"ధన్వి అంటే అర్జునుడు అన్నాడు కదూ" రాఘవరావు నవ్వుకుంటున్నాడు "అభిమన్యుడిలా కాదు, పద్మవ్యూహంలోకి రావడమూ పోవడము రెండు తెలిసిన మనిషన్నమాట."
అంటూ ఫకాల్న నవ్వాడు. ఒక్క శరత్ చంద్ర తప్ప గుండె కొండల కొనలో అందెల రవళిలా అనిపించిన ధన్వి చాలా కలవరపరిచాడాయన్ని.....
ఒకవేళ ధన్వికి ఉద్యోగం యివ్వలేని పరిస్థితే తనకు వస్తే తన స్థానం నుంచి తప్పుకోవాలనే అనుకున్నాడాయన ఆ క్షణంలోనే.
* * * *
"రాత్రి ఎనిమిది కావస్తుందే. ఏడి....ఎక్కడ నీ సుపుత్రుడు.....అసలు వాడి గురించి వాడేమనుకుంటున్నాడు?" నీలకంఠం తగిన మైకంలో తూలుతూ భార్య వెంట పడ్డాడు.
సరిగ్గ్గా అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టాడు ధన్వి. అవాక్కయి నిలబడిపోయాడు క్షణం పాటు.
ఆ సమయానికి నాన్న తాగడంగానీ తాగిన మత్తులో తనని తిడుతూ తల్లి ముందు ప్రతాపం ప్రదర్శించటం గానీ ధన్వికి తెలియనిది కాదు.....
కానీ ఇప్పుడు నిలదీయటంలో ఏదో ప్రశ్న ధ్వనిస్తోంది. ఒకవేళ ఇంటర్వ్యూ విషయం తెలిసిందా? తను రిటెన్ ఎగ్జామ్ పాసైన విషయం కూడా ఎవరికీ చెప్పలేదే!
"ముందు మీరు భోంచేయండి" ధన్వి గదిలోకి వెళ్ళడం చూస్తూనే వుంది. కానీ భర్తకి తెలీడం ఆమె కిష్టం లేనట్టు నీలకంఠాన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కుపోయింది.
"ఇలా కూర్చోండి!"
"అరె....నేను మన అబ్బాయి గురించి అడుగుతుంటే....."
గొంతు స్థాయి పెరిగింది మరింతగా.
ధన్వికి భోధపడిపోయింది. ఇది రోజువుండే తంతు తప్ప తన ఇంటర్వ్యూ కి సంబంధించికాదు.....
బడలికగా గోడకి జరిగిలబడి కిటికీలో నుంచి తండ్రిని చూసాడు.
ఎప్పుడో పాతికేళ్ళ క్రితం సెక్రటేరియేట్ లో ఉద్యోగం నాటకాలంటు డబ్బు తగలేయ్యటం.....జీవితకాలమంతా ప్రయత్నించి మూడు గదుల కొంప నిలబెట్టడం అదో అచీవ్ మెంట్ గా భావించడం.....
అది తన తండ్రి దైనందిక జీవితం.
అసలు తను అమ్మ కడుపున పడటం కూడా అయన త్యాగ నిరతికి ఒక గొప్ప ఉదాహరణ అనడమూ చాలా సార్లు విన్నాడు. కాని ఖండించడు ధన్వి......
రెండు దశాబ్దాల క్రితం పెద్ద స్టేజ్ నటునిగా పేరు సంపాదించుకున్న నీలకంఠం సంపాదనలో చాలా భాగం నాటక రంగానికే తగలేసాడంటారు. వయసు పెరిగిన కొద్ది నటననే ఉన్మాదం తగ్గి తన నటనా వైదుష్యాన్ని ఇంటికి పరిమితం చేసాడు. మంచి భర్తగా అనిపించుకోవాలని భార్య ముందు తప్ప బయట తాగనని ఒట్టేసుకున్న నీలకంఠం తాగాక తరచూ కొడుకు అప్రయోజకత్వం గురించే మాటాడుతుంటాడు.
"అయితే జవాబు చెప్పవన్నమాట?"
కోపం రాలేదతనికి, రెండున్నర దశాబ్దాల ఆమె దాంపత్య జీవితంలో ఇలాంటి చర్చలు ఆమెకు కొత్త గాదు. "వాడేం చెడిపోలేదండి" అలవాటుగా తనే అన్నం కలిపింది భర్తకి తినిపించాలని, "మీ ప్రమేయంతో పని లేకుండానే ఇంజనీరింగ్ లో సీటు సంపాదించుకున్నాడు. బిటెక్ పూర్తి చేసాడు."
"నువ్విచ్చిన అలుసే వాడికి" నీలకంఠానికి ఉక్రోషం ముంచు కొచ్చింది. 'మీ ప్రమేయం లేకుండా' అన్న వాక్యం బొత్తిగా నచ్చకపోవడంతో " అందుకే అంతా తన గొప్పే అన్నట్టుగా వాడు నా ముందు విర్రవీగుతున్నాడు" ఆమె మృదువుగా నవ్వింది.
ఇలా అడపా తడపా సాధించడం తప్ప ఏనాడూ తనను పల్లెత్తు మాట అనని భర్తంటే ఆమెకు చాలా యిష్టం.....అదొక్కటే కాదు.....ఆయన ప్రతి మాటలోనూ కొడుకు మీద ప్రేమే కనిపిస్తుంది తప్ప ద్వేషం ధ్వనించదు.....ముడుచుకున్న ఏ ఆలోచనల రెక్కలో మందు తీసుకోగానే గొంతు దాటి ఉబికి రావటం, తనతో ఆత్మీయంగా మాటాడని ధన్వి మీద అలా అసహనంగా విరుచుకుపడటం ఆమెకు కొత్తయితేగా.....
అందుకే మరేదో అనబోతున్న అయన నోటిలో అన్నం ముద్ద వుంచింది.
చాలా కోపం వచ్చినా తమాయించుకున్నాడు నీలకంఠం.
ఇక ఆ ప్రసక్తి అక్కడితో ఆగిపోయేదే కానీ ధన్వి కూడా టేబుల్ దగ్గరికి వచ్చాడు భోజనానికి తనూ సిద్దమే అన్నట్లుగా.
ముందు ఉలికిపడ్డ నీలకంఠం తల్లీ కొడుకులు ఇద్దరూ తనని మభ్యపెట్టినట్లు రేచ్చిపోతూ "అంటే ఇంతసేపూ వీడు ఇంటిలోనే వున్నాడన్న మాట" అన్నాడు భార్యని సీరియస్ గా చూస్తూ.
"ఇప్పుడే వచ్చాడండి" నచ్చచెప్పబోయింది.
మరా మాట ముందే ఎందుకు చెప్పలేదు?" నిలదిసాడు నీలకంఠం.
"అవసరమనించకేమో."
ఈ మాట అన్నది సావిత్రి కాదు, ధన్వి-__
"చుసావటే వీడి పొగరు? అసలు తండ్రితో మాటాడే పద్దతి ఇదేనటే?" పైకి లేవబోతుంటే మృదువుగా ఆయన్ని వారించింది సావిత్రి.
"మీరు తెలుసుకదండి.....వాడి మాట తీరే అంత."
"అందుకని నేనే రాజీపడిపోవాలంటావ్? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఈయనగారో మేధావిగా అంగికరించి నేనే తగ్గాలంటావ్?" ఈసారి ధన్వినే ప్రశ్నించాడాయన, "సుధాకర్రావుగార్ని కలిసావా?"
రెప్పలార్చకుండా చూసాడు ధన్వి. సుధాకర్రావు అంటే పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంటలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.....నీలకంఠానికి పరిచయస్తుడు....కొడుకు ఉద్యోగం విషయంలో సహకరిస్తానని హామీ యిస్తే ఆయనను కలవమని రెండు రోజుల క్రితం ధన్వి కి చెప్పాడాయన.
"జవాబు చెప్పవేం?"
"కలవలేదు"
