Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 58


    రవణమ్మగారు వారి దగ్గర కూర్చున్నారు. నన్ను ఎగాదిగా చూసి మూతి విరుచుకున్నారు.
    నేను ఆరువేలు తీసి లెక్కపెట్టేను. శ్రీశ్రీగారికి చూపించి వారి తలగడ కింద పెట్టేసి మంచానికి కాస్త దూరంగా వెళ్ళి కూర్చున్నాను.
    "ఇది ఇక్కడికి కూడా దాపరించిందీ! స్టూడియోల్లో ఎలా ఏడిస్తే ఎవరిక్కావాలి? అసలు దీనికి కబురేలా తెలిసింది?" అని తిట్టడం ప్ర్రారంభించారావిడ.
    "ఒక్క నిమిషం నోరు మూసుకుంటావూ?" అని శ్రీశ్రీగారు విసుక్కున్నారు.
    "దాన్ని ముందు బయటికి వెళ్ళమనండి. ఇక్కడికెవడు రమ్మన్నారు" అన్నారావిడ.
    "అది నిన్నేం చేసింది? నేను రమ్మని కబురు పంపితేనే వచ్చింది" అన్నారాయన.
    "అది లేకుంటే మీకు తోచదు. వచ్చి ఓ పూటయినా కాలేదు. కొంపలంటుకు పోతున్నట్టు దానికెందుకు కబురు పంపారు?" అన్నారావిడ.
    "కొంపలంటుకుపోతున్నాయి కాబట్టే దాన్ని పిలిపించాను. లేకుంటే డబ్బెలా? దమ్మిడీ లేదు -" అన్నారాయన.
    "ఎలాగయినా ఉరిపెట్టుకోండ"న్నారావిడ.
    నేను వెంటనే లేచి "వెళ్ళొస్తానండి" అన్నాను.
    "ఇలా రా" అని పిలిచారు శ్రీశ్రీగారు.
    నేను దగ్గరగా వెళ్ళాను.
    ఆవిడ కళ్ళమ్మట నిప్పులు కురిపిస్తూ పెరట్లోకి వెళ్ళిపోయారు.
    వెనకాల ఆవిడ పరివారం కూడా వెళ్ళింది. అందులో వంటావిడ కూడా వుంది.
    "డబ్బంతా తీసుకొచ్చి దని ముందే నా తలకింద పెట్టేశావు. వెయ్యి రూపాయిలైనా నువ్వు అట్టే పెట్టుకోలేకపోయావా?" అనడిగారు శ్రీశ్రీగారు.
    "ఈ డబ్బే చాలుతుందో లేదో అని బెంగ పెట్టుకు చస్తూంటే ఇందులో దాచుకోవడం కూడానా?" అన్నాను.
    "అదికాదు సరోజా! నీ దగ్గరుంటే మంచిదేగా? అవసరమైతే వాడొచ్చు" అన్నారు.
    "వద్దులెండి. నాకేమీ ఇబ్బంది లేదు. మీరు కులాసాగా ఇంటికి వచ్చేద్దురూ అదే పదివేలు" అన్నాను.
    "సరే. నువ్వింటికి వెళ్ళి భోంచేసి స్క్రిప్ట్ పట్టుకుని నాలుగు గంటలకి వచ్చేయి. ఇక్కడే రాసుకుందాం" అన్నారు.
    "మీకు ఇక్కడ కూడా రెస్ట్ లేకుండా ఎందుకులెండి" అన్నాను.
    "నువ్వె రాద్ధువుగాని డౌట్ వున్నచోట అడిగితే చెప్తూ వుంటాను" అన్నారు.
    "నేను బయటికొస్తూండగా రవణమ్మగారు వారి దగ్గరికి వెళ్ళడం గమనించాను. నాకో డౌట్ వచ్చి అడగాలని మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఆవిడ నోట్లన్నీ లెక్కపెట్టి పర్సులో పెడుతోంది.
    "ఏవండీ.....రాతపని ఈ రోజుకి మానేద్దామండి. మీరు రెస్ట్ తీసుకోండ"న్నాని. దాంతో వారు చిరాకుపడ్డారు.
    "చెప్పినట్టు చెయ్యి సరోజా! త్వరగా వెళ్ళు నాలుగు గంటలకి ఇక్కడ వుండాలి" అన్నారు.
    ఆయన చిరాకుతో నా డౌట్ సంగతి మరచిపోయాను. మరి నోరెత్తలేదు. కారులో ఇంటికి చేరుకున్నాను.
    
                           *    *    *
    
    శ్రీశ్రీగారు చెప్పిన ప్రకారం నాలుగు గంటలకు స్క్రిప్ట్ తో సహా హాస్పిటల్ కి వెళ్ళాను. ఆయన నిద్రపోతున్నారు.
    చడీ చప్పుడు కాకుండా వరండాలో రాస్తూ కూర్చున్నాను. నాలుగున్నరకి రవణమ్మగారు కారులో దిగారు. హారన్ చప్పుడుకి శ్రీశ్రీగారు లేచి పోయారు.
    ఆయన నన్ను చూసి "ఎంతసేపయింది వచ్చి?" అనడిగారు.
    "చాలా సేపయ్యింది".
    "అంటే....?".
    "నాలుగు గంటలకే వచ్చేశాను".
    "లేపలేకపోయావా?".
    "నిద్రపోతున్నారుగా? పైగా అంత అర్జంట్ ఏముంది?"
    ఇంతలో ఆవిడ....."మళ్ళీ తయారయ్యావూ? ఏం కొంప మునిగిందని? ఈ రాసుకునేదేదో ఇంట్లో రాసుకోరాదూ?" అన్నారు.
    "ఎందుకలా కోపగించుకుంటారండి. వారు రమ్మన్నారు కనకే వచ్చాను" అన్నాను.
    "ఆయనకి లేకుంటే నీకుండాలి సిగ్గు! అడ్డమైన ముండల్నీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారు" అన్నారావిడ.
    అంతవరకూ ఊరకున్న శ్రీశ్రీగారు, "ఏయి ఎవర్ని ముండనితిడుతున్నావే?"    
    "ఇంకెవర్ని? అదిగో దాన్నే అదే ముండ" అని అన్నారావిడ.
    "అది ముండ అయితే నువ్వు కావా - ?" అని అడిగారు. నాకు తల తిరిగినంత పని అయ్యింది. గురువుగారి ధోరణి మారిపోతోందేమిటి? అనుకున్నాను.
    ఆవిడ నిప్పు తొక్కిన కోతిలా చిందు;లెయ్యడం ప్ర్రారంభించారు.
    "అంతమాత అంటారా? అది ముండ అయితే నేనెందుకౌతాను? ఏ ఉద్దేశంతో మీరా మాటన్నారు. పెళ్ళీ పెటాకులా లేకుండా ఇలా వచ్చివేలాడే వాళ్ళు ముండలు కాక మరేమవుతారు?" అన్నారావిడ.
    "నేను బతికుండగా అది ముండెలాగ అవుతుందే" అని మళ్ళీ అన్నారు. అంతే.....నా కాళ్ళకింద భూమి కదిలిపోతున్నట్టనిపించింది. బిత్తరపోయాను. అనుకోని ఈ సంఘటనకి ఊపిరాడలేదు.
    "దానికీ మీకు ఏమిటి సంబంధం? మీరు ఛస్తే అది ముండ ఎలా అవుతుంది? మీకు పెళ్ళాం అదా? నేనా?" అంటూ అరవడం ప్ర్రారంభించారావిడ.
    పక్క రూంలో వున్న డాక్టర్ గారు వచ్చి, "ఏవిటి మీ గొడవలు? ఇదేమయినా హాస్పిటలనుకున్నారా? ఇల్లనుకున్నారా? పేషెంట్ దగ్గర ఈ అరుపులు. ఏడుపులు ఏవిటి? అని దెబ్బలాడారు.
    వెంటనే ఆవిడ "మీరే చెప్పండి డాక్టర్! ఇకక్డ మేమంతావున్నాం కదా? అది కూడా ఎందుకు చెప్పండి" అన్నారావిడ.
    "చూడండమ్మా! నేనూ వచ్చిన దగ్గర్నుండి చూస్తున్నాను. మీరు తెగ నోరు పారేసుకుంటున్నారు. పాపం! ఆ అమ్మాయి ఏం చేసింది? తన పని తాను చేసుకుంటోంది. మీరెందుకూ ఆమెను తిడుతున్నారో అర్ధం కాలేదు. మీ ఇంట్లో మీరు ఎలాగైనా పొండి. నా హాస్పిటల్లో మాత్రం ఎవరి గొంతుకయినా వినిపించిందో నేను వూరుకునేది లేదు" అంటూ "శ్రీశ్రీగారూ! ఎల్లుండి ఉదయం ఏడుగంటలకి మీకు ఆపరేషన్ చేస్తాను" అన్నారు డాక్టర్.
    "రిపోర్ట్స్ వచ్చాయా?" అని శ్రీశ్రీగారడిగారు.
    "అవన్నీ నేను చూసుకుంటాను. యూ డోంట్ వర్రీ" అంటూ డాక్టర్ వెళ్ళిపోయారు.
    నా ఆలోచనంతా శ్రీశ్రీగారన్నమాట మీదే వుంది. ఊహించని రీతిలో ఆయన ఎందుకలా ఆవిడతో అన్నారు. ఆ మాటలకి అర్ధం వేరే చెప్పనక్కరలేదు. ఇదేమిట్రా దేవుడా? అని అనుకుంటూంటే "సరోజా" అన్న ఆయన పిలుపు వినిపించింది.
    రవణమ్మ గారు వంటావిడ్ని తీసుకొని అక్కడినుండి వెళ్ళిపోయారు. "ఏవండీ పిలిచారా?" అన్నాను శ్రీశ్రీగారితో.
    "అవును. పిలిచాను. నీ మనస్సు ఎక్కడుంది? ఏమిటా ఆలోచన? ఆ కుర్చీ ఇలా దగ్గరగా లాక్కొని కూర్చో" అన్నారు.
    "నేనిక ఇంటికి వెళతానండి" అన్నాను.
    వారు నన్ను పిలిచి దగ్గరగా కూర్చోమనేసరికి ఎక్కడనుండి వచ్చేసిందో దుఃఖం ఉప్పెనలా పొంగుకొచ్చింది.
    కళ్ళనిండా నీళ్ళు నిండిపోయాయి.
    "ఇదిగో చూడు సరోజా! అదో మూర్ఖురాలు! దాని మాటలు లక్ష్యపెట్టకు. నేను హాస్పిటల్ లో వున్నన్నాళ్ళూ నా కోసం నీకి తిప్పలు తప్పవు - దాని బాధ భరించకా తప్పదు. అది ఏమన్నా నాకోసం వస్తూ వుండు" అన్నారు.
    నేను బొంగురుపోయిన గొంతుతో "ఆవిడేమిటండీ ముందూ వెనకా ఆలోచించకుండా అలా నోరుపారేసుకుంటున్నారు. పోనీ ఆవిడ సంగతి వదిలెయ్యండి. ఈ రోజు మీకేమయింది? ఒంటిమీద తెలివివుండే మాట్లాడారా?" అన్నాను.
    "దానితో గొడవలు ముదిరిపోయి చాలా రోజులైంది. చెప్పుడు మాటలు విని చెడిపోతోంది" అని మాటలు మార్చేశారు.
    "సమాధానం చెప్పకుండా దాటెయ్యడానికి మీ తర్వాతే" అన్నాను.
    "సరే - ఉదయం నువ్వు తప్పకుండా రావాలి. ఏడు గంటలకే కారు పంపుతాను" అన్నారు.
    అలాగేనని బయటికొచ్చేశాను.
    
                           *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS