"సర్లేవోయ్. దానిదేముంది? నిన్న మధ్యాహ్నంగానీ నా రూమ్ కి నువ్వు వచ్చివుంటే క్లాస్ లో నిద్రపోయినందుకు తలవాచేటట్లు చివాట్లు పెట్టేవాన్ని. నీ ఆర్ధిక స్థితి గురించీ, నువ్వు చేసే ఈ పని గురించీ తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది. నిన్న ఆ హోటల్లో నా స్నేహితుడు దిగితే చూడ్డానికి వెళ్ళిన నేను, కర్ఫ్యూవల్ల వుండిపోవలసి రావటం యాదృచ్చికం పోతే నీ మ్యూజిక్ మాత్రం అమోఘం.
"థాంక్యూ సర్!" అన్నాడు.
ఈయన్ని కాకాపడితే కొద్దిగా లాభం వుంటుందనిపించింది. సాంస్క్రుతిక కార్యక్రమాలన్నిటికీ కాలేజీలో ఈయనే ఆధిపత్యం వహిస్తూ వుంటాడు. ఈయన తలుచుకుంటే కాలేజీ తరఫున కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకూ వెళ్ళిరావచ్చు.
"మీలాంటి కళాభిమానులు మెచ్చుకోవటం నా అదృష్టం సార్!" అన్నాడు బాలు.
"అంతేనంటావా?" అన్నాడు పొంగిపోతూ.
"అవును సర్! కళాహృదయం వుంది కాబట్టి మీరా సంగీతాన్ని మెచ్చుకోగలిగారు. అసలు ఎకనమిక్సూ, భావుకత్వం ఒక మనిషిలో వుండటం అపురూపం సర్! మీలాంటి లెక్చరర్స్ మా కాలేజీలో వుండటం మా పూర్వజన్మ సుకృతం" అన్నాడు బాలు సుత్తిని స్తుతిచేస్తూ.
"నిజంగా నేనంత బాగా చెప్తానటోయ్?" అన్నాడు.
"మామూలుగా చెప్పటమా? మీరు చెప్తూవుంటే జలతరంగిణి కంపనాల్లాగా పాఠం అలా అలా అలల్లా సాగిపోతుంది సర్!"
"ఓహో! అందుకేనేమో క్లాసులో నిద్రపోతారు చాలామంది" అన్నాడు.
బాలు కేదో వాసన వచ్చింది.
"చూడవోయ్ బాలూ! నా ఇరవై సంవత్సరాల వృత్తిలో నీలాంటి వాళ్ళని సవా లక్షమందిని చూశాను. నీకు సరిగా కాకపట్టడం కూడా చాతకాదు. అయినా చేతిలో ఆర్టున్న వాడికి నీకెందుకోయ్ ఇవన్నీ! అది సరేగానీ అసలు విషయానికి వస్తాను. నీలాంటివాడు కాలేజీలో ఉన్నాడని నాకింతవరకూ తెలీదు. ఎవర్ని పంపాలా అని కొట్టుకు చస్తున్నాను."
"దేనికి సర్?" ఆత్రంగా అన్నాడు బాలు.
"ఇంటర్ యూనివర్శిటీ ఇన్ స్ట్రుమెంటల్ మ్యూజిక్ కాంపిటీషన్ కి మన కాలేజీ తరఫున.
"ఎక్కడికి సర్! శ్రీనగరా?" అని అడిగాడు.
"కాదోయ్! శ్రీకాకుళం? .... లేకపోతే ఏమిటోయ్ ఆ ప్రశ్న? ముందు యూనివర్శిటీ లెవల్లో సెలెక్టు అవ్వాలి. ఆ తర్వాత పై పోటీ."
బాలు సిగ్గుపడి "ఈ పోటీ ఎక్కడ సార్?" అన్నాడు.
"మన కాలేజీలోనే అన్ని కాలేజీల వాళ్ళూ యిక్కడికే వస్తారు. ఎలాగైనా మన యూనివర్శిటీ తరఫున ప్రతినిధిగా నువ్వు సెలక్టు అవ్వాలి. మన పేరు నిలబెట్టాలి. అఫ్ కోర్స్! నిన్న చూశాను కాబట్టి ఈ పోటీలో నువ్వే నెగ్గుతావనుకో."
"ఈ పోటీ ఏమిటి సర్! ఇంటర్ యూనివర్శిటీలో కూడా మనకే బహుమతి" అన్నాడు హుషారుగా బాలూ.
"నువ్వు ఏ ఇన్ స్ట్రుమెంట్ తో పోటీలో పాల్గొంటావు?"
"గిటార్ సర్!"
* * *
పోటీలో మొట్టమొదటి ఎంట్రీ బాలూదే. గిటార్ పట్టుకుని స్టేజి దగ్గరకు వెళ్తూ ఉండగానే చప్పట్లు ప్రారంభం అయ్యాయి. అందులోనూ అది అతని కాలేజీ కాబట్టి, ప్రోత్సాహానికి అంతే లేకపోయింది. ఇన్ స్ట్రుమెంటల్ పోటీలో పక్క వాయిద్యాన్ని ఒకదాన్ని తోడుగా వప్పుకుంటారు. తనతోపాటూ అహమ్మద్ ని తీసుకున్నాడు. అహమ్మద్ తబలా మీద అన్ని రాగాలూ పలికేటంత గొప్పగా మలచగలడు. గిటారూ తబలా చాలా అరుదైన కాంబినేషన్. కానీ కొత్త కొత్త ప్రయోగాలు చెయ్యటం బాలూ కెప్పుడూ ఇష్టమే.
మొట్టమొదట మామూలుగానే మొదలుపెట్టాడు. మొదటి నిముషంలో జనాన్ని కొద్దిగా మూడ్ లోకి తీసుకెళ్ళి తర్వాత అసలుది ప్రారంభించాడు. వేళ్ళు గిటార్ తీగలమీద నాట్యం చెయ్యసాగాయి. ప్రక్కకి తోస్తున్నాయి. వెనక్కి లాగుతున్నాయి.... డామ్ సింగ్... ట్రిల్లింగ్ - క్లిచ్చింగ్...
స్పీకర్ డ్రమ్ముల్లో పాట ప్రారంభం అయింది.
"కోయీ యహా అహ - నాచే నాచే
సారే జహా అహ.... నాచే నాచే"
అంతా ఒక్కసారిగా కాలేజీ కుర్రవాళ్ళు వేసే విజిల్సూ చప్పుళ్ళతో హాలు దద్దరిల్లిపోయింది. మరీ హుషారు పట్టలేని కుర్రవాళ్ళు ఒక మూల డిస్కో మొదలుపెట్టారు. పది నిముషాల్లో బాలూ వంతు పూర్తయ్యింది. తరువాత రెండు నిముషాల వరకూ జనం గోల, వన్స్ మోర్ లు ఆగలేదు.
తరువాత స్టేజి ఎక్కిన ఇంజనీరింగ్ కాలేజి నుండి వృత్తలేఖిని రామారావు! ఫిడేల్ పట్టుకుని స్టేజి ఎక్కాడు. అమావాస్య చంద్రుడిలో పాట మొదలు పెట్టగానే కింద జనం కోరస్ గా దేవదాసు లో పాట మొదలెట్టారు. ఆ విషాదంలోనే అతను సగంలో దిగిపోవలసి వచ్చింది.
తరువాత ఎంట్రీ హోమ్ సైన్స్ కాలేజి నుంచి బచ్చలికూర రాంబాయమ్మది. బొద్దుగా, లావుగా కళ్ళజోడులో వున్న ఒకావిడ స్టేజి ఎక్కింది. ఆమె పాట మొదలుపెట్టగానే దూరం నుంచి నెమ్మదిగా సన్నటి స్వరంతో ఎవరో అన్నారు.
"అబ్బ! ఎళ్ళకెళ్ళ కెళ్ళాను"
పది గొంతులు అంతే నెమ్మదిగా ఒకే స్వరంతో అన్నాయి. "...గోంగూరకి".
"అబ్బ! ఎందుకో అనుకుంటే".
"గోంగూరకి..."
బచ్చలికూర రాంబాయమ్మ శ్రోతల్ని తినేసేలా చూస్తూ స్టేజి దిగిపోయింది. తరువాత వచ్చిన అమ్మాయి "ప్రేమే నేరమౌనా!" అని మొదలుపెట్టగానే వాళ్ళు కోరస్ లో "మాపై ఈ పగేలా?" అని మొదలుపెట్టారు.
తరువాత వచ్చింది ఉమెన్స్ కాలేజి ఎంట్రీ. పేరు పిలవగానే వీణ పట్టుకుని ఒకమ్మాయి స్టేజీవైపు నడిచింది. అక్కడి నుండి గోల మొదలైంది. "ఈ వీణ మ్రోగకపోయినా..." అన్నాడు ఒకడు నెమ్మదిగా. ఈసారి అమ్మాయిలు కూడా నవ్వేశారు. "పాడమని నన్నడగవలెనా" అని ఎత్తుకున్నాడు బాలూ ప్రక్కన సుబ్బారావు. వాడు మామూలుగా మాట్లాడితేనే గుడ్లగూబ అరిచినట్టు వుంటుంది. ఇంకొక మూలనుంచి ఒక చిన్న గ్రూపు "ఈ వీణకు శృతిలేదూ..." మొదలుపెట్టారు.
అంతలో ఒక సన్నటి నాదం గాలిలో వ్యాపించింది.
ఒక చూపుడు వేలు ఒక తీగెను మీటితే వచ్చే నాదం కాదది.
వచ్చిన శబ్దం ఆగకముందే మరో కంపనం.
దానిమీద మరొకటి.
ఎంతో అనుభవమూ చేతిలో పరికరాన్ని ఆట వస్తువులా తిప్పగలిగే నేర్పు ఉంటే తప్ప ఆ కమేండ్ రాదు. వాయిద్యాల గురించి తెలిసిన వాళ్ళకిది అది అర్ధం అవుతుంది. సరిగ్గా నిముషం గడిచేసరికి ఆమె జనాన్ని తనతోపాటు ఇంకో లోకంలోకి తీసుకువెళ్ళిపోయింది. గుంపుగా వున్నప్పుడు జనం ఆలోచనా రహితులు. దాన్నే గ్రూప్ సైకాలజీ అంటారు. కాని ప్రత్యేకంగా ప్రతి హృదయాన్ని స్పందింపచేయగలిగితే ఒక్కొక్కరూ ఇండివిడ్యువల్ గా స్పందిస్తారు. దీన్ని అప్పీలింగ్ టు ది సెన్సెస్ అంటారు. ఆమె ఇప్పుడు చేస్తున్న పని అదే.
గుంపులో వున్నప్పుడు ఏ డిస్కో డాన్సర్ లాటి పాటో వాయించి జనంచేత చప్పట్లు కొట్టించడం, ఆడిటోరియం దద్దరిల్లిపోయేలా చేయటం ఒక టెక్నిక్. కాని వాళ్ళు యింటికి వెళ్ళిన గంటసేపట్లో ఇది మర్చిపోతారు. పూర్తి శాస్తీయ పద్దతిలో కొద్దిమంది జనాన్ని మాత్రం ఆకట్టుకుని మిగతా వారికి బోర్ కొట్టించటం ఇంకో టెక్నిక్ నవలల పోటీల్లో బహుమతి వచ్చిన రచనల్లా వుంటాయవి. అలా కాకుండా "గుంపు"ని ఆహ్లాదపరుస్తూ, విలువల్ని కాపాడటం కళాకారుడికి కత్తిసాము. బాలు డిస్కోబీట్ వాయిస్తున్నప్పుడు గెంతువేసిన జనమే ఆమె "కొమ్మల్లో కోయిలా" వాయిస్తూంటే నిశ్శబ్దంగా మంత్రముగ్ధులై వినసాగారు.
బాలూ ప్రక్కనున్న సుబ్బారావు పిట్టలా అరవబోయేసరికి ఓ పది తలలు వెనక్కి తిరగడంతో ఆమె ఎంత బలంగా ముద్రవేసింది తెలుస్తోంది. ఆ పది తలల్లో బాలూది ఒకటవ్వడం విశేషం. మూడు నిముషాలు ఈ విధంగా లలితమైన భావస్ఫూర్తిలో తేలియాడించి శ్రోతల మూడ్ మరలించటం కోసం ఆమె సైగచేసింది. ప్రక్క వాద్యగాడు ఒక్కసారి బీట్ మార్చాడు. బాలు ఉలిక్కిపడి ఆమెవైపు చూశాడు. అదే సమయానికి ఆమె అతడివైపు చూసింది. ఆమె మొహంలో సన్నటి చిరునవ్వు కూడా గర్వంగా కదలాడింది. మార్చిన బీట్ తో ఆమె ఉషా అయ్యర్ పాట "అండ్ విత్ ఎవిరి డ్రాప్ రైన్ ఐ లవ్ యూ మోర్" అని ఎత్తుకుంది. జనాన్ని సరిగ్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది దెబ్బ అనుకున్నాడు బాలు. అప్పటివరకూ సూదిపడితే వినిపించేంత నిశ్శబ్దంగా వున్న జనంలోంచి ఆనకట్ట తెగితే బయటికి దూకే నది హోరులాంటి శబ్దం ఒక్కసారి బయలుదేరింది.
పోటీ ముగిసి జడ్జిమెంటుతో ఎకనమిక్స్ మాస్టారు మైకు దగ్గరికి రాకముందే జనం ఏకగ్రీవంగా ఎవరు ఫస్టో నిర్ణయించేశారు. శ్రీనగరో, శ్రీకాకుళమో వెళ్ళే ఛాన్సు పోయినందుకు బాలూ ఏమీ బాధపడలేదు. బీట్ మారుస్తూ ఆమె బాలూవైపు చూసి నవ్వినపుడు మన్మధుడు టపటపా అయిదు బాణాలు కొట్టేశాడు. మెడనుంచి క్రింది భాగం అంతా తిమ్మిరెక్కినట్టయి, ఎందుకా అనుకున్నాడు. అప్పుడు అర్ధం అయింది ప్రేమలో అక్కడివరకూ మునిగిపోయాడని.
వసంతకాలం ఎప్పుడో తెలీదుగాని పారేసిన ఖాళీ మిక్చర్ పొట్లాలు రాలుతున్న ఆకుల్లాగానూ, అతని స్నేహితుల అరుపులు కోయిల కూతల్లాగానూ వినిపించసాగాయి.
ప్రేమలో పడ్డవాళ్ళు స్నేహితుల సలహాలు తీసుకోవడం, రూమ్ లో కూర్చుని గడ్డం పెంచేసి విరహగీతాలు పాడుకుంటూ తన ప్రేమని ఎలా తెలపాలా అని మధనపడటం ఓల్డు టెక్నిక్ అలాంటి నాజూకైన భావాలు, స్పందనలూ, బాధపడటాలూ, ఆ చేతగానితనానికి విరహం, అలౌకికమైన ప్రేమలాంటి నాజూకు పదాల ముసుగేసుకోటాలూ బాలూకి తెలీదు. ఆ అమ్మాయి కూడా తనని ప్రేమిస్తేనే పెళ్ళి చేసుకోవటం... అంతే!.....
ప్రేమకి క్లయిమాక్స్ పెళ్ళి కాకుండా మరొకటి వుంటుందని బాలూకి తెలీదు. అంత ఆలోచించే ఓపికా తీరికా అతడికి అతడి జీవితం ఇవ్వలేదు. కేవలం కష్టపడటం నేర్పిందంతే! ఇప్పుడిప్పుడే జీవితంలో సెటిల్ అవుతున్నాడు. తల్లిదండ్రుల చాటు పెరిగిన పిల్లలకి లేని తెగువ, మొండితనం, కమాండ్ అతడికి అతడి జీవితమే యిచ్చింది. అనుకున్నది చెయ్యటం ఒక్కటే అతడికి తెలుసు. అందుకే వాళ్ళ క్లాసులో వచన గేయాలు వ్రాసే ఒక భావకుడు అతడికి 'మెటీరియలిస్ట్', 'రాక్ హడ్సన్' అని పేరు పెట్టాడు. (రాక్ హడ్సన్ అంటే కొండరాయిలాంటి గుండె కలవాడు అని అర్ధం అట!) అది తెలిసిన బాలు బాధపడలేదు. నవ్వుకున్నాడు. కష్టాల్నెదుర్కోవాలంటే పువ్వులాకాదు- రాయిలా వుండాలి మనసు - అన్నది అతడి సిద్దాంతం.
అయితే ప్రస్తుతం అతడి మనసు పరిస్థితి గమ్మత్తుగా వుంది. ఆ గమ్మత్తు పరిస్థితికి ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ నాలుగు పదాల వాక్యమే వుండటం కూడా గమ్మత్తే...
లవ్ ఎట్ ఫస్ట్ సైట్.
తొలి చూపు లో ప్రేమ!
ఆమె స్టేజీమీదకు వెళ్ళి సర్టిఫికెట్ అందుకుని క్రిందకు దిగి వస్తూండగా "హలో" అన్నాడు బాలు ప్రక్కనుండి.
ఇది వూహించని ఆ అమ్మాయి బిత్తరపోయింది.
"కంగ్రాట్యులేషన్స్" అని తిరిగి అన్నాడు.
ఆ కంగారులో 'థాంక్స్' అని కూడా అనాలని తోచలేదనుకుంటా. అతనివైపు భయంగా చూసి ముందుకు కదలబోయింది.
