Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 57


    యంత్రంలో తీగ ఏదీ తెగిపోలేదని తెలిసినప్పుడు ఎంత ఆశ్చర్యపడ్డానో నాకు బాగా జ్ఞాపకం. ఇన్ని నెల్లుగాపాడకపోయినా, ఏం విచిత్రం!అనుకున్నాను. ఇంకొక క్షణంలో ఇందులోంచి ధ్వని వెలువడుతుంది. ఇలాంటి భయాన్ని మనశాస్త్రవేత్తలు ఏం పేరుతో పిలుస్తారో నాకుతెలియదుగాని విపరీతమైన భయం మాత్రం వేసింది. నేను దిక్కుమాలిన వాన్నన్న సంగతి రహస్యంగా ఉండిపోతేనే బాగుండుననిపించింది. నాకు చప్పుడు చెయ్యాలనిలేదని నిశ్చయంగా తోచింది ఆ వెంటనే ఎలాగూ ఈ కొత్త రికార్డులు తీసుకొచ్చాం. వీటిని కూడా మిగిలిన వాట్లలో కలిపివెయ్యడానికి ముందు కనీసం ఒక్కసారయినా వినాలనిపించింది.
    ఆరాత్రి ఆరు రికార్డులూ రెండు వేపులూ విన్నాను ఫోనోగ్రాపు మరీ పెద్దచప్పుడు చేసి యింట్లోనే మిగిలినవాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి మెత్తగా వుండే సూదులు కొన్నాను. కాని, కొన్ని నెలలతరబడి మ్రోగకుండా వున్నందున ఫోనోగ్రాఫులోంచి పెద్దగా ధ్వని వెలువడింది. ఆ చప్పుడువల్ల అంతసేపూ సిగరెట్లు కాలుస్తూనే ఉన్నాను. తలుపుతట్టిన చప్పుడుకూడా విన్న జ్ఞాపకముంది.
    ఆ వొచ్చింది ఇంటి యజమానురాలు మిసెస్ లీబిగ్ మీరా? ఎవరో అనుకున్నాను మిస్టర్ రోమనో కొద్దిగా సంగీతం అంతేకదూ! అన్నదావిడ.
    ఔనన్నాను నేను. కొన్ని కొత్త రికార్డులు. వేగిరం ముగించేస్తాను.
    తన ఇంట్లో నేనిలా ఫోనోగ్రాపును వాయించడం ఆవిడ కిష్టంలేదు. కాని నేను ఇంట్లో చిరకాలంనుంచి ఉంటున్నాను. ఎప్పటికప్పుడు అద్దె సరిగ్గా యిచ్చేస్తున్నాను. నా గదిని శుభ్రంగా వుంచుతూ వుంటాను. అంచేతనే వెంటనే ఆమాటనేసెయ్యలేకపోయింది. కాని ఆవిడ అభిప్రాయం నేనెరుగుదును.
    రికార్లులేవీ మంచివి కావు. అన్నీ విసుగెత్తించాయి. ఒక్కటి తప్ప ఈ ఒక్కదానిలో ఒకచోట వాయిద్యం నన్ను అమితంగా ఆకర్షించింది. ఆ చోటనే మూడునాలుగుసార్లు ఆ రికార్డు వేశాను. ఏమిటి దీని తాత్పర్యం గ్రహించుదామని. కాని ఎక్కడా అందలేదు. శాస్త్రరీత్యా ఆ భాగం నాకు సరిగానే అర్ధమయింది. కాని ఇంత వింతగా ఎందుకని నన్ను కదల్చిందో స్థిరపరుచుకోలేక పోయాను. ఒక చక్కని ప్రేమగానానికి అది ఒక ఎదురువాద్యం. బాంజో తీగమీద జోరుగా ఎనిమిది మీట్లు అలాగా పధ్నాలుగుసార్లు. ఈ తీగల్లోంచి వచ్చిన చప్పుడు. వదలకుండా అన్నిమార్లు వాగిన ఆ ధ్వనిలో ఏదో వుంది. అది నాలోపలికి జొరపడింది. అదంతా ఇదివరలోనే ఎప్పుడూ నాలోవుండి ఇటువంటి ఒక ధ్వనిగా ఇంతకుముందు బైటపడనిది. ఆ రికార్డు పేరేమిటో చెప్పను. ఎందువల్లనంటే నామీద దాని ప్రభావం చాలామట్టుకు కాకతాళీయం, చాలామట్టుకు నాఒక్కడికి మాత్రమే దొరికి  తీరవలసి ఉంది. ఇంకెవ్వరయినా దాన్ని విన్నప్పటికీ నన్ను కదిల్చినట్లుగా అది వాళ్ళను కదల్చదు వాళ్ళ పరిస్థితులు ఆ సమయంలో నా జీవితపు పరిస్థితులు కావాలి వయస్సు పందొమ్మిదేండ్లు ఉండాలి. కించిత్తు పిచ్చితనం ఉండాలి ఇత్యాదయః రికార్డులు దాచేసి దానిసంగతే మర్చిపోయాడతను. ఆనాటి సంగీతం కూడా ఇదివరకు తాను విని పోగొట్టుకొన్న తతిమ్మా యావత్సంగీతంలోనూ కలిసిపోయింది. ఒక వారం గడిచింది ఒక సాయంత్రం హఠాత్తుగా తన నిశ్శబ్దంలో మళ్ళీ వినబడిందతనికి ఆ ఘట్టం ఒకటి రెండు మూడు నాలుగు అయిదు ఆరు ఏడు ఎనిమిది పద్నాలుగుమార్లు ఇంకో వారం గడిచింది మాటిమాటికీ ఆ ధ్వానం అతనికి వినబడుతోంది. ఎప్పుడైనా తాను అనిర్వచనీయమైన జీవనానుభూతి పొంది ప్రపంచంలో అందవికారమైన వన్నింటినీ బద్దలు కొట్టెయ్యగలిగినంత బలం వున్నట్టు భావిస్తాడో అప్పుడల్లా ఆ గానం వినబడేది.
