ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ కళ్ళముందు ఇప్పుడు కలెక్టర్ ధీరజ గంభీరమయిన రూపం మెదులుతున్నది.
అతని భ్రుకుటి సాలోచనగా ముడిపడింది, చివరకు ఏదో నిర్ణయానికి వచ్చినట్టున్నాడు.
ఎలా వెళ్ళాడో, అలానే క్రిందకు దిగాడు. అప్పుడు కూడా ఎవరూ అతని చర్యలను గమనించిన వాళ్ళు కానీ అడ్డు చెప్పేవాళ్ళు కానీ తారసపడలేదు.
షూ వేసుకుని వడివడిగా వెళ్ళిపోతున్న ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ ఏదో మొక్కవోని పట్టుదల పల్లవిస్తున్నది!
* * * *
రాజీవ్ పార్క్........
సాయం సమయం.......
వయ్యారంగా వస్తున్న ఆ యువతిని చూసిన కోడెకారు పెదవులను నాలుకతో తడుపుకున్నారు. ఆమె విదేశీ వనిత భారతి. అయితే ఆమె కట్టు, బొట్టు అంతా భారతీయ సంప్రదాయమే! కళ్ళను చక్రాల్లా తిప్పుతూ నలు వైపులకూ పరిశీలనగా చూసింది భారతి. ఒంటరిగా కూర్చుని వున్న ముప్పయ్ ఏళ్ళ యువకుని మీద ఆమె చూపులు నిలిచాయి. అతని వైపు చకచకా నడిచింది.
తన వద్దకు వచ్చి ఆగిపోయిన అడుగుల చప్పుడుకు అతను తల పైకెత్తి చూసి ఆశ్చర్యంతో తల మునకలై పోయాడతను.
ఆమె ఎవరో తెలియకపోయినా పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు.
భారతి అలవోకగా వంగి అతని పక్కనే కూర్చుంది.
అశ్చర్యం.......అనుమానం రెండూ ఒకేసారి అతనిలో కలిగాయి.
"ఐయాం రమేష్........"
"మిస్ భారతి......"
ఇరువురు ఒకరి నొకరు పరిచయం చేసుకున్నారు.
అప్పుడు కురిపించింది వలపులసోయగాల వయగారాలను.....విసిరింది తన ప్రశ్నల పరంపరలను!
"ఇఫ్ యూ డోంట్ మైండ్ ......ఆర్ యూ మారీడ్?"
'ఎస్......మా సంసార జీవితానికి చిహ్నంగా ఒక పసివాడు కూడా....."
'అయినా మీ జీవితంలో సుఖ సంతోషాలు లేవు. అంతే కదూ?"
అంత కరెక్టుగా ఆమె ఎలా వూహించగలిగిందో అతనికి అంతు పట్టలేదు.
'అవును మేడమ్ .....మీరు చెప్పింది నిజమే"
'ఆమె అంటే మీకు ఇష్టం లేదన్నమాట!"
'అదేమీ కాదు. ఆమెకే నేనంటే ఇష్టం లేదు.'
"వ్వాట్" ఈసారి ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది.
"ఇక్కడ భారత స్త్రీకి ఇష్టాఇష్టాలు కూడా వున్నాయా?" అనుమానంగా ప్రశ్నించింది భారతి.
"మీరు భలేవారే......ప్రపంచంలో ఎన్నో అత్యద్భుతాలు జరుగుతుండగా స్త్రీ తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం మీకు వింతగా వుందా?" చిరునవ్వుతో అన్నాడతను.
"ఆఫ్ కోర్స్! అలాంటప్పుడు ఆమె మీ నుంచి విడాకులు తీసుకోవచ్చుగా" క్షణం పాటు ఆగి అతని కళ్ళల్లోకి చూపింది భారతి.
"రాముడికి ఒకే భార్య అనే సిద్దాంతం నాది. అలా అని ఆమెకు విడాకులు ఇవ్వనని నేను చెప్పబోవడం లేదు. అసలామే విడాకుల ప్రసక్తి ఇంతవరకూ నా వద్ద తేలేదు."
"కారణం ఏమంటారు" సూటిగా ప్రశ్నించింది అతన్ని.
సరిగ్గా అదే సమయానికి ఒక ఆడమనిషి అడుక్కుంటూ అక్కడకు వచ్చింది.
"బాబూ ధర్మం చేయండి బాబూ!"
తైల సంస్కార లేని జుత్తు చిరిగిన దుస్తులు. ఎన్నో లంఖణాలు చేసినట్టు సడలిన ముఖం ప్రపంచంలోని బీదరికం అంతా గూడు కట్టుకున్నట్టు ఆమె ముఖంలోనే కనిపిస్తున్నది.
ఆ బిచ్చగత్తే తనను సమీపించడంతో పర్సు తీసి ఐదు రూపాయిల నోటును దానం చేశాడు రమేష్.
ప్రసాదం అందుకున్నట్టు ఎంతో వినయంగా కళ్ళకు అద్దుకుని వెళ్ళిపోయిందామె!
"ఇండియాలో బిచ్చగత్తెలు ఎక్కువగా వుంటారంటే నేను ఏమో అనుకున్నాను. నిజమేనన్న మాట. పనీ పాటా లేని వాళ్ళందరూ ఇలా బిచ్చగాళ్ళుగా మారతారనుకుంటాను."
రమేష్ ముఖంలో రంగులు మారిపోయారు.
"భారతిగారూ ......ఆమె ఏ పరిస్థితుల్లో దీనంగా చేయి చాపి అడుక్కుంటుందో తెలుసుకోకుండా ఆమెను దూషించడం మంచిది కాదు. పరువు ప్రతిష్టలను గౌరవంగా , మాన మర్యాదలను ప్రాణ సమానంగా ఎంచే భారత స్త్రీ లెప్పుడూ కావాలని నీతి మాలిన పనులు చేయరు. తెలిసి తెలిసీ నీచమయిన వృత్తిని అసలే ఎన్నుకోరు. అయినా వయసులో వున్న అమ్మాయి సిగ్గు విడచి యాచిస్తుందంటే ఆమె ఆకలి బాధను అర్ధం చేసుకోవాలి తప్ప అవహేళన చేయకూడదు.'
అతని గొంతులో ఒకవిధమైన ఆవేదన ధ్వనించింది.
"ఐయాం సారీ.....ఆ విషయం వదిలేద్దాం. ఇంతకూ నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పనేలేదు" అసలు అంతవరకూ ఏమీ జరగలేదన్నట్టు ఎంతో సాదా సీదాగా ప్రశ్నించింది ఆమె.
"ఏ విషయం?" రమేష్ నీళ్ళు నములుతూ అడిగాడు.
'అదే విడాకులు ఎందుకు తీసుకోలేదని?"
"అది నా బలహీనత మేడమ్"
"బలహీనతా......అంటే?"
"ఇక్కడ భారతీయులు ఎక్కువగా సంప్రదాయలకు , కట్టుబాట్లకు తలవంచుటారు. బహుశా అదే నా బలహీనత కావొచ్చు.'
"పోనీ మీరే మీ ఆవిడకు అనుకూలంగా నడుచుకుంటే మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోతాయి కదా?"
'లాభం లేదు మేడమ్. నేనంతగా ప్రయత్నించినా ఆమె నన్ను అర్ధం చేసుకోదు. ఎన్నో విధాల నచ్చజెప్పి చూసి విసిగివేసారిపోయాను.' అతని గొంతులో గూడుకట్టుకున్న నిస్పృహ!
ఇద్దరి మధ్యన క్షణం పాటు మౌనం!
"విష్ణు గురించి మీ అభిప్రాయం ఏమిటి?"
టాపిక్ మార్చి టక్కున అడిగిందామె.
ఊహించని ఆ ప్రశ్నకు రమేష్ తెల్లబోయాడు.
అంతవరకూ ఆ పరిసరాలలోనే తచ్చాట్లాడిన బిచ్చగత్తే పార్కులో నుంచి బయటకు వెళ్ళిపోయింది.
"అయన దైవాంశ సంభూతులని నా నమ్మకం' స్థిరంగా వుంది రమేష్ కంఠం.
'అయితే మీరు విష్ణు భక్తులా!"
అవును, కాదన్నట్టు తల అడ్డంగా వూపాడతను.
"మీ నుదుట వున్న విభూతి చెప్పకనే చెబుతున్నది మీరు విష్ణు భక్తులేనని.....అయన గురించి నాకు పూర్తిగా తెలుసుకుకోవాలని వుంది. నిజం గానే అయన మహిమ కలవాడా?"
"నా జీవితం కుదుట పడడానికి ఆ స్వామిజీయే కారణం. కలికాలంలో పెరిగిపోయిన అధర్మాన్ని రూపుమాపడానికి వచ్చిన దైవాంశ సంభూతుడు విష్ణు. ఆయనగారిని దర్శించిన క్షణం నుంచి విష్ణుభక్తునిగా మారిపోయాను."
రమేష్ మాటలను భారతి శ్రద్ధగా వింటున్నది.
ఈ సంభాషణ జరుగుతున్న సమయంలోనే అంతవరకూ దూరంగా వుండి వాళ్ళను గమనిస్తున్న లేడీ కానిస్టేబుల్ లో చలనం వచ్చింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆమె హెడ్ క్వార్టర్స్ ను కాంటాక్ట్ చేసింది.
