"తెలుసు" అప్పటికే వివరాలన్నీ సేకరించినట్లు రోషంగా అన్నాడు నీలకంఠం."ఎందుకు కలవలేదు అని అడుగుతున్నాను?"
"కలిసినా ప్రయోజనం వుండదని కాదు, కలవకూడదని...."
"ఎందుకు?" నీలకంఠం తమాయించుకోలేకపోయాడు. "కలవడం నామోషి అనుకున్నావా?"
"సూటిగా చెప్పాలనుకున్నాడు ధన్వి. "అవును నాన్నగారూ......ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే కన్నా నాకు నేనుగా ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటున్నాను."
'అంత మొగాడివయితే ఏడాది నుంచి ఖాళీగా వుండేవాడివి కాదురా....."
ఖాళీగా వున్నవాళ్ళంతా అసమర్ధులు కాదు నాన్నగారూ" భావరహితంగా అన్నాడు ధన్వి. "మీకు తెలుసు, ఏదైనా నాకు నేనుగా సాధించటాన్ని నేను యిష్టపడతానని."
"ఎందుకు?" ఉద్వేగామో లేక ఉక్రోషమో ఆవేశంగా లేచాడాయన. "అసలు నువ్వెందుకిలా తయారయ్యావ్? నీ వయసులో వున్న వాళ్ళంతా ఆసరా దొరికితే చాలు అల్లుకుపోదామనుకుంటుంటే నువ్వు మాత్రం బోడి ఆత్మాభిమానంతో ఎందుకు నాశనమైపోతున్నావ్?"
ఎప్పుడూ వున్నదే అయిన రోజు కన్నా ఈరోజు చర్చ కాస్త శృతి మించినట్టనిపించటంతో "ముందు మీరు కూర్చోండి" అంది సావిత్రి.
"విన్నావటే.....నీ కొడుకు ఏం అంటున్నాడో వింటున్నావా?.....ఎవరికీ తల వంచడట....ఎవరి సహాయమూ అవసరం లేదట, తనకు తానుగానే ఎదుగుతాడట" అలసటగా ఆగేడు సన్నగా కంపిస్తూ . "అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా?"
"ఒక్కటే నాన్నా....."మృదువుగానే జవాబు చెప్పాడు ధన్వి. "ప్రతి మధ్యతరగతి తండ్రిలాగే మీరూ ఆలోచిస్తున్నారంటాను....స్వతంత్రంగా ఆలోచించగల నా లాంటి కొడుకు అప్రయోజకుడిగా మీకు కనిపిస్తున్నందుకు బాధ పడుతున్నాను."
అహంకారం కాదిది....గతం మట్టిపొరల్లో సమాధి అయిన పుచ్చి పోయిన ఆస్థిపంజరాల్లాంటి ఆలోచనలపై తిరుగుబాటు కూడా కాదు.
కనిపించని పురుగుల్ని, వినిపించని పిడుగుల్ని జిర్ణించుకున్న నిశ్శబ్దంలా లేచి నిలబడ్డాడు ధన్వి.
"క్షమించండి నాన్నా....మారని నా దృక్పథం మిమ్మల్ని బాధపడితే నన్ను మన్నించండి....."
ఆగేడు ధన్వి, అది క్షణం పాటే,
"నేను అందరిలో ఒకణ్ణి కాలేను....ఎందుకిలా ఆలోచిస్తున్నాను అని నన్ను నిలదిసినా నేను జవాబు చెప్పను....నేను నేనులా బ్రతకడాన్ని యిష్టపడతాను, నేనిలా ఆలోచించటానికి కారణం నా చుట్టూ వున్న సంఘం లోని వ్యక్తులా లేక పరిస్థితులా అది కాని నాడు మనుషుల్లోని కాలుష్యమా అన్నది కూడా తెలిదు. కానీ రెండు నాల్కలానీతుల్ని అవసరాల కోసం అభిమానాన్ని చంపుకుని నటించటాన్ని, మనసులో వున్నది కనిపించకుండా పెదవుల్తో ప్రేమ నటించే హిపోక్రసిలను నేను ద్వేషిస్తాను.....అబద్దాల్లో బ్రతకటాన్ని అసహ్యించుకుంటాను.....కృత్రిమమైన మనసులూ కుహనా ఆదర్శాలు మరొకరిలా బ్రతకాలనుకోవటాలూ వంటి ఆలోచనలకి నేను పోయేదాకా దూరంగా వుంటాను...."
ఆ తర్వాత ఇక అక్కడ వుండలేకపోయాడు ధన్వి.
భోం చేయకుండా వెళుతున్న కొడుకుని చూసి సావిత్రి మనసు చివుక్కుమన్నా వారించలేకపోయింది.
మ్రాన్పడి నిలబడిపోయిన భర్త భుజాలపై చేయి వేసిందామె. చాలా మాట్లాడాలనుంది. భర్తని ఓదార్చాలని వుంది.
కానీ ఆమెకు గొంతు పెగల్లేదు.....ప్రయత్నించి మాటాడేదేమో కానీ అసలు ఇందాక ధన్వి చెప్పింది ఆమెకు పూర్తిగా అర్ధంకాలేదు.
"బాధపడుతున్నారా?" అంది దిగులుగా దీనంగా భర్తనే చూస్తూ.
"లేదు సావిత్రి" అంతు తెలీని ఏ అంతరిక్షంలోకో చూస్తున్నా నీలకంఠం "భయపడుతున్నాను" స్వాభిమానంతో మాటాడే నీ కొడుకు ఇలా కాలంతో కాలు దువ్వుతూ ఎక్కడ కూరుకుపోతాడో అని అందోళన పడుతున్నాను....ఏటికి ఎదురీదగల మనిషిగా వాడు ధైర్యం ప్రదర్శిస్తుంటే సాహసి కాని వాడు బ్రతుకు సమరంలో నెగ్గుకురాలేడు అన్న నిజం తెలిసి కూడా అందరిలో ఒకడు కాని నా కొడుకు రేపేం కాబోతున్నాడని కంగారు పడుతున్నాను."
అతడి బాధ అది కూడా కాదు.....
ఈ కాలంలో ఇలాంటి కొడుకులుంటారా అని కాక యిలా ఆలోచించే యువకులు వుంటారా అని విస్మయంగా చూస్తున్నాడు సుదూరం దాకా పరుచుకున్న చీకటిలోకి.
* * * *
"హల్లో...."
ద్వారం దాటి వచ్చిన ధన్విని చూస్తూ పలకరించింది సామ్రాజ్యం.....చదువుతున్న పుస్తకాల్ని తను కూర్చున్న సోఫా మీద వుంచి "వెల్ కమ్" అంటూ సాదరంగా ఆహ్వానించింది అదోలా నవ్వుతూ.....
"సో.....మీ నాన్నగారితో గొడవపడి పరుగెత్తికొచ్చావన్నమాట."
ఉలికిపడలేదు ధన్వి.....సామ్రాజ్యం వుండేది తమ యింటి పక్కనే బహుశా తమ యిద్దరి వాగ్వివాదం వినబడి వుండొచ్చు.....
"నాకు వినిపించింది కాబట్టి నేనిలా ఆడగటం లేదు ధన్వి" అతని మనసుని చదివేస్తున్నట్టుగా మృదుమందహాసంతో ఉడికించింది సామ్రాజ్యం. "నీ మోహంలో భావాల్ని నన్ను మించి మరెవరూ చదవలేరని నీకు తెలుసు" కాదనలేకపోయాడు ధన్వి.
మూడు పదుల వయసుతో ధన్వి కన్నా అయిదేళ్ళు పెద్దదైనా సామ్రాజ్యం అతడికి ఆరేళ్ళగా తెలుసు.....
కేవలం తెలియడం మాత్రమే కాదు తన తెలివితో చిలిపితనంతో ధన్విని బాగా ఆకట్టుకున్న ఆడది కూడా....
ధన్వి కుటుంబంలో అందరికి పరిచితురాలైన సామ్రాజ్యం తనకు తోచినట్టు బ్రతికి భర్తని వదిలేసింది. రెండేళ్ళ క్రితం....ఓ స్టార్ హోటల్లో రిసప్షనిస్ట్ గా జాబ్ చేస్తూ ఏకాంతంగా తన స్వంత యింటిలో వుంటుంది.