    ఆదివారాలు నాకు నగరంలో ఏ పనీ వుండేదికాదు. అందుకనీ ఆఫీసులోని కూర్చొనేవాణ్ని. టెలిటైప్ యంత్రంముందు కూర్చోవడమే నా జీవితమంతటికీ పెద్ద పనయిపోయింది. కాబట్టి ఆదివారాలు కూడా పనిచేసేవాడిని. కాని ఆదివారాలప్పుడు వర్తకం మందగిస్తుంది. అంచేత ఆఫీసులో కూర్చొని కునికిపాట్లు పడుతూ కలలుకంటూ నాకోసం సంపాదించుకొందామనుకున్న ఇల్లుగురించి ఆలోచనలు పోయేవాన్ని తెలివైన యంత్రం సందేశాన్ని పంపుతూ వుంటుంది. అందుకుంటూ వుంటుంది. చాలా గొప్ప యంత్రం.
    ఎందర్నో పాత టెలిగ్రాఫిస్టుల్ని నిరుద్యోగుల్ని చేసింది. వాళ్ళకి గంటకి ఒక డాలరుదాకా కూలి గిట్టేది. కాని ఈ కొత్త యంత్రం అమలులోకి రాగానే వాళ్ళకి పన్లు పోయాయి. టెలిగ్రాఫీలో ఓనమాలు రాని నాలాంటి కుర్రాళ్ళకి పనులు దొరికాయి. ఈ యంత్రాన్ని కనిపెట్టడంతో బోలెడంత పని సాధ్యమయింది. చాకచక్యానికి దీన్నే మొదలు చెప్పాలి.
    టెలిగ్రాఫు కంపెనీలకు చాలా లక్షలకొద్ది డాలర్లు ఆదా అయింది. నేను గంటకి 28 సెంట్లు ఆర్జించేవాణ్ణి ఇదివరలో జోరుగా సందేశం పంపగల ఆపరేటరుకన్నా అదే వ్యవధిలో నేను అంతకు రెండురెట్లు ఎక్కువ భోగట్టా సరఫరా చెయ్యగలను. అయితే ఆదివారాలు వ్యాపారం మందంగా సాగుతుంది. అంచేత ఒకొక్కప్పుడు టెలిటైపు యంత్రం చాలాసేపు అప్పుడప్పుడు ఒక గంటవరకు కూడా మౌనంగా ఉండిపోతుంది.
    ఒక ఆదివారం చాలాసేపు మౌనంగా వుండిపోయిన పిమ్మట సాయంత్రం పలకడం మొదలుపెట్టింది. ఆ కబురేమిటో అందుకొని తనిఖీ చెయ్యాలని దగ్గరికి వెళ్ళాను. అయితే అది వార్త కాదు. మామూలు టెలిగ్రాము కాదు. మాటలు చదివాను. హెల్లో హెల్లో హెల్లో, ఈ యంత్రానికీ నాకూ ఏ విధమైన సంబంధమూ వుంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇతరుల సందేశాల కోసమే అదక్కడ వుంది. ఇందులో నాకీ ఆహ్వానం టిక్కుటిక్కుమనేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సంగతేమిటంటే, ఈ యంత్రాన్ని వ్యాపారానికి సంబంధించిన వార్తలు కొట్టడానికి తప్ప యింకేపనికీ ఉపయోగించడం కంపెనీ నిబంధనలకి కేవలం వ్యతిరేకం. టెలిటైపు ఆపరేటరు అలాచేస్తే కంపెనీ డిసిప్లిను భంగపరిచినట్లు అర్ధం అందుకనే అవతలి మనిషి విషయమై నేను చాలాసేపు ఆలోచించాను. తర్వాత నేనూ హెల్లో అన్నమాట టైపు చేశాను. ఒక సంభాషణ ప్రారంభమయింది.
    ఈ యంత్రాన్ని నాకు ఉపయోగకరమైన విధంగా వాడడం చాలా వింతగా వినబడింది. అవతలి ఆపరేటరుతో సుమారు ఒక గంటసేపు సంభాషించాను. ఆమె ఒక అమ్మాయి ప్రధాన కార్యాలయంలోని ఆపరేటింగ్ రూములో పని చేస్తోంది. నేను నగరంలో వున్న అనేకమైన బ్రాంచి ఆఫీసుల్లో ఒక దానిలో పని చేస్తున్నాను. ఒక గంటసేపు చాలా చాలా ప్రసంగించాను. ఇంతట్లోకే 'యజమాని' అనే మాట చదివాను. పెద్ద అధికారి గదిలోకి వచ్చాడనీ, మా సంభాషణకీ వీలుండదనీ గ్రహించాను.
    అకస్మాత్తుగా నిశ్శబ్దంలో అతనికి మళ్ళీ ఆ గానం వినబడసాగింది. ఒకటి రెండు మూలు నాలుగు అయిదు ఆరు ఏడు ఎనిమిది. మాటిమాటికీ అదే ధ్వని. దానికొక ప్రత్యేకార్ధం ఇన్నాళ్ళ కథానికి స్ఫురించింది. ఒక యిల్లూ, చుట్టూ పరిశుద్దమైన తోట. వెచ్చని సూర్యుడు, ఇంకో మనిషి....ఒకటి రెండు మూడు నలుగు అయిదు ఆరు ఏడు ఎనిమిది తానూ ఈ రెండో మనిషీ ఇల్లూ, భూమి, సూర్యుడు సుస్పష్టమైన ఇంద్రియాలూ ప్రగాఢనిద్రా ఒకటి రెండు మూడు నాలుగు అయిదు ఆరు ఏడు ఎనిమిది, అర్ధం సపూర్ణత్వం, దిక్కుమాలినట్లు భావించకపోవడం, బోనులో చిక్కుకున్నామనే ఊహ మాయం కావడం.
    ఈ అమ్మాయి ఎలా ఉంటుందా అని నా మనోనేత్రంలో సాక్షాత్కరించుకోవడానికి ప్రయత్నించాను. ఈమె నాతోబాటు ఈ యింట్లో కాలుపెట్టి దాన్ని మా ఇద్దరి జీవితాలతో నింపడానికి అంగీకరిస్తుందా అని అనుకున్నాను. కొంచెం సేపటికి టెలిటైపు యంత్రం మళ్ళీ కొట్టుకుంది. హెల్లో హెల్లో యజమాని వెళ్ళిపోయాడు అని చదివాను.
    అమోఘంగా ఉంది ఈ నడిచిన ఫక్కీ కంపెనీ డిసిప్లిన్ ను ధిక్కరించడం వగైరా.
    సాయంత్రం అయిదు గంటలకి ఆమె పెద్ద ఆఫీసు వదలి నేను పని చేస్తున్న ఆఫీసులోకి వచ్చింది.
    తాను వస్తున్నట్లు నాకు చెప్పలేదు, గాని ఆమె ఆఫీసులో అడుగుపెట్టిన తక్షణమే ఆమె ఎవరో తెలిసిపోయింది. ఎందువల్లనంటే ఆమె మొగం చూసీ చూడడంతో నాకు సంగీతం వినిపించింది. ఒకటి రెండు మూడు నాలుగు అయిదు ఆరు ఏడు ఎనిమిది, జోరుగా ఏమిటో అయిపోతున్నాను. గభీమని నా చోటునుంచి గెంతికెళ్ళి ఆమెను కౌగలించుకొని మా యింటిగురించి చెప్పాలనుకున్నాను.
    కాని మా సంభాషణ మర్యాదగా సాగింది. ఆరుగంటలకి అతని పని ఆ రోజుకి ముగియడంతో ఇద్దరూ కలిసి ఆమె యింటిదాకా మాట్లాడుతూ నగరం దాటి నడుచుకుంటూ వెళ్ళారు. అతనికా సంగీతమే పదేపదే వినిపించింది. ఎన్నో నెలల తరువాత మళ్ళీ మొదటిసారి అతడు నిజంగా నవ్వడం ప్ర్రారంభించాడు. ఆమె అమోఘంగా వుంది. ఆమె మనస్సులో మనోహరమైన జీవశక్తి వుంది. అల్లరంటే ఆమె కిష్టం. ఆమె కళ్ళలో అతనికి భూలోకం, ఉజ్జ్వల ధాత్రి వెలుగు వెచ్చగా నిండి, ఎదుగుతున్న వస్తువుల బలంతో కూడిన భూమి కనిపించినట్లయింది. తన యిల్లు కట్టుకోవలసిన చోటు, తాను తానుగా బతికి ఊపిరి పీల్చుకోవలసిన చోటు.
    ఆ సాయంత్రం రికార్డును మళ్ళీమళ్ళీ వేశాడు. ఆఖరికి ఇంటి యజమానురాలు అతని గదిలోకి వచ్చి "మిస్టర్ రోమనో పదకొండున్నర అయిపోయినట్టుంది." అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS