Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 57

 

    "నిజాలు ఎప్పుడూ నిష్టురంగానే వుంటాయి కలెక్టర్ గారూ....."
    ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ మద్యలో అందుకుని అనడం కిరణ్మయికి నచ్చలేదు.
    "కలెక్టర్ గారు కమీషనర్ తో మాట్టాడుతుంటే మధ్యలో మీ జోక్యం ఏమీ బాగోలేదు. వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి రాకముందే మీరు ఏదేదో ఆరోపణలు చేయడం సబబుగా లేదు.....' ఇంకా ఏదో చెప్పే ప్రయత్నం చేసింది ఏ.సి.పి కిరణ్మయి లో గొంతుతో.
    "ఇట్స్ ఒకే......లేట్ హిమ్ స్పీక్.....' కలెక్టర్ గంభీరంగా అనడంతో ఆమె ముఖం చిన్నబోయింది. "సారీ మేడమ్ ఇక్కడ ఊహాగానాలకు, అభిమానానికి తావులేదు. విషయ నిర్ధారణ జరిగేవరకూ ఎవరు ఎవ్వరిని నిందించడం , అనుమానించడం న్యాయం కాదు.....నిన్ను గురించి క్షుణ్ణంగా పరిశోధించి ఉన్నట్టయితే ఇన్ స్పెక్టర్ అతని గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్టాడి వుండేవారు కాదు. అసలు అతని గురించి ఇన్ స్పెక్టర్ కు ఏం తెలుసునని ఇన్ని నిందలు వేస్తున్నారు. హి ఈజ్ రియల్లీ సెయింట్......పవర్ ఫుల్ సెయింట్......జీవితంలో అన్నీ వదులుకుని చీకటిలోంచి వెలుగులోకి వచ్చి తనేమిటో తెలుసుకున్న మహనీయుడు విష్ణు' కిరణ్మయి తన్మయత్వంగా చెప్పుకుపోతున్నది. ఆమె మాటలు పోలీస్ కమీషనర్, కలెక్టర్ ఇద్దరికీ ఆశ్చర్యాన్ని కలిగించినాయి.
    విష్ణు గురించి పూర్తిగా తెలిసినట్టు ఏసిపి గారు మాట్టాడుతున్నారు......." ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్  మాటల్లో హేళన ధ్వనిస్తోంది. ఏ.సి.పి మాటలకు అతను హార్ట్ అయ్యాడు.
    "ఎస్.....ఐ నో హిమ్........హి ఈజ్ మై టీచర్.....అంతే కాదు నేను అయన అభిమానిని కూడా, కొన్ని పరిస్థితుల కారణంగా అతను సర్వసంగపరిత్యాగి అయిన మాట నిజం. అలాంటి వ్యక్తిని అభిమానించడం ఆరాధించడం నేరం కాదు.....నేను ఇక్కడ చార్జ్ తీసుకున్న రోజునే విష్ణు మహా యోగిలా ఇక్కడ పూజలందుకోవడం  చూశాను. అలాంటి స్వార్ధం లేని , కల్మషం లేని పవిత్రమయిన వ్యక్తీ ఏ స్వార్ధాన్ని ఆశించి నటిస్తున్నాడో ఎవరన్నా తెలిస్తే చెప్పండి, ఆధారాలు వుంటే నిరూపించండి."
    ఉద్యేగంతో ఏ.సి.పి కిరణ్మయి గొంతు మూగబోయింది.
    ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ కు అంతా అయోమయంగా వున్నది.
    ధీరజ హృదయం మరొకమారు విలవిలలాడింది.
    నిన్న భవానీ......నేడు కిరణ్మయి!
    ఎవరిని కదిలించినా విష్ణుని మనసులో ప్రేమాభిమానాలతో ఆరాధించిన వాళ్ళే.
    అయినా విష్ణు ఇప్పటికీ ఒంటరివాడే!
    ఇంతమంది ఇన్ని విధాలుగా అతని కోసం తాపత్రయపడినా తన పవిత్రతను కాపాడుకుంటూ వస్తున్న విష్ణు నిజంగా మహనీయుడే!
    జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలకు తట్టుకుని అకుంఠిత దీక్షతో యోగి కాగలిగాడు.
    అంతటి మహోన్నతుడిపై బురద జల్లడానికి నేడు ప్రయత్నాలు జరుగుతూవుంటే తను చూస్తూ ఉరుకోలేకపోతున్నది.....
    "ఏ.సి.పి గారూ........అయన పట్ల మీకు గౌరవభావం, భక్తీ వుంటే వుండవచ్చు. అంత మాత్రాన విష్ణుని దైవాంశ సంభూతునిగా , ఒక మహా యోగిలా మీరు కూడా భావించడం ఎంతవరకు సబబో ఆలోచించండి" అన్నాడు వినయ్ కుమార్ తనపై ఆఫీసర్ అన్న భయాన్ని కూడా పక్కన బెట్టి.
    "మిస్టర్ ఇన్ స్పెక్టర్ ......కిరణ్మయి చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం. మీ ఉద్యోగ ధర్మం మీరు నిర్వర్తిమ్చాలనే పట్టుదలతో మీరు మాట్టాడుతున్నారే తప్ప నిజానికి విష్ణు గురించి మీకు పూర్తిగా తెలియదు. కిరణ్మయి ఒకప్పుడు విష్ణు స్టూడెంట్...అందుకే మీకన్నా ఆమెకే అతనిని గూర్చి ఎక్కువ తెలుసుకోవడానికి అవకాశం వుంది. కాదనగలరా? నేను కూడా అందుకే విష్ణు ఛాలెంజ్ ను స్పోర్టివ్ గా తీసుకుందామనుకుంటున్నాను" అంటూ వెంటనే రియాక్ట్ అయింది కలెక్టర్ ధీరజ.
    "అంటే......!" కమీషనర్ పృద్వీరాజ్ అయోమయంగా ప్రశ్నించాడు.
    "ఇప్పుడు ఇక్కడ మనం సమావేశం అయ్యింది . రేపు జీవసమాధిలోకి వెళ్ళబోతున్న విష్ణుకు పర్మిషన్ ఇవ్వాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవడానికి కమీషనర్ గా ఆ హక్కు మీకున్నట్టే ఒక జిల్లా అధికారిగా నాకూ ఆ హక్కూ వున్నది. అందుకే విష్ణుకు అనుమతి ఇవ్వడానికే నిర్ణయించుకున్నాను." గంభీరంగా చెప్పింది ధీరజ.
    "నో.......నో.......అలా తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు మేడమ్....."
    "వారి నిర్ణయం తొందరపాటు ఎలా అవుతుంది. అతని పట్ల అభిమానం వున్న భక్తులు లక్షలలో వున్నారు. వాళ్ళను కాదనగలమా?" అంటూ కలెక్టర్ నిర్ణయాన్ని సమర్ధించింది ఏ.సి.పి కిరణ్మయి.
    "మిస్ ధీరజా.....ఒకవేళ విష్ణుకు ఏమయినా జరిగితే అందుకు బాధ్యులం మనమే అవుతాం. నిజంగా అతనికి శక్తి యుక్తులు వున్నాయో లేవో మనకు అనవసరం. ఈ నాగరిక ప్రపంచంలో చూస్తూ చూస్తూ ఒక వ్యక్తీ జీవ సమాధిలోకి వెళుతుంటే నగర పోలీస్ అధికారిగా ప్రజలకు నా ముఖం ఎలా చూపించగలను.........
    "అంతే కాదు.....రేపు ప్రభుత్వం కూడా మనలనే తప్పుపడుతుంది. అందుకే విష్ణు చర్యలను నిరోదిద్దాం. ఎత్తి పరిస్థితులలోనూ అతనిని సమాధిలోకి వెళ్ళనివ్వకూడదు" కమీషనర్ పృద్విరాజ్ స్థిరంగా చెప్పాడు.
    అప్పటికే కమీషనర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున జనం పోగై వున్నారు. విష్ణును జీవ సమాధిలోకి వెళ్ళకుండా పోలీసు అధికారులు అభ్యంతరం పెడుతున్న విషయం ఆ నోట ఈనోట ప్రజల చేవినపడింది. ఒకరి నొకరు చెప్పుకుని గుంపులు గుంపులుగా కమీషనర్ ఆఫీసు ముందు గుమికూడారు.
    క్షణ క్షణానికీ గుంపు పెద్దదై పోతున్నది........
    "విష్ణు........దైవ స్వరూపుడు........."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS