"ఒసేయ్ జయంతి! కాకి ఒకటే పనిగా అరుస్తుందే! మీ బాబాయ్ లు వస్తున్నరేమో చూడు" అని కేకేసింది భ్రమరాంబ నీరసంగా.
"ఈమెదంతా చాదస్తం. కాకి అరుపుకి బాబాయ్ లు రాకకి సంబంధం ఏమిటో?" అంది జయంతి దాక్షాయణితో.
దాక్షాయణితో పాటు పార్వతి కూడా నవ్వింది.
వారికీ ఆ విషాదం క్రమంగా అలవాటయిపోయింది. అంతటి విషాదాన్ని కూడా వాళ్ళు జిర్ణించుకున్నారు.
ఆ సాయంత్రం వేళ కాకి అదేపనిగా అరుస్తూనే వుంది.
వీధిలో పిల్లలు ఆడుకుంటున్నారు.
ఆ పసివాళ్ళకు తెలియదు. కనుక వాళ్ళకివెం పట్టనట్టు హాయిగా ఆడుకుంటూ కేకలు వేస్తున్నారు.
బాబిగాడు పెద్దగా అరిచాడు
"బాబాయ్,నాన్నగారు వస్తున్నారు" అంటూ.
ఇంట్లో అందరికి ఆ కేక వినిపించింది.
ఒక్కసారిగా అందరిలో చైతన్యం కలిగింది.
"నేను చెప్పలేదటే. కాకి అరుస్తుంది చూడమని" అంది భ్రమరాంబ.
జయంతి నిజంగానే ఆశ్చర్యపోయింది.
ఇదేంటి కాకికి ఎలా తెలుసు? అని ఆశ్చర్యపోతూ పరుగున వీధి గుమ్మం దగ్గరకు వెళ్ళింది. అప్పుడే బండి దిగి స్టాండ్ వేస్తున్నాడు మాధవరావు బాబాయ్.
సుందరం బాబాయ్ ముఖం పిక్కుపోయివుంది.
జయంతిని చూసి జీవం లేని నవ్వు నవ్వాడు.
మిగిలిన వాళ్ళంతా పంచలోకి వచ్చి నిలబడ్డారు.
అందరి ముఖాల్లో అనందం తోనికిసలాడింది.
సుందరం నవ్వుకుంటూ పంచలోకి వెళ్ళాడు.
అతని వెనుకాలే మాధవరావు వెళ్ళాడు.
శివపార్వతి ఒకపక్క అనందం, మరోపక్క దుఃఖం రెండు ఒకేసారి వచ్చి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. సుందరం ముందు సర్వోత్తమరావు దగ్గరకు వెళ్ళి అయన కాళ్ళు పట్టుకుని.
"నన్ను క్షమించు అన్నయ్యా" అన్నాడు.
అయన కళ్ళు చెమర్చాయి. గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. పై కండువాతో కళ్ళు అద్దుకుని "నాకు కాదురా.....అడుగో ఆ గదిలో రాత్రి నుంచి మాటా పలుకూ లేకుండా నీకోసం నిశ్శబ్దంగా రోధిస్తున్నాడు చూడు మీ పెద్దన్నయ్య అయన కాళ్ళమీద పడి క్షమాపణ అడుగు. తరువాత నీ భార్య కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు" అన్నాడు సర్వోత్తమరావు.
సుందరం రామశేషు దగ్గరకు వెళ్ళి "అన్నయ్యా....నేను వచ్చేశాను అన్నయ్యా.....నువ్వు బాధపడకు" అన్నాడు.
"సుందరం.....నాయనా వచ్చావా?!" అని పెద్దగా అరిచి అనందం పట్టలేక పెద్దగా ఏడ్చేశాడు.
"అన్నయ్యా...నన్ను క్షమించు అన్నయ్యా....మీ అందర్నీ బాధపెట్టాను. నా పాపానికి నిష్కృతి లేదు, నన్ను క్షమించన్నయ్యా. పార్వతీ! నువ్వు క్షమిస్తావా? ఎన్నోసార్లు పాపం నువ్వు ఏడుస్తూ మొత్తుకొని చెప్పావు....నన్ను క్షమించు పార్వతీ" అంటూ పెద్దగా రోదించాడు.
"అరేయ్ సుందరం! ఏంటది చిన్నపిల్లాడిలా .....ఊరుకో.....జరిగిన దాన్లో నీతప్పేముంది? ఆ నీచుడు చేశాడు ఇదంతా.....ఊరుకో! మానవ మాత్రులం తప్పులు చేయటం సహజం. కానీ చేసిన తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపం చెందడంలోనే వుంది గొప్పతనం" అని ఓదార్చాడు మాధవరావు.
"అన్నయ్యా.....నువ్వేకనక రాకపోయినట్లయితే నా బ్రతుకు ఏమయ్యేది అంటూ ఏడ్చాడు.
"అరెరే- రాకుండా ఎలా వుంటాంరా? మనది రక్త సంబంధం. దారి తప్పిన వాడికోసమే
ప్రయాసపడాలి.....ఊరుకో.....ఇప్పటికయినా తప్పోప్పులు తెలుసుకున్నావ్....ఇకముందు బుద్దిగా వుంటే అదే పదివేలు....అన్నాడు మాధవరావు.
శివపార్వతి "ఏమండి!" అంటూ సుందరాన్ని వాటేసుకుని పెద్దగా ఏడ్చింది. అప్పటివరకు ఘనీభవించి వున్న ఆమె దుఃఖం ద్రవిభవిస్తూ బొట్లు బొట్లుగా కన్నీళ్ళ రూపంలో ప్రవహిస్తోంది.
అందరి హృదయాల్లోని భారం తొలగిపోయింది. రాత్రి నుంచి పడిన టెన్షన్ అందోళనలన్ని పటాపంచలయ్యాయి.
"వదినా! కాస్త టి పెట్టివ్వావా? నీ ముద్దుల మరిదిని క్షేమంగా తెచ్చిచ్చాను కదా" అన్నాడు నవ్వుతూ మాధవరావు.
"వాడి ముఖం నేను చూడను. సొంత కొడుకులా చూసుకున్నాం. మమ్మల్ని ఇంత మోసం చేస్తాడా? నాకు ఇద్దరే మరుదులు, వాడు నా మరిది కాదు" అంది కస్తూరి కోపంగా.
"వదినా! అంతటి శిక్ష విధించకు వదినా. నేను చేసింది తప్పే దాన్ని సరిదిద్దుకున్నాను. ఇక జన్మలో యిలాంటి పొరపాట్లు చేయను వదినా! నన్ను క్షమించు" అంటూ ఆమె రెండు చేతులు పట్టుకుని ఏడ్చాడు సుందరం.
"ఎక్కడికెళ్లావురా? రాత్రి నుంచి మేము ఎంత బాధ అనిభావిస్తున్నమో నీకు తెలుసా?" అంటూ అతని రెండు చెంపలు టపటపా కొడుతూ పెద్దగా ఏడ్చేసింది కస్తూరి.
"వదినా! ఏంటది ఊరుకో. అసలే నీ ఆరోగ్యం సరిగా లేదు. వచ్చేశాడుకదా. ఇంకెందుకు ఏడుస్తావు?" అంటూ ఆమెను ఓదార్చాడు మాధవరావు.
జయంతి ఆనందానికి అవధుల్లేవు. 'హమ్మయ్య! బాబాయ్ క్షేమంగా తిరిగివచ్చాడు అంతేచాలు' అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది కాఫీ పెడదామని.
* * * *
ఆరోజు రాత్రి భోజనాల దగ్గిర అసలు జరిగిన విషయం అంతా చెప్పాడు మాధవరావు అందరికి. దాన్లో కరణం పాత్ర గురించి ప్రముఖంగా చెప్పాడు.
"సమయానికి నాగేశ్వరరావు దేవుడిలా వచ్చి కేసును క్షణాల్లో తేల్చేశాడు" అన్నాడు మాధవరావు.
