మంచం వాల్చి "కూర్చో! స్వప్నా!" అందామె.
ఇద్దరూ కూర్చున్నారు.
ఆమె లోపలికి వెళ్ళి ఓ క్షణం తర్వాత స్టీలు పళ్ళెంలో రవ్వలడ్డు, బజ్జీలు పెట్టుకుని వచ్చి ఇద్దరి మధ్యా ఉంచి "తీసుకో స్వప్నా!" అంది.
"ఎందుకత్తాయ్యా ఇవన్నీ!"
"అమ్మా! రాక రాక వచ్చిన కోడలిని ఆ మాత్రం మరియాద చేయవద్దూ! మీరిద్దరూ కారులో వచ్చారని తెలియగానే తయారు చేశాను హడావుడిగా. ఓ గంటలో వస్తారనుకున్నాను, వచ్చారు. మీ యిద్దరినీ జంటగా చూశాను. నా కళ్ళు ధన్యమయ్యాయి. చాలమ్మా! ఈ జన్మకి అదృష్టం చాలు"
స్వప్న మాట్లాడలేదు.
రవి వంచిన తల ఎత్తలేదు. అతని ఆలోచనలకు తనలో తనే నవ్వుకుంటూన్నాడు.
"tతీసుకోండి!"
ఇద్దరూ టిఫిన్ ముగించారు.
కాఫీ కలిపి తెచ్చింది.
"అద్భుతం!" అనుకుంది స్వప్న.
"ఇక వెళదామా!" అన్నట్టుగా చేతి గడియారం చూసుకున్నాడు రవి.
"వెళదాం పదండత్తయ్యా! ఇక్కడ మీరొక్కరే భిక్కుబిక్కుమంటూ ఎందుకుండాలి. స్వాతి ఆరోగ్యం బాగైంది. శ్రద్దగా చదువుకుంటోంది. మీరిద్దరూ వుంటే మాకు బాగుంటుంది."
నిట్టుర్సిందామె. సమాధానం యివ్వలేదు.
రవి ఎటో చూస్తూ నుంచున్నాడు.
"ఎక్కడ వీలవుతుంది లేమ్మా! స్వాతినే యిక్కడికి రమ్మని చెప్పాలనుకుంటున్నాను. వ్యుక్తరాలు అయ్యే వయస్సు ఇక్కడుంటే బావుటుంది."
"అదేమిటత్తయ్యా! మీరు రావాలని నేనంటూ వుంటే మీరు స్వాతిని పంపమంటారేమిటి? స్వాతి లేందే నాకు క్షణం తోచదు!"
ఇద్దరి మాటలు వింటున్న రవికి "ఇద్దరూ రాజకీయాలలో ప్రవేశిస్తే ఒక నియోజక వర్గంలో పోటీ చేస్తే ఎవరికి ఓటు వెయ్యాలో తేల్చుకోలేక చస్తారు ప్రజలు!" అనిపించింది .
స్వప్న మాటలకి మృదువుగా నవ్వేసిందామె . ఇద్దరూ ప్రయాణం అవుతున్నట్టుగా గమనించిన ఆమె లోపలికి వెళ్ళి ఓ పళ్ళెంలో ఓ కొత్తచీర, రవిక, పళ్ళు, ఆకులూ, వక్కలూ, పసుపు కుంకుమ తెచ్చి స్టూలు పై పెట్టి "తీసుకోమ్మా! ఇప్పించెందుకు స్వాతి లేదు. ఇవ్వటానికి నాకు వీలు లేదు. ఇతర్లని పిలవటం న కిష్టం వుండదు!" అంది.
"ఇప్పుడివన్నీ ఎందుకత్తయ్యా!" అన్న మాటలు స్వప్న పెదాల దాకా వచ్చి ఆగిపోయాయి. రవి వైపు ఓ మారు చూసి అందుకొంది వాటిని. తర్వాత స్వతంత్యంగా లోపలికి వెళ్ళింది.
తల్లీ కొడుకులు యిద్దరే మిగిలారు హల్లో.
రవి ఆమె వైపు చూశాడు.
అంతదాకా చిరుదరహాస మాలికతో వెలుగుతున్న ఆమె ముఖం గ్రీష్మాతపానికి వాడిపోయినట్లు వెలవెలాబోయి గంభీరంగా అయిపొయింది.
రవికి ఆమె అంతర్యం అర్ధమైంది.
"ఇదంతా కేవలం మరియాద! తన పరువుని, తన పెద్దరికాన్ని నిలుపుకునేందుకు చేసింది. ఇందులో ఆత్మీయత లేదు. ఆప్యాయత అంతకంటే లేదు. కేవలం ఫార్మాలిటీ అమ్మ అప్పుడన్న మాటల్లో మార్పులేదు! " అనుకుని నిట్టూర్చాడు రవి.
అంతలో లోపలికి వెళ్ళిన స్వప్న అత్తగారు పెట్టిన కొత్తచీర కట్టుకుని వచ్చింది. అత్తగారి పాదాలకు మళ్ళీ వందనం చేసింది.
స్వప్న ప్రవర్తన ఆమె మనస్సుకి నచ్చినట్టుగా ఆమె పెదాలపై ఓ చిరు దరహాసం వెలిగి మాయమైంది.
"వస్తాం అత్తయ్యా!"
"వెళ్ళి రామ్మా! ఇవిగో నా పెళ్ళి నాటి పట్టుచీరలు, ఇవి పూర్వకాలం డిజైనువి. నువ్వు కట్టుకుంటావో, లేదో అనుకునేదాన్ని. \రావటమే నువ్వు పట్టుచీరతో వచ్చావు. నేనిచ్చిన సిల్కు చీర కట్టుకున్నావు. ఈ రోజుల్లో అందరూ నైలాన్ షిఫాన్ , జార్జేట్ , నైలెక్స్ చీరలకి ఎగబడుతున్నారు. నువ్వింకా సంప్రదాయాల్లోనే వున్నావు అందుకే ఇవి నీకే యిచ్చేస్తున్నా! కాదనక తీసుకో!"
ఆ ఆప్యాయతకి కరిగిపోయింది స్వప్న! చప్పున ఆమెకి అమ్మమ్మ గుర్తుకి వచ్చి కళ్ళు అర్ధ్రమయ్యాయి. అమ్మమ్మగారు పోయాక ఆమె మనస్సుకి యింత శాంతి ఎప్పుడూ లభించలేదు.
"నువ్వు రమ్మంటే రానంటున్నావు అత్తయ్యా! కానీ నువ్వు తప్పక రావాలి. లేకపోతే నేనే యిక్కడికి వచ్చేస్తాను. నాకు ఆ సిటీ హొరు నచ్చటం లేదు. ఈ ప్రశాంత వాతావరణం, ఈ పల్లెటూరు, ఈ పైరగాలి, ఈ స్వచ్చమైన నీరు నన్నెంతో ఆకర్షిస్తున్నాయి!"
ఆమె వెంటనే ఏమీ అనలేదు. కొడుకు వైపు ఓసారి చూసి "అలాగే వచ్చేయ్యండమ్మా!" అంది.
"తప్పక వస్తానత్తయ్యా. ఏమండీ! మనం త్వరలో యిక్కడికి వచ్చేద్దాం. ఈ యిల్లు పూర్తిగా రీమోడల్ చేసి కట్టించండి" అంది స్వప్న.
రవి తలూపాడు గంభీరంగా.
చిరుచీకట్లు కమ్ముకొబోతున్నాయి. ఆమె లైట్లు వెలిగించింది.
"సందె దీపం వెలిగించాను స్వప్నా! ఇప్పుడు వెళ్ళకండి! ఓ పది నిమిషాలాగి వెళ్ళండి!"
"అలాగే అత్తయ్యా!" అని కూచుంది స్వప్న.


