా జరిపిస్తాను. మీరిద్దరూ ఎమ్.ఏ . పూర్తీ చేసి, పిహెచ్. డి చెయ్యాలి. ఇద్దరూ ప్రొఫెసర్లు నీతిగా నియమంగా ఎంతో గౌరవంగా బతకాలి. నిన్ను కన్నా అమ్మా , నాన్నాలకి పెంచిన నాకూ, వదినకీ మంచి పేరు తీసుకురావాలి!" సుధాకర్ సంతోషంతో ఉప్పొంగిపోతూ మాట్లాడుతుంటే అతనికి ఆనందానికి ఎవరు ఎక్కడ బ్రేక్ వెయ్యాలో తెలీక మొహమొహాలు చూసుకుంటూ ఉండిపోయారు అయోమయంగా రాధా, కోసల్యలు.
ఒకరి గుండెల్లో మంటలు రేగుతున్నాయి. మరొకరి గుండెల్లో మల్లెలు పరిమళిస్తున్నాయి. కానీ ఇరువురి స్పందనా ఒకే విషయం మీద. ఒకే విషయం గురించి. కౌసల్య ఈ మధ్య కాలంలో ఎప్పుడూ సుధాకర్ ని అంత సంతోషంగా చూడలేదు. అందుకే అతడి ఆనందాన్ని ఆవిరి చెయ్యదలుచుకోలేదు. అతడి ఉత్సాహాన్ని ఊదిపారెయ్యదలచుకోలేదు. ఆ మాటే పక్కగా పిలచి వదినతో చెప్పింది.
"అలా అని నీ నూరేళ్ళు జీవితాన్నీ చేజేతులా చీకటి కూపంలో గడుపుతావా? కోసల్యా పెళ్ళంటే పది కాలాల పంట! కోరుకున్నవాడితో గతిలేని సంసారాన్ని అయినా గడుపవచ్చు కానీ మనసులేని మనువుతో మన్యాలున్నా మణులున్నా మనుగడ సాధ్యం కాదమ్మా! నా మాట విను. నేను చెబుతాను అన్ని విషయాలు మీ అన్నయ్యకి వివరంగా" అంది కళ్ళు పమిట చెంగుతో తుడుచుకుంటూ , కౌసల్య చేతిని ఆప్యాయంగా నొక్కుతూ రాధ.
"వోద్దోదినా! అన్నయ్య మనసు ఎంత సున్నితమైనదో నీకు తెలుసు. పట్టలేని సంతోషంతో పధకాలు వేస్తున్న అతనికి ఇప్పుడీ విషయం తెలిస్తే భరించలేడు. ఆ పరిణామం ఎలా వుంటుందో మనం ఊహించలేం."
'అందుకని నువ్వు ఆ పనికిమాలిన వాణ్ణి కట్టుకుని ఇష్టం లేని కాపురం చేస్తూ కుమిలిపోతావా?"
"నా కదే రాసి పెట్టుందనుకుంటాను. హద్దు మీరి చొరవ తీసుకుని ప్రవర్తించినందుకు నేనీ శిక్ష అనుభవించవలసిదే!" చెంపల మీదుగా కారుతున్న కన్నీళ్ళన్ని తుడుచుకుంటూ అంది కౌసల్య.
