23
వరూథినీ పిక్చర్ ప్యాలెస్ ప్ర్రారంభోత్సవం అమాత్యుల చేతుల మీదుగా జరిగింది. టౌన్లోవున్న ప్రముఖులూ, సినిమా పరిశ్రమలోని డిస్ట్రిబ్యూటర్సూ, థియేటర్స్ యజమానులూ, ప్రసిద్ద నిర్మాతలూ, కళాకారులూ పిక్చర్ ప్యాలెస్ ప్రారంభోత్సవానికి హాజరయారు. మంత్రిగారి మెడలో రామనాథబాబు పూలమాల వేయగా, మంత్రిగారి సతీమణి మెడలో వరూధిని హారాన్ని వేసింది. మంత్రిగారు ప్రధాన ద్వారానికి కట్టిన ఎర్ర రిబ్బను వెండి కత్తెరతో కత్తిరించి, అందరికంటే ముందు ఆయనే చప్పట్లు కొట్టాడు.
చుట్టూ మూగిన జనం చేసిన కరతాళ ధ్వనులతో పిక్చర్ ప్యాలెస్ ఆవరణంతా నిండగా, వరూధిని మనస్సు గాలిలోకి తేలిపోయింది. ఆ సమయంలో ఆనందం పట్టలేక వరూధిని ముఖం కార్బన్ ఆర్క్ లా వెలిగిపోయింది. ఆమె కళ్ళు రామనాథబాబు కోసం వెతికాయి. కాని వెంకటపతి కన్పించాడు. మంత్రిగారిని చుట్టుకొంటున్న జనాన్ని వెనక్కు నెడుతున్నాడు వెంకటపతి. రామనాథబాబు మంత్రిగారిని ముందుకు తీసుకెళుతున్నాడు.
గత ఐదేళ్ళుగా తారాపథంలో ఎలిగిపోతున్న 'హీరోయిన్' స్విచ్ ఆన్ చేసి ప్రొజెక్టరు స్టార్టు చేసింది. ఆమె పక్కనే నిలబడ్డ వరూధిని దృష్టి ప్రొజెక్టరుమీదకాక సినీతారమీదే లగ్నమయింది. ఇంత పొట్టిగా, గుమ్మటంలా, బుగ్గలు వెళ్ళపిసికినట్టున్న ఈమె అంత పెద్ద తార ఎలా అయిందా అన్న అనుమానంలో పడిపోయింది వరూధిని.
తెరమీద సరికొత్త మహత్తర 'జానపద-సాంఘిక' చిత్రం బొమ్మలు పడుతున్నాయి. అందులో హీరోయిన్ హీరోతో ప్రణయ కలహ ఘట్టంలో అద్భుతంగా నటిస్తోంది.
"ఇది ముందు పౌరాణిక జానపదగాధగా తీయాలనుకొన్నారు ప్రొడ్యూసరు. నేనే కథమార్పించి జానపద సాంఘికం చేయించాను" అన్నది అందాల తార వరూథిన్ని చూసి.
వరూధిని ఆవిడభాష అర్ధంకాలేదు. మీరు కాబట్టి ఇంత గొప్ప పని చెయ్యగలిగారన్నట్టు ముఖంపెట్టి నవ్వింది.
"అంతేగదండీ! ఈ రోజుల్లో పాత చింతకాయ పచ్చడి పురాణాలు ఎవరుచూస్తున్నారండీ, మరి!" అన్నది, అనన్య సామాన్యమయిన అభిమానాన్ని అంతులేని ప్రేక్షకులనుంచి ఐదేళ్ళుగా పొందుతూ, ఇంకో ఐదేళ్ళు పొందుతానన్న ఆశాభావంతో వున్న నటీమణి విజయవాణి.
"నీ బొందా! నా బొందా! నువ్వు పార్వతీ సీతా వేషాలు వేస్తే ఎవరు చూస్తారు?" అనుకుంది వరూధిని.
"మీరు యాక్ట్ చేసిన ప్రతి సినిమా చూస్తానండీ!" ఏదో అనాలి అన్నట్టు అన్నది వరూధిని.
"అవునండీ! ఈమె మీ ఫాన్!" మంత్రిగారి సతీమణిని వెంటబెట్టుకొని అప్పుడే అక్కడకొచ్చిన రామనాథబాబు అన్నాడు.
"రండి! థియేటర్ లో కొంచెంసేపు కూర్చుందాం!" అన్నాడు రామనాథబాబు.
"అబ్బా! బోరు! పిక్చర్ చూస్తూ ఎక్కాడ కూర్చోనూ?" తలమీద మునివేళ్ళు కాదు - వేళ్ళకంటే పొడుగ్గావున్న రంగుగోళ్ళు పెట్టుకొని అన్నది నటీమణి.
"అయితే మీ సినిమాలు మీకే బోరుకొడతాయన్నమాట?" టపీమని అన్నది వరూధిని.
తార ముఖానవున్న మేకప్ ఆరిపోయింది.
రామనాథబాబు ముఖం చిన్నబోయింది.
మంత్రిగారి భార్య అది నవ్వాల్సిన సమయమో, గంభీరంగా వుండాల్సిన సమయమో తెలియక భర్తకోసం వెతికింది. ఆయనగారు అప్పటికే ప్రొజెక్షన్ గదిలోంచి బాల్కనీలోకి వెళ్ళి థియేటర్ లో కూర్చున్నాడు.
"రండమ్మా!" వరూధిని రిజర్వుడు క్లాసులోకి దారి తీసింది.
సదస్సులూ, పురప్రముఖులూ, ఇతర ఆహ్వానితుల చూపులు తెరమీది 'కథానాయిక కథ' వదిలేసి హాలూ, హాల్లో కూర్చున్నవాళ్ళ మీద తిరగసాగాయి. తెరముందు కూర్చున్న వాళ్ళలో సగంమంది పూర్తిగా వెనక్కే తిరిగి చూడసాగారు. సినీతార విజయవాణి గర్వంగా ముఖం పెట్టింది. ఆమె పక్కనే వున్న మంత్రిగారి భార్య పవిట సర్దుకుంది. వరూధిని రెప్పలు టపటపలాడిస్తూ పక్కచూపులు చూడసాగింది.
విజయవాణిని చూస్తున్నవాళ్ళంతా తననూ చూస్తున్నట్లే అనుభూతిని పొందింది వరూధిని. పావుగంటలో, హీరో హీరోయిన్ ప్రేమకలాపం దృశ్యాలూ, పబ్లిక్ గార్డెన్స్ లో పాటలూ అయిపోయాక, పాతికేల్లుగా హీరో వేషం వేస్తున్న కథానాయకుడు కత్తీ, తుపాకీ రెండూ పట్టుకొని, కొత్తగా పైకి వచ్చిన విలన్ మీద పడ్డాడు.
విజయవాణి లేచి నిలబడింది. ఆమెతోపాటు వరూధిని లేచింది.
"ఊపిరి ఆడటంలేదు, బయటకు వెళ్దాం పదండి" అంది సినీతార విజయవాణి. హీరో ఒక్కడే తెరమీద కన్పించే దృశ్యాలు వచ్చేటప్పటికి, విజయవాణికి ఇంటరెస్టు పోయినట్టు వరూధిని గ్రహించింది.
"డిన్నర్ ఎనిమిది గంటలకు, ఇంకా గంట టైం వుంది మరి!" టైం చూసుకుంటూ అన్నది వరూధిని.
"అయితే నేను డ్రసప్ అవాలి!" అంటూ తొందరపడింది, వున్న గంటటైం చాలదన్నట్టు విజయవాణి.
హీరో చేస్తున్న అద్భుత సాహస కృత్యాలనుంచి దృష్టి మరల్చలేని మంత్రిగారి భార్య లేవలేదు. అటు తారతో వెళ్ళడమా, ఇటు మంత్రిగారి భార్యతో వుండిపోవడమా అన్నది తేల్చుకోలేకపోయింది వరూధిని. ఆమె అవస్థ కనిపెట్టి రామనాథబాబు వచ్చాడు.
"నువ్వు విజయవాణితో వెళ్ళు. ఆమెకు మన ఇంట్లోనే మకాం ఏర్పాటు చేశాం. గెస్టు హౌస్ లో ఖాళీలేదు. మంత్రిగారిని నేను చూసుకుంటాను." వరూధిని మీదకు వంగి చెవులో నోరుపెట్టి చెప్పాడు రామనాథబాబు.
వరూధిని విజయవాణిని వెంటబెట్టుకొని థియేటర్ నుంచి బయటకు వచ్చింది. మెయిన్ గేటు దగ్గర్లోవున్న కారు దగ్గిరకు వెళ్తుండగా, ఇనపగేటుకు తన్ని పట్టివున్న జనం గేట్లు పడదోసి ఆవరణలోకి వచ్చారు. వరూధినితోసహా విజయవాణిని చుట్టుముట్టారు.
విజయవాణి కెవ్వుమంది! వరూథిన్ని ఎవడో వెనకనుండి అందినచోట గిచ్చాడు. జనం మీదమీదకు వస్తున్నారు. అన్నిచేతులూ - ఆకలిగొన్న బెబ్బులికోరల్లా వున్నాయి. మరో క్షణం ఆగితే వాళ్ళ చేతుల్లో నలిగి చావటం తథ్యం.
వెనక నుంచి 'ధన్-ధన్-టప్-టప్' మోతలు వినబడినై! మరుక్షణంలో జనం పల్చబడిపోయారు. వెంకటపతి ఆధ్వర్యంలో హాలు వర్కర్లూ, పోలీసులూ జనాన్ని బాదుకొంటూ ముందుకొచ్చారు. సినీతార అభిమానులూ, ప్రేక్షక మహాశయులూ, తలలూ, వీపులూ చితికి కిందపడ్డవాళ్ళు కిందపడగా మిగతావాళ్ళు గేటు దూకి పారిపోయారు. వెంకటపతి హాలు వర్కర్లతో, వరూథినికీ, విజయవాణికీ, చుట్టూ వలయాకారంలో నిలబడి దడి కట్టాడు. మళ్ళీ వాళ్ళచుట్టూ పోలీసులు నిలబడ్డారు. వరూథినీ, విజయవాణీ వెళ్ళి కార్లో కూర్చున్నారు. విజయవాణి వెంటవచ్చిన ఆమె పర్సనల్ అసిస్టెంట్ కార్లో ముందు సీట్లో కూర్చున్నాడు. వెంకటపతికి వాళ్ళతో వెళ్ళాలనిపించింది. కారు దగ్గర తారట్లాడసాగాడు. వరూథిని అదేమీ గమనించనట్లే డ్రైవర్ని చూచి "పోనీయ్ రసూల్!" అన్నది.
కారు గేటు దాటి రోడ్డు మీదకు వచ్చింది. మళ్ళీ జనం కేకలూ, పరుగులూ మొదలైనాయి. రసూల్ కారు వేగంగా నడవడం మొదలు పెట్టాడు. వరూథిని, విజయవాణి మీద ప్రేక్షకుల కురిపించిన ప్రశంసలు ఎప్పుడూ వినలేదు. సిగ్గుతో ఆమె ముఖం కందిపోయింది. లజ్జతో తలవంచుకొని విజయవాణి పక్కనే కూర్చుంది.
"ఇది మాకు అలవాటే!" కొద్ది క్షణాల మానం తర్వాత అన్నది విజయవాణి.
"మరీ మోటుజనం!" అన్నది వరూధిని.
"అదంతా వాళ్ళ అభిమానం ఆపుకోలేక చేస్తారు!"
"వాళ్ళ అభిమానం ఏమోకాని మన మానం పోతుంది."
"అలా అనుకొంటే సినిమాతారగా ఎవరూ రాణించరు" అన్నది విజయవాణి.
వరూధిని ఆమెకేసి తలెత్తి చూసింది. నిజాన్ని ఎంత నిర్భయంగా చెప్తుంది? తవైతే అలా మాట్లాడగలదా? ఛ! ఛ! తనెక్కడ? అదెక్కడ? దాంతో నాకు పోలికేమిటి? తను పరువుగల కుటుంబంలోనుంచి వచ్చింది. పేరు ప్రతిష్టగల వంశం తనది. తను-రామనాథబాబు వరూధిని ఆలోచనల మధ్యలో వచ్చి అంతరాయం కలిగించాడు. వరూధిని ఇంకా తరచి తరచి ఆలోచించలేకపోయింది.
"ఇంకా ఇక్కడ నయం. కొన్ని టౌన్సులో అయితే ఇంకా గొడవ పెట్టేస్తారు. పోయిన నెల్లో నా పిక్చర్ శత దినోత్సవాలు పదిహేడు సెంటర్సులో జరిగాయి. ప్రతి థియేటర్ లోనూ సన్మాన పత్రాలూ-థియేటరు ముందు బూతులూ-దుమ్మూ-రాళ్ళూ-పోలీసులూ-లాఠీ ఛార్జీలూ-ఓ చోటయితే ప్రాణాలుకూడా పోయినంత పని అయింది."
ఇంటిముందు కారాగిన తర్వాత విజయవాణి నోరు మూతపడింది.

