Previous Page Next Page 
స్వర్గంలో ఖైదీలు పేజి 5


    ఇంకకాసేపట్లో తల్లిని చూస్తాననే ఊహేచాలా ఆనందంగా వుంది. బ్యాగ్ లోంచి ఓ క్యాడ్ బరీస్ చాక్లెట్ తీసి రేపర్ విప్పి నోట్లో వేసుకుంది. కాయితం డస్ట్ బిన్ లో పారేస్తుండగా... సంజయ్ గుర్తొచ్చాడు!
    "యూ ఆర్ మై క్యాడ్ బరీస్ చాక్లెట్!" అనేవాడు.
    వర్ష అతని ఆలోచనలను పారద్రోలడానికి తలవిదిలించబోయింది. కానీ ఆ అల్లరీ... ఆ అలజడి ఆమెకి దూరంగా పోనున్నాయి. చలివల్ల కలిగిన పులకింత ఆమె శరీరానికి సంజయ్ స్పర్శ గుర్తుచేసింది.
    మొదటిసారి సంజయ్ కోసం ఇలాగే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురుచూసింది!
    'ఎదురుచూపులో......వలపెంతో తియ్యన....
    అతని రాకతో...బ్రతుకే నులివెచ్చనా'
    ఏమైంది ఆ వియోగం? ఆ తియ్యదనం? ఎక్కడో తప్పింది!
    గత స్మృతులు ఆమెని కదిలించాయి.
    
                                                               * * *
    
    ముంబైనుండి హైద్రాబాద్ వచ్చే ఫ్లైట్ టేకాఫ్ కి సిద్దంగా వుంది.
    వర్షకి ప్రతిసారీ కొత్తగా నెర్వస్ గా వుంటుంది. పైకి ఎగరడం, ఎత్తులు ఎక్కి అక్కడినుండి క్రిందకి చూడటం, ఆమెకి చాలా భయం. కళ్ళు గట్టిగా మూసుకుంది.
    "ఎక్స్క్యూజ్ మీ....మీరు తెలుగువారా?" మృదువుగా వినిపించింది.
    వర్షకళ్ళు విప్పి చూసింది.
    పక్కసీట్లో కూర్చున్న యువకుడు టూత్ పేస్ట్ ఎడ్వర్ టైజ్ మెంట్ లో క్రికెట్ ప్లేయర్ లా నవ్వుతూ అడుగుతున్నాడు.
    "అవును" అంది.
    "మీ ఒళ్ళో వున్న పుస్తకం పేరేమిటీ?"
    "గీతాంజలి- తెలుగు అనువాదం" అంది.
    "ఓసారి చూసి ఇస్తాను" అని చనువుగా ఆమె ఒడిలో నున్న పుస్తకాన్ని తీసుకున్నాడు.
    వర్షకి అతని జుట్టు చూస్తుంటే ఒకసారి తడిమినిజమైనదో లేక విగ్గో తేల్చుకోవాలనిపించింది. అంత బాగుంది అది.
    అతను నిర్లక్ష్యంగా ఓసారి వేళ్ళు జుట్టులోకి జొనిపితల సవరించుకున్నాడు. బాగున్న తలని రేపుకున్నాడు అంటే సరిగ్గా వుంటుందేమో!
    "ప్రియా మీరందరి వెనుకా, నీడల్లో మరుగుగా ఎక్కడ నించునివుంటావు? నిన్నే మాత్రం లక్ష్యపెట్టక, దుమ్ము కప్పిన రాజబాటపైనిన్ను పక్కకి నెట్టేసి ముందుకి సాగిపోతున్నారు.
    తోవపోయేవారు వచ్చినా పువ్వుల్ని ఒక్కొక్కటే పట్టుకుపోతున్నారు. నా పూలసజ్జలో ఏమీ మిగలలేదు!"
    అతను చదువుతూ వుంటే వర్షకి తమాషాగా అనిపించింది.
    "బ్యూటీఫుల్....అద్భుతం!" అతను ఆమె వంక చూస్తూ అన్నాడు.
    "అవును!" అంది.
    "ఏమిటి? దేనిగురించి అద్భుతం అంటున్నానో తెలుసా?" అడిగాడు.
    "గీతాంజలి" క్లుప్తంగా అంది.
    "అదిసరే! నేను చెప్పేది క్రిందకి వాలినప్పుడు ఆ కనుదోయి సౌందర్యంగురించి..." అతను వేలితో ఆమె కనురెప్పలవైపు చూపిస్తూ అన్నాడు. వర్ష ఉలిక్కిపడినట్లు చూసింది. ఓ అపరిచిత వ్యక్తి పరిచయం అవగానే అలా మాట్లాడడం ఆమెకి వింతగా వుంది.
    "మీకళ్ళల్లో ఎందుకు తత్తరబాటు? తప్పా?" అడిగాడు.
    వర్ష ఇబ్బందిగా ఒళ్ళో చేతులు పెట్టుకుని వాటిని నలుపుకుంటూ కూర్చుంది.
    "చూశారా! గీతాంజలి బావుంది అంటే తప్పుగా తోచదు.హిందూ మహాసముద్రం అద్భుతంగా వుంటుంది  అంటే తప్పులేదు. కానీ మీ కనురెప్పలు క్రిందకి వాలినప్పుడు విల్లులా ఒంపు తిరిగి అద్భుతంగా వున్నాయి అంటే..... తప్పుగా అనిపించిందా?" నవ్వుతూ అడిగాడు.
    వర్షకి నవ్వొచ్చింది. అయినా నవ్వలేదు!
    "నవ్వితే ఏం ప్రమాదం లేదు. అలా బిగిసిపోయి కూర్చోనవసరంలేదు. మన ప్లేన్ హైజాక్ చెయ్యబడలేదు. అంత టెన్షన్  అవసరం లేదు" అన్నాడు.
    వర్ష గట్టిగా నవ్వేసింది.
    "హమ్మయ్య.....టెన్షన్ తగ్గినట్లుంది కదూ!" అడిగాడు.
    "టెన్షనా?" అంది.
    "నిజం చెప్పండి. మీరు ఇందాక భయపడ్తూ కళ్ళుమూసుకుని దైవప్రార్ధన చెయ్యలేదూ! సిగ్గుపడాల్సిందేం లేదు. చాలామంది పెద్దపెద్ద వాళ్ళకీ, రోజూ ఫ్లైట్ లో ప్రయాణించేవాళ్ళకీ కూడా వుంటుంది. అది పోగొట్టుకోవాలంటే ఇలా మనసు మరోవైపుకి తిప్పే ప్రయత్నంచేయాలి. అందుకే మాటల్లోకి దించాను" అన్నాడు.
    వర్షకి వెంటనే 'అంటే ఇందాక మీ పొగడ్త అబద్దమా' అని అడిగెయ్యాలనిపించినా, సభ్యత కాదని ఊరుకుంది.
    "నాకు ప్రతిసారీ భయంగానే వుంటుంది. ఎప్పటికిపోతుందో!" చిన్నగా అంది.
    "నో ప్రాబ్లమ్! నెక్స్ట్ టైం నుండీ మీరే మీ పక్క ప్రయాణికుడితో మాటలు మొదలుపెట్టండి. ఏం అలా మొహం పెట్టారు? మొహమాటమా? నో... నో... బీ ఇండియన్.....బై ఇండియన్ అన్నారు. ప్రయాణాల్లో బాతాఖానీలూ, బటానీలూ మన వాళ్ళకి చాలాఇష్టం" గడ గడా మాట్లాడేశాడు.
    వర్ష వింటూ కూర్చుంది.
    "ఇందాక నేను మీ కనురెప్పల్ని పొగిడాను. చూడండీ.....అదంతా...." అవి ఆగి చిన్నగా నవ్వాడు. కొంపదీసి అబద్దం అంటాడా? వర్ష గుండెటకటకా కొట్టుకుంది.
    "భూమి మీద కూడా లేముకాబట్టి నిజాన్ని నిర్భయంగా చెప్పేస్తున్నాను. ఇందాక నేను ఇచ్చిన కాంప్లిమెంట్ హండ్రెడ్ పర్సెంట్ నిజం! మీరు అలాకళ్ళు క్రిందకి వాల్చుకొంటే ముగ్ధమోహనంగా వున్నారు. ఎలా అంటే చినుకు వేడికి కంపించేచిగురుటాకులా.....ఎలావుంది నా పోలిక?" అడిగాడు.
    "మీరుకవులా?" అడిగింది వర్ష.
    "అదేమిచిత్రం. కవి ఓ అమ్మాయిని చూడగానే కవిత్వం చెప్పడం వింతకాదు. కానీ 'ఓ' అంటే 'ఢం' తెలీని నేను కవిత్వం చెప్తున్నానంటే మీకేమిటి.... నాకే కొత్తగా, వింతగా వుంది. ఎందుకిలా అవుతోందీ?" అన్నాడు.
    అతనివాక్చాతుర్యానికి ఆమెకి చాలా నవ్వొచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS