Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 7

 

    "సర్......పార్క్ లో ఒక యువతి ప్రవర్తనా అనుమానాస్పదంగా వుంది. ఆ అమ్మాయి ఒకతనితో స్వచ్చమయిన తెలుగులో మాట్లాడుతున్నది. ఆమె వేషధారణను బట్టి మాటిమాటికి దిక్కులు చూసే ఆమె తడబాటుని బట్టీ మనం అనుమానించే వ్యక్తీ అయిఉంటుందనిపిస్తుంది."
    వెంటనే పోలీస్ ఫోర్స్ ను పంపుతున్నట్టు ఆమెకు రిప్లయ్ వచ్చింది. అంతే ఆమె తన చేతిలో చిక్కినట్టేనని అనుకోవడంతో, అంతవరకూ తను పడిన టెన్షన్ ఆ లేడీ కానిస్టేబుల్ తాత్కాలికంగా మరచిపోయింది.
    ఉన్నట్టుండి భారతి లేచి నిలిచింది. వడివడిగా రోడ్ చేరుకొని అటో ఎక్కి కూర్చుంది. లేడీ కానిస్టేబుల్ చూస్తుండగా కదలి వెళ్ళిపోయింది ఆ అటో!
    ఏం చేయాలో తోచక అటో నంబర్ ను మాత్రం నోట్ చేసుకున్నదామె.
    ఐదు నిమిషాలు కూడా గడవకముందే పార్క్ ముందు పోలీస్ జీప్ ఆగింది. అప్పటికి తేరుకున్న లేడీ కానిస్టేబుల్ జీప్ లో వున్న ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ కు సెల్యూట్ గొట్టి, జరిగింది వివరించింది.
    ఇన్ స్పెక్టర్ వినయ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా జీప్ ను సిటీలోకి పోనిచ్చాడు.
    మిగిలిన పోలీస్ ఫోర్స్ కు కూడా అటో నంబర్ ఇచ్చి కాచ్ చేయమని మెసేజ్ ఇచ్చాడు.
    ఆమె కోసం పోలీసుల వేట కొనసాగుతూనే వున్నది.
    సరిగ్గా ఆ అటో మిస్ అయిన అరగంటకు వి.హెచ్. ఎస్. సెట్ లో గాంధీనగర్ పోలీసులు ఇన్ స్పెక్టర్ వినయ కుమార్ ను కాంటాక్ట్ చేశారు.
    "సర్.......గాంధీనగర్ లో ఓ ఆడమనిషి ఒక ఇల్లాలిని ఐదు నిమిషాల క్రితమే నిలువు దోపిడీ చేసి మాయమైపోయింది.'
    ఇన్ స్పెక్టర్ వినయ్ బిత్తరపోయాడు.
    పార్క్ దగ్గర అదృశ్యమై మరెక్కడో వున్న భవంతిలోకి జోరపడి తన పని పూర్తిచేసుకుని ఎస్కేప్ అయిందన్నమాట! తాము మాత్రం ఫూల్స్ గా మిగిలిపోయారు.
    ఎలాంటి నేరం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జరిగే నేరాలు జరుగుతూనే వున్నాయి. అ దొంగ తన హస్తలఘవాన్ని చూపుతూనే వున్నది!
    ఇన్ స్పెక్టర్ వినయ్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ముందు జీప్ దిగాడు.
    అప్పటికే రమేష్ కంప్లయింట్ వ్రాసి ఇస్తున్నాడు.
    "పార్క్ లో తను ఒక విదీశీ వనితతో మాటలలో వుండగా తన పర్సు పోయినట్టు అందులో పాతికవేల రూపాయలు, అన్నీ ఐదువందల రూపాయల నోట్లు వున్నట్టు, తనకు ఆ విదేశీ యువతిపైనే అనుమానం వున్నదని రిపోర్టు సారాంశం.
    రిపోర్టు చదివిన ఇన్ స్పెక్టర్ వినయ్ నిర్ఘాంతపోయాడు.
    అరగంట తేడాలో రెండు నిరాలా?
    అతని భ్రుకుటి ముడిపడింది.


                                                     *    *    *    *

    కలెక్టర్ క్యాంప్ కార్యాలయం.....
    ఉదయం పది గంటలకు టంచనుగా ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ కలెక్టర్ ఆఫీసు గదిలోకి అడుగు పెట్టాడు.
    అప్పటికే మరికొంతమంది పోలీస్ అధికారులు కాన్ఫరెన్స్ హాలులో వెయిట్ చేస్తున్నారు. అసలు అంత అత్యవసరంగా ఈ సమావేశాన్ని కలెక్టర్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియక ఆలోచిస్తూనే వాళ్ళ సరసన కూర్చున్నాడు వినయ్ కుమార్.
    కలెక్టర్ గారు వస్తున్నట్టు తెలియడంతో అందరూ గౌరవ సూచకంగా లేచి నిలిచారు.
    గదిలోకి అడుగుపెట్టిన కలెక్టర్ ధీరజను చూడగానే క్షణం పాటు అధికారులు అందరు విస్మయానికి గురి అయ్యారు. సాదాసీదాగా నేత చీరలో వచ్చిందామే.
    వచ్చీ రావడంతోనే సమావెశాన్నీ ప్రారంభించింది.
    మైడియర్ ఆఫీసర్స్......కలెక్టర్ గా చార్జ్ తీసుకున్నప్పటి నుంచి బాధ్యలతో బిజీగా వుండటం వలన మీ అందరినీ కలుసుకోవడం ఇప్పటికీ కానీ కుదరలేదు."
    ఆమె మాటలు స్పష్టంగా వున్నాయి.
    రూపం చూస్తే మృదుత్వం.....మాటలు చూస్తే గంభీర్యం!
    "విష్ణు గురించి మీకు ఎంతవరకు తెలుసు?"
    హటాత్తుగా అడిగిన కలెక్టర్ ప్రశ్నకు వెంటనే ఎవరూ బదులు పలుకలేకపోయారు.
    'అందరూ మౌనం వహించారు......ఎవరికి తెలియదా?"
    "తెలుసు మేడమ్.....అయన గొప్ప యోగి!"
    "అయన సాక్షాత్తూ పరమేశ్వరుడని అవతారం!"
    "అయన అవతార పురుషులు అనడంలో ఎలాంటి సందేహం లేదు!"
    ఎవరికి తోచింది వాళ్ళు చెబుతున్నారు.
    ఇన్ స్పెక్టర్ వినయ్ కు మాత్రం కలెక్టరు ప్రవర్తన అంతా అయోమయంగా వుంది.
    ఎంతో భక్తీ భావంతో విష్ణుని దర్శించి అయన సమక్షంలో చాలా సేపు ఆద్యాత్మిక చింతనతో ఆమె వుండి రావడం తను కళ్ళారా చూశాడు. కానీ ఇప్పుడు అయన నిజంగానే దైవస్వరుపుడు అవునా కాదా అన్నట్టు ప్రశ్నిస్తున్నది. మరి, ఆయనపై నమ్మకం లేనప్పుడు అప్పుడు  అంత భక్తీ శ్రద్దలు ఎందుకు చూపినట్టు........
    "మిస్టర్ వినయ్ కుమార్ , మీరు మౌనంగా వున్నారేంటి?"
    ఆమె కావాలనే తనను ప్రత్యేకించి పిలవడంతో వినయ్ కుమార్ ఉలిక్కిపడ్డాడు.
    "ఎస్ మేడమ్ ........అయన గురించి నేనూ విన్నాను. ఈ నగరానికి మీలాగే నేను కొత్తగా వచ్చినవాడినే, అందుకే అయన గురించి నాకు ఖచ్చితంగా తెలియదు. కాకపోతే ప్రజల మూడ విశ్వాసాలను అడ్డు పెట్టుకుని అతను ఒక మహా పురుషునిగా కీర్తించబడుతున్నాడని నా అనుమానం" ఉన్నది ఉన్నట్టు నిష్కర్షగా చెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS