అలకనందా చిత్రము నేను వేయాలనే వేయలేదు హేమా! అలా వచ్చింది. ఆ గడియలలో అలా అలా ఎందుకు వేశానో నాకే తెలియదు. ఎంత అందంగా వచ్చింది, ఆ రూపం! నాతో ఐక్యముకాని నూత్న యవ్వన దినాల శకుంతలారూపం. ఒళ్ళు బంగారము, జుట్టు బంగాము, ధరించిన వస్త్రాలు హిమధవళాలు. హిమమే వస్త్రాలుగా నేసిన సౌందర్య మా రేఖలలో వంపులలో దృశ్యమైనవి. ఎటుచూచిన హిమం. లోయలలో దేవదారు వృక్షాలు, ఘనీభూత హిమవృత పర్వతసానువులలో అంతర్వాహినులై అనేక దివ్యనదీబాలలు. వారెప్పుడూ బాలలే. నిర్ఘరీసుందరులు కొందరు. నిత్య యౌవనులు. త్రిదశ ప్రౌఢాంగనా స్థితి పొందేవారు. గంగా యమునానది నదీమతల్లులు.
హిమాలయంలో ప్రతిప్రదేశం ఎవరు తిరుగగలరు? ఆ రహస్యాలను ఎవరు తెలిసికొనగలరు? మహాకవులీ మహాప్రదేశాలను వర్ణించి వర్ణించి, చాలలేకపోయినారు. మనుష్య దేశాలమధ్య మనుష్యుల కందని మాయా ప్రదేశమై విస్తరించి ఉన్న ఈ విచిత్ర పంథాలలో మనుజునకు పనియేమి? మనుష్యుని దుఃఖాలు, ఆనందాలు, ఆవేదనలు, కాంక్షలు, సంతృప్తులు హిమాలయేశ్వరునకు తెలియనవసరమేమి? అని అతని పాదాలనైనా అంటునా?
ఆ స్థలంలోని మహాదానంద మత్తతలోనుంచి విదల్ఛుకొని, ఎట్లుదిగానో, లోయలోనికి ఎల్లానడిచానో, ఏ దిక్కున వచ్చానో, మెలకువ వచ్చేసరికి శతధారదగ్గర ఉన్నాను. శతధారా సౌందర్యం వర్ణనాతీతమే. అక్కడ నూరుధారలు నూరువివిధ శ్రుతులతో నారదమహతీ వీణానాదం చేస్తూ పడుతున్నవి. అచ్చటి పూవులలో ఒక మహాపుష్పము నాకు దర్శనమిచ్చింది. ఆ పుష్ప సౌందర్యం నేనేమి వర్ణించగలను? తెల్లని రేకులు, కాశ్మీర కుసుమవర్ణ హృదయం రెండువదల పుటాలున్న కమలాలకన్న పెద్దది. ఎన్నో తుమ్మెదలు ఆ పుష్పంలో వాలుతున్నవి. మత్తెక్కి వెళ్ళిపోతున్నవి. ఆ పుష్పపు సువాసన ఇతర పరిమళాలను చిన్నబుచ్చుతుంది. అదే పారిజాత కుసుమము అనుకున్నాను. పుష్పస్వరూపము ఒక మహోత్తమ నక్షత్రస్వరూపమై వెలుగుతున్నది. ఆ పువ్వును నేను సంపాదించగలిగిననాడు, అని నా హృదయంలో ఒక మెరుపు ప్రసరించింది.
40
అలకాపుర బాహ్యసౌందర్య చిహ్నం సత్పథసరోవరం. ఆ సరోవరం మైలున్నర విశాలం. అత్యంత శుభ్రనీలజలపూర్ణము. అలకాపురంలో మధ్యనుండేది చంద్రకుండము. దానికావల మైలుదూరమున సూర్యకుండము. అంత ఎత్తున సత్పాథాది సరోవర కుండాలలో, వేడినీటి ఊటలు గర్భమందుండుట చేతనే, నీరు ఆ అతిశీతలంలో కూడా పెరుకోకుండా ఉన్నాయి. అలకాపురీ ద్వారమైన ఆ హిమసమతల ప్రదేశాన్ని చక్రతీర్థమంటారు. ఆ చక్రతీర్థంలో మానవవాసన పూర్తిగా కరిగిపోతుంది. ఏదో అననుభూతశాంతి హృదయాల నావరిస్తుంది. నాకా చక్రతీర్థ నిత్యవాసత్వం ఏల లభించకూడదన్న గాఢవాంఛ జన్మించింది! సత్పథ సరోవరతీరాన నిలుచుండి, ఆ మధ్యాహ్నాన ఎదుట హిమాలయాలను దర్శిస్తే అవన్నీ ఎక్కడికో, ఏ పధాలకో తీసుకొని పోయే స్పటిక సోపానపంక్తిలా కనపడ్డాయి. ఈ దృశ్యానికే స్వర్గారోహణ దృశ్యమని పేరు.
సూర్యకాంతిలో ఆ పర్వతాగ్ర ప్రదేశాలు వెండి, రత్నసోపానాలులా కనిపించాయి. ఇక్కడనుండే పాండవులు స్వర్గారోహణము కావించారట. ఆ సోపానాల నెక్కుచు అనంత పథాలకు వెళ్ళిపోగలనా? మానవాతీత పథసందర్శనం మానవులలో ఉన్న మానవత్వాన్ని నాశనంచేసి, వారికి మానవా తీతసత్వాన్ని అర్పిస్తుంది? ఆ మానవాతీతత్వం అనుభవించగలం. వర్ణించలేము. ఆ ఆనందానుభవమే అమరత్వమేమో!
తోడు దారెరిగిన మనుష్యుడు లేక ఎవ్వరూ ప్రయాణం చేయలేరట. అయినా అంతకుముందే ఒక సన్యాసులజట్టు ఒకటి ఆదారిని ప్రయాణంచేసి ఉండడంచేత వారి ప్రయాణం జాడలు స్పష్టంగా కనబడినవి. అదీగాక ఆ సన్యాసులను, ఆ దారినిగురించీ ఆ దృశ్యాలను గూర్చీ పూర్తిగా తెలుసుకున్నాను. అందుకనే నాకా దారి సుగమమైంది. తిరిగి చక్రతీర్ధము వచ్చి, ఇంకను దిగి శతధారల సందర్శించునప్పటికి నాలుగైనది. వడగళ్ళు కురియుట కారంభించినవి. అత్యంత శీతలవాయువు వీవదొడగని. నా కాఫీ అంతా అయిపోయినది. బిస్కట్లు అయిపోయినవి. ఒక బండరాతి క్రింద దూరి, చమరీమృగంలా నేను మోసే సామానులు దింపి, గాలిరాకుండా ఒక గొంగళీ అడ్డుపెట్టి, నా స్టవ్ వెలిగించి, వెలగకాయంత ఉన్న నాలుగు వడగళ్ళేరి నీళ్ళుకాచి, కాఫీ తయారుచేసుకొని త్రాగాను. సిగరెట్టు వెలిగించి రెండుగంటలలాగే కూర్చున్నాను. చీకటి అలముకుపోయింది. ఉన్ని గొంగళి కోటుక్రింద వున్న తోలుకోటులోపల ఉన్నిదుస్తులు నాకు చలి బాధను కలిగించలేదు. ఒక గంట కురిసి వడగండ్లవాన వెలిసింది. గాలి జోరుమాత్రం తగ్గలేదు. వేసవికాల మవడంచేత దారి పూడుకుపోదని మాత్రం ధైర్యం.
తీర్థయాత్రకు పోయేవారంతా రానూ, పోనూ మూడురోజులు ప్రయాణం చేస్తారు. నే నున్న తావుకు దిగువను పదునొకండు మైళ్ళ దూరంలో బదరీపురం ఉంది. ఈ కొంచెం దూరంలోనే సర్వమానవ జగత్తు నాకు వేలకొలది మైళ్ళు దూరమైపోయినట్లే తోచినది.
ఒక చిన్న జంతువు దాగేటందుకు మాత్రం సరిపోయే ఆ స్థలంలో ఇన్ని ఎండు చితుకులు పోగుచేసి వంటచేశాను. దేవదారుపుల్లలు బాగా మండుతూ సువాసనాధూపాలను ఎగజిమ్ముతున్నవి. ఆ విచిత్ర నిశ్చలతలో నాకు సంపూర్ణమైన మెలకువే. నిద్ర రానేలేదు. మత్తయినా కలగలేదు. ఎన్ని ధ్వనులు నిండివున్నా అవన్నీ ఆ నిశ్చలతలో అంతర్భాగాలయ్యాయి. అలాగే కూర్చున్నాను. నాచేతి గడియారంలో రెండు అయ్యేసరికి నిప్పు ఆరిపోయింది. ఆ చీకటిలో, ఆ వెలుగులో, ఆ చీకటి వెలుగులలో అలానే కూర్చుండి వున్నాను. నడుం నొప్పి పెట్టలేదు. ఆలోచనలు ఆఖరయ్యాయి. బుద్ధి నిశితత్వం తాల్చింది. స్పష్టమయిన ఆలోచనలు మొక్కలు మొలిచి వృక్షాలై పుష్పాలు పూచినవి.
