ఏ విషయమైనా మనుష్యుల బుద్దిమీదనే ఆధారం. బుద్ది ననుసరించి సిద్దాంతం. సిద్దాంతాన్ననుసరించి మనుష్యుల ఆచరణ ఉంటుంది. అన్ని ఆచరణలకు అతని స్వీయసిద్ధాంతాలు ఆధారం కాకపోవచ్చును. అవి చిన్న పనులు. అప్పటి తాత్కాలిక పరిస్థితుల ననుసరించి ఉంటవి. కాలానికి మనుష్యుడు దూరమవడమేకదా అయిన్ స్టీన్ నాల్గవపథము. ఆకాశంలోని కొన్ని నక్షత్రాలకు మూడువేల సంవత్సరాలనాటి భూమిలోనాని చరిత్ర కనబడుతూ ఉంటుంది. కొన్ని తారలకు నూరు సంవత్సరాలనాటి చరిత్ర. ఇంక కొన్నింటికి ఏడాది క్రిందటి చరిత్ర దర్శనము అవుతూ ఉంటుంది. ఒకే క్షణంలో ఈలాంటి కాలవ్యత్యాసాలు విశ్వంలోవుంటే, సంఘటన, సందర్శనము మనుష్య మనుష్యునికి తేడాలుగా వుండాలి? అందులో వివధ హృదయాలకు దృష్టి వైవిధ్యమూ, గ్రహణవైవిధ్యము అనంతరూపాలుగా వున్నవి. ఈ వైవిధ్యస్థమై, వైవిధ్యాతీతమైన ఒక సత్యమేదో ఉండాలి కదా? అది భౌతికానుభవంలోనే ప్రత్యక్షమవుతున్నప్పుడు, బుద్దికతీతమైన మహాసత్య మొకటి ఉండాలికదా? ఈ సత్యము ఇతరులెవ్వరూ బోధింపలేరు. ఎవరికి వారే గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి. గురువు మార్గం మాత్రం చూపిస్తాడు.
జనసమ్మర్ధంలో సంగీతం వినబడదు. జనం హోరులో ఆలోచన ఏకధారకాదు. కళాశాల శాస్త్రపరిశోధనాలయము వీధిలో పెట్టగలమా? అలాగే సత్యాలను గ్రహించడానికి ఈలాంటి మనవజీవితాతీత నిర్మల నిశ్చల ప్రదేశాలు అనుకూలములు. ఆ సమయంలో ఏవి నాలో చర్చించుకున్నా, నా కవి నిమిషంలో స్పష్టమైపోయినవి. ఇంతలో నేను స్టవ్ వెలిగించి నీళ్ళు కాచుకొని, ముఖసంమ్మార్జనం చేసి, కాఫీ కాచుకొని తాగుతుండగా స్వామీజీ నలుగురు సన్యాసులతో నన్ను వెతుక్కుంటూ అక్కడకు వచ్చారు. ఆయన నన్ను చూచి ఆశ్చర్యపడి'' నాయనా! ఒక్కడవు వచ్చావని ఆలోచించాను. కాని నాకు భయం కలగలేదు. అందుకని ధైర్యంగానే ఉంటిని, కాని వడగండ్లవాన కురియడంవల్ల దారి తప్పిపోతావేమోనని తెల్లవారగట్ల బయలుదేరి వచ్చాము'' అన్నారు.
ద్వితీయభాగము
కైలాసేశ్వరుడు
1
'' హేమసుందరీదేవీ, ఇక్కడ నుంచి జరిగిన మా సమాచారం యావత్తూ స్వామీజీ వ్రాశారు. మళ్ళీ నేను వ్రాయనవసరం లేదు. ఆయన భాష గంగానిర్ఘరిణే. అదంతా ప్రతి వ్రాసుకొని ఈనా జీవిత చరిత్రలో రెండవ భాగంగా స్వీకరిస్తున్నా. ఈ భాగం కొద్దే, ఆ పిమ్మట, నేను నీ దగ్గరకు వచ్చేటంతవరకు జరిగినది. నాలుగు ముక్కలు నేనే వ్రాసి నా చరిత్ర పూర్తిచేశాను. ఈ చరిత్ర ఉద్దేశము చిట్టచివర నీకు నివేదించాను....''
శ్రీనాథమూర్తి.
స్వామీజీ కథనము
శ్రీనాథమూర్తి ఎంతో ఉత్తముడు. అతన్ని చూడగానే నాకదేమో అనిర్వ్యాజమైన వాత్సల్యం కలిగింది. కర్మదుర్విపాకంవల్ల అతని భార్య పోయినది. అతడు పశువై పోయాడు. ఈ బాలకుని ముందుజీవితం అఖండ నిర్ఘరిణీ వేగంతో ప్రవహిస్తూ, దేశాల పుణ్యవంతం చేయవలసి ఉన్నది.
శ్రీనాథమూర్తి ఉత్తమశిల్పి కాగలడు. ఈనాడతనికి ఎవ్వరి బోధలు రుచించవు. అతడే అతని దారివెతుక్కోవాలి. హిమాలయాలలోనే ఈతనికి దారి దొరుకుతుందని తోచింది నాకు. వెంటనే అతన్ని మాజట్టుతో కైలాసం రమ్మన్నాను. అతనితో నేను వాదించదలచుకోలేదు. అతనికి అవసరం వచ్చినప్పుడే ఇది దారి అని చూపిస్తారా. అది నిశ్చయము. నారాయణ! నారాయణ! దివ్యభావాలకు కూడా అతీతుడైన పరమేశా! బదరీ క్షేత్రాంతరమూర్తీ, కైలాసక్షేత్రపాలకా, అనంతప్రభూ, మేమంతా కైలాసం వస్తున్నాము. కైలాస పర్వత సందర్శన మహాపుణ్యం నీకే అర్పిస్తున్నాము తండ్రీ! సెలవా?
నాకిది పదిహేనవసారి కైలాసయాత్ర, కైలాసేశ్వరచరణాలకూ, నాకూ ఏదో విచిత్ర పవిత్రసంబంధం ఉండి వుండాలి. బదరీనాథ క్షేత్రంలోని అన్ని పుణ్యస్థలాలు శ్రీనాథమూర్తికి చుపించినాను. నారదశిల, నృసింహశిల, వరాహశిల, గరుడశిల, కుబేరశిల అనే పంచశిలలు: వహ్ని తీర్థము, ప్రహ్లాదతీర్థము, నారదతీర్థము, కూర్మతీర్థము, ఋషిగంగ అనే పంచతీర్ధాలు: చరణపాదుక, శేషనేత్ర, వేదధార, మాతామూర్తి, వ్యాసగుహ, భీమశిల అను షట్ పవిత్రస్థలాలు అతనికి చూపించి, శుభముహూర్తంలో కైలాస పర్వతోన్ముఖుల మయ్యాము.
కొండ లెక్కుటలో అతి జాగ్రత్తగా దారి చూచుకోవలసివున్నది. అనేక నదుల లోయలు దాటవలెను. వర్షాలు, వడగండ్లు పడుట ఎక్కువైనది. మానాఘాట్ ఈ దారికంతకు ఎత్తయిన ప్రదేశం. ఇక్కడ నిలుచుండి శ్రీనాథమూర్తి నన్ను చూచి '' స్వామీజీ మనం స్విడ్జర్లాండులోని బ్లాంకు శిఖరంకన్న ఎత్తయిన ప్రదేశంలో ఉన్నామండీ'' అన్నాడు.
ఆ ప్రదేశానికి ఎటువైపు చూచినా లోయలు క్రిందకు దిగిపోతున్నాయి. మేము నిలుచున్న ప్రదేశం అసలు హిమాలయ శ్రేణికి వెన్నెముక. ఆ వెన్నెముక శ్రేణిలో ఎవరెస్టు, గురుమాంధాతా, నందపర్వత, కాంచనగంగ, గౌరీశంకర, ధవళగిరి, గోడ్విను పర్వతశిఖారాలున్నాయి. అందులో ఎన్నో శిఖరాలు మాకు కనబడినాయి.
మానాఘాట్ నుంచి ప్రయాణాలు చేసుకుంటూ అడుగు మాత్రం వెడల్పుగల దారుల హిమపాత ప్రవాహాలపై ప్రయాణించాము. ఒకచోట ఆకాశమంటే పర్వతసానువు, ఈ ప్రక్క పాతాళమంటే లోయ. పర్వతాలు, నదులు, రాళ్ళూ, రోజుకు ఆరు, ఎనిమిది మైళ్ళకన్న ఎక్కువ ప్రయాణం చేయలేము.


