Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 58

 

                          24
    
    వరూథినీ పిక్చర్ ప్యాలెస్ ఓపెన్ చేసి మూడు నెలలయింది. థియేటర్ కలక్షన్స్ బాగానే వున్నాయి. టౌను మొత్తంలో అంత మంచి థియేటర్ లేదన్న పేరు వచ్చింది. స్థలమూ, హాలూ, ఫర్నిచరు, ఎక్విప్ మెంటూ అన్నీ కలిసి ఏడు లక్షల దాకా అయింది. సినిమాహాలు నిర్మాణంతో వరూధిని అంతస్తుకూడా పెరిగిపోయింది. ఆమె పేరు, ఆమె హోదా టౌన్లో చాలామందికి తెలిసిపోయింది. ముఖ్యంగా ధనిక వర్గంలోనూ, వ్యాపారస్తులూ, బ్యాంకర్లూ, బ్రోకర్లూ, ఆఫీసర్లలోనూ వరూధిని పేరు తరచు వినబడడం, అందులో కొంతమందికి స్వయంగా పరిచయం కూడా ఉండటం చేత, ఆమె పరపతి కూడా పెరిగిపోయింది. రైలుపేటలో వున్న ఇల్లు ఖాళీచేసి, కొత్తపేటలో కొత్తగా కట్టిన డాక్టరుగారింట్లో చేరాలనే నిర్ణయానికొచ్చింది వరూధిని.
    "నెలకు రెండు వందల పాతిక రూపాయలా? అంత అద్దె పెట్టి మనకెందుకు ఇల్లూ?" అన్నాడు వెంకటపతి.
    "మన హోదాకు తగినట్టు మనం ఉండాలి! ఈ మురికి పేటలో ఒక వాటాలో ఇంకా ఎన్ని రోజులుండమంటారు? మొన్న సబ్ కలెక్టరుగారి భార్య మనింటికొచ్చి ఏమందో తెలుసా?" అన్నది వరూధిని.
    "ఏమన్నదంటా?" అన్నట్టుగా భార్యకేసి చూశాడు వెంకటపతి.
    "చెప్తే మాత్రం నీ బుర్రకు ఎక్కుతుందా?" అన్నట్టు భర్తకేసి చూసింది వరూధిని.
    కారుదిగి రామనాథబాబు లోపల కొచ్చాడు. నిలబడి మాట్లాడటం మొదలుపెట్టాడు.
    "ఏమిటా తొందర? కూర్చోకూడదా ఏం?" అన్నది వరూధిని మూతి తిప్పుతూ.
    "నీకేం మహారాణివి? కూర్చొనే చక్రం తిప్పుతున్నావ్! టాక్స్ వాళ్ళు వచ్చారు. వచ్చేవారం పిక్చర్ మార్చాలి. ఇది లాగటం లేదు. డిస్ట్రిబ్యూటర్స్ తో ట్రంక్ లో మాట్లాడాలి. నంబర్ కాల్ బుక్ చేసి వచ్చాను." రామనాథబాబు గుక్క తిప్పుకోకుండా మాట్లాడసాగాడు. లోగడ తనతో తూచితూచి మాట్లాడే రామనాథబాబు ఎంత జోరుగా మాట్లాడుతున్నాడూ? అనుకొన్నది వరూధిని. "ఇంతకీ డాక్టరుగారి ఇంటి సంగతేం చేశారు?" అన్నది.
    "అదా? అది మాట్లాడేశాగా? మూడు నెలల అద్దెకూడా అడ్వాన్సు ఇచ్చాను" అని జేబులోనుంచి తాళం చెవి తీసి "ఇదిగో కీ! నీ ఇష్టం వచ్చినప్పుడు చేరవచ్చు" అన్నాడు.
    వరూధిని వంగి తాళంచెవి తీసుకుని రామనాథబాబుకేసి ఆపేక్షగా చూసింది.
    రామనాథబాబు ఓ కవరు తీసి వరూధిని చేతికి అందిస్తూ "రెండువేలు! నేవస్తా మరి. కొత్త ఇంట్లో చేరగానే పార్టీ. మర్చిపోయేవ్? వస్తానండి వెంకటపతిగారూ!" అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. అతని వెనకే వెళ్ళిన వెంకటపతి, కారెక్కి కూర్చున్న రామనాథబాబు వంకచూసి ఏదో చెప్పాలని ప్రయత్నించి, మళ్ళీ చెప్పలేక వూరుకున్నాడు. రామనాథబాబు వెంకటపతి అవసరాన్ని త్రుటిలో గ్రహించాడు.
    "అదేగా? నిన్న మర్చిపోయా! రాత్రికి తప్పకుండా పంపిస్తా!" అన్నాడు. కారు సాగి వెళ్ళిపోయింది.
    ఇంట్లోకి తిరిగి వచ్చిన వెంకటపతిమీద వరూధిని విసుగుకొంది.
    "ఏమిటలా లేకిగా ఆయనెమ్మట పడ్తారు?"
    "ఏం లేదులే!" అన్నాడు వెంకటపతి నసుగుతున్న ధోరణిలో.
    వారం తిరక్కముందే వరూధిని ఇల్లు ఖాళీచేసి కొత్త ఇంట్లో ప్రవేశించింది. గదులన్నీ విశాలంగా వున్నాయి. ఎటాచ్ డ్ బాత్ తో వున్న రెండు బెడ్ రూమ్సూ వరూధినికి చాలా నచ్చాయి. నాలుగు రోజులు శ్రమపడి ఇల్లంతా తనకు నచ్చిన విధంగా అలంకరించుకొంది.
