"నువ్వు వెర్రిబాగులవాడివిలా వున్నావు.....అయన శక్తి తెలియక తెలివితక్కువగా దూషిస్తున్నావు, అంతకు అంత అనుభవిస్తావు " మరొకడు గట్టిగానే అన్నాడు.
ఇన్ స్పెక్టర్ వినయ కుమార్ తనలో తనే నవ్వుకున్నాడు.
ఎవరు వెర్రివాళ్ళో తలుచుకుంటూ ఆ భవంతి ముఖద్వారం వైపు నడిచాడు.
ఎక్కడా ఎవ్వరూ అతనిని అడ్డుకోలేదు.
ప్రత్యేకంగా ఎవ్వరూ చెప్పకుండానే వినయంగా, భక్తీ పారవశ్వముతో వరుస ప్రకారం లోనికి వెళుతున్నారు అంతా.
క్రమశిక్షణ పొందిన సైనికుల్లా కదులుతున్న వాల్ వైపు వింతగా చూస్తూ వినయ కుమార్ లోనికి అడుగు పెట్టాడు.
నాలుగయిదు గదులు దాటిన తరువాత పైకి వెళ్ళే మెట్లు కనిపించాయి.
తెల్లని పట్టు వస్త్రాలు ధరించిన ఇద్దరు శిష్యులు ఆ మెట్ల దగ్గర నిలుచుని వున్నారు.
వాళ్ళను చూసి దూరంగానే నిలిచిపోయాడు ఇన్ స్పెక్టర్.
మెట్లు ఎక్కుతున్న భక్తులు ఒక గదిలోకి వెళ్ళడం అతను వున్న చోటికి స్పష్టంగా కనిపించింది. ఆ గది బయట పీతాంబరాలు ధరించిన మరో ఇద్దరు శిష్యులు నిలిచి ఉన్నారు.
ఏదో అడిగిన తరువాతనే వాళ్ళను లోపలకు పంపుతున్నారని అర్ధం అవుతూనే వున్నది.
పైకి వెళ్ళే మార్గం కోసం ఆలోచిస్తూ ప్రక్క గదిలోకి నడిచాడు వినయ కుమార్. ఆ గది దాటాక చిన్న వరండా వచ్చింది. ఆ వరండాలో నిలిచి పైకి చూసిన అతని పోలీసు బుర్రలో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది.
లావుగా ఉన్న పైబర్ వాటర్ పైప్ పై నిలచింది అతని దృష్టి.
తనను ఎవరూ గమనించడంలేదని నిర్ధారణ చేసుకుని షూ విప్పి అక్కడే ఒక మూలకు నెట్టి పైప్ మీద పాకుతూ పైకి వెళ్ళాడు.
లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఇన్ స్పెక్టర్ లో ఎక్కువయ్యింది.
అతను ఎంతో కష్టపడకుండానే పై గది కిటికీ దగ్గరకు చేరుకున్నాడు.
కిటికీ తలుపులు తెరిచే వున్నాయి.
కిటికీ క్రింద వున్న సన్ షెడ్ పై కూర్చుని ఆ గదిలో జరిగే తతంగాన్ని గమనిస్తున్నాడతను.
ఎర్రనిమేని ఛాయా.....మెడలో రుద్రాక్ష మాల.....నుదుట విభూది ......చక్కటి ముఖ వర్చస్సు కలిగిన విష్ణు పద్మాసనం వేసుకుని వున్నాడు.
కండలు మెలిదిరిగిన శరీరం అతనిది.
తన దగ్గరకు వచ్చిన భక్తులతో ఎంతో మృదువుగా , సున్నితంగా మాట్లాడి పంపుతున్నాడు.
విష్ణు ఎదురుగా విభూది, కుంకుమ, పసుపు , రకరకాల పండ్లు రాశులుగా పోసి వున్నాయి. భక్తుల సమస్యలను బట్టి ఆ రాశుల్లో నుంచి ఏదో ఒకటి ఇస్తున్నాడు విష్ణు.
నడుం నొప్పి తో బాధపడే వ్యక్తీ అయన కళ్ళను తాకి కళ్ళకు అద్దుకోగానే నిటారుగా నిలుచున్నాడు.
ఎంతో కాలం నుంచి తలనొప్పి భరించలేని మరొక వ్యక్తీ చిటికెడు విభూది సేవిన్చాగానే తన నొప్పి పోయిందని, ఇక మళ్ళీ ఇంతవరకూ తిరిగి రాలేదని సంతోషంతో విన్నవించుకుని, విష్ణుకు సాష్టాంగనమస్కారం పెట్టీ మరీ వెళ్ళాడు.
ఇలా ఎన్నో.....ఎన్నెన్నో వింత విషయాలు తెలుస్తున్నాయి.
భక్తులు తమకు తోచిన రీతిలో విలువయినా కానుకలను అయన ముందు వుంచుతుంటే సున్నితంగా తిరస్కరిస్తున్నాడు.
"మా కోరిక కాదనకండి స్వామి. మా తృప్తి కోసం అయినా స్వీకరించండి. ఈ డబ్బు ప్రజోపకారార్ధమై ఎన్నో మంచి పనులు చేస్తున్న మీలాంటి మహాత్ముని వద్ద వుంటే కనీసం ఆ రూపంగానయినా మాకు పుణ్యం దక్కుతుందని మా ఆశ. దయచేసి మా కానుకలను స్వికరించండి స్వామి.'
ఆ భక్తుడు వేడుకుంటూనే కానుకలను సమర్పించుకున్నాడు.
విష్ణు చిరునవ్వు నవ్వాడు.
ఆ నగవులో లాస్యం...
ఆ మందస్మితం.........సమ్మోహనం!
"అంతా ఆ పరమేశ్వరుని సంకల్పం!"
భక్తులు కదలి వెళుతున్నారు.
ఉన్నట్టుండి వినయ్ కుమార్ ఉలిక్కిపడ్డాడు.
తళుకు, మెరుపు లీనుతున్న పట్టుచీరతో విష్ణు సాన్నిధ్యానికి వచ్చిన అపురూపమయిన ఆ సౌందర్యరాశిని చూడడంతో కొన్ని క్షణాలపాటు అతనికి ఏమీ పాలుపోలేదు.
ఆ యువతి విష్ణుకి భక్తితో నమస్కరించి అక్కడే ఒక వైపు పద్మాసనం వేసుకుని కూర్చుని వుండిపోవడంతో ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది.
ఆమె ఎవరో కాదు కలెక్టర్ ధీరజ!
జిల్లాకి ఈ మధ్యనే వచ్చిన కొత్త కలెక్టర్. వచ్చిన వెంటనే విష్ణు దర్శనం చేసుకోవాలని వచ్చిందా, లేక అయన శిష్యురాలా?
ఏ నిర్ణయానికి రాలేని సందిగ్ధవస్థ!
ఎంతో కాలం నుంచి రోగాలతో, నొప్పులతో బాధపడేవాళ్ళు ఆయనను తాకగానే ఎలా మాములుగా తిరగగలుగుతున్నారో అతనికి అంతుపట్టడం లేదు.
విష్ణు నిజంగానే మహిమగల యోగి అయివుంటాడా/ లేక అది నటనా?
సాక్షాత్తూ జిల్లా కలక్టరే అయన సమక్షంలో అంత భక్తిగా మోకరిల్లి అయన కటాక్ష వీక్షణాల కోసం అర్రులు చాస్తూ వుంటే ఇక సామాన్య జనం సంగతి ఆలోచించడమెందుకు?
