ఎత్తయై, స్నిగ్ధహిమంతో నిండి, స్వచ్ఛమూర్తులతో ప్రాపంచిక సంబంధమేమీ లేకుండా ఆ రహస్య ప్రదేశాలలో ఆకాశపథగభీరవదనులైన శీతనగేంద్రశిఖరదేవులు నన్ను పూర్తిగా తమ హృదయానికి హత్తుకొన్నారు. వారితో నా ఆవేదనలు మూగభాషలో చెప్పుకొన్నాను. ఎలాగైనా ఆ శిఖర మూర్తులను చేరాలనే కాంక్ష నా కెక్కువైంది. చలి లెక్కచేయలేదు. రాత్రిళ్ళు మంచు కురుస్తున్నా వంటినిండా బచ్చుకోటులూ, తోలుకోటులూ తొడుగుకొని ఆ వెన్నెలలో బదరిలో ఒంటిగా తిరిగాను. స్వామీజీ నన్ను చూచి ఏమీ అనలేదు.
శీతలతీవ్రత వర్ణింపలేను. వెన్నవలె మంచు కురుస్తూ ఉన్నది. ఒంట్లో రక్తం ప్రవహించడానికి, అటూ ఇటూ పచారుచేస్తూ తెల్లవారగట్ల మంచు కురవడం ఆగగానే అలకనంద పుట్టిన ప్రదేశానికి బయలుదేరాను ఒక్కణ్ణే, దారి మంచుపడి వుంది. నా కాళ్ళకు పెద్ద జోళ్ళున్నాయి. హిమాలయ ప్రయాణపు జోళ్ళు, వాడిసూదులున్నవి తొడుగుకొని, సంచినిండా బిస్కట్లు, చిన్నస్టవ్వు, కాఫీపొడుం, పాలడబ్బా వేసుకొని బయలుదేరాను. ఒక్కణ్ణి వెళ్ళాలనే దీక్షపట్టి వెళ్ళాను. స్వామీజీకి ఒక చీటీ వ్రాసి బయలుదేరాను.
చీకటిలేదు. ఒక రకమైనసంధ్య. నిశ్శబ్ధం లోకమెల్లా ఆవరించి ఉంది. దారితప్పిపోతుందని భయపడలేదు, ప్రాణానికి భయపడలేదు. ఆ చుట్టుపక్కల లోయలలో ఏ దారైనా బదరీనాథ్ కే చేరుతుంది. ఏదైనా అలకనందలో కలుస్తుంది. చేతిలో ములుకఱ్ఱ ఉన్నది. నడక సాగించాను. కొండప్రక్కనే మనుష్యులునడిచే దారి, దారికి దిగువ ఎక్కడనో అలకనంద సంగీతం పాడుకుంటూ ప్రవహిస్తున్నది. ఎదురుగా, వెనకగా, ప్రక్కగా ఆకాశాన్నంటే కొండలు. ఒకచోట కొంచెం దిగుతున్నా, మొత్తం ఎక్కటమే. పదకొండువేల అడుగులనుండి పధ్నాలుగువేల అడుగుల దూరం ఎక్కాలి. అక్కడ వున్నది అలకాపురం.
తెల్లవారగట్ల నాలుగింటికి బయలుదేరి తెల్లవారేసరికి బదరికి ఆరుమైళ్ళు ఎగువకు ఎక్కాను. అక్కడ ఆ అతిశీతలంలో దారిప్రక్క ఒక పెద్ద రాతిపై కెక్కి కూర్చుండినాను. ఆకాశంలో వెలుగు పూర్తిగా వచ్చింది. ఎఱ్ఱటి కిరణాలు మబ్బుల్ని వివిధాంతరాలైన బంగారు రంగులతో, నారింజ రంగులతో అంతటా కమ్మివేశాయి. పేరు తెలియని కొన్ని హిమాలయ శిఖరాలు గులాబిరంగులు తాలుస్తున్నవి. అలకనంద లోయలో మాత్రం చీకట్లు పూర్తిగా పోలేదు. పర్వతసానువుల పరచివున్న తెల్లటిహిమం, ఉన్నకాస్తవెలుగునూ ద్విగుణీకృతం చేసి, లోయలను వెలిగిస్తున్నది.
ఏమీ ఆలోచనల్లేని ఆనందంలో మునిగిపోయాను. ఏమి చూస్తున్నానో నాకు తెలియదు. ఎన్నో వింత వింతలైన పక్షులు, ఎన్నో విచిత్ర గాంధర్వ గీతాలు ఆలపించుకుంటూ ఎగిరిపోతున్నవి. వానిని గమనించకుండానే కూర్చుంటిని. ఎన్నో మనోహరమైన పుష్పాలు కని విని ఎరుగనివి ఆ కొండ చరియలలో తలెత్తి లేచి నవ్వి, పరిమళాలు వెదజల్లుతున్నవి. ఇవేమీ నాకు గోచరం కానేలేదు.
వసుధారా జలపాతాలు చాలా అందంగా ఉంటాయట. అని నా తిరుగుదారిలో సందర్శిస్తామని ఏర్పాటు చేసికొని అలకనందా జనన ప్రదేశాన్ని ఎనిమిదిగంటలకు చేరాను. ఏమి ఆ ప్రదేశసౌందర్యము! దేవత లిక్కడ వాసం చేశారంటే అపనమ్మక మేముంది? ఎచ్చట చూచినా మంచుకొండే. ఒక మహా సమప్రదేశంలా వుంది, అలకాపురీద్వారమైన హిమఖండ ప్రదేశం. ఆ హిమపు బయలునకు ఎక్కాలంటే ఇంకా రెండు మూడు వందల అడుగులు వట్టి మంచుగడ్డ ఎక్కాలి. ఆ గడ్డకట్టిన మంచు పర్వతం క్రిందనుంచి అలకనంద ప్రవహించి వస్తూ వుంది.
మంచుగడ్డలు విరిగి ఆ నదీకన్య ఒడిలో పడుతున్నవి. ఆ నిర్మల నిశ్చల మహాశీతల ప్రదేశంలో గొంతెత్తి పాటపాడ బుద్దిపుట్టింది నాకు.
ఓహో! అలకనందా! అమరవాహినీ!
అమృత రాగిణీ! విమల మోహినీ!
సుందరాంగీ! వ్యోమగామినీ! ఆనందరూపిణీ!
ఓహో అలకనందా! అమరవాహినీ!
ఎచ్చటనే నీ దివ్య జన్మము
ఎచ్చటనే నీ బాలికా కేళీ
ఎచ్చటే నీ ముగ్దలాస్యము
ఎచ్చటే ఓ అలకనందా!
మనము లెరుగని హిమప్రదేశము
మనసు లెరగని గగన పథముల
జనన మొందిన సుందరాంగీ!
మనుజ పథముల కేలవస్తివి?
జలజలా ప్రవహించిన స్తివి
గలగలా ప్రవహించి వసివి
పంకిలమ్మగు నరుల బ్రతుకున
మహారాగము పాడుకుంటూ
పరమపూత విచిత్ర పర్వత
సానువుల శిఖరాన్ని మధ్యా
స్వచ్ఛపన్నీరాల ఝురులతో.
ఈ పాట ఆ యక్షప్రదేశాలలో మారు మ్రోగింది. ఆ పాటకు అలకనంద ఆనందమందినదా? అలకనందాదేవీ? ఈ భావం మనస్సులో తట్టిన మరుక్షణంలో అలకనందా, నా శకుంతల ఒకటేనా? అన్న ఆలోచన ఉద్భవించినది. శాకుంతలాదేవీ, అలకనందా ఒక్కటే! ఆమె మరల నదీ రూపమెత్తి ఇక్కడకు చేరిపోయింది అనుకున్నాను.
39
అక్కడినుండి అలకనంద ఆడుకునే ఆ ప్రదేశం దర్శనం చేద్దామన్న మహాకాంక్ష పుట్టింది నాలో. ఆ తొమ్మిది గంటలకు ఆ కొండ ఎక్కడం ప్రారంభించాను. ఎలా ఎక్కానో, ఎన్నిసారులు తూలి పడబోయానో, జారానో, కూర్చున్నానో, దేకానో తెలియదు. పదిగంటలయ్యేలోపున ఆ అలకాపుర ప్రదేశం చేరాను. ఆ ప్రదేశం పద్దెనిమిదివేల అడుగుల ఎత్తున ఉంటుంది. చుట్టూ ఇరువది మూడు, ఇరువది నాలుగువేల అడుగుల శిఖరాలెన్నో అనంతంగా కనబడినాయి. గాలి అతివేగంగా విసురుతూ ఉంది. మంచుతో నిండి, తెల్లటి నెరసిన జుట్టు శిఖలుగా ముడివేసిన యోగి తపస్సు చేసుకొంటున్నట్లున్నది. ఒక చిన్న కొండప్రక్క ఉన్న చిన్న గుహలో చేరి, బిస్కత్తులు తిని, థరమాస్ ప్లాస్కులోని కాఫీ తాగి, స్కెచ్ తీసి పులకరాలతో ఒక బొమ్మ వేశాను. ఆ బొమ్మ మధ్య నాట్యమాడుతూ ధవళాలక అలకనందానది తోచినది. ఆనదీసుందరమోము మా శకుంతల మోమే!