    వరూధిని కొత్త ఇంట్లో ప్రవేశించిన ఐదోరోజున రామనాథబాబు వచ్చాడు.
    "ఐదు రోజులుగ్గాని తీరికలేదన్నమాట!" దెప్పినట్టుగా అన్నది వరూధిని.
    "రెండు హాల్సు మేనేజ్ చెయ్యాలంటే తల ప్రాణం తోక్కొస్తూంది. మాటలు కాదు" అన్నాడు రామనాథబాబు సోఫాలో కూలబడుతూ.
    "ఇష్టమై బరువెత్తుకొన్నారు! ఇప్పుడు దించాలంటే వూరుకుంటారా ఏమిటి?" అని వయ్యారంగా నడుం తిప్పుకుంటూ లోపలకు వెళ్ళబోయింది వరూధిని. రామనాథబాబు వరూధిని చెయ్యి చటుక్కున పట్టుకుని సోఫాలోకి లాగాడు.
    "నాకిప్పుడేం అక్కర్లేదు."
    "అక్కర్లేదంటూనే ఇదేమిటి?" చెయ్యి లాక్కుంటూ అన్నది వరూధిని.
    "కాఫీ అక్కర్లేదన్నా..." ఆనాడు రామనాథబాబు వరూథిని కళ్ళల్లోకి చూస్తూ. మళ్ళీ చెయ్యి పుచ్చుకుని గుంజసాగాడు.
    "ఆయన ఇంట్లో వున్న సంగతికూడా మర్చిపోయారా ఏమిటి?" గొంతు నొక్కి అన్నది వరూథిని.
    "ఎవరూ?"
    "ఎవరా? ఇంకా ఎవరన్నా ఉంటారా ఏం?" వరూధిని మాటల్లోని వ్యంగ్యం రామనాథబాబుకు అర్ధమై ఉడుక్కున్నాడు.
    "ఏమో నాకేం తెలుసూ?"
    "చాల్లేండి! ఎవరన్నా వింటే నవ్వుతారు." వరూధిని రామనాథబాబు మెడ వెనక నుంచి చేతులు వేసి, జుట్టంతా చెరిపి బుగ్గమీద గిల్లింది. రామనాథబాబు చేతులు వెనక్కు చాచి వరూధిన్ని తనమీదకు లాక్కోటానికి ప్రయత్నం చేశాడు.
    వరూధిని అతని చేతుల్లోంచి తప్పించుకొని దూరంగా వెళ్ళి నిలబడింది.
    "అబ్బ! మీక్కాదూ చెప్పేది? ఆయన ఉన్నారంటే!"
    "ఎవరండీ?"
    "ఎవరా? మావారే!"
    "థియేటరు దగ్గర కెళ్ళలా?" అనుమానంలోపడి అన్నాడు రామనాథబాబు.
    "ఊహూ!, వెళ్ళలా! ఇంట్లోనే పడుకున్నారు!"
    "ఏమొచ్చిందంటా?" రామనాధబాబు కొంచెం గాబరా పడ్డాడు, మేట్నీ టైంకు థియేటర్ దగ్గర ఉండాల్సినవాడు ఇంట్లోనే ఉన్నాడన్న సంగతి తెలిసి.
    "వంట్లో బాగా లేదట!"
    "వంట్లో బాగా లేకపోవటం కాదు. గొంతులో చుక్క పడలేదేమో?"
    "ఆయనకు ఇరవై నాలుగ్గంటలూ అదే పని అయిపోయింది. ఒక్కరోజు దొరక్కపోతే మంచంమీదనుంచి లేవడు. ఇదంతా మీ చలవే." వరూధిని మాట విసిరింది.
    "నీ కవసరమైనప్పుడు నేర్పావు! ఇప్పుడేమో నామీద పడి ఏడుస్తావూ?" రామనాథబాబు ఠపీమని అంటించాడు.
    "అబ్బ! ఇంతలోనే అంత కోపమా? ఏదో తమాషాగా అన్నా దానికే మీరు ముక్కులు ఎర్రజేసుకోవాలా ఏం?" మృదువుగా లాలనగా అన్నది వరూథిని.
    "నీకేం తెలుసూ? నీకేం? ఇంట్లో కూర్చున్నా వారానికి వెయ్యి రూపాయలు వస్తున్నాయ్. ఎలా వస్తున్నాయనుకున్నావ్?"
    "ఓహో! అయితే, నేనే వచ్చి హాలు మానేజ్ చేసుకుంటాన్లే."
    "ఏమిటీ?"
    "ఏం? నాకా మాత్రం చాతకాదంటారా?"
    "చాతకాదన్నానా? నువ్వు చెయ్యలేనిదేమిటా అని ఆలోచిస్తున్నాను అంతే!"
    "చాల్లే! సంతోషం!" వరూధిని లోపలి కెళ్ళింది. వంటగదిలో నుంచి కాఫీ తీసుకొస్తూ, భర్త గదిలోకి తొంగి చూసింది.
    "ఏమిటండీ, ఇంకా నిద్ర? నాలుగవుతుంటేను? రామనాథబాబుగారొచ్చి కూర్చొని ఎంతసేపయిందీ?"
    "నిద్రాలేదు. పాడూలేదు. ఊరికే పడుకొన్నా. ఆయనొచ్చాడా? ఎంతసేపయిందీ?" అంటూ లేచాడు వెంకటపతి.
    వరూధిని మాట్లాడకుండా హాల్లోకి వచ్చి రామనాథబాబుకు కాఫీ కప్పు అందించి ఎదురుగా కూర్చొంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS