వెంటనే నేను, "అవకాశం వున్నన్నాళ్ళు" అన్నాను.
"నిన్ను అడగలేదు" అన్నారావిడ.
"అదేమిటి? పని చేస్తున్న దాన్ని నేనయినప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళేం చెప్తారండీ? ఈ క్షణంలో మానెయ్యాలన్నా లేక చేద్దామన్న నా ఇష్టాన్ని బట్టీ వుంటుంది" అన్నాను.
"అయితే అందరికీ చెప్తున్నా వినండి" అంటూ నన్ను చూసి, "ఎంత త్వరగా వారి దగ్గర నువ్వు పని మానేస్తే అంత మంచిది. లేకుంటే అనవసరమైన గొడవలు వస్తాయి. కోరి కొరివితో తల గోక్కున్నట్లు అవుతుంది. తర్వాత విచారించి లాభంలేదు" అన్నారు.
"అంటే నన్ను బెదిరిస్తున్నారా? లేక వార్నింగ్ ఇస్తున్నారా? ఇదిగో చూడండీ. లొసుగులున్నవాళ్ళు భయపడాలి. భయపడాల్సిన అవసరం నాకులేదు. మీతో ఎంత మంచిగా పోదామనుకున్నా మీరే కోరి ఏదో ఒక గొడవ తెస్తున్నారు. నేనూ చెపుతున్నాను వినండి. మీతో సవాలు చెయ్యడం లేదు. మీ మీద పాగా కాదు. కానీ నా నిశ్చయం కూడా చెప్పాలికదా?
శ్రీశ్రీగారి దగ్గర పనికి నేను ప్రవేశించినప్పుడు మీరు నాకు తెలియదు. మీ అనుమతితో వారి దగ్గర ప్రవేశించలేదు. పనికోసం వారి దగ్గర కూడా అప్లికేషన్ వేసుకున్న మాట నిజమే. తర్వాత వారే వచ్చి, తన దగ్గర పని చెయ్యమని అడిగారు. నేను ఒపుకున్నాను. మళ్ళీ వారే వచ్చి నన్ను పని మానెయ్యమని చెప్పేవరకూ నేను మానను. ఇది మాత్రం నిజం.
మీరెంత శ్రమపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభంలేదు. నాకు వారి మాట వేదవాక్కు వారి మాట జవదాటను" అన్నాను.
"నువ్వు ప్రవేశించింది మొదలు మా యింట్లో అశాంతి తాండవమాడుతోంది. నీవల్ల మాకు మనశాంతి లేదు" అన్నారు.
"అది కేవలం మీ పొరపాటే. మీ స్వవిషయాల్లో నేను జోక్యం కలగజేసుకోలేదు. నా బ్రతుకంతా పదిమంది మధ్యలో పనిచేస్తూ స్టూడియోల్లోనే గడిచిపోతోంది తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళం పోతున్నామే కానీ ఇద్దరం అనవసరంగా బయట అర క్షణమైనా గడపడంలేదు.
నేనంత జాగ్రత్తగా మసలుకుంటున్నా మీకు మనశ్శాంతి లేదంటే, కారణం మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అనుమానమే! దయచేసి ఇప్పటికయినా నన్ను నమ్మండి. మీకు పిల్లలు పుట్టివుంటే నా అంత కూతురుండేది. నేను మీ కూతురులాంటిదాన్ని హాయిగా మీ కుటుంబ జీవితం మీరు గడుపుకోండి. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. నాకూ చాలా బాధ్యతలున్నాయి. మాదీ పెద్ద కుటుంబమే. మా వాళ్ళంతా నామీద ఆధారపడి వున్నారు" అన్నాను.
"అంటే వారి దగ్గర పని మానవన్నమాట".
"చూడండి. చిన్న పిల్లల్నయినా, పెద్దవాళ్ళనయినా ఓ పని చెయ్యొద్దని అన్నామనుకోండి - చిన్న పిల్లలయితే వెంటనే మనం వద్దన్న పని చేస్తారు. పెద్దవాళ్ళయితే కారణాలు ఆలోచించి వద్దన్నందుకు ఆ పని చేయాలన్న పట్టుదల పెంచుకుంటారు. మీరు పదే పదే వారి దగ్గర పని మానెయ్యమని చెపుతున్న కొద్దీ నాలో అలాంటి పట్టుదలే ఏర్పడుతోంది. నావల్ల మీకు హాని కలగదని హామీ ఇస్తున్నాను. మీరు నన్ను నమ్మడం లేదు. అది నా దురదృష్టం" అన్నాను.
"నేనిక్కడికి వచ్చినట్టు వారికి తెలియదు" అన్నారావిడ.
"ఫరవాలేదు. నేను చెప్తానులెండి" అన్నాను.
"ఆవిడ నా ముఖం వంక చురచురా చూసి, "వారికి చెప్పకపోతే వీల్లేదా?".
"నేను చెప్పకుండా వుండలేనండి" అన్నాను.
"అదే వద్దంటున్నానన్నారావిడ.
"అన్నీ మీ ఇష్ట ప్రకారం నేనెందుకు చెయ్యాలి? వారికి అబద్దం ఆడినా, రహస్యమన్నా ఇష్టం వుండదు. అయినా ఇందులో రహస్యం ఏం వుంది లెండి" అన్నాను.
"నాకన్నా వారి విషయం నీకు బాగా తెలుసా?".
"అర్ధం లేని ప్రశ్నండీ నక్కపుట్టి నాలుగైదు వారాలైనా కాలేదన్నట్టు, నేను వారి దగ్గరికి వచ్చి పట్టుమని పదినెలలైనా కాలేదు. ఆ మాట నేనంటానా?" అన్నాను.
ఆవిడ మరేమీ మాట్లాడకుండా మా అమ్మనీ, నాన్నగారినీ చూసి, "మీ అమ్మాయికి త్వరగా పెళ్ళి చేసెయ్యండి. మంచిదని" చెప్పారు.
"అబ్బ! బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారండీ, వరుడ్ని కూడా మీరే చూసెయ్యండి. నేను చేసేసుకుంటాను. నాకేమీ అభ్యంతరం లేదు" అన్నాను.
"వెళ్ళొస్తా"నని ఆవిడ గబగబా వెళ్ళిపోయారు.
మేము ఒకటి ముఖాలొకరు చూసుకున్నాం.
* * *
నేను బ్రతికుండగా అది ముండా!
ఇల్లు కొనాలన్న పట్టుదల నాలో బాగా పెరిగింది. శ్రీశ్రీగారితో నా అభిప్రాయం చెప్పాను. "మీరు నాకిచ్చే డబ్బుతోనే కొనుక్కుంటాను. మిమ్మల్ని శ్రమ పెట్టను" అన్నాను.
ఓ ఇల్లు దొరికింది. శ్రీశ్రీగారితో పాటూ ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన డబ్బు అడిగి తీసుకున్నాను. దాంతో ఇల్లు కొనడం జరిగింది. 1957 మార్చి నెలలో శ్రీశ్రీగారింటి గృహప్రవేశం జరిగితే 1957 మే నెల అయిదవతేదీన మా ఇంటి గృహప్రవేశం జరిగింది. గృహప్రవేశం చాలా చక్కగా చేశాం. ఆర్టిస్టులు చాలామంది వచ్చారు. శ్రీశ్రీగారి భార్య రాలేదు. నేను స్వయంగా వెళ్ళి చెప్పివచ్చాను. అయినా ఆవిడ రాలేదు. శ్రీశ్రీగారిని కూడా వెళ్ళడానికి వీలులేదని ఆవిడ చాలా గొడవ చేశారట. కానీ ఆరోజు వారు ఉదయం ఎనిమిది గంటలకే వచ్చేశారు. నాటకాలూ, ఏకపాత్రాభినయం, తోలుబొమ్మలాట - ఇవన్నీ కూడా ఆర్టిస్టులు ప్రదర్శించారు. ఆరోజు శ్రీశ్రీగారు రవణమ్మగారి తోలు బొమ్మలాట ఎంతో ఇంటరెస్ట్ గా చూశారు.
నేను ఇల్లు కొనడంతో శ్రీశ్రీగారి ఇంట్లో పరిస్థితి మరీ విషమించింది.
"అది వచ్చి ఏడాదయినా కాలేదు. నేను ఇల్లు కొనుక్కున్న మూడు నెలల్లో అదికూడా ఇల్లు కొనుక్కుంది. డబ్బంతా దానికి దోచి పెట్టేస్తున్నారు. డానికి ఇల్లు ఎందుకు కొన్నార"ని గొడవట.
"నేను కొనలేదు బాబోయ్! దాని డబ్బుతో అదే కొనుక్కుంది...." అని సమాధానమిచ్చారట శ్రీశ్రీగారు.
కొన్నాళ్ళకి కానీ ఆ అగ్ని చల్లారలేదు. అలాగే - గొడవలతో, మనస్పర్ధలతో 1958లో ప్రవేశించాం.
మా మరో చెల్లికి శ్రీశ్రీగారి సహకారంతోనే పెళ్ళి చేశాం. శ్రీశ్రీగారి సహాయంతో మా కుటుంబ సభ్యులలో కొందర్ని సెటిల్ చేశాం. మాకోచ్చే పిక్చర్లకీ, రాబడికీ, పనికీ అంతులేకుండా వుంది.
ఆ రోజు ఆదివారం పిక్చర్ డైలాగ్స్ ఫెయిర్ చేస్తున్నాను. ఇంతలో సడన్ గా డ్రైవర్ వచ్చి..... "అమ్మా! అయ్యగారు హాస్పిటల్ లో జాయినయ్యారు. మిమ్మల్ని రమ్మంటున్నార"ని చెప్పాడు.
గాభరాపడుతూ వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాను. అది దకతర్ కృష్ణన్ గారి డిస్పెన్సరీ నేను వెళ్ళేసరికి శ్రీశ్రీగారు మంచంమీద పడుకున్నారు. వారిని చూసిన తరువాత కాస్త ధైర్యం కలిగి మనస్సు కుదుటపడింది.
"ఏవండీ....ఏమయింది?" అనడిగాను.
"ఏమో తెలీదు. సడన్ గా కడుపు పొంగింది. ఊపిరాడలేదు. అదీగాక నాకు మూలవ్యాధి నలభై సంవత్సరాలుగా వుంది. ఈ ఫైల్స్ కి ఎప్పుడో ఆపరేషన్ చేయాల్సింది. నెగ్లెక్ట్ చేశాను" అన్నారు.
"నలభై ఏళ్ళుగా వుంటే ఎవరయినా ఇంత అశ్రద్ద చేస్తారా?" అని అడిగాను.
"అదేమంత ప్రమాదం కాదులే. పోతే విపరీతమైన బాధ పెట్టేస్తూ వుంటుంది. సరేగానీ నువ్వో పని చేయాలి. డాక్టరుగారు రెండు మూడు రోజుల్లో ఫైల్స్ ఆపరేషన్ చేస్తానంటున్నారు. ఈలోగా ఎక్స్ రే వగైరా పరీక్షలౌతాయి. చేతిలో చిల్లిగవ్వలేదు ఎలా?" అన్నారు.
"ఎలాగేమిటి? భలేవారే! మనకివ్వాల్సిన వాళ్ళు బోలెడుమంది వున్నారు. ఊరికే మనకెవరూ ఇవ్వక్కర్లేదు. పైగా నాలుగు పిక్చర్లు పూర్తిచేశాం. ఆ డబ్బులింకా పూర్తిగా రాలేదుగా? మీరేం బెంగ పడకండి. నేను వెళ్ళి తెస్తాను".
"నిజంగానే?".
"అదేమిటండీ! అబద్దాలకిగానీ, హాస్యానికిగానీ ఇదా సమయం? ఇంతకీ ఎంత డబ్బు కావాలి?" అనడిగాను.
"రెండు వేలుంటే చాలు".
"మీరు ఓ గంటసేపు పడుకోండి. నేను డబ్బుతో తిరిగొస్తాను. కానీ ఎలా వెళ్ళను!" అనడిగాను.
"అలా అడుగుతావేమిటి? మన కారుందిగా వెళ్ళు" అన్నారు.
"కారంటే జ్ఞాపకం వచ్చింది. మీ ఆవిడ కనిపించలేదేమిటి?" అనడిగాను.
"నన్నిక్కడ దింపి ఇంటికి వెళ్ళిందిలే. నువ్వు ముందు వెళ్ళి డబ్బు సంగతి చూడు" అన్నారు.
నేను బయలుదేరి, మధ్యాహ్నం రెండు గంటలయ్యేసరికి, ఆరువేల రూపాయిల క్యాష్ తో హాస్పిటల్ కి చేరుకున్నాను.
