Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 58

 

    "థాంక్స్!" అంతకు మించి అనలేదు రవి.
    "సీలింగ్ అవుతూనే ఫ్లోరింగ్. ఆ తర్వాత గోడలకి కప్పుకి రంగులు వేయించటం. తర్వాత ఎలక్ట్రిపైయింగ్ తర్వాత ఏర్ కండిషనింగ్. ఎలక్త్రిపై చేసేపుడే అవన్నీ పిక్స్ చేయటం- నాయుడు గారు గుమ్మే పోవాలి!"
    రవి గొంతులో కొద్దిగా గర్వం-----
    "ఈ డబ్బంతా మీ స్వార్జితమే కదూ?"
    "ఒక్క పైసా కూడా నీ ఆస్తి నుంచి వాడలేదు- స్వప్నా! దానిపై నాకేం హక్కు వుంది, నేను గార్డియన్ ని అంతే!" ఎందుకో అతని గొంతులో విషాదం తేలి వచ్చింది.
    'అతన్ని హార్ట్ చేశానేమో !" అనుకుంది స్వప్న.
    తర్వాత ఇద్దరూ పూర్వపు బంగాళా కి వెళ్ళారు. ఇల్లంతా తిరిగి చూసి వచ్చేసరికి లచ్చిమి టిఫిన్ రెడీగా వుంచింది.
    వాళ్ళ ఆప్యాయతని కాదనలేక కొద్దిగా తీసుకుని కాఫీ తాగేరు. ఆ కాఫీ ఎంతో రుచిగా అనిపించింది.
    "మన బావి నీళ్ళు లేతకొబ్బరి నీళ్ళమ్మా! మన చుక్క బర్రె పాలు అమృతం. అందుకే కాఫీ అంత రుచి!"
    ఆ మాటలకి నవ్వింది స్వప్న.
    తర్వాత "ఇదిగో!" తోటలో వున్న పళ్ళు ఏవైనా సరే ఓ డజను కోసుకుని రా! పూలు కూడా తే!" అంది.
    రవి మౌనంగా , ప్రశ్నార్ధకంగా చూశాడు.
    స్వప్న ఉత్తరువు ప్రకారం వెళ్ళిపోయాడు తోట మాలి.
    పది నిమిషాలు యిద్దరి మధ్యా నిశ్శభ్దం.
    "కారులో పెట్టానమ్మా!" పని పూర్తీ చేసుకుని వచ్చి చెప్పాడు.
    రవి లేచాడు.
    స్వప్న అనుసరించింది.
    ఇద్దరూ కారేక్కారు!
    "మళ్ళీ ఓ వారంలోగా వస్తాను. పని జాగ్రత్త!" రవి కంఠంలో హుందాతనం తొణికిసలాడింది.
    తలూపేడు అతను.
    కారు కదిలి గేటు దాటి వూరి ముఖం పట్టింది.
    అటూ వూరికి ఇటు రోడ్డుకి చీలే రస్తా దగ్గర "కారుని వూళ్ళోకి వెళ్ళనివ్వండి!" అంది.
    "ఎందుకు?"
    "అత్తగారిని చూడాలి!"
    చప్పున బ్రేక్ వేసి "స్వప్నా!" అన్నాడు రవి.
    అతని కంఠంలో తొంగిచూసిన ఆందోళనకి నవ్వు కుంది స్వప్న.
    "మరేం ఫర్వాలేదు పదండి. ఆదరించినా, అవమానించినా ఆమె అత్తగారే! నేను కోడలినే! తొలిసారిగా అత్తారింటికి వచ్చాను. ఊరికి వచ్చి అత్తగారిని చూడకుండా వెళ్ళటం తప్పు- పదండి!" నవ్వుతూ అంది స్వప్న.
    చల్లగాలి మెల్లమెల్లగా వీస్తోంది.
    అయినా రవి ముఖాన చెమటలు కమ్మేయి.
    "పదండి!"
    విధి లేక కారుని తన యింటివేపు మళ్ళించాడు రవి.


                                       46

    కారు యింటి ముఖంగా నడుపుతున్నా , రవి మనసులో ఆందోళన క్షణ క్షణానికి ఎక్కువవుతూనే వుంది.
    "స్వప్న పట్టుదలగా యింటికి వెళుతోంది. అమ్మకి పట్టుదల ఎక్కువే! ఆ రోజే తనతో కఠినంగా చెప్పేసింది. ఇప్పుడు హటాత్తుగా వెళుతున్నారు తాము. ఆమె ఎలా ప్రవర్తిస్తుందో? ముఖాన పేడనీళ్ళు చల్లినట్టుగ యింట్లోకి అడుగు పెడుతుండగానే నిర్మోఖమాటంగా పుల్ల విరిచినట్లు మట్టాడితే ఏం చేయగలడు తను?"
    అంతలో యిల్లు వచ్చేసింది.
    కారుని బ్రేక్ వేసి అపు చేశాడు రవి.
    అతను కారు దిగక ముందే స్వప్న దిగేసింది.
    అది పూర్వకాలపు ఇల్లు! చాలా చిన్న ఇల్లు. పెద్ద యింటిలో భాగం అమ్మేయ్యగా మిగిలిన భాగం అది. వంటిల్లు, ఓ హాలు, వరండా ముందుగా కొద్దిపాటి బయలుస్థలం. కాంపౌండ్ గేటు. కాంపౌండ్ శిధిలావస్థలో వుంది. ఇల్లు కూడా అలాగే వుంది. అంతా పెచ్చులూడిపోయింది. వెల్ల ముఖం చూసి ఎన్నాళ్ళయిందో అన్నట్టుగా వుంది. నెల వరుస కూడా అలాగే అక్కడక్కడా చెడిపోయి వుంది. అయితే నెల ఇల్లు, యింటి ముందు భాగం శుభ్రంగా వుంది.
    ఒక్క చూపులో యింటిని అంతా పరీక్షగా చూసింది.
    అంతలో కారు ఆగిన చప్పుడికి బయటికి వచ్చింది తల్లి.
    "రామ్మా!" ఆదరణతో ఆప్యాయత గా పిలిచిందామె.
    చప్పున గేటుదాటి వెళ్ళి పాదాభివందనం చేసింది స్వప్న.
    ఆమె భుజాలు పట్టి లేవనెత్తి, గడ్డం పట్టుకుని ముఖం ఎత్తి "బావున్నావమ్మా! బంగారంలా వున్నావు. నిన్నెప్పుడు చూళ్ళేదు నేను రవి అదృష్టవంతుడు!" అంది ఆమె ముఖం నిండా అనందం. సంతోషం తాండవిస్తున్నాయి.
    స్వప్న చిన్నగా నవ్వి వూరుకుంది.
    "పదమ్మా!"
    లోపలికి దారి తీస్తున్న అత్తగారిని అనుసరించింది స్వప్న.
    "కుడికాలు పెట్టమ్మా! రవీ ఇద్దరూ ఒకేసారి లోపలికి రండి."
    రవికి ఆశ్చర్యం, అనందం!
    ఇద్దరూ లోపలికి వెళ్ళారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS