Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 58


    అమ్మాయితో మంచి స్నేహమయింది. ఇంటి గురించి ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టారు. మొదట్లో అతడంటున్న మాటలను తిన్నగా ఆమె వినిపించుకోలేదు. ఆ మాటలు అంటూన్న విధానాన్ని వింటూ వచ్చింది....తర్వాత అతడు చెప్పిన ప్రతిమాటా విన్నది యంత్రాలు తమలో జొరబడడం అనీ తమ్ము నాశనం చెయ్యడమనీ తమలో సరసమైన వాటినన్నీ నాశనం చెయ్యడమనీ అతడన్న పిచ్చిమాటల్ని వింది.
    ఆదివారాలు పనిలోకి వెళ్ళడం మానేశాడు. సముద్రతీరంలో నడవడం మొదలుపెట్టారు. ప్రతి ఆదివారం సముద్రపుటొడ్డున కొండలదాకా నడుస్తూ ఇంటిగురించి మాట్లాడుకున్నారు. 1927 సెప్టెంబరు అక్టోబరు నెలలో ఆదివారాలన్నీ శాన్ ఫ్రాన్సిస్కో అఖాతంనుంచి కొండలదాకా నడవడంతోనే గడిచాయి.
    దారి తప్పిపోయానన్న భావం అతనిలోనుంచి తొలగిపోవడం ప్ర్రారంభమయింది. తాను బతికివున్న సంగతి తెలిసి ఆ సంగతికి ఒక ప్రాముఖ్యం ఇచ్చే మనిషి కనీసం ఒకర్తె అయినా ఈ ప్రపంచంలో వుంది. తాను చిరకాలం నుంచి కోరుకుంటున్న ఇల్లు నిజంగానే రూపు కట్టినట్లుగా అందులోకి ఈ నవ్వుతూన్న అమ్మాయితో కలిసి ప్రవేశించినట్టుగా అక్కడే ఇద్దరూ కలిసి శాశ్వతంగా వుండిపోయినట్టుగా అనిపించిందతనికి కొన్నాళ్ళు.
    అతని వయస్సు పందొమ్మిదేళ్ళని చెప్పాను కాదూ శాశ్వతంగా, శాశ్వతంగా అక్కడే వుంది తమాషా అంతా రోజు పొడుగునా టెలిటైపు యంత్రం ముందు అతనికి గానం వినబడేది ఒకటి రెండు మూడు నలుగు అయిదు ఆరు ఏడు ఎనిమిది శాశ్వతంగా శాశ్వతంగా శాశ్వతంగా ఈ అమ్మాయి ఈ గానం కట్టబోయే ఇల్లూ అన్నీ మిశ్రితం అయిపోయేవి, ఓ క్షణకాలం నిజంగానే తన ఆశ ఫలించితీరుతుందని అతని కనిపించింది .
    ఇప్పుడు నేను నిజం బయలు పెడుతున్నాను. కల్పించి కథారాయడం నాకిష్టం కాదు.
    ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు మాసాలలో ఏదో అనిర్వచనీయకారణం వల్ల. గాలిలోనే ఆ గుణం వుందనుకుందాం-వారిద్దరూ అమోఘమైన అద్వైతభావం సాధించారు. రాగం, తాళం, శ్రుతి అన్నీ ఒక్కటిగా పెనచుకొన్నాయి, శాశ్వతత్వాన్ని కోరిన వారి స్వప్నం అసాధ్యమైన స్వప్నంగా కనబడలేదు.
    ఆ యిల్లు, యింకా కావాలనే వుంది వాళ్ళకి తీవ్రంగా వాంఛిస్తున్నారు దాన్ని ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నెలలో ఒండొరులను తీవ్రంగా వాంఛించాలనుకున్నాడు ఇత్యాదయః.
    ఏవేవో సంభవిస్తాయి. చెప్పకుండా చెయ్యకుండా నిమ్మళంగా విచిత్రంగా. ఒక క్షణంలో ప్రతీదీ ఒకరకంగా కనబడుతుంది. ఇంతట్లో మరోసారి చూచినంతలో ప్రతీదీ మారిపోయి ఇంకోరకంగా కనబడుతుంది. ఇంకో ఏర్పాటు, రక్తం ఇంకోలాగ భూమి ఇంకోలాగ, జీవితపు అర్ధం ఇంకోలాగ దీని విషయమై మనం చెయ్యగలిగినది ఏమీ లేదు. కళ ఒక్కటే నిర్దిష్టస్పష్టరూపంతో శాశ్వతంగా నిలుస్తుంది. శాశ్వతంగా మనం కళనిమాత్రమే నమ్ముకోవచ్చును.
    వాళ్ళు పోట్లాడుకోలేదు, అమ్మాయికి జబ్బుచేసి చచ్చిపోలేదు. ఇంకో కుర్రాడితో గాని డబ్బున్న ఇంకో ముసలాడితోగాని పారిపోలేదు.
    అకస్మాత్తుగా ఆ గానం ఆగిపోయింది. అందలి ఎదురుదెబ్బ హరించుకుపోయింది. అది నవంబరు.
    నా గదిలో కూర్చునేవాణ్ణి మామధ్య సంభవించిన దాని స్వభావాన్ని అర్ధంచేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఆ యిల్లు అబ్బే ఎంత హాస్యాస్పదం నాకొస్తూన్న జీతం మీద "నే నొక ఇల్లెలాగ కొనగలను? దారి తప్పిపోయినట్లనుకోవడమో? అదీ అసందర్భమే. వొట్టి తెలివితక్కువ ఊహ గది ఈ కొస నుంచి ఆ కొస వరకు నడుస్తూ సిగరెట్టు తర్వాత సిగరెట్టు కాలుస్తూ మాకోసం మేము కట్టుకున్న భవనం ఎలా కూళిపోయిందో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేవాణ్ని నగరాన్ని వదలిపెట్టి పోవాలని ఎందుకనుకోవడం మానేశామో తెలుసుకోవాలనిపించింది. అమ్మాయి ఒక్కర్తేకాదు. నేనూ ఇంటి గురించి మాట్కాడడం మానేశాను. నాకా సంగీతం వినపడడం మానేసింది. మళ్ళీ నిశ్శబ్దం నన్ను ఆవహించింది. దాని మధ్యలో నిలబడి మళ్ళీ దారి తప్పిపోయినట్టు అనుకున్నాను.
    అయితే ఈ మాటు మళ్ళీ నన్ను కలుసుకోవాలనే కోరిక లేదు. పోతే పోనీలే అనుకున్నాను. అదేదో అలాగే వుండనీ యిత్యాదయః
    చలికాలపు రోజుల్లో వాళ్ళిద్దరూ క్రమక్రమంగా ఒకరికొకరు దూరమైపోయారు. ఇంతట్లో హఠాత్తుగా 1928మార్చిలో అంతా అయిపోయిందనీ గతం మృతమైపోయిందనీ అతనికి బోధపడింది.
    ఏదో అయిందామెకి. పనిపోగొట్టుకుంది. వెళ్ళిపోయింది. ఇంకో చిరునామాకో, ఇంకో నగరానికో, సరిగా అతనికి తెలియదు. ఆమె చహరా దొరికింది కాదతనికి.
    జూన్ లో అతనికేదో అయింది.
    ఒక సాయంత్రం నేను టెలిటైపు యంత్రం ముందు పనిచేస్తూ కూర్చున్నాను. ఇంతట్లోనే హఠాత్తుగా ఆ గానం వినబడింది. ఒకటి రెండు మూడు నాలుగు అయిదు ఆరు ఏడు ఎనిమిది జోరుగా, ఆమె ముఖం నాకు కనబడడం మొదలుపెట్టింది ఆమె నేత్రాలనే ప్రకృతిదృశ్యాలు గోచరించాయి. ఆమె నవ్వు వినబడడం మొదలుపెట్టింది. ఒకటి రెండు మూడు నాలుగు అయిదు ఆరు ఏడు ఎనిమిది యంత్రంమీద పనిచేస్తున్నప్పుడంతా ఈ సంగీతమే, ఈ పిల్ల జ్ఞాపకమే మేము కట్టుకుందామనుకున్న ఇల్లే, ఇవన్నీ ఇదివరకటిలాగే వేసవికాలంలో మేమనుకున్నట్టే కళ్ళకి కట్టినట్టే వాస్తవంగా, సత్యంగా నా మనస్సులో గోచరించి దిక్కుమాలిపోయినట్లు, దిగ్భ్రాంతి చెందినట్టు కళవళపడే వాడిని.
    ఆ సాయంత్రం రికార్డు వేశాడు. కాని ఒక్కసారి మాత్రమే విన్నాడు. ఏమంటే అతని కళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి. కన్నీళ్ళు చూసి నవ్వాడు. కాని రెండో మాటు సంగీతం వినే సాహసం లేకపోయింది. మొత్తం మీద అంతా చాలా తమాషాగానే వుంది అనుకున్నాడు. సంగీతం, అమ్మాయి, ఇల్లూ అన్నీ కలిసి ఒకే అర్ధంగా తన మనస్సుకి గోచరించింది. తమాషాగానే ఉంది కాదూ.'
    కాని ఆ మర్నాడు ఆమె ఎక్కడ వున్నదీ తెలుసుకోవాలని ప్రయత్నించడానికి ప్ర్రారంభించాను. ఇలా దానంతటదే జరిగింది. షికారు నడుస్తుండగా నాకే తెలియకుండా ఆమె ఇదివరకున్న ఇల్లు చేరుకున్నాను. అందులో కొత్తగా దిగినవాళ్ళని ఆమె గురించి అడిగాను. ఎక్కడికి పోయిందో తెలియదన్నారు. ఉదయం ఒంటిగంటదాకా అలాగే నడిచాడు సంగీతం మళ్ళీ నాలోనికి ప్రవహిస్తోంది. తరచుగా నా కది వినిపిస్తోంది.
    టెలిటైపు యంత్రంముందు కూర్చున్నప్పుడల్లా అందులోంచి వస్తూ సంగీతం అతని వినిపించేది. ఒకటి రెండు మూడు నాలుగు అయిదు ఆరు ఏడు ఎనిమిది ప్రతి ఆదివారం మళ్ళీ ఆమెను నాకు అప్పగించమని యంత్రాన్నతడు ప్రాధేయపడటం ప్రార్ధించేవాడు. ఎంత అసందర్భం. ఆమె కంపెనీలో పని చెయ్యడం లేదని అతనికి తెలుసును. ఐనా ఎప్పుడో ఒకమాటు హెల్లో హెల్లో హెల్లో అని ఆ యంత్రం పాతపలుకరింపు టైపు చేస్తుందనుకునేవాడు. అసందర్భం కాదూ కేవలం అసందర్భం.
    ఆమె గురించి అతనికట్టే తెలిసిందేమీ లేదు. ఆమె పేరు తెలుసు. ఆమె తన కెంతగా కావాలో తెలుసు. అంతే మరి ఆ సంగీతం మళ్ళీమళ్ళీ వినబడుతుంది.
    ఒక సాయంత్రం అతడు టెలిటైపు యంత్రం ముందునుంచి లేచి నిలుచున్నాడు పనిచేసేటప్పుడు వేసుకునే కోటు విప్పెశాడు. రెండు గంటలు దాటి కొద్ది సేపయింది. పని మానేస్తున్నానని చెప్పేసి డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ ఐశ్వర్యం ఏదీ నా కక్కరలేదు అన్నాడు. తన గదికి వెళ్ళాడు. తనతో తీసుకు వెళ్ళదలచుకున్న వస్తువుల నన్నిటినీ రెండు సూటుకేసులలో వేసి కట్టేశాడు.
    ఫోనోగ్రాఫులనీ, రికార్డులనీ ఇంటి యజమానురాలైన మిసెస్ బీబిగ్ కు ఇచ్చేశారు. ఆమెతో అన్నాడు, ఈ ఫోనోగ్రాపు పాతది. అప్పుడప్పుడు మూలుగుతుంది. ముఖ్యంగా బిథోవెస్ గానం ఏదైనా వేసినప్పుడు అయినా ఇప్పటికీ పనిచేస్తుంది. రికార్డులేని అంత చెప్పదగ్గవి కావు. కొన్ని మంచి పాటలున్నాయి. కాని చాలాభాగం విసుగెత్తించే జాబ్ సంగీతం. యజమానురాలితో మాట్లాడుతున్నంతసేపూ అతనిలో సంగీతం ధ్వనిస్తూనే వుంది. నిజంగా ఈ ఫోనోగ్రాఫునీ, రికార్డులనీ ఇంకోరి ఇంట్లో వదిలిపెట్టి పోవడం బాధగానే వుంది కాని ఇవి నాకక్కర్లేదని అతడు రూఢిగా అనుకున్నాడు.
    డిపో వెయిటింగ్ రూమునుంచి ట్రెయినుదాకా నడుస్తూన్నంతసేపూ సంగీతం నా గుండెల్ని చీలుస్తూనే వుంది! ట్రెయిను కదలబోతున్న సమయానికి, ఈల వినబడ్డవేళకి నేను నిస్సహాయంగా కూలబడిపోయి ఈ అమ్మాయికోసం ఇల్లుకోసం ఏడుస్తున్నాను జీవితం ఇవ్వగలిగినదానికంటే హెచ్చుగా జీవితంనుండి కోరినందుకు నన్ను నేనే అపహసించుకుంటున్నాను.
    
                                    ---౦౦౦---


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS