"ఈ దేశంలో అన్నీ స్టూవర్ట్ పురాలే. ఎక్కడేసినా దే కష్టంలెండి" అంది కామిని తేలిగ్గా.
నాయుడు వెళ్ళిపోయాడు తృప్తిగా.
రెడ్డి భార్యవైపు దూసుకొచ్చి చేతులు పట్టుకున్నాడు. "నిజంగా నీ ఆలోచన అద్భుతం కామినీ! నాయుడు పంతాన్ని వదిలిపెట్టాడంటే మన చీఫ్ మినిష్టర్ గారికి అదో పెద్ద రిలీఫ్. తరువాత వాళ్ళు ఎలాగైనా చావనీ ముందు సమస్య పరిష్కారమైపోయింది. ఆ-అన్నట్టు ఆ ఇన్ స్పెక్టర్ ట్రాన్స్ ఫర్ ఒకటుంది కదూ అయినా నాయుడిలాంటి డక్కా మొక్కీలు తిన్న రాజకీయ నాయకుడినే క్షణాల్లో పడేసిన దానివి, నీకిదో లెక్కా?"
ఆమె అదే నవ్వుతో, "ఆ ఇన్ స్పెక్టర్ని పిలిపించండి" అంది.
అయిదు నిముషాల తరువాత రాణా తలుపు తోసి, "మే ఐ కమిన్ సర్" అన్నాడు.
సరీగ్గా ఆ టైమ్ కి కామిని కాఫీ కప్పు నోట్లో పెట్టుకోబోతోంది. అతడిని చూడగానే ఆమెలో అదోలాటి జెర్క్ లాటిది కలిగింది. ఆ కదలిక ఆమె వంటిని జలదరింపచేసింది. రాణా పెద్ద అందగాడేమీ కాదు. కానీ అతడి "మ్యాస్కులేనిటి" లో ఏదో తెలియని హుందాతనం ఆమెని కదిలించివేసింది. ఆమె సెక్స్ జెవెఇథమ్ గురించి ఋజువులు లేకపోయి వుండవచ్చు. కానీ నిశ్చయంగా ఆమెకు సినీ రంగంలో నైతేనేం, రాజకీయ రంగంలో నైతేనేం కొన్ని వందల మందితో పరిచయాలున్నాయి. కానీ ఎవరూ ఆమెని ఈ రకంగా తబ్బిబ్బు చేయలేదు.
భార్య అకస్మాత్తుగా మౌనం వహించదాన్ని రెడ్డి చూశాడు. అయితే అతడికి స్త్రీ అంతరంగాన్ని తెలుసుకునేటంత శక్తి లేదు. 'ఇది చాలా చిన్న విషయం కదా! అందువల్ల తనని డీల్ చెయ్యమని భార్య వదిలేసిందేమో' అనుకున్నాడు. "చూడు రాణా! మన ఎమ్మెల్యే నాయుడుగారు లేరూ- నువ్వు చేసిన పనికి కష్టపడి బెయిల్ మీద బయటికి తీసుకొచ్చామనుకో. అయినా ఆయన చాలా మండిపడుతున్నారు" అన్నాడు ఉపోద్ఘాతంగా.
తనని పిలిపించారు అనగానే రాణా 'విషయం' ఏదో వుందని గ్రహించాడు హోం మినిష్టర్ ఈ మాట అనడంతో "దానిదేముంది సార్. అరెస్ట్ అంటేనే మనసు బాధగానే వుంటుంది కదా రేపు పేపర్లో ఈ వార్త వస్తే మరీ పరువునష్టం. నేనూ చాల బాధపడుతున్నాను" అన్నాడు.
రాణా అలా అనగానే రెడ్డి మొహం విప్పారింది. "అయిందేదో అయింది. ఇక జరగవలసింది చూడు, జైర్గిన దానికి బాధపడి ప్రయోజనం ఏముంది?" అన్నాడు.
"అబ్బే నేను బాధ పడుతున్నది కూడా జరగబోయే దాని కోసమే సర్! పోలీసుల మీద చేసిన ఆక్సిడెంట్ విషయంలో కష్టపడి ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు లాకప్ లో వున్న గూండాల్ని చావబాదితే వాళ్ళు నిజం చెప్పారు. ఎమ్మెల్యే నాయుడే తమని తీసుకొచ్చాడు అని వప్పుకున్నారు. అందుకని ఇప్పుడు నేను ఇక్కన్నుంచి బయటకు వెళ్ళగానే అర్జెంటుగా ఆయన్ని వేరే సెక్షన్ క్రింద మళ్ళీ అరెస్ట్ చేయాలి. అదే బాధగా వుంది" తాపీగా అన్నాడు.
రెడ్డి మొహం సున్నం కొట్టినట్టు పాలిపోయింది. "ఇంకోసారి ఆయన్ని అరెస్ట్ చేస్తావా? అసలు నిన్ను సస్పెండ్ చేయకుండా వదిలెయ్యమన్నది ఆయనే తెలుసా" అన్నాడు తనకున్న రాజకీయ జ్ఞానంతో - సంధికి మొదటి మెట్టుగా.
"ఆయనకు నా కృతజ్ఞతలు అని చెప్పండి. నిజంగా నన్ను సస్పెండ్ చేస్తే ఈ అవమానం భరించలేక పోయేవాడిని. ఈ ఖాకీ బట్టలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి."
రెడ్డి విప్పారిన మొహంతో "చూశావా మరీ-" అన్నాడు.
"ఆగండి. నేను చెప్పీది మీరు పూర్తిగా వినలేదు. ఈ ఖాకీ బట్టలు నన్ను చాలా ఇబ్బంది పెడ్తున్నాయి. ఆయన సస్పెండ్ చేయిస్తే - నేను మామూలు బట్టలు వేసుకుని ఆయన బట్టలు పూర్తిగా విప్పించి నడిబజార్లో కొట్టేవాడిని" అన్నాడు చాలా క్యాజువల్ గా.
టి.కె. రెడ్డి తల తిరిగినట్టు అనిపించింది. అంతకుముందు సంగతి ఏమోగానీ, హోమ్ మినిష్టర్ అయ్యాక మాత్రం అతనితో ఎవరూ ఇలా మాట్లాడలేదు. కోపంతో మొహం ఎర్రబడగా- "నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా?" అని అరిచాడు కోపంగా.
రాణా నవ్వేడు. "తెలుసు సార్. సెంట్రల్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా బంద్ నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ ప్రముఖుడితో!! రేడియో స్టేషన్ సెంట్రల్ కి సంబంధించింది కాబట్టి దాన్ని నాశనం చెయ్యాలనుకున్న స్టేట్ పొలిటీషియన్ల ప్రతినిధితో.... బంద్ నిర్వహించడానికి, గవర్నమెంట్ ఖర్చుతో జిల్లా జిల్లాకీ వచ్చి మకాం వేసిన రాజకీయ నాయకుల్లో ఒకరితో....ఏ ప్రభుత్వం క్రింద పని చెయ్యాలో తెలియక, ప్రజల ఆస్తిని రక్షించబోయి చావుదెబ్బ తిన్న పోలీసులు, తమమీదకు జీపు ఎక్కించిన ఒక గూండాని అరెస్ట్ చేస్తే, ఆ గూండా దయాదాక్షిణ్యాలు మీద నన్ను సస్పెండ్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూన్న గౌరవనీయ హోమ్ మినిష్టర్ తో-"
అతడి మాటలకి అడ్డు తగులుతూ "రాణా" అంది కామిని. వీణతీగె లాగి బిగించి, వేలితో మీటితె కంపనాలు ప్రతిధ్వనించి నట్టుందా స్వరం. అతడు ఆమెవైపు చూశాడు. ఆమె అన్నది-
"రెడ్డిగారు చాలా ఇబ్బందిలో పడ్డారు రాణా! చీఫ్ మినిష్టర్ ఆయన మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో మాకు అర్ధం కావడంలేదు" అని కొంచెం ఆగి, కొనసాగించింది.
"....నాయుడికి ఈ జిల్లాలో చాలా పలుకుబడి వుంది. అతడిని కాదని మా పార్టీ ఈ జిల్లాలో బ్రతికి బట్ట కట్టలేదు. అటువంటి వాడిని నువ్వు చాలా నిజాయితీగా అరెస్ట్ చేశావ్. హేట్సాఫ్ టుయు. కానీ ఇంత అవమానాన్ని అతడు భరించలేకపోతున్నాడు. నిన్ను సస్పెండ్ చేయాలని మా మీద వత్తిడి తీసుకొచ్చాడు. నిన్ను సస్పెండ్ చేయడం మాకు కష్టం కాదు. కానీ అలా చేస్తే పోలీసు ఫోర్సు వెంటనే తిరుగబడుతుంది. ఇదంతా నీ మీద సానుభూతితోనో, పోలీసులకి భయపడో మేము ఆపుచేయడంలేదు. నిజం చెప్పాలంటే, ప్రెస్ కి భయపడి, ప్రజల సానుభూతి మా పార్టీ మీద పోతుందని భయపడి, నిన్ను సస్పెండ్ చేయలేకపోతున్నాం. మా రాజకీయాల సంగతి నీకు తెలియనిది ఏముంది?...... పోతే నాయుడితో ఇప్పుడే మేం మాట్లాడేము. నిన్ను సస్పెండ్ చేయకుండా ట్రాన్స్ ఫర్ చేస్తే చాలు అని అతి కష్టం మీద అతడిని వప్పించగలిగాం. మేమేదో నీకు సాయం చేసామనుకోకు. మాకు మేం చేసుకున్నాం. రాణా! బంతి ఇప్పుడు నీ కోర్టులో వుంది. కణతకి పిస్తోలు అడ్డు పెట్టుకున్న పోలీసుల్ని ఆపావు. ఇప్పుడు కూడా అలాంటి త్యాగమే చెయ్యి. నిన్ను మేం ట్రాన్స్ ఫర్ చేసేది నీ కోర్కెమీదే అని పోలీసులకీ, ప్రెస్ కీ చెప్పు. వాళ్ళవైపునుంచి ఏ గొడవా రాకుండా చూడు. 'నీ ఋణం ప్రభుత్వం ఉంచుకోదు' అని ఆశపెట్టడం నాకిష్టంలేదు. అలాటి ప్రలోభాలకి నువ్వు లొంగవని నాకు తెలుసు. ఇదంతా నీ మీద వత్తిడి తీసుకురావడం కాదు- మా అభ్యర్ధన! అంటే....చెప్పు వప్పుకుంటావా?" ఆమె కంఠంలో లాజిక్ వుంది.
రాణా తలూపి, "చేసేదేముంది అలానే కానివ్వండి" అన్నాడు. భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోయారు. అతడింత తొందరగా వప్పుకుంటాడని కలలో కూడా అనుకోలేదు. "థాంక్స్ నిజంగా థాంక్స్ నాకన్నా చిన్నవాడివైనా నీకు థాంక్స్ చెపుతున్నాను. చాలా ఇబ్బంది పరిస్థితి నుంచి నన్ను తప్పించావు" అన్నాడు రెడ్డి.
రాణా ఏమీ మాట్లాడలేదు తలుపు దగ్గరికి నడిచాడు.
రెడ్డి మళ్ళీ అన్నాడు- "నీ అంత మంచివాళ్ళు, పరిస్థితిని అర్ధం చేసుకునే వాళ్ళూ వుంటారని నేను అనుకోను. నీ గురించి మా వాళ్ళకి బాగా చెపుతాను."
అప్పుడు రాణా తలుపుదగ్గర ఆగి వెనుతిరిగి చూశాడు. "ఏం బా....గా చెపుతారు సార్? మీరేం చెపుతారో నాకు తెలుసు. అంతవరకూ ఎందుకు? నేనిలా బైటకి వెళ్ళగానే మీరేం మాట్లాడుకుంటారో కూడా నాకు తెలుసు. మీరు పరుగెత్తుకుంటూ చాలా ఆనందంగా మీ భార్య దగ్గరికి వెళ్ళి ఆమె చేతులు పట్టుకుని" ఎంత బాగా ఇన్ స్పెక్టర్ ని బుట్టలో వేశావ్ కామినీ, నీ నటన చూస్తుంటే నాకే మతిపోయింది. ఆ ఇన్ స్పెక్టర్ ని 'నువ్వు చాలా గొప్పవాడివి' అంటూ ఆకాశానికెత్తేసి మొత్తం మీద మన పని పూర్తి కానిచ్చావ్. అసలు నువ్వు అడగాలే కాని కాదనే మొగాడు ఈ భూమ్మీద లేడు" అంటారు. మీ భార్యగారు గర్వంగా నవ్వుతుంది. ఆ తరువాత, ముఖ్యమంత్రి గారి దగ్గరకెళ్ళి 'పాము చావకుండా, కర్ర విరక్కుండా పని సాధించుకొచ్చాం సార్' అని చెప్పుకుంటారు.... సార్! మా డిపార్ట్ మెంట్ కి అత్యున్నతమైన పొజిషన్ లోవున్న హోమ్ మినిష్టరు మీరు. డిపార్ట్ మెంట్ మిషన్ లో చిన్న బోల్టులాంటి ఇన్ స్పెక్టర్ ని నేను! అలాటి నా ముందు కూడా, పని చేయించుకోవడం కోసం, మీరు మీ భార్యని ఉపయోగించుకున్నారంటే-" ఆగి, అన్నాడు. "నాకు జాలేస్తుంది సార్. ఆ జాలితోనే ఆ ట్రాన్స్ ఫర్ కి వప్పుకున్నాను తప్ప- మీ భార్యగారి మనోహరమైన చిరునవ్వులగ్గానీ, మాటలగ్గానీ కాదు."
రెడ్డి మొహం ఎర్రబడింది. మినిష్టరయ్యాక అతడిని ఎవరూ ఇంత పెద్ద దెబ్బ కొట్టివుండరు.
రాణా తలుపువేస్తూ కామినిని చూసి నవ్వేడు. "మీ సినిమాలు మా తమ్ముడికి చాలా ఇష్టం మాడమ్. ఎందుకో ఇప్పుడు నాకు తెలిసింది. బాగా నటిస్తారు మీరు. కంగ్రాట్స్."
భార్యాభర్తలిద్దరూ చిత్తరువుల్లా వుండిపోయారు.
* * *
రాణా సామాన్లు సర్దుకుంటున్నాడు.
అతడికి తమ్ముడు తప్ప ఎవరూ లేరు. అక్క పెళ్ళయి బావతో వుంటోంది. మరుసటిరోజు ఉగాది. అయినా అతడు వెంటనే ఆ వూరు వదిలి వెళ్ళిపోదల్చుకున్నాడు. అతడి సిబ్బంది వద్దంది. అతడు వినలేదు. "ఇక్కడుంటే నాయుడితో ప్రతిరోజూ గొడవే!.....దానికి నేను భయపడడంలేదు. కాని ఎన్నో నేరాల్ని అరికట్టవలసిన ఒక ఇన్ స్పెక్టర్ టైము, ఈ విధంగా ఒక మనిషి కోసం వృధా అవడం నాకిష్టంలేదు. ఇంకొకచోట ఇంకొక నాయుడిని పట్టుకోవడానికి వెళ్తూన్నానంతే"
అతడు వెళ్ళవలసిన వూళ్ళో అతడికి ఎవరూ తెలీదు. అందువల్ల పూర్తిసామానులు తీసుకెళ్ళకుండా వెళ్తున్నాడు. ఇల్లు తీసుకున్నాక మిగతా సామానులు పట్టుకెళ్ళవచ్చని అతడి వుద్దేశ్యం.
అతడు వెళ్ళే ట్రెయిన్ ఆ వూరు వచ్చేసరికి ఒంటిగంట అవుతుంది.
అప్పుడు టైము పదకొండున్నర అయింది. ఇంకా చాలా టైమ్ వుండటంతో అతడు బెడ్డింగ్ కి అనుకుని పడుకుని పుస్తకం తెరిచాడు.
ఊరంతా నిద్రలోకి జారుకుని చాలాసేపయింది.
నిశ్శబ్దాన్ని చెదురుస్తూ బయట చిన్న అలికిడి. తలుపులు తీసే వున్నాయి.
అతడు చప్పున లేచి కూర్చున్నాడు. అప్రయత్నంగా అతడి దృష్టి పిస్తోలు మీద పడింది.
బయట అడుగుల చప్పుడు దగ్గరైంది.
గుమ్మం దగ్గర ఒక ఆకారం నిల్చింది.
మెరుపువేగంతో కదలబోయిన అతడు ఎరుపులైటు చూసినవాడిలా ఆగిపోయాడు. ఎదురుగా కామిని నిలబడి వుంది.
అంత రాత్రి ఆమె అక్కడకు రావడాన్ని అతడు వూహించలేదు.
"లోపలకు రమ్మంటారా? ఇక్కడే నిల్చొని మాట్లాడమంటారా?" నవ్వుతూ అడిగింది.
"రండి" అన్నాడు.
"వద్దులెండి. వెళ్తాను అదృష్టవశాత్తు చుట్టుపక్కల అందరూ నిద్రపోతున్నారు. ఎవరయినా గుర్తుపడితే ప్రమాదం."
"అటువంటి ప్రమాదం మీకేమీ రాదు."
"ప్రమాదం నాకు కాదు. మీకు" అన్నదామె.
అతడు నిరుత్తరుడయ్యాడు.
