Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 58

 

    "విష్ణు ....... జీవ సమాధిలోకి వెళ్ళవలసిందే!"
    "విష్ణు ఎంతటి శక్తి మంతుడో తెలియాలంటే వారు సమాధిలోకి వెళ్ళవలసిందే......."
    జనం నినాదాలు ఇస్తున్నారు.
    ఆ నినాదాల హోరుకు కమీషనర్ కార్యాలయం దద్దరిల్లిపోతున్నది.
    "చూశారా సర్.....జన ప్రభంజనం.....అయినా కాదని నిర్ణయాన్ని బలవంతంగా అమలు జరపాలని చూస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం వున్నది" అన్నది కలెక్టర్ ధీరజ.
    కమీషనర్ సాలోచనగా ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ వైపు చూశాడు.
    "వద్దు సార్......ప్రజలు గొడవ చేయడం మామూలే. వాళ్ళేదో గొడవ చేశారని మనం అనుమతి ఇస్తే రేపు ఇంతకన్నా పెద్ద రిస్క్ ను ఫేస్ చేయవలసి వస్తుంది."
    "సారీ వినయ్.......ప్రజలలో చైతన్యాన్ని నువ్వు తక్కువగా అంచనా వేయకు. ఇప్పుడు వున్న ఈ కొద్ది మందే కొంచెం ఆగితే మహా చైతన్యంలా ఉద్యమిస్తారు. అందుకే కొన్ని కొన్ని సందర్భాలలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించక తప్పదు. కలెక్టర్ గారి నమ్మకం వమ్ము కాదనే భావిద్దాం......ఏ.సి.పి గారి విశ్వాసం ఫలిస్తుందనే ఆశిద్దాం.....విష్ణుకు సమాధి ప్రవేశానికి అనుమతి ఇవ్వక తప్పదు" తన అంగీకారాన్ని తెలిపాడు కమీషనర్.
    కలెక్టర్ ఆర్డర్స్ జారీ చేసింది.
    విషయం తెలుసుకున్న ప్రజావాహిని జయ జయ ధ్వానాలతో వెనుదిరిగింది. విష్ణు జీవ సమాధికి ఎలాంటి ఆటంకం లేదనీ......పోలీసులు సమక్షంలో సమస్త జనులు చూస్తుండగా భవానీ ద్వీపంలో జీవ సమాధి చెందే దృశ్యాన్ని సిటీకేబుల్ ద్వారా టివిలో కూడా చూడవచ్చని తెలియడంతో భక్త జనకోటి ఆనందానికి అంతులేకుండా వున్నది.
    ఏ నోట విన్నా జీవ సమాధి గురించే........
    ఆ స్పందన చూసిన ధీరజ హృదయం పులకించిపోయింది.
    
                                                       *    *    *    *

    బాలభానుడు ఉదయాద్రిని రాగరంజితం చేస్తున్నాడు.
    నేల నింగా అన్నట్టు అప్పటికే విజయవాడ పౌరులతో భవానీ ద్వీపం కోలాహలంగా వున్నది.
    విష్ణు పట్టు పీతాంబరాలు ధరించి వున్నాడు.
    బ్రాహ్మి ముహుర్తంలోనే లేచి పూజలో కుర్చున్నాడతను.
    ఉషోదయ కిరణాలను కనులారా గాంచిన తరువాత సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి తన ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకుంటూ తన కోసం తవ్వి సిద్దంగా వున్న సమాధిలోకి దిగాడు విష్ణు.
    దర్పలతో, ఆసనం పరచబడి వుందక్కడ?
    విష్ణు ఆదర్పసనం పై పవళించాడు.
    గంధపు చెక్కలను విష్ణు పై కప్పి ఆపైన మట్టితో పూడ్చారు. మట్టి కప్పడంలో అందరూ తలా ఒక చేయి వేశారు.
    అపూర్వమయిన రీతిలో జరిగిన ఆ సమాధి ప్రవేశాన్ని అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండిపోయారు.
    తమ హృదయాన్ని ఎవరో కబళించుకు పోతున్న అనుభూతిని ఉగ్గబట్టుకుంటూ ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. ధీరజ.......కిరణ్మయిలు!
    రమేష్ వాళ్ళిద్దరినీ దూరం నుంచీ గమనిస్తున్నాడు.
    చుట్టూ గుమికూడి వున్న జనసందోహంలో ప్రేక్షకురలిలా నిలిచి వున్నా రీటా చూపులు భారతి కోసం నలువైపులా వెదికాయి......
    ఇన్నాళ్ళూ ఆరాధించిన తన దైవం తనను విడిచి
పోతున్నట్టు ఆ వియోగాన్ని భరించలేనట్టు విషాదంలో మునిగిపోయివున్న భారతిని గమనించి అటు నడిచింది రీటా.
    "సిస్టర్........విష్ణు.......చూశావా........ఏం చేశాడో........" అంటూ ఆమెను చుట్టుకుని చిన్నపిల్లలా రోదించింది భారతి.
    రీటా ఆమెను అనునయించింది.
    అయినప్పటికీ తన మనసుకు తను సర్ది చెప్పుకోలేకపోతున్నది.
    తన మనసులోనూ అలజడి వుంది మరి......
    విష్ణు సమాధిలోకి వెళ్లబోయే ముందు నాలుగు గంటల వరకూ సమాధి తెరిచే ప్రయత్నం చేయవద్దని మరీ మరీ చెప్పి వెళ్ళాడు.
    అది అందరూ విన్నారు కూడా......
    కానీ సమయం గాడిచే కొద్దీ రీటా మనసు అగలేకపోతున్నది.
    అప్పటికి మూడు గంటలు ఇట్టే కరిగిపోయాయి.....
    ఆమె మనసులో పడే ఆరాటానికి ఒక కారణం వున్నది.
    సమాధిలోకి వెళ్ళబోయే ముందు రీటాను పిలిచి ఒక సీల్డు కవర్ ఇచ్చాడు విష్ణు.
    "రీటా కరెక్టుగా నేను సమాధిలోకి వెళ్ళిన నాలుగు గంటల తరువాతే నువ్వు కవర్ తెరిచి చూడు....." ఈలోపు ఎత్తి పరిస్థితులలోను కవరు తెరవద్దు" అని చెప్పిన విష్ణు మాటలు ఆమెను పునరాలోచింప చేశాయి.
    మొత్తానికి ఆ కవర్ లో ఏదో ముఖ్యమయినా సమాచారం వుండి వుండాలి.
    లేదంటే ఇంతమంది వుండగా ప్రత్యేకించి తనకే ఈ కవరు ఎందుకు ఇవ్వాలి? అదీగాక నాలుగు గంటల తరువాత కవరు విప్పి చూడమన్న విషయం తనకు ఒక్కదానికే తెలుసు.
    సమాధిలో నుంచి విష్ణు బయటకు వచ్చేది నాలుగు గంటల తర్వాత...
    కానీ ఈలోపే కవరు తెరిచి చూస్తేనో.......?
    తెలియడానికి విష్ణు ఎదురుగా లేడు.......అతనోచ్చేసరికి ఎవరి కవర్లు వారికి ఇచ్చేయడం జరుగుతుంది కాబట్టి తను ముందుగానే కవరు తెరిచినా విషయం విష్ణుకు తెలిసే అవకాశం లేదు.
    అలా అనుకోవడంతో ఆ కవరులో ఏమున్నదో చూడాలనే ఉత్సాహము అధికం అయింది రీటాకు.
    సీల్డు కవర్ తెరచింది, దానిలో నాలుగు లెటర్స్ ధీరజ, కిరణ్మయి, రీటా, భారతి పేర్లతో వున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS